బాబోయ్‌ దోచేస్తాడు అనిపించే ''దోచేయ్''... రివ్యూ రిపోర్ట్

dochey review
DV| Last Modified శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (13:48 IST)
దోచేయ్ చిత్రం నటీనటులు: అక్కినేని నాగచైతన్య, కృతి సనన్‌, పోసాని కృష్ణమురళి, రవిబాబు, బ్రహ్మానందం తదితరులు; కెమెరా: రిచర్డ్‌ ప్రసాద్‌, మాటలు: సన్నీ ఎంఆర్‌, నిర్మాత: బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుధీర్‌ వర్మ.
 
ఏ సినిమా చేసినా ఫైనల్‌గా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడమే ప్రధాన లక్ష్యం. దానికోసం రకరకాల మార్గాలు అవలంభిస్తుంటారు దర్శకులు. ఓ కథ ఓ హీరోకు ఎందుకు నచ్చుతుందో తెలీదు. అది హిట్‌ అయితేనే... తన నిర్ణయం సూపర్‌! అనుకుంటాడు. కొన్నిసార్లు కథ బాగున్నా.. సరిగ్గా తీయకపోవడంతో తప్పు దర్శకుడి మీదకు వెళుతుంది. మొదటి రకం సినిమాలు చాలా వచ్చాయి. అందులో ఏమాత్రం తీసిపోని చిత్రమే 'దోచేయ్‌'. టైటిల్‌ను బట్టే... హీరో డబ్బుల్ని దోచుకోవడమే టార్గెట్‌ అని తెలిసిపోతుంది. మరి అది ఎందుకు చేస్తున్నాడనేది తెలియాలంటే... సుధీర్‌వర్మ దర్శకత్వం వహించిన దోచేయ్‌ కథలోకి వెళ్ళాల్సిందే.

 
కథ:
జనాల్ని ఈజీగా మాయచేసి డబ్బులు దోచుకోవడం చందు(నాగచైతన్య) పని. అందుకు ముగ్గురు స్నేహితులు తోడుగా వుంటారు. జేబుదొంగ నుంచి బ్యాంక్‌ దొంగతనాలు చేయించే స్థాయికి ఎదిగిన వాడు మాణిక్యం(పోసాని). ఓ బ్యాంక్‌లో దొంగతనం చేయించిన రూ. 2 కోట్ల కోసం గాలిస్తుంటాడు మాణిక్యం. అది అనుకోకుండా చందుకు దొరకడం.... ఆ డబ్బుతో తన తండ్రికి పడిన జీవితఖైదు నుంచి విడిపించేందుకు లంచం కోసం వినియోగించాలనుకోవడం జరుగుతుంది. ఇవి పసిగట్టిన పోలీసు ఇన్‌స్పెక్టర్‌ రవిబాబు అతన్ని ఫాలో అయి తనే జైలుకు వెళతాడు. మరి చందు తండ్రి జీవిత ఖైదుగా ఎందుకు మారాడు? మాణిక్యం ఏంచేశాడు? మధ్యలో హీరోయిన్‌ కృతిసనన్‌ రోల్‌ ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌ 
నటనాపరంగా నాగచైతన్య గురించి చెప్పాల్సిన పనిలేదు. పెద్దగా నటించింది ఏమీలేదు. రొటీన్‌గానే వుంది. నవరసాలు పండించే సీన్స్‌ కూడా ఏమీలేవు. హీరోయిన్‌ కృతి సనన్‌ కూడా అంతే. కాకపోతే.. మగరాయిడిలా వుండాలనే తరహాలో సిగరెట్లు తాగడం, కాలేజికి బంక్‌ కొట్టడం వంటివి చూపించినా.. కేవలం ఆమె పాత్ర హీరోకు టైంపాస్‌గానే వుంది. ఫేసులో విలనిజం లేకపోయినా.. విలన్‌గా చేసే రొటీన్‌ పాత్రలో పోసాని అమరాడు. కరెప్టెడ్‌ పోలీసు అధికారిగా రవిబాబు, అంతే కరెప్ట్‌ పి.ఎ.గా జీవా తదితరులు నటించారు. హీరో స్నేహితులుగా బజర్‌దస్త్‌ టీమ్‌ సరిపోయింది.
 
టెక్నికల్‌గా.... 
సినిమాకు కెమెరా ముఖ్యం కాబట్టి ఆ పనిని కెమెరామెన్‌ బాగానే చేశాడు. సంగీతపరంగా పెద్ద బాణీలు లేవు. ఆకట్టుకునే పాటలూ లేవు. సంభాషణలపరంగా సింపుల్‌గా వుండాలని ట్రై చేసినా.. పెద్ద ఎట్రాక్ట్‌ అనిపించవు. సాదాసీదాగా మాటలు రాశాడు. ఎడిటింగ్‌ కన్‌ఫ్యూజ్‌గా వుంటుంది. రాబరీ జరిగే ముందు సీన్‌ ఇంటర్‌వెల్‌ ముందు వచ్చే సీన్‌లో గందరగోళంగా వుంటుంది. స్క్రీన్‌ప్లే కొత్తదనం కోసం ట్రైచేశాడు. విలన్‌ను పట్టుకునేందుకు హీరో వేసిన గేమ్‌ ఇంట్రెస్ట్‌గా వుంటుంది. ఇలాంటివి గతంలో వున్నా... దాన్ని సరిగ్గానే వినియోగించాడు దర్శకుడు.
 
విశ్లేషణ 
సినిమాకు కథ ముఖ్యం. ఆ కథ లేనప్పుడు మాయతో బుట్టలే వేసేయాలి. అయితే అలా హీరోను వేయడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. కథ ఆరంభంలో బ్యాంక్‌ రోబరీ ఇద్దరు వ్యక్తులు చేస్తారు. వాళ్ళ బాస్‌ మాణిక్యం అని మధ్యలో  ప్రేక్షకుడికి తెలుస్తుంది. అయితే 2 కోట్లు దోచేసిన హీరోను పట్టుకోవాలంటే ఆయన పక్కనే వుండే హీరోయిన్‌ను పట్టుకుంటే హీరో దొరుకుతాడని ప్లాన్‌ వేసిన మాణిక్యం... ముందు సీన్‌లో ఆమెనే చూపించి... షడెన్‌గా మరో అమ్మాయి ఇంటికి వెళ్ళడం. అక్కడ వాళ్ళ భర్తను చంపడం అనేది గందరగోళపర్చాడు. మరింకేదో కథ వుందనే బ్రమింపచేశాడు. కానీ ఫైనల్ గోల్‌ 2 కోట్లు గురించి తెలిసిన హీరోయిన్‌ దగ్గరకే పోసాని వస్తాడు. మరి చంపేసిన సీన్‌ ఎందుకు పెట్టాడో అర్థంకాదు. 
 
కథలో హీరో చేసే దోచుకొనే ప్రోగ్రామ్స్‌ ఆకర్షణీయంగా వున్నా.. ఫైనల్‌గా.. తన తండ్రి బాగు కోసమే అనే సెంటిమెంట్‌ పెట్టాడు. అంటే... ప్రజల్ని దోచుకుని తండ్రిని కాపడటం అన్నమాట. దానికీ లాజిక్కు.. తన తండ్రి మాణిక్యం వల్ల ఒకప్పుడు మోసపోయి ఖైదీగా మారతాడు. ఇంతవరకు బాగానే వుంది. దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్‌ చేస్తే కథను మరోలా తీయవచ్చు. కానీ.. ఇంటర్‌వెల్‌ ముందు వాడి సూట్‌కేసులో 10లక్షలు కొట్టాలని వచ్చాక.. వాడిని చూసి.. వాడు డేంజరెస్ ఫెలో అని హీరో విరమించుకుంటాడు. అప్పటికే హీరోకు మాణిక్యం గురించి తెలుసు.. కానీ మరి ఈ ట్విస్ట్‌ ఏమిటో...? 
 
మొదటి భాగం సరదాగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో కథ పాకాన పడుతున్నప్పుడు.. ముగింపు అంతా మసిపూసి మారేడుకాయ చేస్తాడు. అది చేసే విధానం తమిళ చిత్రాల్లో వున్నట్లు లాజికల్‌గా అనిపిస్తుంది. ఫైనల్‌గా విలన్‌ను అరెస్ట్‌ చేయాలి కాబట్టి.. హీరో అరెస్ట్‌ చేయిస్తాడు. తను హీరోగా మిగిలిపోతాడు. ఇందులో ప్రత్యేకంగా నవ్వుకోవడానికి బకరా క్యారెక్టర్‌ రైజింగ్‌స్టార్‌గా బ్రహ్మానందం నటించాడు. తన సినిమా కోసం ఆస్తులు అమ్ముకుని.. పేరు కోసం ప్రాకులాడుతూ.. ఆడియో వేడుకలు ఏర్పాటు చేసి.. ఫ్యాన్స్‌ చేత జేజేలు కొట్టించుకోవడం వంటివి సినిమా ఆడియో ఫంక్షన్‌లకు సెటైర్‌గా చూపించాడు. ఇంకా అక్కడక్కడా కొన్ని అనవసరపు సీన్స్‌ కూడా వున్నాయి. ఓ దశలో బాబోయ్‌ అనిపించేలా వుంటాయి. మరి ఇలాంటి సినిమాలు ఫ్యాన్స్‌ కోసమే తీస్తే 100 రోజులు ఆడాలి మరి.. చూద్దాం. ఏం చేస్తారో ఫ్యాన్స్‌.
 
రేటింగ్‌ : 2/5 దీనిపై మరింత చదవండి :