గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (11:40 IST)

'డైనమైట్‌' అనే అనుకున్నాడు కానీ... 'డైనమైట్' రివ్యూ రిపోర్ట్

డైనమైట్ విడుదల: 4.9.2015.. శుక్రవారం.
 
డైనమైట్ నటీనటులు: మంచు విష్ణు, ప్రణీత, జెడి చక్రవర్తి, శివాజీరాజా, నాగినీడు, రవి తదితరులు; మాటలు: బివిఎస్‌ రవి, కథ: 24 ఫిలింఫ్యాక్టరీ, సంగీతం: అచ్చు, కెమెరా: సతీష్‌ ముత్యాల, ఫైట్స్‌: విజయన్‌, దర్శకత్వం: దేవకట్టా.
 
పాయింట్‌: సీడీ రూపంలో వున్న రేవ్‌పార్టీని ఛేదించేంచుకు హీరో పడే కష్టాలు.
 
చిన్నకథలు.. దాన్ని సాగదీసి సినిమాగా మార్చడం సాహసంతో కూడిన పనే. ఈ ప్రయత్నాన్ని చాలా సినిమాలు చూపించేశాయి. అయితే అవి ఆకట్టుకునేలా వున్నాయా? లేదా? అనేది మాత్రం దర్శకుడి తెలివితేటలపై ఆధారపడి వుంటుంది. తమిళంలో విడుదలైన అరిమనంబి చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేసేశారు. అందులో ప్రభు కుమారుడు విక్రమ్‌ ప్రభుహీరో.. అది బాగానే ఆడింది. దాన్ని తెలుగులో కూడా ఆడిద్దామని మంచు విష్ణు ముచ్చటపడి హక్కులు కొనుగోలు చేసి డైనమైట్‌గా పేరు పెట్టాడు. ఈ చిత్రానికి ఇంతకుముందు నాగచైతన్యతో 'ఆటోనగర్‌ సూర్య' తీసిన దేవకట్టాను మంచు విష్ణు ఎన్నుకున్నాడు. మరి డైనమైట్‌ పేలిందో లేదో చూద్దాం.
 
కథ:
సమాజంలో చెడును ఎదిరించే శివాజీ(మంచు విష్ణు) ధైర్యాన్ని చూసి అనామిక దాసరి(ప్రణీత) ప్రేమించేస్తుంది. తొలి పరిచయమే మందు తాగుతూ.. ఒకరికొకరు అండర్‌స్టాండింగ్‌కు వచ్చేస్తారు. ఆ సమయంలోనే అనామిక కిడ్నాప్‌కు గురవుతుంది. ఫిర్యాదు చేస్తే.. ఇందులో పైఅధికారి హస్తముందని తెలుస్తుంది. ఓ సీడీ కోసం అనామికను కిడ్నాప్‌ చేశారు. అందుకు కారణం. ఆమె తండ్రి రఘునాథ్‌(పరుచూరి వెంకటేశ్వరరావు) న్యూస్‌ 24 ఛానల్‌ సిఇఓ. ఢిల్లీలోని రేవ్‌పార్టీలో సీక్రెట్‌ కెమెరాలో జరిగిన సంఘటనను ఆయన టెలికాస్ట్‌ చేయడానికి రెడీ అవుతాడు. దానికోసం రఘునాథ్‌ను రౌడీలు చంపి సీడీని లాక్కుంటారు. తర్వాత అనామికను చంపేయాలని ప్లాన్‌. వీరిని ఫాలో అవుతూ విషయం తెలుసుకున్న శివాజీ.. అనామినకను రక్షించి.. సీడీలో ఏముందో తెలుసుకోవాలని ట్రై చేస్తాడు. ఇక.. ఢిల్లీలో ఐటీ మంత్రి.. ప్రధాని పదవికి పోటీపడే జెడీ చక్రవర్తి. ఈ సీడీ కోసం తనే డైరెక్ట్‌గా హైదరాబాద్‌ చేరుకుంటాడు. పోలీసు బలగాలతో వారిద్దరిని పట్టుకునేందుకు ట్రై చేస్తాడు. కానీ ఎత్తుకుపైఎత్తు వేసి శివాజీ తప్పించుకుని మంత్రి నోటి నుంచే సీడీలో ఏముందో చెప్పిస్తాడు. ఇదీ కథ. 
 
 
పెర్‌ఫార్మెన్స్‌
నటనాపరంగా మంచు విష్ణు గురించి చెప్పేదేముంది.. ఢీ తర్వాత అంతటి ఎంటర్‌టైన్‌మెంట్‌. కనీసం నటిస్తున్నాడనేందుకు చూసేందుకు వీలుగా వుండే పాత్రలు ఏమీ చేయలేదు. ఇందులో శివాజీగా బలవంతంగా నటించినట్లు కన్పిస్తుంది. డైలాగ్‌ డెలివిరీ ముద్దగా వుంటుంది. అయినా ఎక్కడా ఫీల్‌ కన్పించదు. అందుకు తగ్గట్టే ప్రణీతను ఎన్నుకున్నారు. అత్తారింటికి దారేదిలో సమంత సిస్టర్‌గా చేసిన ఈమె.. ఇందులో హీరోయిన్‌గా చేసింది. పేద్దపేద్ద కళ్ళు వున్నా... అభినయపరంగా ఏమీ చూపించలేకపోయింది. జెడీ చక్రవర్తి.. కేంద్రమంత్రిగా మేకవన్నె పులిగా చేశాడు. నాగినీడు, రవి పోలీసు అధికారులుగా చేశారు. రౌడీలుగా 24 ఫ్యాక్టరీకి చెందిన మనుషులే నటించారు.
 
సాంకేతికంగా...
కథ గురించి చెప్పాలంటే.. తమిళ కథ. కానీ.. 24 ఫ్యాక్టరీ కథగా పేరు పెట్టుకున్నారు. ఒరిజినల్‌ కథను మార్చేశారని ఆ సినిమా చూసినవారికి తెలుస్తుంది. సంభాషణల పరంగా బివిఎస్‌ రవి చేసిన ప్రయత్నాలు ఏమీ ఆకట్టుకునేలా లేవు. ప్రాస కోసం ప్రాకులాడే సంభాషణలు పేలలేదు. నటన..నటన.. పొద్దున్న లేచిన దగ్గరుంచి ఏమి నటిస్తార్రా! అంటూ రాజకీయనాయకులనుద్దేశించి హీరో పలికిన డైలాగ్‌ కాస్త ఒరిజినాటికీ దగ్గరగా వుంది. సంగీతపరంగా అచ్చు చేసిన పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు.. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌.. కమల్‌, వెంకటేష్‌ చేసిన ఈనాడు సినిమా గుర్తుకువస్తుంది. ఎడిటింగ్‌ చేయడానికి పెద్దగా ఏమీలేదు. డీటీఎస్‌ మిక్సింగ్‌... సౌండ్‌ ఎఫెక్ట్స్‌ కొంతవరకు ఫర్వాలేదు. మిగిలిన డిపార్ట్‌మెంట్‌లన్నీ ఓకే.
 
విశ్లేషణ:
రీమేక్‌ చేయడం కష్టంతో కూడుకున్న పనే. అప్పటికే విజయాన్ని చవిచూసిన ఆ చిత్రం ఇక్కడ కూడా వుంటుందని అనుకోవడంలో తప్పులేదు. అసలు ఆ కథలో అంతగా ఇంట్రెస్ట్‌ కల్గించే పాయింట్‌ సామాన్య ప్రేక్షకుడికి పెద్దగా నచ్చదు. బాలీవుడ్‌కు చెందిన నేహాశర్మ అనే హీరోయిన్‌ను కేంద్రమంత్రి చంపడం.. అనేది చిత్రంలో కీలకమైన పాయింట్‌. దాన్ని హీరో ఛేదించి గవర్నర్‌కు తెలిసేలా చేస్తాడు. గతంలో ఢిల్లీలో నేహా అనే నటిని తండూరి చికెన్‌ తయారుచేసే పొయ్యిలో కాల్చి చంపారు. దానికి ఓ హైలెవల్‌ పొలిటీషన్‌ వున్నాడని.. అది పెద్ద సంచలనం సృష్టించింది. బహుశా దాన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని ఈ కథను తమిళంలో రాశారని తెలిసిపోతుంది. మళ్ళీ దాన్ని.. తెలుగులో రీమేక్‌ చేయడంకూడా సాహసమే.
 
మొదట్లోనే ఈ చిత్రంపై పెద్దగా ఇంట్రెస్ట్‌ అనిపించదు. హీరోహీరోయిన్ల తొలిచూపులో ప్రేమలో పడడటం.. మగాడు ఎలా వుండాలని ప్రణీత.. కొన్ని రూల్స్‌ చెప్పడం... అదికూడా జిన్‌, ఓడ్కాలు తాగుతూ.. బోరింగ్‌గా అనిపిస్తుంది. తను తీసుకున్న కథ, కథనం కూడా హైసొసైటీకి దగ్గరగా వుండేది విష్ణు ఎంచుకున్నాడు. దాంతో కామన్‌మాన్‌కు పెద్దగా ఆనదు. పైగా... ఇంటర్‌వెల్‌ కూడా ట్విస్ట్‌గా వుండదు... మొత్తంగా చూస్తే... సీరియల్‌ను తలపిస్తుంది. సినిమాకు తక్కువ.. సీరియల్‌కు ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే.. ఎక్కడా... ఎంటర్‌టైన్‌మెంట్‌ కన్పించదు. సినిమాల్లో ఏదైనా ప్రధాన లోపం వుందంటే అది మంచు విష్ణే. మనోడు హీరోయిన్‌తో వేసే డాన్స్‌లు ఎబ్బెట్టుగా వున్నాయి. డాన్స్‌లు వేసినా.. డైలాగ్‌లు చెప్పినా.. బలవంతంగా చెప్పినట్లుగా అనిపిస్తాయి. 
 
అయితే... సొసైటీలో పదవి కోసం రాజకీయనాయకులు ఎలా ప్రవర్తిస్తారు అనేది క్లైమాక్స్‌లో చెప్పే డైలాగ్‌లు బాగున్నాయి. కానీ అవి ఒక్కటే సినిమాను నిలబెట్టలేవు. రాజకీయనాయకుడు స్వార్థం కోసం ఏదైనా చేస్తాడు. అది ఏదో తను శోధించినట్లు కొత్తగా చెప్పే ప్రయత్నం విష్ణు చేశాడు. సినిమా ఆరంభం నుంచి ముగింపు వరకు ఎక్కడా ఎట్రాక్షన్‌ అనిపించదు. జెడీ చక్రవర్తి విషయానికి వస్తే... నాగచైతన్యతో.. తొలి సినిమాలో సైలైంట్‌ విలన్‌గా చేశాడు. సేమ్‌ అలాంటి బిహేవియర్‌ ఉన్న పాత్రే ఇది. కాకపోతే ఇందులో మంత్రిగా నటించాడు. అసలు ఈ కథకు టైటిల్‌కు ఏమాత్రం సంబంధం వుండదు. కేవలం.. డైనమైట్‌లా పేలే కుర్రాడులా తను వుంటానని హీరో భావించడం మినహా.
 
ప్రధాన లోపాలు... కథలో పట్టులేకపోవడం, సీరియస్‌ పాత్రను విష్ణు చేయడం, కామెడీ లోపించడం..
 
పాజిటివ్‌ పాయింట్‌... ఈ సినిమాతోనైనా పదిమందికి పని దొరికిందనే తృప్తి.
 
రేటింగ్‌: 1.5/5