బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ivr
Last Updated : శనివారం, 13 డిశెంబరు 2014 (21:51 IST)

వరుణ్ సందేశ్ 'ఈ వర్షం సాక్షి'గా... హరిప్రియ అందం తప్పితే...

ఈ వర్షం సాక్షిగా నటీనటులు: వరుణ్ సందేశ్, హరిప్రియ, కాశీవిశ్వనాధం, ధనరాజ్, నల్లవేణు తదితరులు. దర్శకత్వం: రమణ మొగిలి, నిర్మాత: ఓబుల్ సుబ్బారెడ్డి, సంగీతం: అనిల్ గోపిరెడ్డి
 
కెరీర్ తొలినాళ్లలో వచ్చిన "హ్యాపీడేస్, కొత్తబంగారు లోకం" మినహా మరో హిట్టు లేకపోయినా.. "ఈ సినిమా అయినా హిట్టవ్వకపోదా?" అనే ఆశతో వరుస చిత్రాలతో వరుస పరాజయాలు అందుకొంటున్న నటుడు వరుణ్ సందేశ్. వరుణ్ హీరోగా నటించిన తాజా చిత్రం "ఈ వర్షం సాక్షిగా". వరుణ్ సరసన హరిప్రియ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి కొత్త దర్శకుడు రమణ మొగిలి "ఈ వర్షం సాక్షిగా" చిత్రంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగాడా?, వరుణ్‌కు కనీసం ఈ చిత్రమైన హిట్ ఇచ్చిందా? అనే విషయాలు తెలుసుకోవాలంటే.. ఈ సమీక్షను చదివేయండి.
కథ:
జై (వరుణ్ సందేశ్) జీవితంలో ఎటువంటి ధ్యేయం లేకుండా కేవలం ఒక గర్ల్‌ఫ్రెండ్ దొరికితే చాలు "లైఫ్ సెటిల్" అనుకుంటూ.. తన ఫ్రెండ్స్ (ధనరాజ్, నల్లవేణు) పరిచయం చేసే అమ్మాయిలతో టైమ్ పాస్ చేస్తూ.. తనకు సరిపడా అమ్మాయిని వెతుక్కుంటుంటాడు. తనకు వరసకు ఏమౌతాడో కూడా తెలియని ఒక పెద్దమనిషి కొడుకు బారసాలకు ట్రైన్‌లో బయలుదేరిన జైకు మహాలక్షి (హరిప్రియ) పరిచయమవుతుంది. తొలిచూపులోనే మహాలక్ష్మిని ఇష్టపడతాడు జై. తన ప్రేమను వ్యక్తపరిచేలోపే ఆమెకు మరొకరితో నిశ్చితార్ధం అయిపోతుంది. మరి నిశ్చితార్ధం అయిపోయిన తన ప్రేయసిని జై తిరిగి సాధించుకోగలిగాడా లేదా అన్నది చిత్ర కథాంశం. 
 
 
విశ్లేషణ: 
జై పాత్రలో వరుణ్ నటన సొసోగా ఉంది. వరుణ్ సందేశ్ కాస్ట్యూమ్స్‌పై పెట్టిన కాన్‌సన్‌ట్రేషన్.. దర్శకుడు రమణ క్యారెక్టరైజేషన్‌పై పెట్టలేదని సినిమా స్టార్టింగ్ నుంచి అర్ధమవుతూనే ఉంటుంది. హీరోయిన్ హరిప్రియ పాత్రకు తగ్గట్లుగా చలాకీగా నటించింది. అభినయంతోపాటు అందంతోనూ ఆకట్టుకొంది.
 
ధనరాజ్, నల్లవేణు తదితర హాస్య బృందం నవ్వించేందుకు విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ.. డైలాగుల్లో పస లేకపోవడంతో ఘోరంగా విఫలమయ్యారు. ఇక మిగతా నటీనటుల గురించి చర్చించుకొనేందుకు ఏమీ లేని విధంగా దర్శకుడు వాళ్ల పాత్రలను తీర్చిదిద్దాడు. 
 
 
మైనస్ పాయింట్స్: 
సినిమాకి మెయిన్ మైనస్ "కథ,కథనం, దర్శకత్వం". అసలే దర్శకుడు ఎంచుకున్న కథ బి.సిల కాలం నాటిది అనుకొంటే, ఆ కథను నడిపించిన వైనం ప్రేక్షకుల సహనాన్ని పూర్తిస్థాయిలో పరీక్షిస్తుంది. 
 
అనిల్ గోపిరెడ్డి అందించిన బాణీలతోపాటు నేపధ్య సంగీతం కూడా అంతంతమాత్రంగా ఉంది. దర్శకుడు "కొత్తదనం" పేరుతో తెరకెక్కించిన ప్రతి సన్నివేశం రోత పుట్టించేవిగా ఉంది. 
 
రేటింగ్: 1.5/5