బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: శుక్రవారం, 20 ఫిబ్రవరి 2015 (21:33 IST)

గీతాలు బాగున్నాయి... గాయకుడే... రివ్యూ రిపోర్ట్

గాయకుడు నటీనటులు: సిద్దాన్స్‌, అక్షర, సంతోష్‌ పవన్‌, ఎం.ఎస్‌. నారాయణ, సప్తగిరి తదితరులు, కెమెరా: కొల్లి దుర్గాప్రసాద్‌, సంగీతం: రోషన్‌ సాలూరి, నిర్మాత: జమ్మలమడుగు రవీంద్రనాథ్‌, కథ, మాటలు, దర్శకత్వం: కమల్‌ జి.
 
గాయకుడు చిత్రానికి సాలూరి కోటి కొడుకు రోషన్‌ సంగీతం అందించడం ప్రత్యేకత. అందుకే ఈ చిత్రం ఆడియోకు రెహమాన్‌ కూడా హాజరయ్యాడు. దాంతో చిత్రంపై క్రేజ్‌ ఏర్పడింది. కానీ ఇందులో సిద్ధాన్స్‌, అక్షర జంటగా కొత్తవారు నటించారు. దాంతో ఈ చిత్రం ఓ మోస్తరు ప్రేక్షకుల్ని ఆకర్షిస్తుంది. మంచి చిత్రాలు కథా బలం వున్న చిత్రాలు ఆదరణ పొందుతున్న ఈ తరుణంలో వీరు ఎలా తీశారో చూద్దాం.

 
కథ : 
సిద్ధాన్స్‌ (సిద్ధాన్స్‌) అనాథ. భిక్షాటన వృత్తిగా పాటలు పాడుకుంటూ జీవితాన్ని వెళ్ళదీసే ఓ బాబా  చేరదీసి పెంచుతాడు. బాబా చనిపోయే ముందు పాటను అమ్మతో సమానంగా ప్రాణంగా ప్రేమించమని సిద్ధాన్స్‌‌కు చెప్తాడు. ఆ పాటే సిద్ధాన్స్‌ను సెలబ్రిటీని చేస్తుంది. ఇక దాంతో అన్ని వున్నా అమ్మ ప్రేమ లేదనే బాధపడుతుంటాడు. ఆ టైమ్‌లో అక్షర పరిచయమై ప్రేమను ఇస్తుంది. 
 
తనను మాత్రం సిద్దుగా పరిచయం చేసుకుంటాడు. ఆమె సిద్దాన్స్‌ పాటంటే ఇష్టమని తర్వాత తెలుసుకుని పరిచయాన్ని ఐలవ్‌యుగా చెబుతాడు. కానీ తనే సిద్దాన్స్‌ అనే విషయాన్ని చెప్పకుండా ఆట పట్టించాలనుకుంటాడు. కానీ ఆమె సిద్దును ప్రేమించదు. పెద్దల సంబంధానికి సిద్ధమవుతోంది. ఆ సమయంలో సిద్దాన్స్‌ ఏంచేశాడు? వారి ప్రేమ ఫలించిందా? లేదా? అన్నది కథ.
 
నటీనటులు: 
కొత్తవారయినా నాయికానాయకులు ఫర్వాలేదనిపించారు. గాయకుడి పాత్రలో సిద్దాన్స్‌ సరిపోయాడు. కొన్నిషేడ్స్‌లో ముఖ్యంగా సెంటిమెంట్‌ను ఇంకా బాగా పండిస్తే బాగుండేది. అక్షర హీరోయిన్‌గా ఆకట్టుకుంది. సీన్స్‌‌లో నటనతో ఆకట్టుకున్న అక్షర పాటల్లో గ్లామరస్‌ కూడా కన్పిస్తుంది. చైల్డ్‌ ఆర్టిస్టుగా పలు సినిమాలలో నటించిన అనుభవం ఆమెకు ఉపయోగపడింది. మిగిలినవారు పర్వాలేదు.
 
టెక్నికల్‌గా... 
కోటి వారసునిగా రోషణ్‌ మ్యూజిక్‌ బాగానే ఇచ్చాడు. టైటిల్‌కు తగినట్లు మంచి పాటలున్నాయి. వెండితెరపై రిచ్‌గానూ కన్పించాయి. దర్శకుడు వాటిని తీర్చిదిద్దడంలో బాగా కాన్‌సన్‌ట్రేషన్‌ చేశాడు. ఎడిటింగ్‌ ఓకే. స్క్రీన్‌ప్లే బోర్‌ అనిపించదు.
 
విశ్లేషణ 
సినిమా పర్వాలేదు అనిపించినా.. దర్శకుడు కొత్త కావడంతో.. చూపించే విధానం ఈనాటి ట్రెండ్‌కు సరిపోలేదు. ఆకట్టుకునే సన్నివేశాలు బలంగా లేవు. ప్రారంభం నుండి చివరి వరకు సినిమాతో ప్రేక్షకుడు ప్రయాణించేలా దర్శకుడు ఆసక్తికరంగా సినిమాను తెరకెక్కించలేకపోయాడు.
 
సప్తగిరి కామెడీ ట్రాక్‌ ఇరికించినట్టు అర్ధమవుతుంది. ఇకపోతే హీరోహీరోయిన్ల మధ్య లవ్‌ ట్రాక్‌‌లో అయినా కాస్త వినోదాన్ని జోడించి ఉంటే బాగుండేది. ప్రేమిస్తున్నానని హీరో వ్యక్తం చేయడంతో నటి ఇంకా బాగా హావభావాలు పలికిస్తే బాగుంటుంది. చంద్రబోస్‌, అనంత శ్రీరామ్‌‌ల సాహిత్య విలువలు, శ్రోతలను ఆకట్టుకుంటాయి. విశాఖ బీచ్‌ అందాలను తన కెమెరాలో అంతే అందంగా బంధించాడు సినిమాటోగ్రాఫర్‌ కొల్లి దుర్గాప్రసాద్‌. పాటల్లో కెమెరా వర్క్‌ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. 
 
మ్యూజికల్‌ లవ్‌స్టోరీని తీయడంలో దర్శకుడికి ప్రతిభ వుండాలి. సెన్సిటివ్‌ టచ్‌ వున్న సబ్జెక్ట్‌ను తీయడంలో మణిరత్నం వంటివారు తీయగలరు. ఈ దర్శకుడు కూడా అటువంటి ప్రయత్నం చేశాడు. కానీ పూర్తిగా న్యాయం చేయలేకపోయాడు. ప్రేమకథలకు ఆ ఫీలింగ్‌ ముఖ్యం. ఇది కత్తిమీద సాములాంటిది. దాన్ని జాగ్రత్తగా డీల్‌ చేయాలి. పాటలను చూపించినట్లుగా కథను నడపడంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే సినిమా బెటర్‌గా వుండేది.