శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By PNR
Last Updated : శనివారం, 10 జనవరి 2015 (14:42 IST)

దేవుడు చెప్పిన ఆ మాటే 'గోపాల గోపాల' పూర్తి కథా సారాంశం!

తెలుగు హీరోలకు ఒక చట్రం ఉంటుంది. ఫ్యాన్స్‌ కోసం అందులో ఇరుక్కుని.. భిన్నమైన కాన్సెప్ట్‌లు టచ్‌ చేయరు. అలాంటి చట్రాలని ఎప్పుడో తుడిచేసిన బాలీవుడ్‌ నుంచి స్ఫూర్తిగా తీసుకుని తెలుగులో వచ్చిన చిత్రమే 'గోపాల గోపాల'. దేవుడ్ని ముద్దాయిగా బోనులో నిలబెట్టే కథా పాయింట్‌‌తో తెరకెక్కింది. హిందీలో దేవుడుని ప్రశ్నించే పాత్రను పరేష్‌రావల్‌ పోషించి 'ఓ మైగాడ్‌' అనేలా చేశాడు. దేవుడిగా అక్షయ్‌కుమార్‌ చేశాడు. అందులోని సామాన్యుడి ప్రశ్నలు, భక్తుల నమ్మకాలు ఆకర్షిణయంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు దాన్ని తెలుగులో పవన్‌ కళ్యాణ్‌, వెంకటేష్‌తో రీమేక్‌ చేయడం సాహసమే అనుకున్నారు. కానీ కథలోని పాయింట్‌‌ను బట్టి ఎవరుచేసినా సరిపోతుందని తెలియచెప్పింది ఈ చిత్రం. 2015లో జనవరిలో వచ్చే సంక్రాంతికి ఒకే ఒక్కచిత్రంగా విడుదలకావడం కూడా పెద్దచర్చగా మారింది. మరి ఆ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ:
గోపాల రావు (వెంకటేష్‌) నాస్తికుడు. కానీ చేసే వ్యాపారం దేవుడి బొమ్మలను అమ్మడం. ప్రజల మూఢనమ్మకాల్ని విగ్రహం అమ్మడంలో వాడుకుంటాడు. భార్య శ్రియ పరమ భక్తురాలు. తనుండే ప్రాంతంలో ఓ స్వామిజీ (పోసాని) వచ్చి మూఢనమ్మకాల ద్వారా ప్రజల్ని మభ్యపెడుతుంటే గోపాలరావు ఎదిరిస్తాడు. దాంతో ఆయన ఆగ్రహానికి గురై శపించబడతాడు. దానికి తగినట్లే రాత్రి భూకంపం వచ్చి గోపాలరావు షాపు ఒక్కటే నేలమట్టమవుతుంది. లక్షల్లో నష్టం వచ్చి రోడ్డున పడిపోయాడనుకున్న సమయంలో తెలివిగా ఇన్సూరెన్స్‌ క్లెయిమ్ చూపిస్తాడు. 
 
కానీ కంపెనీవారు అందులోని 'ఏక్ట్‌ ఆఫ్‌ గాడ్‌' అనే లాజిక్కుతో తామేమీ చేయలేమనీ చేతులు దులుపుకుంటారు. దాంతో వారిని ప్రశ్నించడంతో దేవుడ్నే న్యాయం అడగమని కంపెనీ సూచిస్తుంది. ఆ తర్వాత దేవుడిపై పోరాటం కోర్టులో చేస్తాడు. చిత్రమైన కేసును కోర్టు ఆమోదిస్తుంది. దాంతో ముస్లిం లాయర్‌ ద్వారా గోపాలరావు... దైవాంస సంభూతులుగా చెప్పుకునే స్వామీజీలకు నోటీసులు పంపిస్తాడు. వారంతా కోర్టుకు హాజరై తమ వాదనలు విన్పిస్తారు. మరోవైపు గోపాల తన వాదనలు విన్పిస్తాడు. ఈ క్రమంలో దేవుడ్ని నిందించేవాడు బతకకూడదనే సాధువుల పెద్ద లీలాధర (మిథున్‌ చక్రవర్తి) అనుచరలతో గోపాలపై ఎటాక్‌ చేయిస్తాడు. అప్పుడే విషయం తెలుసుకున్న దేవుడు (పవన్‌కళ్యాణ్‌) పైలోకం నుంచి కిందకి వచ్చి గోపాలను కాపాడి తగు సలహాలు ఇస్తుంటాడు. మరి ఎంతోమంది భక్తులున్నా రాని దేవుడు నాస్తికుడైన గోపాలకు ఎందుకు సాయం చేయాలనుకున్నాడు? అసలు దేవుడుపై పెట్టి కేసు గెలిచాడా? అన్నది మిగిలిన సినిమా.
 
తప్పొప్పులు...
ఈ చిత్రంలోని పాయింట్‌ చాలా పెద్దది. దాన్ని చాలా జాగ్రత్తగా డీల్‌ చేయాలి. హిందీలో ఉన్న స్ట్రాంగ్‌ కంటెంట్‌ను ఇందులో చెప్పలేకపోవడం. మాతృకలో చాలా బాగా డీల్‌ చేశారు. అయితే తెలుగులో వచ్చేసరికి మొత్తం హీరోయిజం వెంకటేష్‌పైనే నడుస్తుంది. లేదా పవన్‌ కళ్యాణ్‌పై పడుతుంది. దేవుడిపై చర్చలో తీవ్రస్థాయిలో డైలాగ్‌లు మాతృకలో వుంటాయి. కానీ ఇందులో డైలాగ్‌లు చిన్నపిల్లవాడు అమ్మను అడిగినట్లే వుంటాయి. ఇంకా డీప్‌గా వెళ్లలేక పోవడం మైనసే. మొదటి భాగంలో పరేష్‌రావల్‌తో పాటు ప్రేక్షకుడు కనెక్ట్‌ అవుతాడు. కానీ ఇందులో వెంకటేష్‌ సమస్య మనది కాదనేది కన్పిస్తుంది. అదే ప్రధాన లోపం. 
 
ఇక పవన్‌కళ్యాణ్‌ పాత్ర... దేవుడిగా సింపుల్‌గా బాగానే వుంది. అయితే మాటల్లో.. కొన్ని తెలుగు జిమ్మిక్కులు చెప్పాడు. జ్ఞానం ఉన్నవాడు ఇంటిలో కూర్చుంటే అజ్ఞానులు దేశాన్ని ఏలుతారు.. అంటూ డైలాగ్‌లు పెట్టాల్సివచ్చింది. అదేపనిగా.. ఇందులో దేవుడి పాత్ర నిడివి ఎక్కువగానే వుంది. స్వామీజీలు పాత్రలు చాలా స్ట్రాంగ్‌గా అనిపించకపోవడానికి కారణం.. రొటీన్‌ ఆర్టిస్టులు వేయడమే. 
 
ఒప్పులు గురించి చెప్పాలటే.. పవన్‌ కళ్యాణ్‌ ప్రవేశం, గోపాల పాత్ర డీల్‌ చేయడం బాగున్నాయి. రొటీన్‌ చిత్రాలకు భిన్నంగా వారి ప్రవర్తన వుంటుంది. కోర్టులోనూ, టీవీ చర్చల్లోనూ సాగే డైలాగ్‌లు పవర్‌ఫుల్‌గా ఉండబట్టి ఆలోచించేట్లుగా అనిపిస్తాయి. దేవుడ్ని తమ్ముడు అని సంబోధించడం నచ్చింది. 
 
పెర్‌ఫార్మెన్స్‌ 
లీలాధర స్వామిజీగా మిథున్‌ చక్రవర్తి పాత్రలో జీవించాడు. గోపాల శిష్యుడుగా కృష్ణుడు, జడ్జిగా రంగనాథ్‌, లాయర్‌గా ఆశిష్‌ విద్యార్థి, ముస్లిం లాయర్‌గా మురళీ శర్మ, టీవీ యాంకర్‌గా మధుశాలిని వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఆసక్తికల్గించేదుకు ఎన్‌టిఆర్‌, ఎస్‌విఆర్‌ నటించిన సీన్‌.. ఘటోత్కచుడు, బ్రాహ్మణుడు సీన్‌.. పవన్‌, వెంకీకి జత చేశారు. శ్రియ పాత్ర పరిమితమే. అయితే వెంకీ కొడుకు మాస్టర్‌ అర్జున్‌ ఇందులో కొడుకుగా నటించాడు కూడా.
 
టెక్నికల్‌గా... 
జయన్‌ విన్సెంట్‌ కెమెరా, అనూప్‌ బాణీలు బాగున్నాయి. అయితే సంభాషణపరంగా బుర్రా సాయిమాధవ్‌ పొందికగా రాయడానికి ప్రయత్నించాడు. ఆ క్రమంలో కొన్ని హాస్యపు గుళికలు వేశాడు. ఎడిటింగ్‌, ఫర్వాలేదు. దర్శకుడిగా కిషోర్‌ కుమార్‌ పార్థసాని.. కొద్దిగా తెలుగుకు మార్చి సినిమాను తీశాడు. నిర్మాతగా పవన్‌ స్నేహితుడు శరద్‌ మరార్‌ సింపుల్‌గా నిర్మించాడు. విజువల్‌ ఎఫెక్ట్‌, గ్రాఫిక్స్‌ చిత్రానికి ఆకర్షణగా నిలిచాయి. 
 
ముగింపు.. 
ప్రజల మూఢనమ్మకాల్ని క్యాష్‌ చేసుకుంటున్న స్వామీజలపై ఎక్కుపెట్టిన సినిమా ఇది. ఇందులో హిందువే కాదు, ముస్లిం, క్రైస్తవులు కూడా ఉన్నారు. మూడు మతాల్లోనూ చెప్పేది ఒక్కటే. సాటి మనిషిని ఆదుకోవాలి. అదే దేవుడు కూడా చెప్పేది. కానీ మనుషులు స్వార్థం కోసం రాళ్ళను కూడా దేవుడ్ని చేస్తున్నారు. కానీ మనిషిని మనిషిలా చూడడంలేదని... భగవంతుడు చెప్పదలచింది. ఇదే ఖురాన్‌లోనూ, భగవద్గీతలోనూ, బైబిల్‌లోనూ ఉందని గట్టిగా చెప్పాడు. 
 
రొటీన్‌ క్లాస్‌మాస్‌ అంటూ ఒక ఫార్మెట్‌లో వెళుతున్న తెలుగు సినిమాకు ఇలాంటి అరువు కథలే అయినా మంచి చిత్రాలు చేయాల్సిన అవసరం ఈ ఏడాది ఎంతైనా ఉందని చెప్పకనే చెప్పడం విశేషం.