మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By IVR
Last Modified: మంగళవారం, 15 జులై 2014 (14:47 IST)

చూసినవారిని ఫూల్‌ చేసిన ఐస్‌క్రీమ్‌... రాసినవారిని 'కుక్క'లంటూ వర్మ చిందులు

'ఐస్‌క్రీమ్‌' నటీనటులు: నవదీప్‌, తేజస్వి, చంటి, సరస్వతమ్మ, సందీప్తి, కెమెరా: అంజి, ఎడిటింగ్‌ : బాబి, సంగీతం: ప్రద్యోతన్, బ్యానర్‌ : భీమవరం టాకీస్‌., నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శకత్వం: రామ్‌గోపాల్‌ వర్మ. 
 
వర్మ సినిమాలంటే ఏదో ఉంటుందనీ... చూశాక. ఏమీలేదనీ.. మోసం పోయామనేకునే బాపతు ఈమధ్య ఎక్కువైంది. అయినా మళ్లీమళ్ళీ అదే రూటులో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే జిమ్మిక్కులు చేయడం వర్మకు పెట్టింది పేరు. దెయ్యం, భూతం, వంటి సినిమాలు తీస్తున్న వర్మ ఈసారి కూడా అలాంటి కాన్సెప్ట్‌ను తీసుకుని తెలివిగా.. ఐస్‌క్రీమ్‌ అని పేరుపెట్టారు. మాటిమాటికీ.... టెక్నాలజీ కొత్తదంటూ ప్రచారం చేశారు. శాటిలైట్‌ సినిమాలు తీసే నిర్మాత రామసత్యనారాయణతో సినిమా తీశాడనగానే సినీ విశ్లేషకులు వర్మ ఎంత దిగజారిపోయాడో అర్థమైపోయిందంటూ రాసేశారు. అసలు వర్మ ఐస్ క్రీమ్ చిత్రంతో ఏం చెప్పదలిచాడో చూద్దాం.  
 
కథ :  
రేణు(తేజస్వి) మెడికల్‌ స్టూడెంట్‌. ఆమెకో బోయ్‌ ఫ్రెండ్‌ ఉంటాడు. అతని పేరు విశాల్‌(నవదీప్‌). రేణు తల్లిదండ్రులు ఓ పెళ్ళి నిమ్మిత్తం ఊరెళ్తారు. ఆ సమయంలో రేణు మాత్రమే లంకంత కొంపలో పియానో వాయిస్తూ... బుద్ధి పుట్టినప్పుడు చదువుతూ... అప్పుడప్పుడు బోయ్‌ ఫ్రెండ్‌తో సరసాలాడుతూ గడుపుతుంటుంది. ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లో ఏవో వింత శబ్దాలు రావడం, మాటిమాటికి తలుపు చప్పుడు కావడం, డోర్‌ తీస్తే... ఎవరూ లేకపోవడం జరుగుతుంది. ఇంకో సందర్భంలో ఎవరో తనని వెంబడిస్తున్నట్లు అనిపిస్తుంది(దెయ్యం రూపంలో). తన ప్రియుడికి ఆ విషయం చెప్తే... కేవలం నీ భ్రమ అంటాడు. ఓ సమయంలో రేణుకి మూడు ఆకారాలు కనిపిస్తాయి. అవేంటి.. నిజంగానే ఆ ఇంట్లో దెయ్యాలున్నాయా? లేక రేణు సరదాగా భయపెడుతోందా. ఆ చప్పుళ్ళకి విశాల్‌కి ఏమైన కనెక్షన్‌ ఉందా అనేది తెలుసుకోవాలంటే ఐస్‌క్రీం టేస్ట్‌ చేయాల్సిందే. 
 
నటీనటులు అభినయం : 
వర్మ కెమెరాలు ఎప్పుడూ అమ్మాయిల అందాల్నే చూపిస్తాయి. అలాగే ఇందులోనూ జరిగింది.   సినిమా మొత్తం తేజస్వి చుట్టూనే తిరుగుతుంది. ఇందులో ఆమెది భయపడే పాత్ర. కానీ నిజంగా భయపడిన ఎక్స్‌ప్రెషన్‌ ఎక్కడా కనబడలేదు. అలా అని నవ్వుతూ కనిపించిందా అంటే అదీ లేదు. ఇందులో ఆమె చేసిందాల్లా.. డోర్‌ చప్పుడయినప్పుడు ఆ డోర్‌ తీయడం ఎవరూ లేకపోతే నడుం ఊపుతూ పైకి ఎక్కడం స్నానం చేయడం, ఐస్‌క్రీం తినడం, ట్యాప్‌ బంద్‌ చేయడం మాత్రమే చేస్తుంటుంది. 
 
పెర్‌ఫార్మెన్స్‌ కంటే అందాల ఆరబోతపై దృష్టి పెట్టింది తేజస్విని. ఇందులో దెయ్యాలుగా నటించిన ముగ్గురు కూడా మంచోళ్ళే. ఒకరు ఇంటి పని చేస్తారు, మరొకరు దొంగపోలీస్‌ ఆడతారు, మరొకరు రేణూ అని ప్రేమగా పిలవడం లాంటివి మాత్రమే చేశారు. ఆ పాత్రలు ఎందుకో అర్ధం కాదు. ఇక నవదీప్‌ తన నటనా ప్రతిభను చూపించే స్కోప్‌ కనిపించలేదు. 
 
సాంకేతిక నిపుణుల పనితీరు : 
వర్మ సినిమా సినిమాకి ఏదో కొత్తని చూపించినట్లుగానే ఈ సినిమాతో ఫ్లో కెమెరా, ఫ్లో సౌండ్‌ సిష్టంను ఇంట్రడ్యూస్‌ చేశాడు. ఫ్లో అంటే ఏదో ఫ్లోలో కెమెరా ఇల్లు మొత్తం రౌండేస్తుంది. ఇక ప్లో సౌండ్స్‌ అంటారా? ఇంట్లో ఉన్న సామాన్లను అన్నింటిని నేలకేసి కొడితే అదే ఫ్లో సౌండ్‌ సిస్టం. ఇందులో కెమెరా ఫోకస్‌ మాత్రం ఎప్పుడు తేజస్వి కాళ్ళపైనే. ఆ కాళ్ళని, నడుముని ఎంత అందంగా తిప్పగలుగుతుందనేది ఫ్లో క్యామ్‌ బాగా చూపించింది. ఈ సినిమా విషయంలో వర్మ టెక్నాలజీ మీద పెట్టిన దృష్టిని కథ మీద పెట్టలేదు. దీంతో తనేం చెప్పాలనుకున్నాడో సినిమా చూసిన ఏ ఒక్కరికీ అర్ధం కాదు. 
 
సౌండ్‌ ఇంజనీర్‌కిచ్చిన ఫ్రీడమ్‌తో కీ బోర్డ్‌లో ఉన్న అన్ని ఇనుస్ట్రుమెంట్స్‌ని వాడేసి థియేటర్‌ మొత్తం రణగొణ ద్వనిని సృష్టించేశాడు. సినిమాలో దెయ్యాలు భయపెట్టాయా లేదా అనేది ప్రక్కన పెడితే... ఆ రణగొణ ధ్వనికి మాత్రం భయపడక తప్పదు. ఎడిటర్‌ తిప్పలు తనకే తెలియాలి. ఇక నిర్మాత విషయం చూస్తే సినిమా కథేంది? వర్మ ఏం తీశాడు అనేది ఇంచు కూడా ఆలోచించినట్లు లేరనే గొణుగుళ్లు కూడా వినిపించాయి. అయితే ఇందులో అతనికొచ్చిన నష్టమేమిలేదు. ఎందుకంటే వర్మ సినిమాలకి ఓపినింగ్స్‌ ఉంటాయి కాబట్టి. సినిమాకి పెద్ద ఖర్చు కూడా ఏమీ ఉండకపోవచ్చు ఎందుకంటే ఒకే ఇంట్లో 5 ఆర్టిస్టుల మీద సినిమా పూర్తయిపోయింది కాబట్టి. 
 
వివరణ: 
హారర్‌ సినిమాకు మ్యూజిక్‌ ఇంట్రెస్ట్ క్రియేట్‌ చేసేవిధంగా స్క్రీన్‌ప్లే ఉండాలి. ఇవన్నీ ఎప్పుడో చూసేశారనుకుని ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించడం ఈ సినిమాలో పెద్ద విశేషం. చాలా సీన్స్‌ చూసినవే చూపిస్తాడు. ఐస్‌క్రీమ్‌లో అదే జరిగింది. జరిగిన సీన్లే మళ్ళీ రిపీట్‌ అవ్వడం ప్రేక్షకుడి సహనానికి పరీక్షలా మిగిలింది. ఐస్‌క్రీమ్‌ తింటే దెయ్యాలు కలలొస్తాయని గొప్ప సందేశం కూడా ఇచ్చాడు ఆర్‌జివి. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు భయపడలేదు కదా వ్యంగ్యంగా నవ్వుకున్నారు. మరో ముఖ్యమైన విషయం ఇందులో తేజస్వి న్యూడ్‌గా యాక్ట్‌ చేసిందని సినిమా టీమ్‌ మొత్తం డప్పు కొట్టారు. ఓ సన్నివేశంలో తేజ తన దుస్తులన్నింటిని విప్పేసి ప్రక్కన పడేసిందంతే. అంతకు మించి అక్కడేమీ లేదు. అలాంటి సీన్లు గతంలో ఎన్నో సినిమాల్లో చూసినవే. అది నిజమనుకుని సినిమాకెళ్తే ప్రతి ప్రేక్షకుడు పప్పులో కాలేసినట్టే. అది కేవలం పబ్లిసిటీ స్టంట్‌ మాత్రమే. 
 
ఇప్పటికే వర్మ బ్రాండ్‌ కాస్త దిగజారిందనేది ఇండస్ట్రీ టాక్. ఐతే ఈ సినిమా రివ్యూలు అన్నీ నెగటివ్ టాక్ రావడంతో వర్మకు కోపమొచ్చింది. మరీ ఇంకాస్త విమర్శనాత్మక కోణంలో రాసినవారినుద్దేశించి తన ట్విట్టర్లో అలా రాసినవాళ్లు కుక్కలంటూ ట్వీట్ ఇచ్చుకున్నారు. మరి జనం ఐస్ క్రీం ఎలా ఉన్నదని చెపుతారో మరికొద్ది రోజుల్లోనే తేలిపోతుంది.