గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: శుక్రవారం, 26 జూన్ 2015 (16:31 IST)

'చింతకాయల...' దర్శకుడు నిర్మాతగా మారితే... 'జాదూగాడు' రివ్యూ రిపోర్ట్

జాదూగాడు నటీనటులు: నాగశౌర్య, రాశీఖన్నా, కోట శ్రీనివాసరావు, శ్రీనివాసరెడ్డి, అజయ్‌, సప్తగిరి తదితరులు
 
సినిమా కథలు రకరకాలుగా వుంటాయి. హీరోను బట్టి కథను రాసుకోవడం ఒకటైతే... కథ వుంది గనుక హీరో డేట్స్‌ ఇస్తే.. రెడీ కానిచ్చేయడం. ఊహలు గుసగుసలాడే.... లక్ష్మీరావే మా ఇంటికి వంటి చిత్రాల్లో లవరబాయ్‌గా నటించిన నాగశౌర్య తన ఇమేజ్‌ను మాస్‌ వైపు మళ్లించాడు. ఇందుకు చింతకాయల రవి.. ఫేమ్‌ యోగేష్‌ ఐదేళ్ల తర్వాత తనే నిర్మాతగా, దర్శకుడిగా అవతారం ఎత్తి.. తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. మరి ఇందులో ఏం చెప్పాడో చూద్దాం.
 
కథ:
కోనసీమలో ఊరి జనాలు తరిమేస్తే.. కోటి రూపాయలు సంపాదిస్తానని హైదరాబాద్‌ వస్తాడు కష్ణ (నాగశౌర్య). స్నేహితుడు సెక్యూరిటీ గార్డ్‌ శ్రీనివాసరెడ్డి ఇంటికి వచ్చి ఆయనే బినామీగా వుంటూ బ్యాంక్‌ లోన్స్‌ రికవరీ ఆఫీసర్‌గా చేరతాడు. అయితే అవన్నీ రౌడీలు గూండాలకు బ్యాంక్‌ ఇచ్చిన అప్పులు. వారి నుంచి రాబట్టడం కోసం ప్రయత్నాల్లో ఫెయిల్‌ అవుతాడు. ఓ దశలో ఓ రౌడీని బెదిరించి రాబట్టుకుంటాడు. అది చూసిన సిటీలో పెద్ద డాన్‌.. కృష్ణను తన దగ్గర పనిలో పెట్టుకుంటాడు. 
 
కానీ ఆ డాన్‌ దగ్గర అప్పటికే నమ్మకస్తుడై అనుచరుడు అజయ్‌ వుంటాడు. కొన్ని సంఘటనలతో డాన్‌కు కృష్ణ మరింత నమ్మకంగా వుంటాడు. దాని ఫలితంగా.. కృష్ణను చట్టవ్యతిరేక పనుల్లో బినామీగా పెట్టేసి 2 వేల కోట్లు కొట్టేయాలన్నది డాన్ ఆశ. డాన్‌కు వెనుక కోటశ్రీనివాసరావు అనే మంత్రి.. అయితే మరో ఉపకథ కూడా వుంది. సిటీ పోలీసు కమీషనర్‌ ఆశిష్‌విద్యార్థి.. తన కుమార్తె కోసం 25 కోట్లు సంపాదించాలని సి.ఐ.ని పురమాయిస్తాడు. అందుకు డాన్‌ రహస్యాలన్ని తెలుసుకుని రాబట్టాలనేది అతని ప్లాన్‌. అందుకు కృష్ణను పావుగా వుపయోగించుకుంటాడు పోలీసు అధికారి.  అయితే అసలు విషయం తెలుసుకున్న కృష్ణ ఏం చేశాడు? అన్నది మిగిలిన కథ.
 
పెర్‌ఫార్మెన్స్‌
నాగశౌర్య పక్కా మాస్‌ పాత్రలో అలరించే ప్రయత్నం చేశాడు. అంతవరకు బాగానే వుంది, కానీ.. యాక్షన్‌ సన్నివేశాల్లో కొడితే గాల్లోకి వెళ్ళిపోవడం వంటికి కాస్త టూమచ్‌గా వున్నాయి. రాశీఖన్నా.. పాత్ర కేవలం ఎక్స్‌పోజింగ్‌కు లిప్‌లాక్‌లతో పరిమితమయింది. కోట శ్రీనివారావు కన్నింగ్‌ మంత్రిగా బాగా నటించాడు. కోటకు బినామీగా శ్రీశైలం అనే కొత్త విలన్‌ చేశాడు. అజయ్‌తో పాటు మిగిలినవారు తమ పనికి న్యాయం చేశారు. కరెప్టెడ్‌ పోలీసు అధికారిగా రవి కాలే నటించాడు. కమీషనర్‌గా ఆశిష్‌విద్యార్థి చేశాడు.
 
విశ్లేషణ...
ఈ చిత్రం మైండ్‌ గేమ్‌తో కొనసాగుతుంది. పెద్ద డాన్‌ను తలదన్నేట్లుగా హీరో నాగశౌర్య జిమ్మిక్కు చేసి కథను సుఖాంతం చేసుకోవడం. అయితే కథకు నాగౌశర్య పూర్తిస్థాయిల సూటుకాలేదు. అగ్రహీరో చేయాల్సిన కథాంశమిది. కోట్లను డీల్‌ చేస్తూ, ఎదుటివాడు ఎలాంటివాడో కనిపెట్టి శక్తిగల విలన్‌ ముందు పిల్లిలా నటిస్తూ.. చాకచక్యంగా ఆయన మన్ననలు పొందడం అనే సన్నివేశాలన్నీ సినిమాటిక్‌గా వున్నాయి. ఎక్కడా ఫీల్‌ కలుగదు. 
 
ఇక హీరోయిన్‌తో రొమాన్స్‌ చేసే సన్నివేశంలో నాగశౌర్య రెచ్చిపోయాడు. రెండు సన్నివేశాల్లో రాశిఖన్నాను లిప్‌కిస్‌లు ఆరుసార్లు పెట్టేస్తాడు. బహుశా కొత్తగా ఎదుగుతున్న నటుడు, నటి ఇలా చేయడంతో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుందనడానికి ఇదే నిదర్శనం. సంభాషణల పరంగా దర్శకుడు సినిమాటిక్‌గా రాసేశాడు. కష్టపడటమంటే.. బాస్‌ ముందు నమస్కారంపెట్టి పని చేయడంకాదు.. మైండ్‌గేమ్‌తో ఎదగడమనేవి చెప్పాడు. ఇలా డైలాగ్స్‌కు ప్రాధాన్యత ఇచ్చాడు. మాస్‌ కథ కాబట్టి డైలాగ్‌లను ఎలా బడితే అలా రాసుకోవడానికి వీలుంటుంది.
 
కథంతా ముగింపుకు 10 నిముషాల ముందే హీరోయిజం బయటపడుతుంది. షిప్‌యార్డ్‌లో యాక్షన్‌ సన్నివేశాలు అగ్రహీరోతో చేసినట్లుగా వున్నాయి. నిర్మాణపరంగా ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. దర్శకనిర్మాత యోగేష్‌... వెంకటేష్‌తో తీసి.. నాగశౌర్యతో భారీ కథను ఎంచుకోవడం చిత్రమే అయినా చూడ్డానికి ఫర్వాలేదనిపిస్తుంది. కానీ... యాక్షన్‌ సన్నివేశాలకు తన బాడీ సూట్ కాలేదు.
 
మణిశర్మ కుమారుడు సాగర్‌ మహతి సంగీత దర్శకుడిగా పరిచయమైన చిత్రమిది. తొలి సినిమా అయినా బాగానే చేశాడు. పాటలు సంగీతం బాగుంది. బ్యాక్‌గ్రౌండ్‌ ఓకే. రణగొన ధ్వనులు లేకుండా జాగ్రత్తపడ్డాడు. మాస్‌ ప్రేక్షకుల్ని అలరించేందుకు చేసిన ఈ ప్రయత్నం ఓ వర్గానికి నచ్చుతుందేమో. అందుకు కారణం.. కథ వారికి దగ్గరగా వుండటమే. 
 
రేటింగ్‌: 2.5/5