శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By dv
Last Updated : శుక్రవారం, 25 నవంబరు 2016 (14:10 IST)

పల్లెటూరి నిదర్శనంలా... 'జయమ్ము నిశ్చయమ్మురా' (మూవీ రివ్యూ)

కమెడియన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేస్తున్న శ్రీనివాసరెడ్డి ప్రధాన పాత్రతో చేసిన 'గీతాంజలి' తర్వాత 'జయమ్ము నిశ్చయమ్మురా'తో కథానాయకుడిగా ఎదిగాడు. 'దేశవాళి వినోదం' అందిస్తున్నామని పబ్లిసిటీపరంగా గుప్ప

నటీనటులు:
శ్రీనివాసరెడ్డి, పూర్ణ, పోసాని కృష్ణమురళీ, శ్రీవిష్ణు, కృష్ణుడు, రవి వర్మ, కృష్ణభగవాన్‌, ప్రవీణ్‌, తాగుబోతురమేష్‌, డబ్బింగ్‌ జానకి తదితరులు
 
సాంకేతిక వర్గం:
కెమెరా: నగేష్‌ బనేల్‌, సంగీతం: రవిచంద్ర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివరాజ్‌ కుమార్‌ కనుమూరి, నిర్మాతలు: శివరాజ్‌, సతీష్‌ కనూమరి, స్క్రీన్‌ప్లే: పరమ్‌ సుయాంశ్‌.
విడుదల: 25.11.2016... శుక్రవారం
 
కమెడియన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేస్తున్న శ్రీనివాసరెడ్డి ప్రధాన పాత్రతో చేసిన 'గీతాంజలి' తర్వాత 'జయమ్ము నిశ్చయమ్మురా'తో కథానాయకుడిగా ఎదిగాడు. 'దేశవాళి వినోదం' అందిస్తున్నామని పబ్లిసిటీపరంగా గుప్పించాడు. తెలుగు రాష్ట్రం మూలాలైన గ్రామాల్లో ఉండే వ్యక్తుల వ్యక్తిత్వాలు, అక్కడ పరిస్థితులు, ఆ ప్రకృతి అందాలనడుమ సినిమా తీశారు. సినిమా కూడా చక్కటి ఆహ్లాదకరమైన జర్నీగా ఉంటుందని చెబుతున్న ఈ చిత్రాన్ని శివరాజ్‌ కుమార్‌ అనే దర్శక నిర్మాత ఎలా తీశాడో చూద్దాం.
 
కథ:
కరీంనగర్‌కు చెందిన సర్వమంగళం (శ్రీనివాస్‌ రెడ్డి) దేవాదాయశాఖలో ఓ ఉద్యోగి. వృత్తిరీత్యా కాకినాడ వస్తాడు. మూఢభక్తి, నమ్మకాలు అధికం. కాకినాడ వచ్చాక రాణి (పూర్ణ)ను చూసి ప్రేమిస్తాడు. అమ్మాయి విషయాలు తను నమ్మే స్వామిజీకి చెప్పడంతో ఆమెనే పెళ్లిచేసుకోవాలని నిర్ణయానికి వస్తాడు. ఆ తర్వాత తను సొంత ఊరికి బదిలీ అయి వెళ్ళాలన్నది కోరిక. అయితే ప్రేమిస్తున్న రాణికి మరొకరు దగ్గరవ్వడం సహించలేక.. స్వతహాగా పిరికివాడుకావడంతో ఏమీచేయలేకపోతాడు. ఇంతలోనే రాణి తనకు దూరమయ్యే పరిస్థితి వస్తుంది. దానికి కారణం తన బాసే అని తెలిసి ఆశ్చర్యపోతాడు. ఆఫీసులోనూ ప్రతికూల పరిస్థితులు ఎదువవుతాయి. ఇలాంటి స్థితిలో తనలోని ఆత్మారాముడు చెప్పినట్లు ఎలా నడుచుకున్నాడు? ఆ నడకలో అడ్డంకుల్ని అధిగమించాడు? అనేదే మిగిలిన సినిమా. 
 
పెర్‌ఫార్మెన్స్‌:
శ్రీనివాస్‌ రెడ్డి ఒక మూఢనమ్మకాలను కలిగి ఆత్మవిశ్వాసం లేక వెనకబడుతున్న మంచివాడిగా మెప్పించాడు. తననుకున్నదే చేయాలనే యువతిగా పూర్ణ నటించింది. పేద బ్రాహ్మణుడి పాత్రలో పోసాని చేత, ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో కష్ణ భగవాన్‌ పాత్రలు ఎంటర్‌టైన్‌ చేస్తాయి. క్లైమాక్స్‌లో పోసాని కామెడీ చిత్రానికి కీలకం. డబ్బింగ్‌ జానకి.. శ్రీనివాసరెడ్డి తల్లిగా నటించింది. జోగి బ్రదర్స్‌ ప్రభుత్వాఫీసులో గుమాస్తాలుగా.. అక్కడ ఏపనైనా తనులేకుండా జరగని తత్కాల్‌ పాత్రలో ప్రవీణ్‌ అలరించాడు. 
 
సాంకేతిక విభాగం :
పూర్తిగా పల్లెటూరి వాతావరణాన్ని పరిస్థితుల్ని ఓ నవలో రాసినట్లుగా దాన్ని తెరపైకి ఎక్కించేవిధానాన్ని దర్శకుడి రచనా ప్రతిభకు నిదర్శనం. చాలా సన్నివేశాల్లో డైరెక్టర్‌ ప్రతిభ, సునిశిత పరిశీలన స్పష్టంగా బయటపడ్డాయి. రవిచంద్ర అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అలరించింది. ఎడిటింగ్‌ కూడా బాగుంది. సినిమాలోని అన్ని పాత్రలకు ముఖ్యంగా పోసాని, కష్ణ భగవాన్‌ పాత్రకు రాసిన డైలాగులు బాగున్నాయి. ఇక నిర్మాతగా కూడా వ్యవహరించిన శివరాజ్‌ కనుమూరి నిర్మాణ విలువలు బాగున్నాయి. పల్లె అందాలను కెమెరాతో బాగా బంధించాడు. 
 
విశ్లేషణ:
ఇది సాదారణ కథ. గ్రామంలో కన్పించే లవ్‌స్టోరీనే. అయితే వాటి చుట్టూ కొత్తగా అల్లుకున్న సన్నివేశాల తీరు ఆకట్టుకుంటుంది. హీరో పిరికివాడు ధైర్యవంతుడుగా మారితే అతని జీవితంలో ఎలా ఉంటుందనేది పాయింట్‌. దీనిపై పలు కథలు వచ్చినా మూడణాల గ్రామీణ కథ కాబట్టి.. అక్కడి పద్ధతులు, సంభాషణలు, ద్వంద్వర్థాలు అగుపిస్తాయి. వల్గారిటీ అనిపించనంతగా నేచురల్‌ మాట్లాడే పదబంధాలు వినిపిస్తాయి. దానికి దర్శకుడు ఎంచుకున్న తీరు బాగుంది. పరిస్థితుల ప్రభావంలో ఇరికించి చివరికి దాన్నే హీరోని చేసిన తీరు, ఎక్కడికక్కడ ప్రేక్షకుడికి సంతప్తినిచ్చే మలుపుల్లాంటి సన్నివేశాలు బాగున్నాయి. అలాగే కథను మొత్తాన్ని కరీంనగర్‌, కాకినాడల్లోనే నడుపుతూ ఎక్కడా బోర్‌ కొట్టకుండా లోకేషన్లని తెలివిగా వాడుతూ ఆహ్లాదకరంగా సినిమాని తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంది. బస్టాప్‌లో మొదలైన ప్రేమకు దానిపై వున్న అత్తారింటికి దారేది వినాయిల్‌ను వాడుకుని ఈస్ట్‌వెస్ట్‌ ఫ్యాన్స్‌ను ఉత్సాహపరిచాడు.
 
కాగా, ఫస్టాఫ్‌ మొదలుపెట్టినా మొదటి 20 నిముషాల తర్వాత కథ చాలా నెమ్మదించింది. దర్శకుడు చాలాసేపటి వరకూ అసలు కథలోకి వెళ్లకుండా పాత్రలను పరిచయం చేయడంలో ఎక్కువ సమయాన్ని కేటాయించి విశ్రాంతి వరకు తీసుకురావడంతో కాస్త బోర్‌ కొట్టించాడు. అలాగే సినిమాలో సర్వమంగళం పాత్ర చుట్టూ కొన్ని అనవసరమైన సన్నివేశాలు నడిచి కాస్త విసిగించాయి. మంగళం బాస్‌, కృష్ణభగవాన్‌ల సెకండ్‌షో ఎపిసోడ్‌, ఏడవలేక మంగళవారం (సినిమాలో ఎక్కువే అంటారు. అందుకే మార్చి రాశాం) వీటి నిడివి ఎక్కువగా వుంది. వాటిని తగ్గిస్తే కుటుంబాలతో హాయిగా చూసే చిత్రమవుతుంది. ఇక సర్వమంగళం పాత్ర పూర్తిగా హీరోగా మారిపోయే కీలకమైన సీన్‌ బలంగానే ఉనప్పటికీ ఆ సన్నివేశం ప్రభావితంగా స్క్రీన్‌‌పై చూపబడలేదు.
 
వాస్తవికతకు దగ్గరగా ఉండే కథ, మంచి కామెడీ ఎంటర్టైర్‌టైన్మెంట్‌ అయినా ఫస్టాఫ్‌ కథనం చాలా వరకూ సాగదీశారు. ఆ తర్వాత నెమ్మదించడం, సెకండాఫ్‌ కథ కాస్త దారి తప్పడం, అనవసరమైన సన్నివేశాలు ఇందులో మైనస్‌ పాయింట్స్‌. ఇక శ్రీనివాసరెడ్డి, పూర్ణల ఫోన్‌ సంభాషణలనుబట్టి వారిద్దరూ కలవడం అనుకుంటుంటే.. వెంటనే వాళ్ళ బాస్‌తో తను అంతకుముందు మాట్లాడిందనేంత బిల్డప్‌ ఇవ్వడం.. శ్రీవిష్ణు పాత్ర అకస్మాత్తుగా రావడం.. కొద్దిగా లాజిక్కుకు దూరంగా ఉన్నాయి. అప్పట్లో దర్శకుడు పెద్ద వంశీ చిత్రాల తాలూకా ఛాయలు ఈ చిత్రంలో కన్పిస్తాయి. ఆ కథనం కూడా తలపిస్తుంది. రాజేంద్రప్రసాద్‌ మొదట్లో చేసిన పాత్రను శ్రీనివాస రెడ్డి పాత్ర పోలివుంటుంది. అమాయకత్వం, అంథవిశ్వాసం కలగిలిపిన పాత్రలో జీవించాడు. తెలుగుదనం నేటివిటీ అడుగడుగునా కన్పించే ఈ చిత్రం ఫర్వాలేదనిపిస్తుంది. మొత్తంగా ఏవరేజ్‌ సినిమా. 
 
రేటింగ్‌: 5/3