శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Updated : శుక్రవారం, 22 జులై 2016 (13:58 IST)

చెడు జరిగినా 'మంచిది' రజనీ పంచ్ డైలాగ్... 65 ఏళ్ల 'కబాలి' అదరగొట్టేశాడు... రివ్యూ రిపోర్ట్

విడుదలకు ముందే పబ్లిసిటీలో హల్‌చల్‌ చేసిన రజనీకాంత్‌ సినిమా 'కబాలి'. విడుదల తర్వాత అంత హైప్‌ వుపయోగపడుతుందా? లేదా? అనే చిన్నపాటి శంక కూడా ప్రేక్షకుల్లో వుంది. 'లింగా' తర్వాత రజనీకాంత్‌ చేసిన కబాలి.. ఎ

విడుదలకు ముందే పబ్లిసిటీలో హల్‌చల్‌ చేసిన రజనీకాంత్‌ సినిమా 'కబాలి'. విడుదల తర్వాత అంత హైప్‌ వుపయోగపడుతుందా? లేదా? అనే చిన్నపాటి శంక కూడా ప్రేక్షకుల్లో వుంది. 'లింగా' తర్వాత రజనీకాంత్‌ చేసిన కబాలి.. ఎలా వుంటుందనే ఉత్సుకత కూడా మరోవైపు ప్రేక్షకుల్లోనూ, అభిమానుల్లోనూ వుంది. రెండే చిత్రాలకు దర్శకత్వం వహించిర రంజిత్‌.. రజనీ సినిమాకు దర్శకత్వం వహించడం మరో ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేసింది. మాఫియా డాన్‌గా ఫస్ట్‌లుక్‌తో అదుర్స్‌ అనిపించిన రజనీ.. అసలు ఇటువంటి కథను 65 ఏళ్ళ వయస్సులో ఎలా చేశాడనేది మరింత ఆసక్తికరంగా సాగింది. శుక్రవారమే విడుదలైన ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం.
 
కథ : 
తాతల నాటి నుంచి మలేషియాలో చైనా అధికారుల కింద బానిసలుగా వలసవెళ్ళిన ఇండియన్‌ కార్మికులు కబాలీ వంశీయులు. తరాలు మారినా.. కబాలి రోజుల్లో కూడా అదే కొనసాగుతుంది. ధర్మం కోసం, న్యాయం కోసం, కూలి కోసం నోరెత్తి అడిగితే శిక్షిస్తారు. అలాంటి చోట సీతారామరాజు (నాజర్‌) అనే నాయకుడు ప్రజల పక్షాన పోరాడే లీడర్‌. ఓ సందర్భంగా తమకు జరిగిన అన్యాయం కోసం కబాలి నోరు పెద్దది చేసి చైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు. దాంతో సీతారామరాజు, కబాలిని ప్రోత్సహిస్తాడు. సీతారామరాజుకు నలుగురు అనుచరులుంటారు. అందులో కొడుకు దేవరాజు కూడా వుంటాడు. అందరికంటే కబాలిని ఇష్టపడతాడు. 
 
అలాంటి సమయంలోనే దేశంలో మాదకద్రవ్యాలు ప్రవేశించడంతో దాన్ని లాభసాటి వ్యాపారంగా భావించిన స్థానికుడు టోనీ(హాలీవుడ్‌ నటుడు) సీతారామరాజు అనుచరుల్ని తమవైపు తిప్పుకుని వ్యాపారం సాగిస్తాడు. వ్యాపారానికి ఎదురుతిరిగిన రామరాజును అతని అనుచరులతోనే చంపించేస్తాడు టోనీ. ఈ ఘర్షణలో కబాలీ భార్యను కూడా చంపేస్తారు. అనంతరం తెలివిగా టోనీ బృందం తప్పించుకోగా కబాలి పట్టుపడతాడు. 25 ఏళ్ళ శిక్ష అనుభవిస్తాడు. ఆ తర్వాత కూడా వయస్సుపై పడిన కబాలిని ఇక గొడవలు ఏమీచేయడని జైలు నుంచి వదిలేస్తుంది. 
 
ఇక విడుదలయ్యాక... తన భార్య గురించి వాకబు చేస్తూ.. తన కుటుంబాన్ని నాశనం చేసిన సీతారామరాజు అనుచరుల్ని వేటాడతాడు. అప్పటికే డ్రగ్స్‌ మాఫీలో ప్రపంచంలోనే నెంబర్‌ 1గా ఎదిగిన టోనీ అడుగడుగునా కబాలికి అడ్డుతగులుతాడు. కబాలీ వస్తే తన స్థానం పోతుందని భయంతో.. హత్య చేసేందుకు పథకం వేస్తాడు. చివరికి ఎలాగోలా తప్పించుకున్న కబాలి.. టోనికి ఎలాంటి ముగింపు ఇచ్చాడు? అసలు కబాలి ఫ్యామిలీ వుందా? ఆ తర్వాత ఏమి జరిగింది? అనేది సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌ :
రజనీకాంత్‌ వన్‌మేన్‌ షో. 65 ఏళ్ళ వయస్సులో చలాకీగా నటించాడు. యువకుడిగా వున్నప్పుడు పాత్రకు తన బాడీతో చాలా చక్కగా డీల్‌ చేశాడు. వయస్సు పైపడ్డ కబాలి పాత్ర స్టెయిలిష్‌గా వుంది. కోటు, సూటుతో లుక్‌ బాగుంది. తనకు మంచి జరిగినా... చెడు జరుగుతున్నా.. 'మంచిది' అనే పదం రజనీ చెబుతాడు. ఈ పదం సీన్‌పరంగా బాగుంది. ఇక భార్యగా రాధికా ఆమ్టే నటించింది. కుమార్తెగా యోగి నటించింది. సీతారామరాజుగా ధర్మం కోసం పోరాడే వ్యక్తిగా నాజర్‌ సరిపోయాడు. ఆయన అనుచరులుగా తమిళ నటులు నటించారు.
 
టెక్నికల్‌గా..
సాంకేతికంగా కెమెరా గురించి చెప్పాలి. ప్రతి సన్నివేశం బాగా డీల్‌ చేశాడు. సంగీతపరంగా పెద్దగా చెప్పుకోవడానికి ఏమీలేదు. ఎందుకంటే.. కబాలి.. అనే టైటిల్‌ సాంగ్‌.. బ్యాక్‌డ్రాప్‌లో వస్తుంది. అది మినహా పెద్దగా పాటలు లేవు. కథ అలాంటిది. నేపథ్య సంగీతం బాగుంది. సంభాషణపరంగా.. సింపుల్‌గా వుండేట్లు చూసుకున్నాడు. 'మన చెంప ఎవడైనా కొడితే.. వెంటనే రియాక్ట్‌ కావాలి. లోపల దాచుకుని భయపడకూడదు.. అనే సాధారణ డైలాగ్స్‌ అయినా.. సన్నివేశపరంగా కుదిరాయి. అలాగే రజనీ చిత్రాల్లో వుండే.. వేదాంత ధోరణి ఇందులోనూ వుంది... నేనే మాఫియా సామ్రాజ్యాన్ని ఏలాలనే టోనీ పాత్రతో... ఈ సూటు ఈ కోటు వేసుకుని ఇన్ని కుతంత్రాలా... అందుకే మరో జన్మ వుంటే ఈ మనిషి జన్మ వద్దని కోరుకుంటా.. అనేవి టచ్‌ చేస్తాయి. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌తో పాటు మిగిలిన గ్రాఫిక్స్‌ కథకు సరిపోయాయి.
 
విశ్లేషణ :
దర్శకుడుగా రంజిత్‌కు ఎక్కువ సినిమాలు తీసే అనుభవం లేకపోయినా.. రజనీకాంత్‌ను బాగా డీల్‌ చేశాడు. స్టయిలిష్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. అసలు కథను చూస్తే... ఫ్రెంచ్‌ సినిమాలోని ఓ పాయింట్‌ తీసుకుని చేసినట్లుంది. ఓ సినిమాలో డాన్‌గా చేసిన కబాలి లాంటి పాత్ర ఓ వేశ్యను ప్రేమిస్తాడు.. ఆమెను ఈ గొడవల్లో చంపేస్తారు. ఆ తర్వాత తను జైలుకు వెళతాడు. బయటకు వచ్చాక.. కొన్ని నిజాలు తెలుస్తాయి. తన గురువుచుట్టూ వున్న అనుచరులే తన భార్యను నాశనం చేశారని.. ఈ కథను అటుఇటూగా మార్చి తీశాడని కబాలి.. సినిమా చూశాక.. సినీ విశ్లేషకులు చర్చించుకోవడం కన్పించింది. 
 
కమల్‌ హాసన్‌ 'నాయగన్‌' తీశాక.. అలాంటి కథతో సినిమా తీయాలని రజనీకి వుండేదని తెలిసింది. అందుకు సంబంధించినట్లుగా 'బాషా' తీశాడు. అయితే కబాలి చూశాక.. అలాంటి ఫార్మెట్‌లో వుంటుందని ఆశించిన వారికి నిరాశే మిగులుతుంది. ఎందుకంటే ఆ చిత్రంలో వున్న ఎమోషన్స్‌.. ట్విస్ట్‌లు కబాలిలో లేవు. అందులో ప్రతి సన్నివేశం ఇంట్రెస్ట్‌గా వుంటుంది. కబాలిలో అదే లోపం. మలేషియాలో మాఫియాడాన్‌గా వుండే టోనీకి కబాలి ఎలా చెక్‌ పెట్టాడనేది కథ. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌ప్లేను దర్శకుడు ఇంకాస్త ఆసక్తికరంగా తీసుకువస్తే బాగుండేది. 
 
ఏది ఏమైనా రజనీ స్టయిలిష్‌ను కూడా ఓవర్‌గా చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మొదటి భాగమంతా.. కబాలి  తన కుటుంబాన్ని నాశనం చేసిన వారిని తుదముట్టించడం.. ష్లాఫ్‌బ్యాక్‌లో తన గురించి చెప్పుకోవడం జరుగుతుంది. సెకండాఫ్‌ వచ్చేసరికి.. కాస్త నిదానించింది. కుటుంబ ఎమోషన్స్‌ వున్నా.. అవి ఎక్కడా కనెక్ట్‌ కావు. 'దళపతి', 'బాషా' చిత్రాల్లో అవి బాగా రక్తికట్టాయి. ఆ రెండు చిత్రాలను చూసిన కళ్లతో ఈ చిత్రం చూసినవారికి పెద్దగా ఆనదు. వయస్సు మీద వున్న రజనీ డాన్‌గా ఎలా చేశాడనే ఆసక్తి మాత్రం వుంటుంది. ప్రత్యేకంగా చెప్పాల్సింది కూడా అదే. వయస్సుకు తగ్గ పాత్రను ఎన్నుకుని ఆ పాత్రకు న్యాయం చేశాడు రజనీ. ఇందులో అతనికి నూరుకి నూరు మార్కులు ఇవ్వవచ్చు. 
 
కాగా, ముగింపులో ట్విస్ట్‌ ఇచ్చాడు. తన కుటుంబాన్ని దక్కించుకుని డాన్‌ను తుదముట్టించిన కొద్ది నెలలవరకు సాఫీగా సాగిన కబాలి జీవితానికి 'నాయకుడు'లో కమల్‌కు ఇచ్చిన ముగింపు ఇచ్చాడు. మలేషియా ప్రభుత్వమే కబాలిని నమ్మకస్తుడు చేత కాల్పిస్తుంది. దాంతో టైటిల్స్‌ పడతాయి... అతను ఎందుకు చంపాడు? అనేది.. కబాలి-2లో చూడాలా? అన్నట్లు క్రియేట్‌ చేశాడు. ఈ సినిమా రిలీజ్‌కు ముందున్న క్రేజ్‌కు తగినట్లు ఆడితే.. రెండో భాగముంటుందేమో..?
 
రేటింగ్‌ : 3/5