శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ivr
Last Updated : శుక్రవారం, 24 అక్టోబరు 2014 (15:31 IST)

పాము పగపట్టింది... మరి కార్తీక్ ఏం చేశాడు... కార్తికేయ రివ్యూ రిపోర్ట్

కార్తికేయ నటీనటులు: నిఖిల్‌, స్వాతి, రావు రమేష్‌, తనికెళ్ళ భరణి, సాయి, తులసి, జోగి బ్రదర్స్‌ తదితరులు
 
పాయింట్‌: దేవుడు, నమ్మకంపై అల్లిన కథ.
 
సినిమాల్లో కథలు సామాజిక అంశాలతో ముడిపడే చిత్రాలు చాలా వచ్చాయి. కమర్షియల్‌ ఫార్మెట్‌ జోడించి దానికి నమ్మకం అనే దాన్ని ముడిపెడుతూ... వచ్చిన చిత్రాలు వచ్చాయి. విజయవంతం అయ్యాయి. రజనీకాంత్‌ 'బాబా', అనుష్క 'అరుంధతి', పంచాక్షరి వంటి చిత్రాలు అలాంటి కోవలోకి వస్తాయి. 'స్వామి రారా' చిత్రం ఫేమ్‌ స్వాతి, నిఖిల్‌ నటించిన చిత్రమిది. 'పరుశురామ్‌' చిత్రానికి దర్శకత్వం వహించిన చందు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వెంకట్‌ శ్రీనివాస్‌ బొంగరం చిత్రాన్ని నిర్మించారు. మొదట ఈ చిత్రానికి 4 కోట్ల బడ్జెట్‌ వేసుకున్నా... కొన్ని కారణాల వల్ల 8 కోట్లు చేరుకుందని తెలుస్తోంది. దాదాపు ఏడాది పాటు సినిమా పూర్తయినా.. సాంకేతిక ఇబ్బందుల వల్ల ఈ చిత్రం ఇప్పటికి అంటే 24.10.2014న విడుదలైంది. ఆ విశేషాలు ఏమిటో చూద్దాం.
 
కథగా చెప్పాలంటే.... 
కార్తీక్‌ (నిఖిల్‌) మెడికో స్టూడెంట్‌. చదువుతోపాటు అల్లరిచిల్లరి పనులు చేస్తూ కాలేజీ డీన్‌ దృష్టిలో కొరకరానికొయ్యగా మారతాడు. వేరే కాలేజీలో చదివే వల్లీ (స్వాతి)ని మొదటిచూపులోనే ప్రేమించేస్తాడు. ఆమె అతని ప్రేమని తిరస్కరిస్తుంది. మరోవైపు అనుకోకుండా సుబ్రహ్మణ్యపురం అనే ఊరిలో వున్న కుమారస్వామి ఆలయంలో కొన్ని సంఘటనలు చోటుచేసుకుంటాయి. మూసివేయబడిన ఆ గుడి విరాలను తెలుసుకోవాలని దేవాదాయశాఖలో పనిచేసే ఉద్యోగి శంకర్‌, రచయితగా మారి.. దాని గురించి పరిశోధించి చనిపోతాడు. ఆ కేసును డీల్‌ చేసే ఇన్‌స్పెక్టర్‌ కూడా అనుకోకుండా పాము కాటుకు గురవుతారు. అలాంటి ప్రాంతంలో కార్తీక్‌ స్నేహితులతో సహా కాలేజీ ప్రిన్సిపాల్‌ ఫ్రీ మెడికల్‌ క్యాంప్‌కు పంపిస్తాడు. దానితోనైన కార్తీక్‌ పొగరు అనుగుతుందని ప్రిన్సిపాల్ భావిస్తాడు. 
 
విషయం తెలిసి.. కార్తీక్‌ తల్లి తులసి.. స్వామీజీ ఇచ్చిన కంకణాన్ని జాగ్రత్తగా వుంచుకోమని చెబుతుంది. ఆ తర్వాత వారంతా సుబ్రహ్మణ్యపురం ఊరి వెళ్ళడం. అక్కడ ఫ్రీ మెడికల్‌ క్యాంప్‌ చేయడంతోపాటు గుడిలోని రహస్యాల్ని చేధించాలనే కోరిక కార్తీక్‌లో బలంగా వుంటుంది. అనుకోకుండా అక్కడే క్యాంపుకు వచ్చిన వల్లీని ఆమె తండ్రి తనికెళ్ల భరణి సహాయంతో పెండ్లి చేసుకుంటానని చెప్పేస్తాడు. ఈ క్రమంలో ఓ సంఘటనలో కార్తీక్‌కు పగపట్టే పాము కన్పిస్తుంది. తనపైనే ఎందుకు పగ పట్టింది? అంటూ ఓ పూజారి సాయంతో పక్క ఊరిలోని స్వామీజి వద్దకు వెళతాడు. ఆ తర్వాత ఏమయింది? అక్కడ ఆ స్వామీజీ ఏం చెప్పాడనేది కథ.
 
పెర్‌ఫార్మెన్స్‌.. 
నటనాపరంగా నిఖిల్‌ 'పరశురామ్‌' నుంచి చాలా ఎనర్జిటిక్‌గా వుండేవాడు. కానీ 'కార్తికేయ' చిత్రంలో మాత్రం.. పరిమితి పొందాల్సి వచ్చింది. ఒక బాధ్యతగల పాత్రగా దర్శకుడు చందును తీర్చిదిద్దాడు. మొదటి భాగంలో చాలా సరదాగా చేసే పాత్రను సెకండాఫ్‌లో కొంచెం సెంటిమెంట్‌ టచ్‌తో చూపించాడు. కలర్స్‌ స్వాతి పాత్ర కూడా మెచ్చూర్డ్‌గా వుంటుంది. నిఖిల్‌ స్నేహితులుగా యూత్‌ కమేడియన్స్‌ జబర్‌దస్త్‌ టీమ్‌ నటించారు. వారు చేసే సన్నివేశాలు హాస్యం తెప్పిస్తాయి. తనికెళ్ళ భరణి స్వాతి తండ్రిగా, ఊరిలో పూజారిగా నటించాడు. మిగిలిన పాత్రలు కథాపరంగా సాగిపోయేవే. ఎండోమెంట్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్‌గా రావు రమేష్ నటించాడు. మేక వన్నె పులిగా ఆయన పాత్ర వుంటుంది. జోగి బ్రదర్స్‌ కూడా అదే బాపతు..
ఇంకా ఉంది... రెండో పేజీలో చదవండి------->
 
రేటింగ్: 3/5
టెక్నికల్‌గా... 
కెమెరాపనితం చాలా బాగుంది. ప్రతిషాట్‌ను అద్భుతంగా తీశాడు. నైట్‌ ఎఫెక్ట్‌లో సీన్స్‌ తీయడం ఆకర్షణీయంగా వున్నాయి. సంగీతపరంగా ఈ చిత్రంలో డ్యూయెట్లు పెద్దగా లేవు గనుక.. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ను సంగీత దర్శకుడు బాగా ఇచ్చాడు. భయం గొలిపే మిక్సింగ్‌ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఎడిటింగ్‌ పరంగా ఓకే. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పనితం చాలా బాగుంది. ద్రవిడ రాజ్యానికి చెందని రాజుల కథ నుంచి నేటివరకు కథను చూపే విధంగా వేసిన ఆర్ట్‌ కథలో లీనమైపోయేలా చేస్తుంది. సంభాషణ పరంగా దర్శకునికి మార్కులు పడతాయి. 'ఆడపిల్లకు బస్సులోనూ, బయట కూడా సేఫ్టీ లేకుండా పోతుంది. అలాంటిది తల్లి కడుపులో కూడా సేఫ్టీ లేకపోతే ఎలా?' అనే డైలాగ్‌... సన్నివేశపరంగా బాగా ఆకట్టుకుంది. ఇలాంటి పంచ్‌ డైలాగ్‌లు మితమైన సంభాషణలు ఇందులో వున్నాయి.
 
విశ్లేషణ 
దేవుడిపై నమ్మకం, నమ్మకం లేకపోవడం అనే కాన్సెప్ట్‌లు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా డీల్‌ చేయాలి. మొదటి భాగంలో దర్శకుడు చందు చాలా పరిణితి చెందినవాడిలా చూపించాడు. సెకండాఫ్‌లో దాన్ని ఇంకెంత బాగా తీస్తాడో అనిపించేలా వుంది. అడుగడునా ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేసినా .. రెండో భాగంలో ఒక్కసారిగా ముగింపు ఆసక్తి తగ్గింది. దైవమే మనిషిని నడిపేది. ఆ దేవుడిని నమ్ముకుంటే ఏదైనా జరుగుతుందని చెప్పే కాన్సెప్ట్‌ ఇది. దేవుడు, దెయ్యం లేదని నేటితరం యువత... మూసివేసిన ఆలయంలోని రహస్యాన్ని ఎలా ఛేదించాడనేది ముగింపు.
 
మేషరాశిలో పుట్టిన కార్తీక్‌ మాత్రమే ఆ ముడిని విప్పగలడని స్వామీజీ చెప్పడం.. చిత్రంలో ఆసక్తికరం. అయితే... పాము పగపడుతుంది. కార్తీక్‌ పైనే పగ ఎందుకు? అనేది క్లారిటీ లేదు. పాము పగపట్టడం వెనుక.. దాన్ని హిప్నటైజ్‌ చేయడమే. ఈ కాన్సెప్ట్‌ ఈ చిత్రంలో కొత్తగా అనిపిస్తుంది. ప్రతి జీవిని హిప్నటైజ్‌ చేసే విధంగానే పామును కూడా చేస్తారంటూ... దర్శకుడు చెబుతాడు. దీని గురించి దర్శకులు చాలానే కసరత్తు చేశాడు.
 
అయితే.. ముగింపులో ఎండోమెంట్‌ అధికారే దేవాలయంలోని విలువ కట్టలేని వజ్రం సొంతం చేసుకోవాలనే కాంక్షతో విదేశీయులతో చేతులు కలిపి కాజేయాలనుకుంటాడు. దానికి ప్రజల్లో సెంటిమెంట్‌ కలగజేసి... దాన్ని స్వలాభానికి ఉపయోగించుకోవాలనుకుంటాడు. ఇలాంటి కాన్పెప్ట్‌.. బ్లాక్‌ అండ్‌ సినిమాల నుంచి వచ్చినవే. కానీ మొదటి భాగంలో చూపించిన ఇంట్రెస్ట్‌... సెకండాఫ్‌లో తేల్చేయడంతో ఆ ఇంట్రెస్ట్‌ క్యారీ కాలేకపోయింది. 
 
ప్రతి కార్తీక పౌర్ణమినాడే.. పున్నమి వెన్నెల దేవుడి కాలు దగ్గర వజ్రంపై పడి వెలుతురు వస్తుంది. కానీ దాన్ని ఎండోమెంట్‌ అధికారి ఎలా అడ్డుకట్టవేశాడో సరిగ్గా చూపించలేకపోయాడు. వెరసి... కొన్ని లోటుపాట్లు ఉన్నా.. మొత్తంగా సామాన్య ప్రేక్షకుడికి.. ఈ చిత్రం ఆసక్తి కల్గిస్తుంది. నిఖిల్‌ రేంజ్‌కు ఇది విజయవంతమైన సినిమానే అనుకోవచ్చు. 
 
పాము సినిమాలు చాలామటుకు విజయాలు చేకూర్చాయి నిర్మాత దర్శకులకు. బహుశా అంత రేంజ్‌లో కాకపోయినా.... ఫర్వాలేదనిపించేలా కార్తికేయ చిత్రం వుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

రేటింగ్: 3/5