గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: గురువారం, 23 ఏప్రియల్ 2015 (18:38 IST)

'కాయ్‌ రాజా కాయ్‌'.... ఏముందసలు...? రివ్యూ రిపోర్ట్

కాయ్ రాజా కాయ్ చిత్రం నటీనటులు: రామ్‌ఖన్నా, మానస్‌, జోష్‌ రవి,  శ్రావ్య, షామిలి, హరికృష్ణ, డి.ఎం.కె. తదితరులు; సినిమాటోగ్రఫీ: దేవ్‌, సంగీతం: జె.బి. ఎడిటింగ్‌: ఎస్‌.బి.ఉద్దవ్‌, నిర్మాతలు: మాధవి చలసాని, సతీష్‌రాజు వేగేశన, రచన, దర్శకత్వం: శివగణేష్‌.
విడుదల తేదీ: 23.04.2015
 
సినిమాలు సీరియస్‌గా తీయడం వేరు. తమవారి కోసం తీయడంవేరు. రెండోరకానికి చెందిన సినిమానే 'కాయ్‌ రాజా కాయ్‌'. మారుతీ దర్శకుని టీమ్‌లోని ఇద్దరిని హీరోలు గానూ, దర్శకుడిగానూ కొంతమందికి ట్రైనింగ్ కోసం నిర్మాతలు చాలా సింపుల్‌ బడ్జెట్‌తో చిన్నపాటి కథను తీసుకుని లాగించేయడం అనేది ఈ కాయ్‌ రాజా కాయ్‌. కథ కూడా పెద్ద పాయింట్‌ కాదు. పాత కథాంశంతో కొత్తగా తియ్యాలని చేసిన ప్రయత్నమే కానీ కొత్తదనం అస్సలు కన్పించదు. దర్శకుడు మారుతీ సపోర్ట్‌ చేసిన ఈ సినిమాలో ఏం చూపించదలచాడో చూద్దాం. 

 
కథ: అర్థరాత్రి హైవేలో ఓ సేఠ్‌ కారులో ప్రయాణిస్తాడు. దాన్ని కాపు కాచి నలుగురు పంక్చర్‌ చేస్తారు. అందరినీ చంపేసి కారు డిక్కీలో వున్న బంగారు బిస్కెట్ల బాక్స్‌ను లేపేస్తారు. నలుగురిలో ఇద్దర్ని ఒకడు చంపేస్తాడు. మిగిలినవి ఇద్దరే పంచుకోవాలి. ఇక ఇంకోవైపు హైదరాబాద్‌లో ఖన్నా(రామ్‌ ఖన్నా), ఆనంద్‌(మానస్‌) ఇద్దరూ ఫ్రెండ్స్‌. ఖన్నా బైక్‌ మెకానిక్‌, ఆనంద్‌ నిరుద్యోగి. వీరికి చిట్టిబాబు(జోష్‌ రవి) వచ్చి చేరతాడు. అయితే ఊర్లో కాయ్‌ రాజా కాయ్‌ అనే గాంబ్లింగ్‌ ఆటతో సిద్ధహస్తుడు. ఈజీగా మనీ సంపాదించడంకోసం ఇక్కడికి వచ్చాడు.  ఏదోలా డబ్బు సంపాదించాలనుకునే వీరంతా కలిసి ఎమ్మెల్యే కూతుర్ని కిడ్నాప్‌ చేస్తారు. ఆ తర్వాత వారు చిక్కుల్లో పడతారు. అవి ఏమిటి? మరి బంగారు బిస్కెట్ల గొడవేమిటి? అనేది కూడా మిగిలిన సినిమానే.
 
పెర్‌ఫార్మెన్స్‌: రామ్‌ఖన్నా, మానస్‌, జోష్‌ రవి పాత్రలు ఫర్వాలేదనిపిస్తాయి. మెకానిక్‌ రామ్‌ఖన్నా నటన చాలా నేర్చుకోవాలి. మానస్‌ అనే ఆర్టిస్టు ఇంతకుముందు మూడు, నాలుగు చిత్రాల్లో నటించినా కొన్నిచోట్ల ఈజీగా వున్నా.. ప్రేమ వ్యవహారంలో పెర్‌ఫార్మెన్స్‌ పెద్దగా పండించలేకపోయాడు. డ్యూయెట్‌ సాంగ్‌లో మానస్‌ వేసిన నైస్‌ స్టెప్పులు అందర్నీ ఆకట్టుకుంటాయి. ఇక అల్లరి చేసే చిట్టిబాబు క్యారెక్టర్‌లో జోష్‌ రవి మొదట్లో కాస్త అతిగా అనిపించినా పోనుపోను అతని క్యారెక్టర్‌ కూడా బాగుందనిపిస్తుంది. విలన్‌గా చేసిన హరికృష్ణ పర్వాలేదు. మిగిలిన పాత్రలు మామూలే.
 
టెక్నికల్‌గా... 
మారుతీ బ్రాండ్‌ సినిమాల్లో వుండే జె.బి.నే ఈ చిత్రానికి సంగీతం. పర్వాలేదు అనిపించేట్లుగా వున్నాయి ట్యూన్స్‌. దానికి తగ్గట్టుగానే విజువల్‌గా కూడా బాగా ప్రజెంట్‌ చేశారు. సినిమాకి తగ్గట్టుగా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా బాగా చేశాడు జె.బి., ఎడిటింగ్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్లు సోసోగా వున్నాయి. దర్శకుడుగా శివగణేష్‌ తను చెప్పాలనుకున్నది తన రీతిలో చెప్పాడు. కాకపోతే ఎక్కడా కొత్తగా అనిపించదు. 
 
విశ్లేషణ 
డబ్బు, బంగారం, ఓ నిధి వీటి కోసం సాగే కథలో లాజిక్కులు కన్పించవు. ఇంట్రెస్ట్‌గా చూపించగలగాలి. అసలు కథలో కొత్తదనం వుంటేనే ఆకట్టుకుంటుంది. పాత చింతకాయ పచ్చడి కథను తీసుకుని లాగించేశాడు. కథనంలోనూ ఎలాంటి కొత్తదనం లేకపోవడంతో సినిమా మీద స్టార్టింగ్‌ నుంచే ఆడియన్స్‌కి ఇంట్రెస్ట్‌ అనిపించదు. రొటీన్‌ డైలాగ్స్‌, రొటీన్‌ సీన్స్‌తో తర్వాత ఏం జరగబోతోంది అనేది కూడా మనకి ముందే తెలిసిపోతూ వుంటుంది. 
 
ఎంతో ఇంట్రెస్టింగ్‌గా చూపించాల్సిన ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ చాలా సాదాసీదాగా సెకండాఫ్‌లో మనం ఏం చూడబోతున్నామో అర్థమయ్యేలా వుంటుంది. ఫస్ట్‌ హాఫ్‌లో విలన్‌ని ఎంతో క్రూయల్‌గా చూపించి సెకండాఫ్‌కి వచ్చేసరికి అతని సీన్స్‌ కామెడీ అనిపించేలా చేశారు. బంగారు బిస్కెట్ల కోసం అందరినీ చంపేసే విలన్‌.. చివరికి రైస్‌లా వుండే ఇంటర్నేషనల్‌ మార్కెట్‌ వున్న ఇరీడియమ్‌ అనే పదార్థం గురించి అని చెప్పడం చిత్రాతిచిత్రంగా అనిపిస్తుంది. ఎన్నో మర్డర్లు చకచకా చేసుకుంటూ పోతుంటే.. ఒక్క పోలీసు కేసు ఫైల్‌ కాదు. 
 
సెకండాఫ్‌లో అనవసరమైన సీన్స్‌ చేయడంతో ఆడియన్స్‌కి సినిమా మీద ఇంట్రెస్ట్‌ పోవడమే కాకుండా, తర్వాత ఏం జరగబోతోంది అనే దానిపై కూడా క్యూరియాసిటీ లేకుండా చేసింది. సెకండాఫ్‌లో కొన్ని ఛేజ్‌లు, కొన్ని ట్విస్ట్‌ల తర్వాత యధాతథంగా పాత ఫార్ములాలోనే సినిమా ముగించడంతో ఆడియన్స్‌ డీలాపడిపోతారు. మొత్తంగా చూస్తే.. తమవారిని ప్రమోషన్‌ చేయడానికి ఇద్దరు నిర్మాతలు కలిసి తీసిన చిత్రమిదని అనిపిస్తుంది. ఇంతకంటే ఈ చిత్రం గురించి చెప్పాల్సిన పనిలేదు.