గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: బుధవారం, 11 జనవరి 2017 (14:38 IST)

చిరంజీవి ద్విపాత్రాభినయం... 'ఖైదీ నెంబర్‌ 150' ఇలావుంది... రివ్యూ రిపోర్ట్

యాభై రోజుల క్రితం అందరూ పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులుపడుతూ వినోదసాధనమైన సినిమాను చూడ్డానికి ఉత్సాహాన్ని చూపించలేకపోయారు. చాలా సినిమాలు వాయిదాలు పడ్డాయి. కాస్త కుదుటపడుతున్న తరుణంలో సంక్రాంతి వచ్చేసింది. తెలుగు సినీరంగ చరిత్రలో ఈ సంక్రాంతికి ప్రత్యేకత

యాభై రోజుల క్రితం అందరూ పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులుపడుతూ వినోదసాధనమైన సినిమాను చూడ్డానికి ఉత్సాహాన్ని చూపించలేకపోయారు. చాలా సినిమాలు వాయిదాలు పడ్డాయి. కాస్త కుదుటపడుతున్న తరుణంలో సంక్రాంతి వచ్చేసింది. తెలుగు సినీరంగ చరిత్రలో ఈ సంక్రాంతికి ప్రత్యేకత వుంది. చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు రోజు తేడాతో విడుదలకావడం విశేషం. అయితే చిరంజీవి 9 ఏళ్ళ తర్వాత మొహానికి రంగేసుకుని ఎలా నటిస్తారనే ఆసక్తి అందరిలోనూ వుంది. బుధవారమే విడుదలైన ఈ చిత్రం గురించి చెప్పాలంటే.. తమిళ 'కత్తి' గురించి కూడా చర్చించుకోవాలి. రెండు సంవత్సరాల నాడు విడుదలైన కత్తికి ఈ చిత్రం జిరాక్స్‌ కాపీ. కాగా, కొన్ని సన్నివేశాలను చిత్ర దర్శకుడు వినాయక్‌ హాస్యం కోసం జోడించారు. బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ.. తీసిన ఈ సినిమా మొత్తంగా ఎలా వుందో చూద్దాం.
 
కథ :
కొల్‌కతా జైలు నుంచి తప్పించుకున్న 'ఖైదీ నెంబర్‌ 150' కత్తి శీను (చిరంజీవి) పోలీసులకు దొరక్కుండా వుండాలని బ్యాంకాక్‌ వెళ్ళడానికి సిద్ధమవుతాడు. ఎయిర్‌పోర్ట్‌లో కన్పించిన లక్ష్మీ(కాజల్‌)ని చూసి తనకు తెలిసిన సుబ్బలక్ష్మిగా భావించి ప్రేమించేస్తాడు. ఆమె ప్రేమ కోసమే యూటర్న్‌ తీసుకుంటాడు. అలాంటి సమయంలో తమ కళ్ళముందే ఒకతన్ని కాల్చేయడం చూసి ప్రాణాపాయంలో వున్న అతన్ని శ్రీను ఆసుపత్రిలో చేర్పిస్తాడు. అచ్చు తనలాగే వుండటంతో అతనే శ్రీనుగా భ్రమించేలా చేయడంతో శ్రీను కోసం వెతుకుతున్న పోలీసులు అతన్ని జైలుకు తీసుకెళతారు. ఆయనే శంకర్‌ (చిరంజీవి). హైదరాబాద్‌లో ఓ వృద్ధాశ్రమంలో రైతుల్ని జాగ్రత్తగా చూసుకుంటుంటాడు. ఇక.. శ్రీనును చూసి తనే శంకర్‌గా ఆశ్రమవారంతా భావిస్తారు. ఇదేవిధంగా భ్రమించి, శీతలపానీయాలు తయారుచేసే కార్పొరేట్‌ సంస్థ అధినేత అగర్వాల్‌ తన కార్యాలయానికి పిలిచి శ్రీనుకు 25 కోట్ల ఆఫర్‌ ఇస్తాడు. ఆశ్రమంలో వున్న రైతుల వేలిముద్రలు కావాలనీ, అందుకు ముందుగా 15 కోట్లు ఇచ్చి పంపిస్తాడు. ఈ డబ్బుతో విదేశాలకు చెక్కేద్దామని ప్లాన్‌ చేసుకుంటుండగా... ఆశ్రమంలోని వారంతా రోటరీక్లబ్‌ వారు సన్మానించి 4 లక్షలు ఇస్తారని చెప్పగానే శ్రీను వారితో వెళతాడు. 
 
అక్కడికి వచ్చాక శంకర్‌ గురించిన వాస్తలు తెలిసి శ్రీనుకు హృదయం ద్రవించిపోతుంది. నీరూరు అనే గ్రామం కోసం శంకర్‌ జీవితాన్ని పణంగా పెట్టాడని తెలిసి, అలాంటి వారిని తాను మోసం చేస్తున్నందుకు సిగ్గుపడతాడు. వెంటనే అగర్వాల్‌కు తిరిగి డబ్బు వాపసు ఇచ్చి అతని దురాక్రమణాలకు చెక్‌ పెడతానని సవాల్‌ విసురుతాడు. సరిగ్గా ఆ సమయంలోనే కొల్‌కతా జైలు నుంచి తప్పించుకున్న శంకర్‌ను అగర్వాల్‌ రౌడీలు తీసుకువస్తారు. ఈ విషయం తెలిసిన శ్రీను ఏం చేశాడు? రైతుల పోరాటం ఏమయింది? అనేది మిగిలిన సినిమా. 
 
విశ్లేషణ:
తొమ్మిదేళ్ళ తర్వాత వచ్చిన చిరంజీవి తెరపై కన్పించిన తీరు ఆకట్టుకుంది. 149 సినిమాల నటనానుభవంతో సులువుగా రెండు పాత్రల్ని పోషించేశాడు. డాన్స్‌పరంగా స్టయిలిష్‌గా, సింపుల్‌గా బాడీలోని రిథమ్‌ ప్రకారం చేసేశాడు. డైలాగ్‌లు, యాక్షన్‌ సన్నివేశాలు గత చిత్రాల్లో చూసినట్లుగా అనిపిస్తాయి.
 
నటనాపరంగా కాజల్‌కు పెద్ద ప్రాధాన్యత లేకపోయినా కథలో భాగంగా వుంటుంది. సినిమాటిక్‌గా ఆమెను చూస్తే చిరంజీవి పక్కన ఓకే అనిపిస్తుంది. ఇక బ్రహ్మానందం, రఘుబాబు పాత్రలు కాసేపు అలరిస్తాయి. 'ఫ'ను పలికే విధానమే నవ్విస్తుంది. బ్రహ్మానందం, అమ్మాయిగా అలీతో చేసే ఊరమాస్‌ కామెడీ రొటీన్‌గా వుంది. 'కత్తి' సినిమాలో ఇటువంటివి కన్పించవు. హాస్య పాళ్ళు తక్కువ. కథ ప్రకారం కథనం సాగుతుంది. ఇక మిగిలిన పాత్రల్లో జయప్రకాష్‌రెడ్డి, విలన్‌ పాత్రధారి తరుణ్‌ అరోరా ఓకే అనిపించారు.
 
రత్నవేలు సినిమాటోగ్రఫీ బాగుంది. దేవీశ్రీ బాణీలు కమర్షియల ఫార్మెట్‌లో సాగుతాయి. కథతో రన్‌ అయ్యే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ మాత్రం 'కత్తి'లోనిదే వాడేశాడు. సంభాషణపరంగా పరుచూరి బ్రదర్స్‌, సాయిమాధవ్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారనే చెప్పాలి. ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయడం కోసం... పొగరు నాలో వుంది. హీరోయిజం నా ఇంట్లో వుందనే.. లాంటివి రాసేశారు. రామ్‌లక్ష్మణ్‌ యాక్షన్‌, ఎడిటింగ్‌, గ్రాఫిక్స్‌ వారి మేరకు పనిచేశారు.
 
అయితే తరుణ్‌ అరోరా పాత్రలో క్రూరత్వం కన్పించదు. 'కత్తి'లో స్టయిలిష్‌గా ఆ పాత్రను చేసిన నటుడు మెప్పించాడు. ఇక్కడ చిరంజీవి పాత్రను తరుణ్‌ అరోరా డామినేట్‌ చేయలేకపోయాడు. దర్శకుడు తీసుకున్న కొన్ని జాగ్రత్తల వల్ల కాబోలు విలనిజం హైలైట్‌ కాలేకపోయింది. సినిమాని మొత్తం చిరంజీవి వైపు నుండే చూడాల్సి వచ్చింది. 'కత్తి' అనే టైటిల్‌కు అర్థం అందులో విలన్‌ చెబుతాడు. రైతులను ఒప్పించకపోతే.. వారిని షేవింగ్‌ చేయడానికి పంపిన రౌడీలు.. కత్తితో షేవింగ్‌ చేసి ఎంత అందంగా మొహాన్ని చూపించగలరో.. అంతే అందంగా పీకలు కోసేయగలరనే డైలాగ్‌ పర్‌ఫుల్‌గా చెబుతాడు. దాంతో టైటిల్‌కు అది సెట్‌ అయింది. కానీ ఖైదీ.. కథకు వచ్చేసరికి అది తేలిపోయింది. 
 
కత్తిలో.. రైతు సమస్యలతోపాటు.. రాజకీయ అంశాలు కూడా చర్చకు వస్తాయి. లోకల్‌ రాజకీయాలను వేలెత్తి చూపించే సన్నివేశాలుంటాయి. తెలుగులో దాన్ని పూర్తిగా తీసేసి.. కేవలం రైతు భూ సమస్య, కార్పొరేట్‌ దిగ్గజం అగర్వాల్‌ సమస్యపైనే కథ సాగుతుంది. మధ్యమధ్యలో పోలీసు వ్యవస్థ లొసుగులు, రేటింగ్‌ కోసం మీడియా చూపే అత్యుత్సాహం అలానే చూపించేశారు. రైతుల కోసం పోరాడుతున్నాడనేది 'నీరు నీరు.. రైతు కంటనీరు' అనేది బ్యాక్‌డ్రాప్‌ సాంగ్‌ రావడంతో ఇది రైతుల సమస్య అని గుర్తుకువస్తుంది. 
 
ఇక ముగింపులో.. కత్తిలో విజయ్‌ చేసిన పెర్‌ఫార్మెన్స్‌.. దర్శకుడు మురుగుదాస్‌ తీసుకున్న విధానం హృదయాన్ని టచ్‌ చేస్తుంది. 'ఎవరో ఎవరో.. వీరి కోసం పోరాడాడో..' అనేలా జేసుదాస్‌ పాడే సాంగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రావడం... తమ కోసం పాటుపడి.. చివరికి జైలుకు వెళ్ళిపోతున్నాడనే బాధ.. అక్కడి ప్రజల్లో కలుగుతూ పాట సాగుతుంది. కానీ ఇక్కడ అది లోపించింది. సరదాగా జైలుకెళ్ళి తిరిగి వస్తాలే అంటూ కాజల్‌తో చెప్పడంతో ముగుస్తుంది. బలహీనమైన ప్రతినాయకుడి పాత్ర, సెకండాఫ్‌లో కాస్త సాగదీసిన డ్రామా, రైతుల సమస్యకు బలమైన పరిష్కారం చూపకపకుండా అసంతృప్తిగా వదిలేయడంతో... సినిమాను సినిమాగా తీస్తు ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేసేలా చిరంజీవి ఇలా వున్నాడనే చెప్పే ప్రయత్నమే ఈ సినిమా.
 
రేటింగ్‌ : 3/5