శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2015 (11:27 IST)

రేయ్... రండిరా... నేను మీకెలా కనిపిస్తున్నాను... 'కిక్‌-2' రివ్యూ రిపోర్ట్

కిక్ 2 నటీనటులు: రవితేజ ద్విపాత్రాభినయం, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రాజ్ కిరణ్‌, పోసాని, రఘుబాబు తదితరులు; నిర్మాత: నందమూరి కళ్యాణ్‌ రామ్‌, కథ: వక్కంతం వంశీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేందర్‌ రెడ్డి.
 
కిక్‌ సినిమా అనగానే, రవితేజ ఎంత ఎనర్జిటిక్‌గా చేశాడో ఒక్కసారి గుర్తుకు వస్తుంది. తన కిక్‌ కోసం ఎన్నో జిమ్మిక్కులు చేసి... రాబిన్‌హుడ్‌లా ఉన్నవాడిని దోచుకుని అనాథలకు పెట్టే పాత్ర అది. లవర్‌ కోసం ఏకంగా పోలీసుగా అయిపోయే ఆ క్యారెక్టర్‌ డిజైన్‌ మాస్‌ను అలరించింది. పట్టంకట్టారు. అయితే మరలా ఐదేళ్ళ తర్వాత కిక్‌-2 అంటూ వచ్చాడు. అయితే ఇందులో కిక్‌ కోసం విదేశాలకు వెళ్ళిపోతాడు రాబిన్‌‌హుడ్. ఆ తర్వాత ఏమి జరిగిందనేది సీక్వెల్‌లో చూపించాడు. అసలు ఇలాంటి కథలకు రకరకాలు ప్రాంతాలను ఎంచుకుని వారి కష్టాల్ని తన కష్టాలుగా హీరో ఎలా మలుచుకున్నాడనేది చూద్దాం..
 
కథ: రాబిన్‌హుడ్‌ (రవితేజ) యు.ఎస్‌ వచ్చేస్తాడు. కిక్‌ కోసం... వాడి కంటే రెండింతలు కిక్‌ కావాలని.. తల్లి గర్భంలో వుండగానే తనకు కంఫర్ట్‌గా లేదని ఏడు నెలల్లో అమ్మకడుపు లోంచి బయటకు వచ్చేస్తాడు చిన్న రాబిన్‌హుడ్‌(రవితేజ). పెరిగి పెద్దయ్యాక తండ్రి చేసే పనులు తనకు కంఫర్ట్‌గా లేదని గ్రహిస్తాడు. తన తాత ఆస్తి ఇండియాలో కబ్జా అయిందని తెలుసుకుని.. దాన్ని స్వాధీనం చేసుకోవడానికి హైదరాబాద్‌ వస్తాడు జూ. రాబిన్‌హుడ్‌. ఇక్కడకు రాగానే.. పండిత్‌ రవితేజ (బ్రహ్మానందం)ఇంట్లో అద్దెకు దిగుతాడు. 
 
తన కంఫర్ట్‌ కోసం కొన్ని రూల్స్‌ పెట్టి ఆడుకుంటాడు. ఎట్టకేలకు తాత ఆస్తిని కబ్జా చేసిన సెటిల్‌మెంట్‌ మధు (ఆశిష్‌ విద్యార్థి)నుంచి తెలివిగా రాబట్టుకుంటాడు. ఆ సమయంలో చిత్ర(రకుల్‌ప్రీత్‌సింగ్‌) ప్రేమిస్తున్నట్లు చెబుతుంది. ఇలాగే ప్రేమిస్తూ వుంటే ఎప్పటికైనా నిన్నే ప్రేమిస్తానేమో అనే చిత్రమైన లాజిక్‌ చెప్పి.. ఆమె చేత ఖర్చు పెట్టిస్తాడు. ఇలాంటి టైంలో తన ఆస్తి దక్కింది కనుక ఇక పని అయిపోయింది గనుక యు.ఎస్‌. వెళ్ళిపోవడానికి సిద్ధమవుతాడు. అయితే లోపల వున్న మనిషి.. చిత్రను మర్చిపోకుండా చేస్తుంది. దాంతో ఆమె కోసం బీహార్‌లోని విశాల్‌పూర్‌కు వస్తాడు. అక్కడ గ్రామ ప్రజలంతా ఠాగూర్‌ బల్వంత్‌సింగ్‌(రాజ్‌కిరణ్‌) కింద బానిసల్లా బతుకుతారు. క్రూరుడు. అలాంటివాడికీ రాబిన్‌హుడ్‌కు గొడవలు పెట్టి తమను ఎలా కాపాడుకున్నారనేది మిగిలిన కథ.
 
పెర్‌ఫార్మెన్స్‌ 
ఇందులో రవితేజ సహజంగానే యమ స్పీడ్‌గా నటించేశాడు. ఎనర్జీ ఇంకా తగ్గలేదు. కానీ.. తన కంఫర్ట్‌ కోసం 10 కేజీలు తగ్గడంతో.. కొన్ని షాట్స్‌లో బాగున్నా.. మరికొన్ని చోట్ల గ్లామర్‌ తగ్గినట్లు స్పష్టంగా కన్పిస్తుంది. తండ్రి గెటప్‌ బాగుంది. అదే కొడుకు గెటప్‌ కూడా బాగానే చేశాడు. ఇక రకుల్‌ప్రీత్‌సింగ్‌ పాత్ర బాగానే చేసింది. హైటెక్‌ యువతిగా, గ్రామీణ యువతి రెండు షేడ్స్‌ వున్న పాత్రను పోషించింది. కథలో ఆమె పాత్ర కీలకమైనదే. ఠాగూర్‌గా క్రూరుడుగా రాజ్‌కిరణ్‌ నటించాడు. రేసుగుర్రం తరహా క్రూయల్‌గా వున్నా.. అంతకంటే ఎక్కువగానే చేశాడు. తనికెళ్ళభరణి, రఘుబాబు... తదితరులంతా విశాల్‌పూర్‌ గ్రామంలో తగిన పాత్రల్లో పోషించేశారు. మిగిలిన పాత్రలన్నీ వారి మేరకు నటించాయి. 
 
సాంకేతికంగా... 
కెమెరా పనితనం బాగుంది. సంగీతపరంగా తమన్‌ బాణీలు బాగానే ఉన్నాయి. అయితే ఒకసారి విన్నట్లుగా అనిపిస్తాయి... నేనొక్కడినే చిత్రంలోని బాణీలను సెకండాఫ్‌లో గుర్తుకు తెస్తుంది. సంభాషణల పరంగా ప్రాసలు లేకపోయినా.. ఎక్కడా ఆకట్టుకునేట్లుగా వుండవు. కథను వక్కంతం వంశీ ఇచ్చాడు. అయితే ఆయన కథ అందరికీ కనెక్ట్‌ అయ్యేట్లుగా లేకపోవడమే ప్రధాన లోపం. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట పని ఫర్వాలేదు. బీహార్‌కు చెందిన విశాల్‌పూర్‌ గ్రామంలో కొంత తీసినా కొంత ఆర్ట్‌ వర్క్‌ స్పష్టంగా తెలిసిపోతుంది. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఓకే. గ్రాఫిక్స్‌ కూడా బాగానే వాడారు. జూ. రాబిన్‌హుడ్‌.. పుట్టడం, పావురాల్ని చంపడం, యాక్షన్‌ సన్నివేశాలన్నీ గ్రాఫిక్స్‌తోనే ముడిపడి వున్నాయి.
 
విశ్లేషణ 
బాగా డబ్బున్న వ్యక్తి.. తన పని కోసం ఇండియా వచ్చి, ఇక్కడ సమస్యల్లో చిక్కుకుని దాన్ని సాల్వ్‌ చేయడమనేది కాన్సెప్ట్‌. చాలా చిత్రాల్లోనేదే. అయితే.. నేపథ్యం మారుతుంది. కిక్‌2 కూడా అంతే. బీహార్‌ నేపథ్యాన్ని తీసుకుని.... అసలు హీరోకు విలన్‌కు మధ్య వార్‌ అనే విషయాన్ని ఇద్దరికీ ఒకరికొకరు ఎందుకు కొట్టుకుంటారో తెలీకుండా గ్రామస్తులు ప్లాన్‌ చేయడమే కాన్సెప్ట్‌ కొత్తది. కొత్తదైనా దాన్ని స్క్రీన్‌ప్లేలో ఇంకాస్త ఎఫెక్ట్‌గా తీసుకురాకపోవడమే చిత్రంలోని ప్రధాన లోపం. మహేష్‌ నటించిన 'శ్రీమంతుడు'లో ఊరి కోసం ఏదో చేయాలని వచ్చి, అక్కడ క్రూరుడైన విలన్‌ను చంపేస్తాడు. 
 
ఊరి జనాలు తిరగబడలేకపోతే తనే కథకు ముగింపు ఇస్తాడు. ఖలేజాలో కూడా.. తన ఊరి కోసం ఏ దేవుడు వస్తాడని ప్రజలంతా ఎదురుచూస్తుంటారు. అలాగే అనుకోకుండా మహేష్‌ వచ్చి.. అనుకోకుండా ఇన్‌వాల్వ్‌ అవుతాడు. అది జనాలకు అర్థంకాక తిరస్కరించారు. కిక్‌2లో కూడ అంతే... ఎక్కడో వున్న తెలుగువాడు.. విలాస్‌పూర్‌లో వున్న తమను కాపాడటానికి ఎలా వస్తాడు. అందుకు పూజలు చేస్తే అమ్మ కరుణిస్తుందని.. గ్రామ పెద్ద చెప్పడం. ఊరంతా పూజించడం.. అనుకోకుండా  విమానం ఎక్కిన హీరో మనస్సుమారి.. బీహార్‌కు వచ్చేయడం అన్నీ చకచకా జరిగిపోతాయి. 
 
అసలు కథంతా చాలా స్పీడ్‌గా సాగుతుంది. మొదటి భాగం సరదాగా సాగుతుంది. రెండో భాగం చాలా సాగదీసినట్లుంది. దాంతో కథలో పట్టులేకపోవడంతో... ఒక దశలో విసుగుతెప్పిస్తుంది. విక్రమార్కుడులో ఇదే రవితేజ... అక్కడి క్రూరత్వాన్ని పోలీసుగా చాలా తెలివిగా చంపేస్తాడు. ఇందులో అదే సీన్‌ రిపీట్‌ అవుతుంది. విలన్‌ కొడుకు... పుట్టినరోజు నాడు అందరూ చూస్తుండగానే.. ఊరిలోని అమ్మాయిని రేప్‌ చేసేస్తాడు. నేనూ మగాడినే అని నిరూపించుకున్నాననే డైలాగ్‌ కూడా పెట్టారు. ఇదంతా రచయిత, దర్శకుడు తెలివికి పరాకాష్ట.
 
అసలు ఎక్కడో కథ మనకు సింక్‌ కావడమనేది లాజిక్ లేని పాయింట్‌. ఒకవేళ వున్నా.. దాన్ని కనెక్ట్‌ అయ్యేవిధంగా తీయగలగాలి.. కానీ దాన్ని తీయడంలో దర్శకుడు ఫెయిల్‌ అయ్యాడు. మొదటి నుంచి సినిమాలో దర్శకుడు రీష్యూట్‌ చేశాడనే విమర్శ విన్పిస్తూనే వుంది. ఈ చిత్రం చూశాక.. నిజమే అనిపిస్తుంది. రెండో భాగం బాగా సాగదీసి... చివరికి విలన్‌ను హీరోనో, ఆయన కింద నలిగిపోతున్న ప్రజలే చంపకుండా.... వెనుదిరగడం.. కథలో ప్రధాన లోపం. ఆఖరికి పావురం ఎగిరి వచ్చి... నిప్పంటించిన కర్రను విలన్‌కు వెళ్ళేలా చేయడం మరీ విడ్డూరంగా వుంది. ఇలాంటి విడ్డూరాలు చిత్రంలో చాలానే వున్నాయి. అందులో మొదటిది కథే. దాదాపు మూడు గంటలపాటు చూసిన ఫీలింగ్‌.. ప్రేక్షకుడు కనెక్ట్‌ కాలేని సినిమా.. కిక్‌2. మరి దీనికి కొనసాగింపుగా కిక్ ‌3 అంటూ ముగింపు ఇవ్వడం మరింత విడ్డూరం.
 
కొసమెరుపు: 
క్లైమాక్స్‌లో రవితేజ.. ప్రజలు తనని మోసం చేశారని తెలిసి.. రండిరా నేను ఎలా కన్పిస్తున్నాను మీకు.. అంటూ పలికే డైలాగ్‌ సినిమాకు కరెక్ట్‌గా సరిపోతుంది. పాపం నిర్మాతకు కూడా వర్తిస్తుంది కూడా...