శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: శుక్రవారం, 19 జూన్ 2015 (20:17 IST)

పాత ప్రేమ జ్ఞాపకాలతో 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...' రివ్యూ రిపోర్ట్

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ నటీనటులు : సుధీర్‌ బాబు, నందిత; దర్శకత్వం : ఆర్‌. చంద్రు; నిర్మాత : లగడపాటి శ్రీధర్‌; సంగీతం : హరి
 
ప్రేమకథలు ఎప్పుడూ కొత్తగానే వుంటాయి. అవి యూత్‌ను బాగా ఆకట్టుకుంటాయి. 1980లో యూత్‌కూ 2015కు యూత్‌కు చాలా తేడా వుంది. అయితే వయస్సు పెరిగినా ప్రేమ అనేది ఒకేలా వుంటుంది. కానీ ఆలోచనలు వేరుగా వుంటాయి. ప్రేమంటే స్వచ్చమైందని చెప్పే చిత్రాలు చాలా వచ్చాయి. ఇప్పటికే సుధీర్‌ బాబు, నందితలు హీరోహీరోయిన్లుగా 'ప్రేమకథా చిత్రమ్‌'లో చేశారు. మళ్ళీ అదే జంట చేసిన ప్రయత్నమిది.


రామలక్ష్మీ క్రియేషన్స్‌ పతాకంపై లగడపాటి శ్రీధర్‌ నిర్మించిన సినిమా 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ'. కన్నడలో హిట్‌ అయిన 'ఛార్మినార్‌' సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. చార్మినార్‌ సినిమాకు దర్శకుడైన ఆర్‌. చంద్రుయే తెలుగు రీమేక్‌ను కూడా తెరకెక్కించారు. అయితే కన్నడ ప్రేమకు తెలుగు ప్రేమకు వ్యత్యాసం ఏమిటో చూడాలంటే సినిమాలోకి వెళ్ళాల్సిందే.
 
కథ : 
కృష్ణాపురంకి చెందిన ఐదుగురు కుర్రాళ్లు తాము చదివిన స్కూల్‌ డేస్‌ను గుర్తుచేసుకుంటూ.. పాత విద్యార్థినీవిద్యార్థుల సమ్మేళనం పేరుతో అందరిని ఆహ్వానిస్తుంటారు. అందులో అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేసే కృష్ణ(సుధీర్‌ బాబు) ఒకడు. పాత్ర ఫ్రెండ్స్‌ను కలుసుకునేందుకు ఉత్సాహంగా బయలుదేరివస్తాడు. ఇండియాకు రాగానే పాతజ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. హైస్కూల్‌ చదువులు, కాలేజీ చదువులు, తనకు నచ్చిన రాధ(నందిత)తో కృష్ణా నది పరిసర ప్రాంతంలోని గడిపిని క్షణాలు. ఇక అక్కడ నుంచి ఫ్లాష్‌బ్యాక్‌. రాధ ప్రేమకు చాలా రకరాలుగా ప్రయత్నాలు చేస్తాడు.
 
కానీ ప్రిన్సిపాల్‌ చెప్పిన సలహామేరకు రాధకు ప్రేమపై ఎటువంటి ఆసక్తి లేదని తెలుసుకుంటాడు. దాంతో తన కెరీర్‌పై దృష్టిపెట్టి.. ఇంజనీరింగ్‌ చేయడం సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగం సంపాదించడం జరిగిపోతాయి. చివరికు ఫ్రెండ్స్‌తో కలిసి స్కూల్‌ఫంక్షన్‌కు హాజరవుతాడు. తన అనుభవాలు చెబుతాడు. కానీ తన రాధ కన్పించదు. ఆమె కోసం తిరిగి ఆమె ఇంటికి వెళతాడు. అక్కడ దీనాతిదీనంగా వున్న ఆమె పరిస్థితి చూసి చలించిపోతాడు. ఆ తర్వాత ఏం చేశాడు? అన్నది కథ.
 
పెర్‌ఫార్మెన్స్‌
కృష్ణగా సుధీర్‌బాబు తన క్యారెక్టర్‌లోని మూడు వేరియేషన్లను బాగా చూపించాడు. ముఖ్యంగా కృష్ణ పాత్రలో ప్రతి దశలో వచ్చే ఎమోషన్స్‌ని సుధీర్‌ బాబు చాలా బాగా చూపించాడు. క్లైమాక్స్‌లో కంటతడి పెట్టించాడు. ఇక నందిత తన పాత్రలో ఒదిగిపోయి నటించింది. క్లైమాక్స్‌లో వీరిద్దరి యాక్టింగ్‌ కట్టిపడేస్తుంది. నందిత తల్లిగా నటించిన ప్రగతి, సుధీర్‌ బాబు తండ్రిగా గిరిబాబు బాగా నటించారు. సుధీర్‌ బాబు, నందితల కెమిస్ట్రీ బాగుంది. మిగిలిన వారు తమ పాత్రల్లో నటించారు. పిల్లలకు పాఠాలు నేర్పే గురువులు కూడా బాగానే చేశారు. ప్రిన్సిపాల్‌గా పోసాని సరిపోయాడు.
 
సాంకేతిక విభాగం :
కెమెరా బాగా డీల్‌ చేశాడు. పాటలపరంగా ఎక్కువగా అనిపించాయి. ఒక్కో దశలో మారుతూ ఉన్న ఎమోషన్స్‌ను సినిమాటోగ్రాఫర్‌ సరిగ్గా బంధించే ప్రయత్నం చేశారు. హరి అందించిన సంగీతం బాగుంది. దర్శకుడు ఆర్‌. చంద్రు ఒక ఫార్ములా కథనే ఆసక్తికరంగా మలిచే ప్రయత్నంలో చాలావరకు విజయం సాధించాడు. స్క్రీన్‌ప్లే బాగుంది. సినిమా మొదట్లో మొదలైన సస్పెన్స్‌ ఎలిమెంట్‌ను చివరి వరకూ బాగా క్యారీ చేశాడు. సినిమా టైటిల్‌కు, కొంత కన్ఫ్యూజన్‌తో నడిచే కృష్ణ ప్రేమకథకు చివర్లో చక్కటి న్యాయం చేశాడు. కానీ నెరేషన్‌ విషయంలో కేర్‌ తీసుకొని ఉండాల్సింది.
 
విశ్లేషణ:
కథ ప్రకారం హైస్కూల్‌, కాలేజీ, ఉద్యోగం ఈ మూడు స్టేజ్‌లలో హీరోహీరోయిన్ల కథ చెప్పడం గురించి చెప్పుకోవాలి. చిన్నప్పుడు, ఇంటర్‌ కాలేజీ చదివే రోజుల్లో, ఇంజనీరింగ్‌ చదివే రోజుల్లో.. ఇలా ఒక్కో దశలో కృష్ణ ప్రేమలోని ఎమోషన్‌ మారుతూ ఉండటాన్ని చాలా బాగా క్యాప్చర్‌ చేశారు. ప్రేమకథల్లో ఎక్కువగా కనిపించే కలవడం, విడిపోవడం, మళ్ళీ కలవడం.. ఈ కాన్సెప్ట్‌ను స్క్రీన్‌ప్లే లోని కొన్ని పాయింట్ల ద్వారా బాగా డీల్‌ చేశారు. ఒక ఎదిగే కుర్రాడి జీవితంలో కలిగే తల్లి, తండ్రి, గురువు, ప్రేమ మరియు లక్ష్య సాధన అనే పాయింట్స్‌‌ని చాలా బాగా చెప్పాడు. స్క్రీన్‌ప్లే లోని కొన్ని గ్రిప్పింగ్‌ పాయింట్లతో ఆసక్తికరంగా చెప్పడానికి ట్రై చేసారు. కానీ ఈ పాటలు, అనవసర లాగ్‌ సీన్స్‌ ఆ ఫీల్‌‌ని కాస్త చెడగొట్టాయి. వీటి వలన సినిమాలో సీన్‌‌కి సీన్‌‌కి మధ్య కనెక్టివిటీ మిస్‌ అవుతుంది.
 
ఇక హీరో అమెరికా నుంచి మళ్ళీ తన సొంత ఊరికి వచ్చేవరకూ హీరోయిన్‌ను మరిచిపోయాడా? అనే ఆలోచన కలుగుతుంది. అలాగే సినిమాలో నందిత సైడ్‌ నుంచి ఒక్కసారి కూడా కృష్ణ మీద లవ్‌ ఉందని చూపించకుండా ఇద్దరినీ కలపడంలో లాజిక్‌ కనిపించలేదు. నెరేషన్‌ స్లోగా సాగుతుంది. దీంతో ఇప్పటి యూత్‌ కనెక్ట్‌ కావడం కష్టం. హైటైక్‌ యుగంలో స్లోగా సాగే ప్రేమకథలు పెద్దగా రుచించవు. అయితే ప్రేమంటే ఎంత స్వచ్ఛంగా వుండాలో.. అంత స్వచ్ఛంగానూ చివరివరకు వుండాలనే పాయింట్‌ బాగుంది. 
 
కృష్ణా నదిలో బండరాయిపై నమ్మకంతో ఏది రాస్తే అదే జరుగుతుందనేది అక్కడివారి నమ్మకం. ఆ నమ్మకంతో హీరోహీరోయిన్లు రాసుకున్న ఐ లవ్‌ యూనే సినిమా టైటిల్‌గా పెట్టారు. 1980లో అప్పటి యూత్‌ ఆలోచనలు, కెరీర్‌ ఎలా చూసుకునేవారే.. ఈ చిత్రకథ చాలా దగ్గరగా వుంది. అటువంటి గతం వున్నవారికి ఈ చిత్రం బాగా నచ్చుతుంది. ఎక్కడా వల్గారిటీ లేకుండా హాయిగా కటుంబంతో కలిసి చూసే చిత్రమిది. చక్కటి ఫీల్‌ కల్గించే సినిమా ఇది. దీన్ని ఇప్పటి యూత్‌ ఎంతమేరకు ఆదరిస్తారో చూడాలి.