గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: శుక్రవారం, 29 జనవరి 2016 (18:27 IST)

'లచ్చిందేవికి ఓ లెక్కుంది' ఆ లెక్క ఎలా ఉందంటే... రివ్యూ రిపోర్ట్

లావణ్య త్రిపాఠికి మరో సక్సెస్ తెస్తుందా...?

'లచ్చిందేవికి ఓ లెక్కుంది' నటీనటులు : నవీన్‌ చంద్ర, లావణ్య త్రిపాఠి, అజయ్‌ తదితరులు; సంగీతం : ఎం.ఎం కీరవాణి, నిర్మాత : సాయి ప్రసాద్‌ కామినేని, దర్శకత్వం : జగదీశ్‌ తలసిల.
 
దర్శకత్వ శాఖలో ఎస్‌ఎస్‌ రాజమౌళి దగ్గర అసిస్టెంట్‌‌గా చేసి లెక్కప్రకారం.. తను డైరెక్టరయిన జగదీశ్‌ తలసిల సినిమా అంటే క్రేజ్‌ వచ్చింది. మగధీర, ఈగ వరకు ఆయన దగ్గర పనిచేసిన జగదీష్‌.. తీసుకున్న పాయింట్‌ మంచిదే. కానీ దాన్ని లెక్క ప్రకారం చెప్పాలనుకున్నది చెప్పలేకపోయాడు. ఏవో హాలీవుడ్‌ సినిమాల స్ఫూర్తిగా తీసుకుని దేశంలోని మన బ్యాంకుల్లో జరుగుతున్న అనామతు ఖాతాలను కథావస్తువుగా తీసుకున్నాడు. ఇందుకు పరిమిత నటీనటుల్ని ఎంపిక చేశాడు. అందాల రాక్షసి' ఫేమ్‌ నవీన్‌చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన సినిమా 'లచ్చిందేవికి ఓ లెక్కుంది'. మరి ఆయన చెబుతున్న లెక్క ఎలా వుందో చూద్దాం.
 
కథ :
జనతా బ్యాంకులో నవీన్‌(నవీన్‌ చంద్ర) హెల్ప్‌ డెస్క్‌ లో పనిచేస్తుంటాడు, ఆ బ్యాంకులోనే క్యాషియర్‌ దేవి(లావణ్య త్రిపాటి). మొదట్లో వీరిద్దరికీ అసలు పడదు. త్వరగా లైఫ్‌లో సెటిల్‌ కావడానికి డబ్బు అవసరం. దాంతో ఏం చేయాలా అని ఆలోచిస్తున్న టైంలో అజయ్‌(మహేష్‌) అండ్‌ టీం వచ్చి వారి బ్యాంకులో ఉన్న అన్‌‌క్లైమ్డ్‌ అకౌంట్స్‌ ఫైల్‌ తెస్తే, దాని ద్వారా వచ్చే అమౌంట్‌‌లో తనకు వాటా ఇస్తామని చెప్తారు. అప్పటికి ఓ రౌడీ నుంచి దేవిని కాపాడటంతో మంచి పేరు తెచ్చుకుంటాడు. అలా దగ్గరై అనామతు ఖాతాల లిస్టును కొట్టేస్తాడు. కానీ అవి బయటకు డ్రా చేసే క్రమంలో బ్యాంక్‌ మేనేజర్‌ జయప్రకాష్‌రెడ్డి వారికి ఓ ట్విస్ట్‌ ఇస్తాడు. అది ఏంటి? ఆ తర్వాత ఏం జరిగింది? అన్నదే ఈ సినిమా కథ.
 
పెర్‌ఫార్మెన్స్‌:
నవీన్‌ చంద్ర, లావణ్య త్రిపాఠిల కాంబినేషన్‌ చూడటానికి బాగుంది. కానీ నటనాపరంగా ఇంకా నవీన్‌ మెరుగు కావాల్సివుంది. కాజువల్‌గా కొన్ని సీన్స్‌ చేసినా.. అంత ఎఫెక్టివ్‌గా చేయలేకపోయాడు. లావణ్య ఫరవాలేదనిపించింది. అజయ్‌ చేసిన పాత్ర డీసెంట్‌‌గా ఉంటుంది. జయప్రకాష్‌ రెడ్డి.. అభినయమే చిత్రానికి ప్రధాన ఆకర్షణ. అటు సెంటిమెంట్‌, ఇటు కామెడీ బాగా పండించాడు. ఓ పాట కూడా పాడాడు.

 
సాంకేతిక విభాగం :
లిమిటెడ్‌ లొకేషన్స్‌లోనే ఈశ్వర్‌ అందించిన సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. బాగా చూపించాడు. ఎంఎం కీరవాణి ఈ విజువల్స్‌‌కి మంచి నేపధ్య సగీతం ఇచ్చాడు. పాటలు ఫరవాలేదనిపించినా సినిమాకి మాత్రం అడ్డంగా మారాయి. కోటగిరి వెంకటేశ్వర రావు వీలైనంత తగ్గించి సినిమాని ఎడిట్‌ చేసినా ఆయన ఎడిటింగ్‌ అస్సలు హెల్ప్‌ అవ్వలేదు. కథ, కథనం, దర్శకత్వం విభాగాలను జగదీశ్‌ విభిన్నంగా చేయాలని ట్రై చేసినా.. ఎఫెక్ట్‌వ్‌గా అనిపించలేదు. కొత్త కావడం వలన చాలా విషయాలలో థ్రిల్‌కు గురిచేయబోయి మెప్పించలేకపోయాడు. కంటెంట్‌‌ని వదిలేసి రకరకాల సందర్భాలలో కామెడీని పెట్టి సినిమాని లాగేయాలని చూసాడు కానీ ఎక్కడా నవ్వించ లేకపోయాడు. 
 
విశ్లేషణ:
మొదటి నుంచి డబ్బుకు ఓ లెక్కుందని చెబుతున్నా.. ఆ లెక్కకు సరైన క్లారిటీ ఇవ్వలేకపోయాడు. పోనీ.. అంకాలమ్మ, మాంకాలమ్మ అంటూ దేవతల పేర్లు చెప్పి కథను మరోవైపు లాగించాడు అనుకున్న టైంలో అదంతా ఒట్టి డ్రామా అని చెప్పడంతో సీన్‌ తేలిపోతుంది. జగదీశ్‌ థ్రిల్లర్‌ కామెడీ ఫార్మాట్‌లో ఓ సినిమా అనుకొని దానికి ఓ మంచి స్టొరీ లైన్‌ కూడా అనుకున్నాడు. ఆంగ్ల సినిమా స్పూర్తి అని ఓ సన్నివేశంలో చూపిస్తాడు. అవి తెలుగు నేటివిటీకి పనికివస్తాయా లేదా అనేది సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. అయితే రొటీన్‌గా వచ్చే సినిమాలకు భిన్నంగా తీసే ప్రయత్నం చేశాడు. 
 
లైన్‌ బాగుంది, కానీ దానిని డెవలప్‌ చేసుకున్న విధానం వీలైనంత బాడ్‌‌గా రాసుకున్నారు. ఎందుకంటే స్టొరీ లైన్‌కి చాలా పవర్‌ ఉన్నా కథలో రాసుకున్న ఒక్క పాత్రని కూడా సరిగా రాసుకోలేదు. ఎక్కడా ఏ పాత్ర ఆడియన్స్‌‌కి కనెక్ట్‌ అవ్వదు, కనెక్ట్‌ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. కనీసం కథలో పాత్రలను కూడా స్ట్రాంగ్‌‌గా రాసుకోలేదు. కథ అనేది ఈ సినిమాకి బిగ్గెస్ట్‌ మైనస్‌. ఇక ఆ కథకి రాసుకున్న కథనం అస్సలు బాలేదు. పెద్ద థ్రిల్లింగ్‌ అనిపించే ఎపిసోడ్స్‌ కూడా ఏమీ లేవు. మరీ క్లైమాక్స్‌ ని అయితే కిచిడీలా చేసి హడావిడిగా క్లైమాక్స్‌‌ని ముగిస్తారు. అయిపోయిందా అనే షాక్‌‌ని కలిగించేలా అసంపూర్తిగా ముగించడం మైనస్‌.
 
ఇకపోతే నేరేషన్‌ అనేది చాలా చాలా స్లోగా ఉంటుంది. అసలే సినిమా స్లోగా సాగుతోంది అంటే.. సినిమాలో పాటలు వచ్చి వచ్చి ఉన్న ఫీల్‌‌ని ఇంకా దెబ్బ తీస్తాయి. పాటలు అనేవి సినిమాకి హెల్ప్‌ కాలేదు. ఇకపోతే పాత్రలలో స్ట్రాంగ్‌‌గా లేకపోవడం వలన నటీనటుల నుంచి మనకు బెస్ట్‌ పెర్ఫార్మన్స్‌ తెరపై కనపడదు. సస్పెన్స్‌, థ్రిల్స్‌‌కి చాలా ఆస్కారం ఉంది కానీ ఒక్క థ్రిల్‌ కూడా కనిపించలేదు. 
 
రేటింగ్‌: 2/5