మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By PNR
Last Updated : శనివారం, 18 ఏప్రియల్ 2015 (13:07 IST)

ఓకే బంగారం రివ్యూను ఓసారి పరిశీలిస్తే....

ఓకే బంగారం రివ్యూను ఓసారి పరిశీలిస్తే... ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్, లీలా సామ్సన్, ప్రకాశ్‌రాజ్, ప్రభూ లక్ష్మణన్, రమ్యా సుబ్రమణియమ్, కణిక, బి.వి. దోషీలు నటించారు. ఈ చిత్రానికి మాటలు - కిరణ్, పాటలు - సీతారామశాస్త్రి, సంగీతం - ఏ.ఆర్. రెహమాన్, ఛాయాగ్రహణం - పి.సి. శ్రీరామ్, కొరియోగ్రఫీ - బృంద, కూర్పు - ఏ. శ్రీకర్‌ప్రసాద్, నిర్మాత - ‘దిల్’ రాజు, రచన, దర్శకత్వం - మణిరత్నం.
 
ఓకే బంగారం చిత్రం కథను పరిశీలిస్తే.. దాదాపు పాతికేళ్ళ క్రితం దేశంలో మొదలైన ఆర్థిక సరళీకరణ, ఆ వెంటనే వచ్చిన ప్రపంచీకరణ ప్రభావంలో పుట్టి పెరిగిన కొత్త తరం ఇప్పుడు పరవళ్ళు తొక్కుతోంది. దేశాన్నీ, ప్రపంచాన్నీ ముందుండి నడుపుతున్న ఈ తరానికి పెళ్ళి, కెరీర్ లాంటి అంశాలపై ఉన్న అభిప్రాయాలు, కుటుంబ సంబంధాలపై ఉన్న ఆలోచనలు ఎలాంటివి? వివాహ వ్యవస్థ కన్నా సహజీవనమైతే బరువు బాధ్యతలు ఉండవని వారు అనుకోవడంలో ఎంత నిజాయతీ ఉంది? వాటిని తెరపై చూపితే ఎలా ఉంటుంది? దర్శక - రచయిత మణిరత్నం చేసిన తాజా వెండితెర ప్రయత్నం - ‘ఓ.కె. బంగారం’ అదే! ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత - పంపిణీదారు ‘దిల్’ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో అందించారు.
 
మణిరత్నం సినిమాలంటే ఇప్పటి తరానికి పెద్దగా తెలీయకపోవచ్చు. తెలిసిన 'విలన్‌' చిత్రం పెద్దగా ఆడలేదు. ముందు తరానికి ఆయన చిత్రాలన్నీ ఓ ఆల్బమ్స్‌. గీతాంజలి వంటి చిత్రం ఎంతో ఫీల్‌ కల్గించేలా వుండేది. పాటలు, సాహిత్యం, కథలోని థీమ్‌ అన్నీ ఆకట్టుకునేలా వున్నాయి. అయితే ఇప్పటి తరానికి అటువంటి ఫీల్‌ కల్గించేలా చేయాలనుకున్న ప్రయత్నమే ఓకే బంగారం. మరి అది ఎలా వుందో చూద్దాం.
 
కథ పరంగా చెప్పాలంటే....
ఆది (దుల్కర్ సల్మాన్‌) తల్లిదండ్రులు లేనివాడు. అన్న సంరక్షణలో పెరుగుతాడు. తార (నిత్య)కు తండ్రి ఉండడు. వీరిద్దరి ఆలోచనలు ఒకేలా వుంటాయి. పెండ్లికంటే కలిసి వుండడంలో తప్పేంటనేది వాళ్ళ లాజిక్కు. అనుకోకుండా రైల్వేస్టేషన్‌లో పరిచయమైన ఇరువురు స్నేహితురాలి పెండ్లి దగ్గర కలుసుకోవడం... స్నేహంగా మారడం జరుగుతుంది. ముంబై వచ్చిన ఆది... తన అన్న స్నేహితుడు ప్రకాష్‌రాజ్‌ ఇంటిలో గెస్ట్‌గా దిగుతాడు. వీడియోగేమ్స్‌లో కొత్తదాన్ని కనిపెట్టే బాధ్యత కంపెనీ అతనికి ఇస్తుంది. గొప్ప ఆర్కిటెక్ట్ కావాలని తార ఆశయం. ఇక వీరిద్దరూ కలిసి ఒకే ఇంటిలో జీవనం సాగిస్తారు. ఆ తర్వాత ఏమయింది? అనేది మిగిలిన సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌
మమ్ముట్టి కొడుకు తెలుగులో కొత్త. అప్పటికే మలయాళంలో సినిమాలు చేయడంతో.. నటన ఈజీగానే చేసేశాడు. లుక్‌ పరంగా బాగున్నాడు. నాని డబ్బింగ్‌ అతనికి సూటయింది. కొన్ని సన్నివేశాల్లో నానినే ఊహించుకే ప్రమాదం కూడా వుంది. నిత్యమీనన్‌ నటన చెప్పక్కర్లేదు. అల్లరిగా, తల్లితో వాదించే దానిగా బాగా చేసేసింది. పాత్రకు సరిపడేవిధంగా దర్శకుడు ఆమెను చూపించాడు. ప్రకాష్‌రాజ్‌ సగటు మనిషి. ఆ మనిషిలో వుండే కోణాలు ఇందులో చూపిస్తాడు. అతని భార్యగా సంగీత విద్వాంసురాలిగా ఓ నటి నటించింది. ఇక మిగిలిన పాత్రలన్నీ తమిళ పాత్రలే.
 
టెక్నికల్‌గా...
ఇలాంటి ఫీల్‌గుడ్‌ లవ్‌ చిత్రాల్లో సినిమాటోగ్రఫీ, సంగీతం ముఖ్యం. అవి ఎంత మేరకు వుండాలో అన్నీ ఇందులో వున్నాయి. రెహమాన్‌, పి.సి.శ్రీరామ్‌లు పనితనం కొట్టవచ్చినట్లు కన్పిస్తుంది. సంభాషణలు కూడా చాలా సింపుల్‌గా వున్నాయి. అచ్చమైన తెలుగు పదాలని పలికించేదిశగా దర్శకుడు తీసుకున్న జాగ్రత్త అభినందనీయం. కథ సాదాసీదాగా వుంది. స్క్రీన్‌ప్లే నెరేషన్‌ బాగుంది. మిగిలిన డిపార్ట్‌మెంట్లు ఓకే.
 
విశ్లేషణ
కథగా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ వుండదు. ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. ముందుగానే లివింగ్‌ టు గెదర్‌ అంటూ ప్రచారం చేసిన కథ కాబట్టి.. మణిరత్నం ఎలా చూపించాడనేది ఆసక్తి మాత్రం నెలకొంది. సినిమా చూశాక.. ఇంతకంటే తనూ ఏమీ చెప్పలేడని ప్రేక్షకుడికి అర్థమవుతుంది. ఇప్పటి యూత్‌ ఆలోచనలు ఇలాగే వున్నాయని చెప్పాడు. అందులో ఇద్దరు కలిసి జీవనం సాగిస్తారు. కానీ పెండ్లి చేసుకోకూడదు.. ఇది తప్పని పెద్దలు చెప్పినా వినరు. అలాంటి వాళ్ళకు కనువిప్పు అనలేంకానీ.. మనస్సు చంచలం కాబట్టి కొన్ని సన్నివేశాల్లో మారిపోతుంది. ఆ మార్పే ప్రకాష్‌రాజ్‌ పాత్ర ద్వారా వారికి కలుగుతుంది. 
 
మొదటి భాగంలో హీరో హీరోయిన్‌ కలుసుకోవడం, వారి మధ్య సరదాగా సన్నివేశాలు ఇంట్రెస్ట్‌గా దర్శకుడు డీల్‌ చేశాడు. సెకండాఫ్‌లో తను ఏంచెప్పాలనుకున్నది కరెక్ట్‌గా చెప్పాలికాబట్టి ఎక్కడో చోట ముగింపు ఇవ్వాలి. అందుకే  హడావుడిగా.. నిత్యమీనన్‌, హీరోపై అలిగి ఎక్కడికో వెళ్ళిపోతుంది. సడెన్‌గా తనను ఫాలో అవుతున్నాడని తెలిసి గుడికి వస్తుంది. ఇక్కడికి నిన్ను తీసుకురావడంకోసమే నేను వచ్చానంటుంది. అక్కడే ఆల్జ్‌మరీ జబ్బు (మతిమరుపు)తో గుడికి వచ్చి ఇంటిఅడ్రస్‌ తెలీక కూర్చున్న ప్రకాష్‌రాజ్‌ భార్యను వాళ్ళు ఇంటికి తీసుకెళతారు. ఇలా సడెన్‌గా సన్నివేశంతో కథను ముగింపుకు మలిచాడు దర్శకుడు.
 
ఎంత గొప్ప దర్శకుడయినా.. వైవాహిక జీవితం వేస్టు అని చెప్పలేడు. ఒక వేళ చెప్పినా ఏక్స్‌ప్ట్‌ చేయరు. పిల్లలు ఆలోచనలు ఇలా వున్నాయి. వాటిని మార్చుకోవాలని చెప్పే ప్రయత్నమే ఇది. స్లో నెరేషన్‌ వంటి కథలు మల్టీప్లెక్స్‌కు ఆకర్షించవచ్చు. మిగిలిన వారికి పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. 
 
రేటింగ్‌: 3/5