గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ivr
Last Updated : శుక్రవారం, 22 ఆగస్టు 2014 (15:32 IST)

'నీ జతగా నేనుండాలి'... సచిన్ హీగా లవ్ స్టోరీ... రివ్యూ రిపోర్ట్...

నీ జతగా నేనుండాలి నటీనటులు: సచిన్‌, నజియా, రావురమేష్‌, చిట్టి, మధుకృష్ణ, శశాంత్‌ తదితరులు; పాటలు: చంద్రబోస్‌, నిర్మాత: బండ్ల గణేష్‌, దర్శకత్వం: జయరవీంద్ర
 
పాయింట్‌: ఆషీకీ-2కు రీమేక్‌
 
సినిమాలు క్లాస్‌ మాస్‌ అనే కేటగిరిలో వుంటాయి. క్లాస్‌ చిత్రాలంటే హాయిగొలిపే సంగీతంతో పాటు రిచ్‌ లుక్‌ లొకేషన్స్‌తో కూడిన అంశాలు. ప్రేమకథ కూడా క్లాస్‌గా వుండేలా వుంటుంది. హిందీలో ఆషీకీ-2ను రీమేక్‌ చేసిన 'నీ జతగా నేనుండాలి' సినిమా కూడా అదే బాటలో తీసిన చిత్రం. అయితే హిందీ సినిమా చూసిన వారు చక్కటి మెలోడీని, సింగర్‌ హైపిచ్‌ వాయిస్‌ను ఇప్పటికీ మర్చిపోలేరు. అటువంటి సినిమాను అదేవిధంగా తర్జుమా చేస్తే ఎలా వుంటుందో చూద్దాం.
 
కథ: సచిన్‌ జాకీ.... అంటే చక్కటి గాత్రంతో దేశవిదేశాల్లో పలు షోలు ఇచ్చి పేరు తెచ్చుకుంటాడు. తెలుగువాడైన సచిన్‌ ఇక్కడ ప్రోగ్రామ్‌ చేసే టైమ్‌లో నిర్వాహకుల్ని టెన్షన్‌ పెడతాడు. అప్పటికే సరైన టైమ్‌కు రాకపోవడంతో కొన్ని ప్రోగ్రామ్‌లు డుమ్మా కొట్టడం చేస్తుంటాడు. తనకు నచ్చినట్లు బతకాలనేది అతని పాలసీ. పేరుప్రఖ్యాతులు డబ్బు వున్నా.. జీవితంలో ఏదో తెలీని వెలితి వెంటాడుతుంది. దాంతో తాగుడుకు బానిసవుతాడు. ఓ సందర్భంలో క్లబ్‌లో పాటులు పాడే నందినిని చూసి మనసు పారేసుకుంటాడు. దాంతోపాటు ఆమె స్వీట్‌ వాయిస్‌ నచ్చి తనంతటి వాడిని చేస్తానని ధైర్యం చెబుతాడు. అలా ఆమెను వున్నత స్థితికి చేరవేస్తాడు. కానీ దానితోపాటు తను అధఃపాతాళానికి పోతుంటాడు. తాగుడుకు మరింత బానిసై.. ఆత్మహత్య కూడా చేసుకుంటాడు. ఆ తర్వాత ఏమయింది? అనేది సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌ 
నటీనటులపరంగా సచిన్‌ జాకీ పాత్రలో సరిపోయాడు. చాలాకాలం తర్వాత ముంబై నుంచి తెలుగుకు వచ్చిన సచిన్‌తో పాత సచిన్‌ కన్పించలేదు. కొంత నటనను నేర్చుకున్నాడు. నందినిగా బాలీవుడ్‌ నటి నజియా తొలిసారిగా తెలుగుకు పరిచయమైంది. హావభావాలు పెద్దగా లేకపోయినా కథాపరంగా కొట్టుకుపోయింది. రావు రమేష్ పాత్రతో పాటు మిగిలిన పాత్రలు కూడా కథ ప్రకారం నడిచాయి. 
 
టెక్నికల్‌గా.. 
ముందుగా చెప్పాల్సింది గీతరచయిత చంద్రబోస్‌.. ఆషీకీ-2 గీతాల్ని మక్కికిమక్కి తెలుగులో తీసుకురావడానికి చాలా కష్టపడ్డాడు. ఎక్కడా సాహిత్యం దెబ్బతినలేదు. చాలా స్పష్టమైన పదాలున్నాయి. దానికి తగినట్లుగానే ముగ్గురు సంగీత దర్శకులు చేసిన విధానం బాగుంది. హిందీ తరహాలోనే తెలుగు పాటలు పాడేవిధంగా వుంటుంది. కొన్ని రిచ్‌ లొకేషన్లు బాగున్నాయి. ఎడిటింగ్‌ పర్వాలేదు. స్క్రీన్‌ప్లే పర్వాలేదు. 
 
విశ్లేషణ : 
క్లాసికల్‌ చిత్రాలు తీయాలంటే అందులో సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యత వుంటుంది. అలాంటి ప్రయత్నం ఇందులో చేశారు. చిత్రంలో ప్రధానమైన మైనస్‌... కీర్తి ప్రతిష్టలు వున్నవాడికి సరైన గైడెన్స్‌ లేకపోతే ఎలాంటి పతనమవుతాడో చూపించే కథ. అదే కీర్తిప్రతిష్టలు కోసం కన్నతల్లిదండ్రులు అమ్మాయిని ఎలా ప్రోత్సాహిస్తారు అనేది ఇందులో చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఇండస్ట్రీలో జరిగే ఎత్తుపల్లాలు అన్నీ ఇందులో చూపించాడు. ఏదీ శాశ్వతం కాదు అనేది తెలుసుకోవాలి. 
 
హీరోకు అన్నీ తెలిసినా ఎందుకని మందుకు బానిసయ్యాడు. అనే దానిలో సరైన క్లారిటీ లేదు. మనిషిలో వుండే సహజమైన ఒంటరితనం, ఏదో పోగొట్టుకున్నామనే బాధను మాత్రమే హైలైట్‌ చేశారు. దానికి సొల్యూషన్‌ తీసుకువచ్చే ప్రయత్నంలో సమాజంలో జరిగే సూటిపోటి మాటలు మనిషి జీవితాన్ని ఎలా దిగజారుస్తాయనేది చెప్పేందుకు ఈ చిత్రం ఉదాహరణ. తొలిరోజు ఎలా తీశారనే ఇంట్రస్ట్‌ ప్రేక్షకుల్లో వుంది. కొద్దిరోజులు పోతేగానీ ఎంతమేరకు ఆడుతుందో చెప్పలేం.