గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ivr
Last Updated : శుక్రవారం, 1 ఆగస్టు 2014 (18:08 IST)

మందకొడిగా 'మాయ'... ఆమె ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ అర్థంకాక బుర్ర బద్ధలు...

మాయ చిత్రంపై సమీక్ష...నీలకంఠ చిత్రాలంటే స్క్రీన్‌ప్లేకు ప్రాధాన్యత ఇస్తాడని పేరుంది. కథలో కాస్తోకూస్తో స్టఫ్‌ వున్నా.. దాన్ని స్క్రీన్‌ప్లేతో ఆట్టుకుంటాడంటారు. కానీ కొన్ని చిత్రాల్లో ఆ పప్పులు వుడకలేదు. 'సదా మీ సేవలో, నందనవరం 120 కిమీ' వంటి పలు చిత్రాలు కనీస స్థాయి విజయాన్ని సైతం అందుకోలేకపోయాయి. ఆయన మునుపటి చిత్రం 'చమ్మక్‌చల్లో' కూడా తీవ్రంగా నిరాశపరిచింది. 
 
ఈ విధంగా 'మిస్సమ్మ' అనంతరం ఒక్కటంటే ఒక్క హిట్టు కూడా లేకుండా ఉన్న నీలకంఠ దర్శకుడిగా.. మరో దర్శకుడు మధుర శ్రీధర్‌రెడ్డి నిర్మించిన చిత్రం 'మాయ'. 'ఇ.ఎస్‌.పి' అంటే జరగబోయేది ముందే తెలిస్తే అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో తెలియాలంటే ఈ సమీక్షను చదివేయాల్సిందే!
 
కథ: 
అవంతిక (సుష్మారాజ్‌) ఓ న్యూస్‌ ఛానల్‌ రిపోర్టర్‌. ఒక ఫ్యాషన్‌ షో నిర్వహించే పనిలో భాగంగా ఫ్యాషన్‌ డిజైనర్‌ సిద్దార్ధ్‌ వర్మ (హర్షవర్ధన్‌ రాణె)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతున్న తరుణంలో తన చిన్ననాటి స్నేహితురాలు పూజా (పూజారాంచంద్రన్‌)ను కలుస్తుంది.
 
తాను ప్రేమిస్తున్న సిద్దార్ధ్‌, తన స్నేహితురాలు పూజా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని తెలుసుకొని.. తనను అప్పటివరకు ప్రేమిస్తున్నట్లు నటించిన సిద్ధార్ధ్‌పై అసహ్యం పెంచుకొంటుంది. అయితే.. సుష్మాకు ఓ అతేంద్రియ శక్తి ఉంటుంది. తనకు అప్పుడప్పుడు జరగబోయేది ముందే కనిపిస్తుంటుంది. చిన్నతనంలో తన కన్నతల్లి చనిపోవడం.. పెద్దయిన తర్వాత మార్కెట్‌లో ఓ సంఘటన కళ్ల ముందు జరిగినవి ఆమెకు ముందుగానే తెలుస్తుంటాయి. ఈ విషయాన్ని తండ్రి నాగబాబుకు చెబుతుంది. ఆ తర్వాత డాక్టర్‌ను సంప్రదించి... తన కుమార్తెకు ముందుగా జరిగే విషయాన్ని ఎలా డీల్‌ చేయవచ్చో అనేది చెబుతాడు. అది కథ. 
 
విశ్లేషణ: 
దర్శకుడు నీలకంఠ 'మాయ' చిత్రం కోసం ఎంచుకొన్న కాన్సెప్ట్‌ పెద్ద కొత్తదేమీ కాదు. ఇంగ్లీషులో ఈ తరహా సినిమాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. ముఖ్యంగా 'ఫైనల్‌ డెస్టినేషన్‌' వంటి 'ఇ.ఎస్‌.పి' కాన్సెప్ట్‌ మూవీస్‌ ఇప్పటికే 7 పార్ట్‌లు విడుదలవ్వడంతో... 'మాయ' సినిమా ఇటు ఇండస్ట్రీలో.. అటు ఆడియన్స్‌లో చెప్పుకోతగ్గ ఆసక్తిని కలిగించలేకపోయింది. అయితే.. తాను ఎంచుకొన్న కథ విషయం పక్కన పెడితే.. 'స్క్రీన్‌ప్లే రైటర్‌'గా నేషనల్‌ అవార్డ్‌ అందుకొన్న నీలకంఠ.. 'మాయ' సినిమాలో కూడా తన గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకొన్నాడు. 
 
'మాయ' సినిమాలో కీలకపాత్రధారి అయిన అవంతిక ఈ చిత్రానికి బిగ్గెస్ట్‌ మైనస్‌గా మారింది. చూడటానికి అంతంతమాత్రంగా ఉన్న ఈ బొద్దుగుమ్మ పెర్ఫార్మెన్స్‌ విషయంలో బొటాబొటీ మార్కులు కూడా సంపాదించలేకపోయింది. భయానికి వణుకుతుందో, సంతోషంతో నవ్వుతుందో, ప్రేమతో చూస్తుందో.. అసలు ఆ ముఖంలోని ఎక్స్‌ప్రెషన్‌కు అర్థం ఏంటో అర్థం కాక ప్రేక్షకుడు చిరాకుపడటం ఖాయం. సెకండ్‌ హీరోయన్‌ సుష్మారాజ్‌ రెండు డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌లో చక్కని అభినయం ప్రదర్శించింది.
 
నటీనటులు : 
హర్షవర్ధన్‌ రాణె పెర్ఫార్మెన్స్‌ జస్ట్‌ ఓకె. శేఖర్‌చంద్ర అందించిన బాణీలు బాగున్నాయి. ఆర్‌.ఆర్‌ కూడా ఫర్వాలేదు. కానీ అవంతిక క్యారెక్టర్‌కు జరుగబోయేది ముందే కనడుతున్న సమయంలో... 'కుయ్‌....'మంటూ వచ్చే సౌండింగ్‌ మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. హీరోయిన్‌ ఫాదర్‌గా నాగబాబు, డాక్టర్‌గా ఝాన్సి, హీరో అసిస్టెంట్‌గా అనితా చౌదరి తమ తమ పాత్రల పరిధి మేరకు ఫర్వాలేదనిపించుకొన్నారు. 
 
ఇక ఈ చిత్రంతో నిర్మాతగా మారిన దర్శకుడు మధుర శ్రీధర్‌రెడ్డి నిర్మాణ విలువల విషయంలో పెద్దగా కాంప్రమైజ్‌ కాలేదనిపిస్తుంది. ఒక దర్శకుడిగా తనకున్న అనుభవంతో.. అవసరం మేరకు మాత్రమే ఖర్చు పెట్టి బెటర్‌ అవుట్‌పుట్‌ తీసుకొన్నాడు.
 
ఈ సినిమాలో హీరోయిన్‌తోపాటు మరో మైనస్‌ కూడా ఉంది. అదే ఈ సినిమాలోని 'ఇ.ఎస్‌.పి' కాన్సెప్ట్‌. అప్పటివరకు కేవలం జరగబోయేది మాత్రమే కనిపించే హీరోయిన్‌కి... సంవత్సరం క్రితం జరిగింది ఎందుకు కనిపించిందో ఎవరికీ అర్థం కాదు. ఇలా ఈ సినిమాలో చాలా మైనస్‌లు ఉన్నాయి.