మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Updated : శుక్రవారం, 18 సెప్టెంబరు 2015 (18:56 IST)

'కొరియర్‌ బాయ్ కళ్యాణ్'లో అంతలేదు... మరింకెంత ఉంది...? రివ్యూ రిపోర్ట్

కొరియర్ బాయ్ కళ్యాణ్ విడుదల: 17.9.2015 గురువారం.
 
కొరియర్ బాయ్ కళ్యాణ్ నటీనటులు : నితిన్‌, యామి గౌతమ్‌, అశుతోష్‌ రానా, సత్యంరాజేష్‌, ఇంటూరు వాసు తదితరులు.నిర్మాత : గౌతమ్‌ మీనన్‌, వెంకట్‌ సోమసుందరం, రేష్మా ఘంటాల, సునీత తాటి; సంగీతం : కార్తీక్‌, అనూప్‌ రూబెన్స్‌, దర్శకత్వం : ప్రేమ్‌ సాయి.
 
మూడేళ్ళ ప్రాజెక్ట్‌... రెండు భాషల్లో షూటింగ్‌... గుండెజారి... చిత్రం షూటింగ్‌లో నితిన్‌కు చెప్పిన కథ. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ నిర్మాత. కొత్త దర్శకుడు ప్రేమ్‌ సాయి.. చెప్పిన కథ.. వెరసి.. ముంబైలో జరిగిన ఓ యదార్థ గాధ. 
 
ఇన్ని క్వాలిటీకేషన్‌ల మధ్య చిత్రం కేక పుట్టిస్తుందని అందరూ భావిస్తారు. దానికితోడు తాను కొత్త ప్రయోగం చేశాననీ, ఇది హిట్‌ అయితే.. మరిన్ని భిన్నమైన చిత్రాలు తీయడానికి పనికి వస్తుందని నితిన్‌ వెల్లడించారు. ముందు రెండుమూడు చిత్రాలతో హిట్‌లో వున్న నితిన్‌... ఈ చిత్రంతో భిన్నంగా కన్పించే ప్రయత్నం చేశాడు. మరి ఆ ప్రయత్నం ఎలా వుందో చూద్దాం. 
 
కథ :
విదేశాల్లో ఓ పెద్ద డాక్టర్‌ అయిన అశుతోష్‌ రానా, గర్భం దాల్చిన మహిళ మూలకణాలను తీసుకుని మిలియనీర్ల జబ్బులకు మందులా వుపయోగిస్తూ డబ్బు వెనకవేసుకుంటాడు. అది అక్కడ తెలిసేసరికి.. ఇండియాలోని హైదరాబాద్‌కు తన ప్రయోగాన్ని మార్చేస్తాడు. ఇక మరోవైపు.. పనిలేని కళ్యాణ్‌- పి.కె. (నితిన్‌).. బీఏ ఫెయిలయినా వుద్యోగం మాత్రం సాఫ్ట్‌వేర్‌ లెవల్లో వుండాలని కోరిక. చిన్నాచితకా వుద్యోగాలు నామోషి. స్నేహితుడు రాజేష్‌ కోరిక మేరకు.. అతని డ్యూటీ కొరియర్‌ బాయ్‌గా పి.కె. చేయాల్సి వస్తుంది. కావ్య (యామి గౌతమి)కి కొరియర్‌ ఇవ్వడానికి వెళ్ళి.. ఆమెను మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి కోసమే ఓ కొరియర్‌ కంపనీలో కొరియర్‌ బాయ్‌గా చేరతాడు.
ఇక ఆ డాక్టర్‌.. హైదరాబాద్‌లో కొన్ని ఆసుపత్రులు సెలక్ట్‌ చేసి.. మూలకణాలను దొంగిలించే ప్లాన్‌ చేస్తుంటాడు. ఓ పెద్ద ఆసుపత్రిలో వార్డెన్‌ బాయ్‌గా పనిచేస్తున్న ఇంటూరి వాసు ఈ విషయాన్ని తెలుసుకుని.. హైద్రాబాద్‌లో ఉండే సామాజిక కార్యకర్త అయిన సత్యమూర్తి(నాజర్‌)కు తెలియజేస్తూ ఒక కొరియర్‌ చేస్తాడు. అది పసిగట్టిన అశుతోష్‌ రానా.. తన గ్యాంగ్‌తో కొరియర్‌ను ఆపేయాలని ట్రై చేస్తాడు. మరి ఆపాడా? లేదా? తర్వాత ఏమయింది? అనేది మిగిలిన సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌:
హీరో నితిన్‌ పాత్ర అక్కడక్కడా గతంలో నితిన్‌ చేసిన పాత్రలు గుర్తుకు తెచ్చినా, కామన్‌మ్యాన్‌గా చేసే ప్రయత్నం బాగుంది. క్లైమాక్స్‌లో సీరియస్‌ సన్నివేశాల్లోనూ ఇంకాస్త ఎమోషనల్‌ వుంటే బాగుండేది. యామి గౌతమ్‌ ఉన్నంతలో బాగా నటించింది. ఇక నాజర్‌, అశుతోష్‌ తమతమ పాత్రలకు న్యాయం చేశారు. కళ్యాణ్‌ స్నేహితుడుగా సత్యంరాజేష్‌ నటించాడు. మిగిలిన పాత్రలు ఫర్వాలేదు. 
 
సాంకేతిక విభాగం :
దర్శక, రచయిత ప్రేమ్‌ సాయి కొత్త అంశాన్ని చెప్పాలన్న విషయంలో లోపం లేకపోయినా.. అయితే ఒక కొత్త కథనే స్క్రీన్‌ప్లే ద్వారా కట్టిపడేసే విషయంలో మాత్రం దర్శకుడు చాలాచోట్ల విఫలమయ్యాడు. దర్శకత్వం పరంగా అక్కడక్కడా ప్రేమ్‌ సాయి ప్రతిభను చూడొచ్చు. అయితే అనవసర అంశాల జోలికి పోకుండా నేరుగా చెప్పాలనుకున్న విషయాన్నే చెప్పేస్తే దర్శకుడిగా ప్రేమ్‌ సాయి ఒక మార్క్‌ చూపెట్టగలిగేవాడేమో. సంగీతపరంగా ముగ్గురు పనిచేశారు. 
 
కార్తీక్‌, అనూప్‌ రూబెన్స్‌ అందించిన మ్యూజిక్‌ బాగుంది. బంగారమా పాట వెంటనే రిజిస్టర్‌ అయిపోతుంది. సందీప్‌ చౌతా అందించిన బ్యాక్‌గ్రౌడ్‌ స్కోర్‌ కూడా ఆకట్టుకునేలా ఉంది. చాలాచోట్ల బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాను నిలబెట్టింది. ఇక సినిమాటోగ్రాఫర్‌ పనితనం బాగుంది. ఎడిటింగ్‌ విషయంలో సినిమా ఇంకా బాగా ఉండాల్సింది. నెరేషన్‌ను మరింత అందంగా చూపాల్సిన సన్నివేశాల్లో ఎడిటింగ్‌ సాదాసీదాగా ఉంది. ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌ బాగున్నాయి.
 
విశ్లేషణ:
ఈ సినిమాలో ప్రధాన లోపం... అసలు కథలోని సీక్రెట్‌ ముందుగా చెప్పేయడమే. దాంతో కథ తేలిపోతుంది. విదేశాల్లో వుండే డాక్టర్‌.. హైదరాబాద్‌ వచ్చి ఇక్కడా మూలకణాలతో వ్యాపారం చేయడం. దీన్ని హీరోకు ఎలా లింక్‌ చేశాడన్నది కథ. ఇదేమంత ఇంట్రెస్ట్‌ పాయింట్‌ కాదు. దాన్ని స్క్రీన్‌ప్లేలో ట్విస్ట్‌ల్తో చెబితే బ్రహ్మాండంగా వుండేది. కానీ ఆ పని దర్శకుడు చేయలేకపోవడమే కథ తేలిపోయింది. కానీ, డిఫరెంట్‌ సినిమాలను ఇష్టపడే వారికి చాలా బాగా నచ్చే అంశం. ఇక ముఖ్యంగా కొరియర్‌లో ఉండే అసలైన విషయం కూడా తెలుగు సినిమాకు కొత్తది అనే చెప్పాలి. సెకండాఫ్‌లో కొరియర్‌ చుట్టూ సస్పెన్స్‌ ఎలిమెంట్‌తో కథను తిప్పడం బాగుంది.
 
కథ చాలా కొత్తదే అయినా, సింగిల్‌ పాయింట్‌ కావడంతో సబ్‌ప్లాట్స్‌పై ఆధారపడి సినిమాను అర్థవంతంగా చెప్పాల్సిన ప్రయత్నంలో స్క్రీన్‌ప్లే లోని తప్పిదాలు కనిపిస్తాయి. దీంతో సినిమాలో ఇంటరెస్టింగ్‌ పాయింట్స్‌ ఏవీ లేక, ఒకదాని తర్వాత ఒక సన్నివేశం పెద్దగా ప్రాధాన్యం లేకుండా వచ్చేస్తున్నట్లు కనిపిస్తుంది.
 
ఇక పాటలు వినడానికి, చూడటానికి బాగున్నా కూడా అవి వచ్చే సందర్భాలే అర్థరహితంగా ఉండి సినిమా ఫ్లోను దెబ్బతీశాయి. ఇక కొన్ని విషయాల్లో డీటైలింగ్‌ ఇచ్చినా చాలావరకూ త్వరత్వరగా అర్థాంతరంగా ముగించిన ఫీలింగ్‌ కలుగుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్‌ వరకూ సినిమా కథలోకి వెళ్ళకుండా లవ్‌ ట్రాక్‌తోనే నడిపించారు. సెకండాఫ్‌లో కొద్దిసేపు సినిమా ఆసక్తికరంగా నడిచినా, ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ వచ్చేసరికి సినిమాను చుట్టేసిన ఫీలింగ్‌ కలుగుతుంది. సినిమాలో మరికొంత డీటైలింగ్‌ ఇచ్చి, అనవసరమైన పాటలను తీసేసి, ఇదే కథను ఏమాత్రం ఆసక్తికరంగా చెప్పినా కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌ సినిమా ఎక్కడో ఉండేది. ఇవన్నీ మిస్‌ అవ్వడం చేతే ఎటూపోని ఒక సాదాసీదా సినిమాగా నిలిచింది.
 
చాలాచోట్ల మైనస్‌లు కన్పిస్తాయి. విలన్‌ అయిన అశుతోష్‌.. షెడన్‌గా కళ్యాణ్‌ వున్న దగ్గరకు రావడం ఆశ్చర్యం కల్గిస్తుంది. అంతకుముందే ఆయన అనుయాయులు అందరూ ఛేజింగ్‌ చేస్తుంటారు. ఇక్కడ సరైన క్లారిటీ లేదు. మరోవైపు... అసలు మూలకణాలను గర్భంలోనే దొంగిలించడం అనే పాయింట్‌ సీరియస్‌గా చెప్పలేకపోవడం. ఈ మూలకణాల గురించి... చాలా పెద్ద పట్టణాల్లో ఉన్నత కుటుంబాలవారు దాచుకుంటూ... తమ వంశంలోనివారి సమస్యల్ని పరిష్కరించడానికి వుపయోగిస్తుంటారు.

అలాంటి కనెక్టివిటీ వున్న పాయింట్‌ను సాదాసీదా.. మహిళపై ప్రయోగాలు చేసి... దానివల్ల తనేం సాధిస్తున్నాడనే విషయంలో స్పష్టత లేదు. ఎవరో ఒకరికి పోయిన కళ్ళు ఈ మూలకణాలను చొప్పించి రప్పిస్తాడు. ఒకరి మూలకణం మరొకరికి ఎలా సరిపోతుందనే లాజిక్‌ చూపలేకపోయాడు. ఇలా స్క్రీన్‌ప్లేలో కూడా కొన్ని తప్పులున్నాయి. మొత్తంగా ఈ చిత్రం చూస్తుంటే.. సినిమా చూసినట్లుగా అనిపించదు. ఫీచర్‌ ఫిలిమ్ చూసిన ఫీలింగ్‌ కన్పిస్తుంది. 
 
రేటింగ్‌: 2/5