శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By IVR
Last Modified: శుక్రవారం, 18 జులై 2014 (17:52 IST)

'ఒక క్రిమినల్ ప్రేమకథ' వావివరుసలు చూడని కామాంధుల కథ

ఢిల్లీలో 'నిర్భయ' సంఘటన చోటుచేసుకొన్న సమయంలో... యావత్‌ భారతావని ఉలిక్కిపడింది. మన దేశంలో ఇంత దారుణమా అని రోడ్లెక్కి ఘోషించింది. అదే తరహా ఘటన హైద్రాబాద్‌లో జరిగితే.. నిందితులకు కఠిన కారాగార శిక్ష పడేలా చేసింది. అటువంటి మన భారతదేశంలో.. ముఖ్యంగా ఈమధ్యే విడిపోయిన మన ఆంధ్రప్రదేశ్‌లో ఏదో ఒక ఊళ్లో నిర్భయ, అభయ సంఘటనలు చోటుచేసుకొంటూనే ఉన్నాయి.
 
కాకపోతే అవి బయటకు రావడం లేదు. మనం ప్రతిరోజు దినపత్రికల్లో చదువుతుంటాం... 'ఆరేళ్ల బాలికపై అరవయ్యేళ్ల ముసలాడి అత్యాచారం, అంధబాలికల హాస్టల్‌లో వార్డెన్‌ కీచకపర్వం' అంటూ ప్రాసలతో వెలువడుతున్న హెడ్డింగులను చూసి.. 'అయ్యో.. ఎంత దారుణం' అని ఒకే ఒక్క నిట్టూర్పుతో మన సంఘీభావం వ్యక్తం చేసేస్తాం. అయితే.. 'ఆ తరహా' దారుణాలకు సమాధానంగా ప్రముఖ దర్శకులు సునీల్‌ కుమార్‌రెడ్డి తెరకెక్కించిన చిత్రమే 'ఒక క్రిమినల్‌ ప్రేమకథ'.
 
కథ : 
బిందు (ప్రియాంక పల్లవి) వైజాగ్‌ దగ్గర్లోని ఓ పల్లెటూరిలో చదువుకుంటుంటుంది. తాగుడుకి బానిసైన తండ్రి పక్షవాతం వచ్చి మంచాన పడటంతో.. దిక్కులేని పరిస్థితుల్లో తన తల్లికి సొంత అన్నయ్య, వరసకు తనకు మావయ్య అయిన వ్యక్తి (వైజాగ్‌ సత్యానంద్‌) చెంతన చేరుతుంది. 
 
అప్పుడప్పుడే యవ్వనంలోకి అడుగిడుతున్న బిందు.. తనకు వరసకు మేనకోడలు- కన్నకూతురుతో సమానురాలు అయినప్పటికీ.. అమెను శారీరకంగా హింసిస్తుంటాడు వైజాగ్‌ మావయ్య(ఈ సినిమాలో ఇతని పేరు తెలియదు). తనకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాలని ఉన్నా.. కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అన్నింటినీ సహిస్తూ.. జీవితాన్ని నెట్టుకొస్తుంటుంది.
 
ఈలోపు తన పాత ప్రియుడు శీను (మనోజ్‌నందం) తారసపడటంతో.. తన మావయ్యను చంపి, తనకు ఆ చెరసాల నుండి విముక్తి కలిగించమని వేడుకొంటుంది. శారీరికంగానే కాకుండా మానసికంగా కూడా తీవ్ర ఆవేదనకు గురవుతున్న తన ప్రియురాలి కోసం అమె మావయ్యను హతమార్చి తన ప్రియురాలికి స్వేఛ్చనిచ్చి.. క్రిమినల్‌గా మారినప్పటికీ.. ఒక ప్రేమికుడిగా విజయం సాధిస్తాడు.
 
విశ్లేషణ : 
ముందు మాట్లాడుకున్నట్టుగా.. 'ఆ తరహా' సంఘటనలు రోజూ మనం పేపర్లలో, న్యూస్‌ ఛానల్స్‌లో చూస్తూనే ఉన్నాం, ఉంటున్నాం కూడా. కానీ అందుకు సమాధానంగా ఏం చేయగలం అన్నది మాత్రం అంతుబట్టని ప్రశ్న.
 
ముందుగా ఇటువంటి కథాంశాన్ని ఎంచుకొని.. అశ్లీలత, అసభ్యతలకు పెద్దపీట వేసినప్పటికీ.. తాను చెప్పాలనుకొన్న అంశాన్ని ప్రతి ప్రేక్షకుడి బుర్రలో పర్మనెంట్‌గా ఫీడ్‌ అయ్యేలా చేయగలిగిన దర్శకుడు సునీల్‌ కుమార్‌ రెడ్డి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. 
 
తాను ఎంచుకొన్న సబ్జెక్టే చాలా సెన్సిటివ్‌... డబ్బే ప్రధానం అనుకొంటే.. ఆ సబ్జెక్ట్‌కి కమర్షియల్‌ అంశాలు జోడించి కేవలం 'ఆ తరహా' సన్నివేశాలు చూసి సంతోషించే ఒక క్లాస్‌ ఆఫ్‌ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్‌ చేసి కోట్లు దండుకోవచ్చు. కానీ సునీల్‌ కుమార్‌ రెడ్డి అలా చేయలేదు.. నేటి సమాజంలో 'మావయ్య, బాబాయ్‌, పెదనాన్న, అన్న' అనే పవిత్రమైన బాంధవ్యాల ముసుగులో వావివరుస చూడకుండా.. వయసుతో సంబంధం లేకుండా ఆడపిల్లలపై తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించి.. రాక్షసానందం పొందే కామాంధుల గురించి.. వారి కారణంగా నలిగిపోతున్న ఆడపిల్లల గురించి బోల్డ్‌గా వివరించాడు. అందుకుగాను సునీల్‌ కుమార్‌ రెడ్డి అభినందనీయుడు.
 
ఇక నటీనటుల విషయానికోస్తే.. నిజమైన ప్రేమికుడిగా మనోజ్‌ నందం చక్కని హావభావాలతో ఆకట్టుకొన్నాడు. అతని స్నేహితుడు జాన్‌ పాత్రలో అనిల్‌ కళ్యాణ్‌ అక్కడక్కడా కామెడీ పండించి ఫర్వాలేదనిపించుకొన్నాడు. బిందు పాత్రలో నటించిన పల్లవి ప్రియాంక పోస్టర్‌లో కనిపించినంత అందంగా లేకపోయినప్పటికీ.. 'సొంత మావయ్య' చేతిలో సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌కు గురయ్యే యువతిగా అద్భుతమైన అభినయం ప్రదర్శించింది. కీచక మావయ్యగా వైజాగ్‌ సత్యానంద్‌ జీవించాడనే చెప్పాలి. మిగిలిన పాత్రధారులంతా తమ తమ పాత్రల పరిధి మేరకు ఫర్వాలేదనిపించుకొన్నారు. టెక్నికల్‌ వేల్యూస్‌ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. 
 
అలాగే.. ఈ సినిమాలో కూడా కొన్ని మైనస్‌ పాయింట్లు ఉన్నాయ్‌...
 
ఇవి మైనస్‌లు అని చెప్పకూడదు కానీ.. ఇంట్లో ఎన్ని వెధవ వేషాలు వేసినా బయట మాత్రం సభ్యత, సంస్కారం అంటూ శ్రీరంగనీతులు పలికే వారి దృష్టిలో మాత్రం ఇవి తప్పకుండా మైనస్సులే.
 
బిందు మావయ్య అమెను లొంగదీసుకొనేందుకు ప్రయత్నించే సన్నివేశాలు.
 
బిందు-మనోజ్‌నందం మధ్య వచ్చే రొమాంటిక్‌ కమ్‌ రేప్‌ సీన్‌ (రేప్‌ అని ఎందుకు అన్నానో సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది)
 
క్లైమాక్స్‌కి ముందు బిందు-మావయ్య మధ్య వచ్చే సెక్స్‌ సీన్‌.
 
అక్కడక్కడా కాస్త శృతిమించిన డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌ (నేటి యూత్‌ మూవీస్‌లో వచ్చే చెత్త డైలాగులతో పోల్చుకొంటే పెద్ద బూతులేమీ కాదనుకోండి)
 
మొత్తానికి... బంధువుల(కామాంధుల) చేతిలో తమ జీవితాన్ని బుగ్గిపాలు చేసుకొంటున్న అబలుల వ్యధ 'ఒక క్రిమినల్ ప్రేమకథ'