గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ivr
Last Modified: శుక్రవారం, 17 అక్టోబరు 2014 (14:25 IST)

'ఒక లైలా కోసం' నాగచైతన్య ఏం చేశాడు...? రివ్యూ రిపోర్ట్

'ఒక లైలా కోసం' నటీనటులు: నాగచైతన్య, పూజా హెగ్డే, బ్రహ్మానందం, అలీ, ప్రభు తదితరులు; సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, నిర్మాత: అక్కినేని నాగార్జున, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయకుమార్‌ కొండా.
 
విడుదల: 17- 10- 2014, శుక్రవారం.
 
నాగచైతన్య చిత్రాల్లో పేరుతెచ్చినవి ఒకటి రెండు మాత్రమే. 'ఏ మాయ చేసావె', '100% లవ్‌' చిత్రాలు హీరోగా సక్సెస్‌లు సాధించాయి. 'మనం' నలుగురితో పాటుగా నటించినా మంచి పాత్రే పోషించాడు. అయితే సెంటిమెంట్‌గా 8వ సినిమా 'ఆటోనగర్‌ సూర్య' పెద్దగా లాభం చేయలేకపోయింది. ఇప్పుడు 9వ సినిమా 'ఒక లైలాకోసం'. ఈ చిత్ర కథను నమ్మి... స్వంత బేనర్‌లో నాగార్జున నిర్మించారు. విజయ్‌కుమార్‌ దర్శకత్వం వహించారు. ఇంతమంది కలిసి చేసిన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ :  కార్తీక్‌(నాగచైతన్య) డిగ్రీ పూర్తయి జాబ్‌ వచ్చినా వెళ్ళకుండా జీవితాన్ని ఎంజాయ్‌ చేయాలని విదేశాలకు వెళతాడు. ఆ తర్వాత ఇండియా వచ్చాక ఇక్కడ నందిని(పూజా హెగ్డే)ను చూసిన తొలిచూపులోనే ప్రేమించేస్తాడు. కానీ నందినికి కార్తీక్‌ అంటే నచ్చదు. అతను ప్రవర్తించే తీరువల్ల అసహ్యించుకుంటుంది. అనుకోకుండా ఇద్దరికీ పెద్దలు పెండ్లిచూపులు చూస్తారు. పెండ్లి చేసుకునే టైమ్‌లో కార్తీక్‌ను పోలీసులు అరెస్ట్‌ చేస్తారు. ఆ తర్వాత ఏమయింది? అసలు పోలీసులు ఎందుకు వచ్చారు? నందిని ప్రేమను పొందాడా? లేదా? అనేది మిగిలిన సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌... 
నటనాపరంగా కార్తీక్‌ పాత్రలో నాగచైతన్య నటించేశాడు. ఇందులో కాస్త గ్లామర్‌గా కన్పించాడు.యాక్షన్‌ సన్నివేశాల్లో ఇంకా వయస్సు తక్కువ ఛాయలు కన్పిస్తాయి. డైలాగ్‌ డెలివరీ మునుపటి చిత్రాల కంటే బెటర్‌గా అనిపిస్తుంది. పూజా హెగ్డే.. ఫర్వాలేదు. తనకిచ్చిన పాత్రను పోషించింది. బ్రహ్మానందం, పోసాని, వెన్నెల కిషోర్‌ పాత్రలు కాస్త నవ్విస్తాయి. ప్రభు పాత్ర హుందాగా వుంటుంది. అందరికీ పెద్దగా, పెద్దతనం ఉట్టిపడే పాత్రను పోషించాడు. తెలుగు సినిమాల్లో తను నటించి చాలా కాలమైంది. ఇక మిగిలిన పాత్రలు వారి పరిధి మేరకే చేసేశారు.
 
టెక్నికల్‌గా... 
అనూప్‌ రూబెన్స్‌ బాణీలు చాలా క్లీన్‌గా సాప్ట్‌గా వున్నాయి. నాగార్జున తనకు కావాల్సినట్లుగా పాటలకు తగినట్లుగా ట్యూన్స్‌ రాబట్టుకున్నాడు. ఫొటోగ్రఫీ ఫర్వాలేదు. సంభాషణలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. విజయ్‌కుమార్‌ తరహాలో సింపుల్‌ డైలాగ్‌లు పెద్ద మీనింగ్‌ వచ్చేట్లుగా వున్నాయి. గుండెజారి గల్లంతయ్యిందే.. తర్వాత మళ్ళీ అంతే ఇదిగా ఎంటర్‌టైన్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చాడు దర్శకుడు. 
 
విశ్లేషణ : 
సింపుల్‌ లవ్‌స్టోరీ. దీన్ని చెప్పే విధానంలో దర్శకుడు ప్రతిభ కనబరిచినా... ట్విస్ట్‌లు పెద్దగా లేకపోవడంతో సాదాసీదాగా అనిపిస్తుంది.  దాదాపు మొదటిభాగంలో 20 నిముషాల్లో రొటీన్‌గా సాగి విసుగుపుట్టేలా వుంటుంది. రానురాను కథనంలో పరుగు పెంచి దర్శకుడు ప్రేక్షకుల మూడ్‌ను రాబట్టుకునేలా చేశాడు. హీరోయిన్‌గా కొన్ని ఎమోషనల్స్‌ పూజా పండించలేకపోయింది. ఈ సినిమా కేవలం నాగచైతన్య కోసమే చేసినట్లు వుంటుంది. 
 
ప్రేమను పలికించే సన్నివేశాలు బాగున్నాయి. దానికి ఎంటర్‌టైన్‌ జోడించి ఏదోవిధంగా సక్సెస్‌ చేయాలనే నిర్మాత ఆశించారు. ప్రొడక్షన్‌ వేల్యూస్‌ ఫర్వాలేదు. సెకండాఫ్‌లో స్క్రీన్‌ప్లే.. కొత్తదనం లేకపోయినా ఫర్వాలేదు అనిపించాడు. ఇప్పటికే నెలల పాటు సినిమా తీసి విడుదల తేదీ కోసం ఆగినా.. ఉత్తరాంధ్రలో తుఫాను తాకిడికి.. అక్కడ థియేటర్లలో ప్రదర్శించబడలేదు. ఇక మిగిలిన చోట్ల విడుదలైన ఈ సినిమా ఏవరేజ్‌ సినిమాగా చెప్పవచ్చు. దివంగత అక్కినేని.. సినిమాలోని లిరిక్‌ను టైటిల్‌గా తీసుకుని కథకు సరిపడేవిధంగా పెట్టడమే చిత్రంలో ప్రత్యేకత.