గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Updated : శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (16:49 IST)

ఓం నమో వేంకటేశాయ.. ఆ విధంగా థ్రిల్ కల్గించాడు... రివ్యూ రిపోర్ట్

భక్తిప్రదానమైన చిత్రంలో నటీనటుల పెర్‌ఫార్మెన్స్‌ ఎలా వుంది. ఎలా చేశారనేకంటే.. వారి ఆహార్యం.. పాత్ర చిత్రరణ ఎలా వుందనేది ముఖ్యం. ఇందుకు దర్శకుడిదే పైచేయి. శ్రీవేంకటేశ్వరునిగా ఎన్‌టిఆర్‌ను, సుమన్‌ను చూస

నటీనటులు : నాగార్జున, సౌరభ్‌ రాజ్‌ జైన్‌, అనుష్క, ప్రగ్యా జైస్వాల్‌, తనికెళ్ళభరణి, సాయికుమార్‌ తదితరులు.
నిర్మాతలు : ఏ. మహేష్‌ రెడ్‌, 
సంగీతం : ఎం.ఎం.కీరవాణి, 
దర్శకత్వం : కె. రాఘవేంద్రరావు.
 
నాగార్జున, కె. రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో భక్తిరస చిత్రమంటే ఎంతో ఆసక్తి వుంది. 'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'షిర్డీసాయి' చిత్రాలు రావడంతో ఈసారి మరలా ఏడుకొండలవాడైన శ్రీనివాసుని భక్తుడైన హాతీరామ్‌బాబా చరిత్రను తెరకెక్కిస్తున్నాడంటే మరింత ఆసక్తి. ఆయన గురించి పెద్దగా తెలీదు. పుస్తకాల్లో ఏదో కొద్దిగా వుండేది. భగవంతుడు ఆయనతో పాచికాలు ఆడేవాడని వుంది. మరి అలాంటి కథను తీసుకుని రెండు గంటల 15 నిముషాల సినిమాగా ఎలా మలిచాడో చూద్దాం.
 
కథ :
రామ్‌ (నాగార్జున) అనే బాలుడు దేశసంచారం చేస్తూ తిరుమలలోని పద్మానంద స్వామి (సాయి కుమార్‌) అనే గురువు ఆశ్రమానికి వస్తాడు. రావడంతోనే దేవుడ్ని చూసే విద్య కావాలంటాడు. గురువు అతని అమాయకత్వానికి మెచ్చి విద్య నేర్పిస్తాడు. అనంతరం ఓంకారం పుట్టకైన అ,ఇ,ఈ కారాలతో ఓంకారంతో ధ్యానం చేస్తే తప్పకుండా ప్రత్యక్షమవ్వడమేకాకుండా నీతో పాచికలుకూడా ఆడతాంటూ పాచికలు ఇస్తాడు. ఓ చోట ధ్యానంలో మునిగిపోతాడు. కాలక్రమంలో గెడ్డాలు మీసాలు పెరిగి పెద్దవాడయ్యేసరికి శ్రీ వేంకటేశ్వర స్వామి బాలుని రూపంలో ప్రత్యక్షమవుతాడు. తన తపస్సును భగ్నం కల్గించాడని కసురుకుని.. తనింటికి తిరిగి వెళ్ళిపోతాడు రామ్‌. 
 
 
అక్కడ తల్లిదండ్రులు కుదిర్చిన తన మరదలతో పెళ్లికి సిద్ధమవుతాడు. ఓ రాత్రి గురువు కలలో ప్రత్యక్షమై.. దేవుడ్ని చూసే అవకాశం వచ్చేసింది రమ్మని ఆహ్వానించేసరికి... మరదలు అనుమతితో తిరుమల ప్రయాణమవుతాడు. అక్కడ గోవిందరాయలు అనే అధికారి దేవుడిపేరుతో ప్రజల్ని వెట్టిచాకిరీ చేయించుకోవడమే కాకుండా భక్తుల కానుకలను కైంకర్యం చేస్తుంటాడు. ఇది తెలిసిన రామ్‌ అతన్ని రాజు సమక్షంలో శిక్షవేయిస్తాడు. దాంతో పగతో రగిలిపోయిన గోవిందరాజులు అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. అది రానేవస్తుంది. ఓసారి గర్భగుడిలోని శ్రీవేంకటేశ్వరుని ఆభరణాలు మాయమైపోతాయి. ఇది తెలిసి.. అతన్ని శిక్షించేలా రాజు ఆజ్ఞ ఇస్తాడు. ఆ శిక్ష ఏమిటి? రామ్‌... హాతీరామ్‌బాబాగా ఎలా మారాడు? మధ్యలో కృష్ణమ్మ పాత్రధారి అనుష్క పాత్ర ఏమిటి? అనేది మిగిలిన సినిమా.  
 
విశ్లేషణ
భక్తిప్రదానమైన చిత్రంలో నటీనటుల పెర్‌ఫార్మెన్స్‌ ఎలా వుంది. ఎలా చేశారనేకంటే.. వారి ఆహార్యం.. పాత్ర చిత్రరణ ఎలా వుందనేది ముఖ్యం. ఇందుకు దర్శకుడిదే పైచేయి. శ్రీవేంకటేశ్వరునిగా ఎన్‌టిఆర్‌ను, సుమన్‌ను చూసిన మన కళ్ళు ఒక్కసారిగా ఉత్తరాదికి చెందిన టీవీ నటుడు సౌరభ్ ‌‍జైన్‌ను చూసేందుకు సమయం పడుతుంది. నిత్య యవ్వనుడు వేంకటేశ్వరుడు అనేందుకు అతన్ని ఎంపిక చేశామని దర్శకుడు చెప్పిన సత్యమే. అయితే దేవుడ్ని చూపించే విధానంలోని థ్రిల్‌ ఇందులో కన్పించదు. భక్తుడిలో వున్న ఆత్రుత ఆకట్టుకునేదిగా వుండదు. 
 
అయితే ప్రతి సన్నివేశానికి జీవం పోసేట్లు దర్శకుడు ప్రయత్నించాడు. కళ్ళలో ఉట్టిపడే భక్తి భావం, మాటల్లో ఆర్ద్రత, నడవడికలో క్రమశిక్షణ ఇంకా బాగా తీయాల్సింది. అన్ని ఎమోషన్లు గత చిత్రాల్లోని పాత్రలే నాగార్జునను గుర్తు తెస్తున్నాయి.
 
ఇక వేంకటేశ్వర స్వామి పాత్ర ధరించిన సౌరభ్‌ రాజ్‌ జైన్‌ ఆహార్యంలో తేజస్సు, ముఖ కవళికల్లో, మాటల్లో భక్తుల పట్ల ఆదరణ చూసేవారికి కన్పిస్తాయి. మొదటి భాగమంతా నాగార్జున జీవితం మీద, అతను తిరుమల చేరుకొని, ఆ క్షేత్రాన్ని బాగు చేయడం మీద నడిపి ఆకట్టుకుని ద్వితీయ భాగం మొత్తం దేవుడికి, భక్తుడికి మధ్యన గల హద్దులులేని భక్తి, ఆదరణ అనే అనుబంధాల్ని చాలా భావోద్వేగంగా ఆవిష్కరించి మైమరపింపజేశారు.
 
ముఖ్యంగా రెండవ భాగంలో హాతి రామ్‌ బావాజి, వేంకటేశ్వర స్వామి మధ్య నడిచే పాచికలాట, రామ్‌ హాతిరామ్‌ బావాజిగా మారడం, భక్తుడే దేవుడికన్నా గొప్పవాడు అని చెప్పే అంశం, తన ప్రియమైన భక్తుడి కోసం దేవుడంతటివాడు వేదన చెందడం లాంటి సందర్భాలు మనసును కదిలించాయి. ఇక మధ్యలో వచ్చే కీరవాణి భక్తి పాటలు కూడా చాలా వినసొంపుగా ఉన్నాయి. నాగార్జున, ప్రగ్యా జైస్వాల్‌‌ల మధ్య తెరకెక్కించిన ఒక రొమాంటిక్‌ సాంగ్‌ కూడా రాఘవేంద్రరావు మార్క్‌తో చూడటానికి బాగుంది. తిరుమల వాతావరణాన్ని చాలా అందంగా చూపిన ఎస్‌. గోపాల్‌ సినిమాటోగ్రఫీ చాలా చక్కగా ఉంది.
 
ప్రధాన లోపాలు:
1. చిన్నతనంలోనే ఇంటినుంచి వెళ్ళిపోయిన గెడ్డాలు మీసాలు వచ్చాక తిరిగి ఇంటికి వస్తే వెంటనే గుర్తుపట్టే తల్లిదండ్రుల్ని ఈ సినిమాలోనే చూస్తాం.
2. బాలుడిగా దేవుడు కన్పించినప్పుడు నాగార్జున పలికిన పలుకుల్లో తత్తరపాటు కన్పిస్తుంది.
 
3. చిన్నతనంలోనే దేవుడికి తన జీవితాన్ని అంకితం చేసిన కృష్ణమ్మ (అనుష్క) పాత్ర చిత్రణ అర్థంపర్థంలేకుండా చూపించాడు. అంతే భక్తిభావంతో వుండే రామ్‌తో పాచికలు ఆడే దేవుడు.. అంతకంటే పరమ భక్తురాలైన కృష్ణమ్మను గమనించకపోవడం కథలో ప్రధాన లోపం. ఇది కల్పితమైనా.. దానికి ఒక అర్థం చెప్పాల్సింది.
 
4. దివినుంచి భువికి దిగి వచ్చిన దేవేరుడు... మనిషి రూపంలో వుండగానే.. ఆకాశదేవుని కుమార్తెను వివాహమాడే సన్నివేశం చూపించినా.. వెంటనే.. పద్మావతితో కలిసి వుండడం అర్థంకాకుండా చూపించాడు.
 
5. 108 తీర్థాలు కొలువైన తిరుమలలో వాటి ప్రత్యేకతలు మరింత వివరంగా చెప్పాల్సింది. అగ్ని తీర్థం, వరాహస్వామి గురించి మాత్రమే చెప్పగలిగాడు.
6. రావురమేష్ పాత్ర తీరు.. మరదలు సన్నివేశాలు, రామ్‌కు జైలు శిక్ష అనేవి.. శ్రీరామదాసు, అన్నమయ్యల్ని గుర్తుచేస్తాయి.
7. హతీరామ్‌బాబా బలన్మరణం ఎందుకు పొందాలనుకుంటాడో అర్థంకాదు.
 
సాంకేతిక విభాగం :
వున్నంతలో కాస్త మంచి కథనం, అందులో భావోద్వేగపూరితమైన సన్నివేశాలు, వాటిలో ప్రతిభ ఉన్న నటీనటుల నటనతో చిత్రాన్ని ఆకర్షణీయంగా దర్శకుడు తీర్చిదిద్దారాయన. సినిమాకి ముఖ్యమైన భక్తుడి భక్తి భావాన్ని, దేవుడి ఆదరణను, వాటి రెండింటి మధ్య సంబంధాన్ని చాలా బాగా తెరపై ఆవిష్కరించారు. కె.కె. భారవి అందించిన కథ కాస్త కల్పితమే అయినా కూడా మనకు తెలియని ఎన్నో విషయాలను తెలియజెప్పింది. భక్తి పాటలకు కీరవాణి అందించిన సంగీతం .. ప్రపంచ కోటి బ్రహ్మాండ నాయకా.... పాట మినహా ఏదీ ఏమంత ఆకట్టుకోలేదు. అయితే గోవింద నామాలు.. పలికే మొదటి భాగంలో కాస్త భక్తిభావం పొంగింది.
 
ఎస్‌.గోపాల్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ అందంగా ఉంది. అది సినిమాకి అదనపు బలమవుతుందనడంలో సందేహమేలేదు. గౌతమ్‌ రెడ్డి ఎడిటింగ్‌ బాగుంది. నిర్మాత ఏ. మహేష్‌ రెడ్డి పాటించిన నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
 
 
ముగింపు:
ఇటువంటి కథను తనదైన శైలిలో తీసే రాఘవేంద్రరావు ఈసారి పెద్దగా ఆకట్టుకునేలా తీయలేదనే చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటి తరం తెలుసుకోవాలనే తీశానని చెప్పడం.. బాగున్నా.. అందుకు సరైన లాజిక్కులేని సన్నివేశాలు పెట్టాడు. గరుత్మండిగా అజయ్‌ను పెట్టి పాత్రలో సీరియస్‌నెస్‌లేకుండా చేశాడు.
 
ఎక్కడో రాజస్థాన్‌ నుంచి వచ్చిన రామ్‌.. తిరుమలలో.. శ్రీ వేంకటేశ్వరునికి పవిత్రమైన భక్తుడిగా ఎలా మారడన్నదే కథ. అయితే ముగింపు ఏమాత్రం నమ్యశక్యంగా అనిపించదు. వేంకటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవికూడా రామ్‌.. తిరుమలలోనే సేవించి వుండమని తలస్తే.. తనకుతాను శిక్షగా.. దేవుని సమక్షంలోనే సజీవ సమాధి కావడం అర్థంకాదు. చివరికి ఆత్మరూపంలో వేంకటేశ్వరునికి తొలి హారతి ఇవ్వడంతో తెరపడుతుంది. అంటే.. ప్రతిరోజూ రామ్‌ ఆత్మ వచ్చి దేవేరుని నిద్రలేపుతుందన్నమాట. ఇది ఎంతవరకు నిజమో... కానీ... చివర్లో ఆత్మ కాన్సెప్ట్ పెట్టి  థ్రిల్‌ కల్గించాడు. అయితే మొత్తంగా చూస్తే ఇది ఓ సీరియల్‌లా అనిపిస్తుంది.

రేటింగ్: 3/5