గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By IVR
Last Modified: శుక్రవారం, 20 జూన్ 2014 (22:13 IST)

గలగల పారే నదిలా 'ఊహలు గుసగుసలాడె...' రివ్యూ రిపోర్ట్

ఊహలు గుసగసలాడె నటీనటులు:  నాగశౌర్య, రాశి ఖన్నా, అవసరాల శ్రీనివాస్‌, పోసాని, పృద్వీ, రావు రమేష్‌, సత్యకృష్ణ, ప్రగతి, హేమ తదితరులు. కెమెరా: విజయ్‌ జి. దిలీప్‌; ఎడిటింగ్‌ : కిరణ్‌ గంటి, సంగీతం: కళ్యాణి కోడూరి, బ్యానర్‌ : వారాహి చలన చిత్రం, నిర్మాత: రజని కొర్రపాటి, దర్శకత్వం: అవసరాల శ్రీనివాస్‌.
 
నటుడిగా అమాయకత్వం ఉట్టిపడే పాత్ర పోషిస్తూ కామెడీని పండించే అవసరాల శ్రీనివాస్‌ 'అష్టాచెమ్మ'తో మెప్పించాడు. ఆ తర్వాత రెండుమూడు చిత్రాలు చేసినా పెద్దగా లాభం లేకపోవడంతో రచయితగా ప్రముఖుల దగ్గర పనిచేయడం మొదలుపెట్టి ఈసారి ఏకంగా దర్శకుడు అయ్యాడు. అయితే 'ఈగ' సినిమాతో నేషనల్‌ అవార్డ్‌ను సొంతం చేసుకున్న అభిరుచి గల నిర్మాత సాయి కొర్రపాటిని నిర్మాతగా ఎంచుకోవడం విశేషం. చిత్రం పూర్తయినా టైటిల్‌ పెట్టకుండా ఏదో కాజువల్‌గా ఓ బందిపోటు సినిమా చూసి అందులో పాటను బట్టి 'ఊహలు గుసగుసలాడే' టైటిల్‌ పెట్టేశాడు. మరి ఆ ఊహలు చిత్రం ప్రేక్షకుల మదిని ఊహల్లోకి తీసుకెళ్ళిందా? థియేటర్‌ నుండి బయటికొచ్చాక జనాల నోట గుసగుసలాడించిందా అనేది చూద్దాం. 
 
కథ విషయానికి వస్తే... 
న్యూస్‌ రీడర్‌ కావాలనుకునే ఎయిమ్‌ ఉన్న ఎన్‌.వెంకటేశ్వరరావు (నాగశౌర్య). తన అక్క బావ ఇంటికి వేసవి శలవులకు వైజాగ్‌ వెళ్ళినప్పుడు ప్రభావతి(రాశి ఖన్నా)ని చూసి ప్రేమలో పడతాడు. ప్రభావతికి కూడా వెంకీ అంటే ఇష్టమే. కానీ చిన్న మనస్పర్ధల కారణంగా ఇద్దరూ దూరమవుతారు. ఆ తర్వాత యు.బి టీవీ అధినేత ఉదయ్‌ శిరీషని చూసి ఇష్టపడతాడు. తననే పెళ్ళి చేసుకోవాలని ఫిక్స్ అయ్యి ఆమెని ఇంప్రెస్‌ చేయడానికి నానా ప్రయత్నాలు  చేస్తుంటాడు. శిరీషని ప్రేమలో పడేయడానికి వెంకీని సహాయమడుగుతాడు. లేదంటే న్యూస్‌ యాంకర్‌ కావాలని తన ఆశని ఆడియాశ చేస్తానని బెదిరిస్తాడు. వెంకి తప్పక ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఏమయింది? తన బాస్‌కు వెంకీ సహరించాడా? శిరీష ప్రేమ పొందాడా? అనేది సినిమా.
 
నటీనటులు 
చందమామ కథలు చిత్రంలో ఓ పాత్ర పోషించిన శౌర్య ఈ సినిమాలో మెయిన్‌ లీడ్‌గా యాక్ట్‌ చేశాడు. తన ఎనర్జిటిక్‌ యాక్టింగ్‌తో మంచి ఈజ్‌ ఉన్న ఆరిస్ట్‌గా ప్రూవ్‌ చేసుకున్నాడు. మద్రాస్‌ కేఫ్‌ సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన రాశిఖన్నా ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు నాయికగా పరిచయమైంది. శౌర్యకి పెయిర్‌గా కరెక్ట్‌గా సూటయ్యింది. చక్కని అందంతోపాటు ఆమెలో కాస్త మందం కూడా ఉంది. ఎక్స్‌ప్రెషన్స్‌ బావున్నాయి. యాక్టింగ్‌ ఉంది కానీ కొన్ని సన్నివేశాల్లో ఆమెలో ఏదో లోపం కనిపించింది. ఓవరాల్‌గా తెలుగులో తొలి సినిమా అయినప్పటికీ మంచి మార్కులే కొట్టే అవకాశముంది. ఛానల్‌ హెడ్‌గా యాక్ట్‌ చేసిన శ్రీని అవసరాల యాక్టింగ్‌ డామినేటింగ్‌గా ఉంది. పోసాని, పృధ్వీ పాత్రలు ఓకే. మిగిలిన పాత్రధారులు తమ పాత్రల పరిధి మీరకు బాగానే నటించారు.
 
సాంకేతిక నిపుణుల పనితీరు : 
శ్రీనివాస్‌ అవసరాల ఇప్పటివరకు నటుడిగా, రచయితగా మంచి మార్కులే తెచ్చుకున్నాడు. అతను రాసుకున్న ఈ కథలో కొత్తదనం లేకపోయినా మాటలు, దర్శకత్వం కొత్తగా ఉన్నాయి. టైటిల్‌తోనే తన శైలి ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పాడు. సినిమాను కూడా అంతే ఆహ్లాదకరంగా తెరకెక్కించాడు. అవసరాల రాసిన సున్నితమైన హాస్యం ప్రేక్షకులను బాగానే నవ్వించింది. మాటల రచయితగా మంచి మార్కులు కొట్టేశాడు. ద్వితీయార్థంలో కథను కాస్త సాగదీసినా రొమాంటిక్‌ సన్నివేశాలతో బాగా హ్యాండిల్‌ చేశాడు. నటీనటులందరి చేత చక్కని నటన రాబట్టుకున్నాడు. 
 
ఇక సినిమా మెయిన్‌ ఎసెట్‌ పాటలు, ఫోటోగ్రఫి అని చెప్పాలి. ఇటీవల ఏ సినిమాలో చూసిన సాహ్యితం వినబడకుండా రణగొణధ్వనులతో పాటల్ని వినిపిస్తున్న తరుణంలో కళ్యాణి కోడూరి కూల్‌గా సాగే సంగీతం అందించారు. ఆర్‌.ఆర్‌ కూడా బావుంది. చక్కని లొకేషన్‌లలో సినిమాను విజువల్‌గా బాగా చూపించారు. ముఖ్యంగా నటీనటుల కాస్ట్యూమ్స్‌ చాలా నీట్‌గా ఉన్నాయి. సెకెండాఫ్‌లో సినిమాకు కాస్త కత్తెర వేసుంటే బావుండేది. సాయి కొర్రపాటి నిర్మాణ విలువలు బావున్నాయి. చిన్న సినిమా అయినా చాలా రిచ్‌గా తీశారు. 
 
విశ్లేషణ 
సినిమా మొత్తం చాలా స్లోగా సాగుతుంది. మల్టీప్లెక్స్‌లో పాప్‌కార్న్‌ తింటూ సరదాగా సాగేలా ఈ చిత్రముంటుంది. మధ్యమధ్యలో సింపుల్‌గా ఎంటర్‌టైనింగ్‌గా ప్రారంభమైంది. అలా సాగుతుండగా మార్గమధ్యలో కాస్త బోర్‌ ఫీల్‌ కలిగింది. సెకెండాఫ్ మరీ స్లోగా అనిపించింది. ప్రభావతిని ఇంప్రెస్‌ చేయడానికి ఉదయ్‌ చేసిన చేష్టలు తెలుగుతెరకు కొత్త కాకపోయినా ఎంటర్‌టైనింగ్‌గా బాగానే ఉన్నాయి. ఇంటర్వల్‌ బ్యాంగ్‌, సెకెండాఫ్‌లో అవసరాల, రాశి ఖన్నాకి మధ్యగల సీన్స్‌ చాలా ఫన్నీగా ఉన్నాయి. ఇక అవసరాల, శౌర్య, బ్లూటూత్‌ టాకింగ్‌ కాస్త బోర్‌ కొట్టించింది. ఇది చాలా సినిమాల్లో చూసిందే. రొమాంటిక్‌ లవ్‌స్టోరితో తెరకెక్కిన ఈ చిత్రంతో హీరోహీరోయిన్‌కి మధ్య పెద్దగా కెమిస్ట్రి పండలేదనే చెప్పాలి. 
 
ఇటీవల వస్తున్న చిన్న సినిమాల్లో బూతు అనేది కామన్‌ అయిపోయింది. దర్శకుడు ఎటువంటి వల్గారిటీ లేకుండా క్లీన్‌ సినిమా తీశాడు. కథ పాతదే అయినా ప్రజంట్‌ చేసిన విధానం బావుంది. మాటల రచయితగా మరోసారి ప్రూవ్‌ చేసుకున్నాడు. తొలిసారి దర్శకత్వ వహించడంలో చిన్నచిన్న లోపాలు సహజం కానీ ఆ లోపాల్ని కనిపించకుండా కథని నడిపించాడు. దర్శకుడిగా శ్రీను అవసరాల ఓ మోస్తరు పేరు పొందినట్టే. ఈ సినిమా గలగల పారే నదిలో పడవ ప్రయాణంలా కొందరికి అనిపిస్తే... మరికొందరికి ప్యాసింజర్‌ రైలు ప్రయాణంలా అనిపిస్తుంది. ఓవరాల్‌గా మల్టీప్లెక్స్‌ ఆడియన్స్‌ని మాత్రం బాగా ఆకట్టుకుంటుంది.