గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: శుక్రవారం, 29 మే 2015 (17:04 IST)

దీనితో 'పండగ చేస్కో'వాలా...? రివ్యూ రిపోర్ట్...

పండగ చేస్కో నటీనటులు : రామ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సోనాల్‌ చౌహన్‌, రాజీవ్‌ మీనన్‌, బ్రహ్మాజీ, బ్రహ్మానందం, ఎం.ఎస్‌. నారాయణ, వెన్నెల కిశోర్‌ తదితరులు. సంగీతం: థమన్‌, నిర్మాత : పరుచూరి కిరీటి, దర్శకత్వం : గోపీచంద్‌ మలినేని.
 
పాయింట్‌: కుటుంబమంతా కలిసివుంటే పండుగ చేసుకున్నట్లే.
 
తెలుగు సినిమాకు రొటీన్‌గా ఓ ఫార్మెట్‌ వుంది. దాన్నుంచి బయటపడాలంటే హీరోలకు ఇష్టముండదు. రామ్‌ అంతకుముందు రెడీ, కందిరీగ చిత్రాలు చేసిన పాయింట్‌తోనే మళ్ళీ 'పండగ చేస్కో' చేయడం విశేషం. ఆడియన్స్‌ను నవ్వించాలి. అందులో లాజిక్కులు జిమ్మిక్కులు అవసరంలేదు. ఇందుకు నిర్మాతలు కూడా కోట్లు పెట్టడానికి వెనుకాడటంలేదు. 'సింహా' చిత్రాన్ని తీసిన పరుచూరి ప్రసాద్‌ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం గత కొంతకాలంగా సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్న రామ్‌ చేసిన చిత్రం ఎలా ఉందో చూద్దాం.
 
కథ :
కార్తీక్‌(రామ్‌) పోర్చుగల్‌లో పెద్ద బిజినెస్‌‌మేన్‌. సాఫ్ట్‌వేర్‌ కంపెనీని స్థాపించి తండ్రి, చెల్లెల్లు, బావకు ఉద్యోగాలు ఇస్తాడు. స్ట్రిక్ట్‌ మనిషి. అక్కడే ఉండే పెద్ద బిజినెస్‌ వుమెన్‌ అనుష్క(సోనాల్‌ చౌహన్‌) తన ఆలోచనలకు తగినట్లుండే ఓ వ్యక్తి కోసం వెతుకుతుంది. అందుకు ఆమె దగ్గర పనిచేసే వీకెండ్‌ వెంకట్రావ్‌(బ్రహ్మానందం) హెల్ప్‌ చేస్తాడు. అలా కలిసిన ఇద్దరూ బిజినెస్‌ డెవలప్‌మెంట్ కోసం ప్రపోజల్‌తో వచ్చి.. పెళ్ళికి సిద్ధమవుతారు. అయితే వారం రోజుల్లో పెండ్లి వుందనగా ఇండియాలో వున్న తన ఫ్యాక్టరీ మూసేశారని తెలిసి హుటాహుటిన హైద్రాబాద్‌ వస్తాడు కార్తీక్‌. ఫ్యాక్టరీ గొడవకు దివ్య(రకుల్‌ ప్రీత్‌ సింగ్‌) అనే పర్యావరణ ప్రేమికురాలు కారణమవుతుంది. 
 
ఆమెదో ఫ్లాష్‌బ్యాక్‌. ఫ్యాక్షనిస్టు కుటుంబానికి చెందిన ఆమె అటు మేనమామ సాయిరెడ్డి(సాయి కుమార్‌) ఇటు తండ్రి భూపతి(సంపత్‌) ప్రేమల మధ్య నలిగిపోతుంది. అందుకే ఫ్రెండ్‌ వద్ద వుంటుంది. కేవలం దివ్యను లైన్‌లో పెడితే.. అటు ఫ్యాక్టరీ గొడవ తీరిపోతుందనుకున్న కార్తీక్‌కు, దివ్యను ప్రత్యర్థివర్గం కిడ్నాప్‌ చేయాలనుకోవడంతో మరో సమస్య వచ్చిపడుతుంది. ఇది తెలిసిన కార్తీక్‌ ఎటాక్‌ చేస్తాడు. అదే టైమ్‌లో దివ్య తండ్రీ వస్తాడు. రాగానే దివ్యను తీసుకెళతాడు. అయితే దివ్య తండ్రిని తనే రమ్మన్నట్లు కార్తీక్‌ చెబుతాడు? అసలు వీరిద్దరికి సంబంధం ఏమిటి? ఫ్యాక్టరీ గొడవేమిటి? ఆ తర్వాత ఏమయింది? అనేది సినిమా. 
 
పెర్‌ఫార్మెన్స్‌
రామ్‌ పాత్రలో రెండు కోణాలున్నాయి. బిజినెస్‌మేన్‌తో పాటు పంతాలు పట్టింపులు పగలు కూడా తెలిసిన ఫ్యాక్షన్‌ కుటుంబ ఛాయలు పోషించాడు. ఆ పరిణితిని సెకండాఫ్‌లో బాగా పలికించాడు. రామ్‌ ఎనర్జీ సినిమాకు హైలైట్‌. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చాలా బాగా నటించింది. చిలిపి ఎక్స్‌ప్రెషన్స్‌తో పాటు, భావోద్వేగాన్ని కూడా బాగానే పండించింది. సోనాల్‌ చౌహన్‌ సరితూగింది. గ్లామర్‌లో పోటీపడ్డారు ఇద్దరూ. మిగతా నటీనటులంతా తమ పరిధి మేరకు బాగానే నటించారు. వీకెండ్‌ వెంకట్రావుగా నటించిన బ్రహ్మనందం అలరిస్తాడు. బ్రహ్మాజీ, రఘుబాబు వంటి పాత్రలన్నీ గతంలోని ఫ్యాక్షన్‌ పాత్రలే. రావు రమేష్‌, రామ్‌ తండ్రిగా నటించాడు.
 
టెక్నికల్‌గా...
కథ విషయంలో ఎలాంటి కొత్తదనమూ లేదు. ఆ విషయంలో కథ పరంగా దర్శకుడు ప్రతిభ కూడా పెద్దగా బయటకొచ్చే అవకాశం లేదు. అదేవిధంగా ఒక ఫార్ములా కథకు ఫార్ములా స్క్రీన్‌ప్లేనే అందించడం ద్వారా కోన వెంకట్‌ కొత్తగా చేసిందేమీ లేదు. డైలాగుల విషయంలో మాత్రం కోన వెంకట్‌ తన మార్క్‌ను మళ్ళీ చూపించారు. పంచ్‌ డైలాగుల జోలికి వెళ్ళకుండా అర్థవంతమైన డైలాగులు ఇచ్చే ప్రయత్నం చేశారు.
 
ఇక కథకుడిగా ఏమీ చేయలేకపోయినా, దర్శకత్వం విషయంలో మాత్రం గోపీచంద్‌ మలినేని చాలాచోట్ల మెరిశాడు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. పోర్చుగల్‌, బొబ్బిలి ఇలా రెండు విభిన్న నేపథ్యాలనే కాక, విభిన్న పరిస్థితుల మూడ్‌ కూడా బాగా క్యాప్చర్‌ చేశారు. ఎడిటింగ్‌ బాగుంది. థమన్‌ పాటలపరంగా ఫర్వేలేదనిపిస్తే.. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌లో మూడ్‌ను ఫాలో చేసి బాగుందనిపించాడు.
 
విశ్లేషణ:
కూల్‌గా సాగిపోయే కామెడీ, సెకండాఫ్‌లో వచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్‌ చూపించాడు. సినిమాలో రకరకాల క్యారెక్టర్స్‌ వస్తూ పోతూ తెరంతా నిండుగా కనిపిస్తుంది. ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఇన్ని రకాల క్యారెక్టర్‌లు ఉండటం, వాటి మధ్యన వచ్చే కన్ఫ్యూజన్‌తో కూడిన కామెడీ ఎప్పుడూ ఆకర్షించే విషయమే. సెకండాఫ్‌లో వచ్చే ఫ్యామిలీ సెంటిమెంట్‌ సినిమాకు ఒక అర్థాన్ని తెచ్చిపెట్టింది. బ్రహ్మానందం పాత్ర బాగా నవ్విస్తుంది. ఇక ఆ పాత్రను కథలో జొప్పించిన విధానం కూడా బాగుంది. పృధ్వీతో పాటు మరో నటుడు విజయవాడ బ్రదర్స్‌ దొంగలుగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' కామెడీ ట్రాక్‌ నవ్వులు పూయిస్తుంది.
 
ఇక ప్రధాన లోపం కథ, స్క్రీన్‌ప్లే అనే చెప్పాలి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ తరహా కథల్లో ఎప్పట్నుంచో చూస్తూ ఉన్న ప్లాట్‌నే ఈ సినిమాకూ వాడుకోవడం కొత్తదనం కోరుకునేవారిని ఏమాత్రం ఆకట్టుకోదు. కథ పాతదే అయినా కథలో కొన్ని అంశాలను దాచిపెట్టడం, సందర్భానుసారంగా ఆ అంశాలను రివీల్‌ చేయడంలోనూ కొత్తదనం లేకపోవడం స్క్రీన్‌ప్లే వైఫల్యమే. సినిమా మొదలైన కాసేపటికే అన్నీ తెలిసిపోవడం బోర్‌ కొట్టిస్తుంది. ఫార్ములా స్క్రీన్‌ప్లే వల్ల సినిమాలోని కామెడీ, ఎమోషన్‌ను అర్థం చేసుకోవడమే తప్ప అనుభవించలేం.  సినిమా నిడివి కూడా కొంత ఎక్కువైందనే చెప్పాలి.

ఎక్కువ క్యారెక్టర్లు ఉండటం, అన్నింటికీ సరైన డీటైల్‌ ఇచ్చే ప్రయత్నం చేయకపోయినా సినిమా నిడివి పెరగడమనేది అనవసర ట్రాక్‌ల వల్లేనని ఇట్టే తెలిసిపోతుంది. అయితే ఏదో కొత్తదనం ఆశించేవారికి ఇది నిరాశే మిగులుస్తుంది. కందిరీగ, రెడీ చూసిన వారికి అటుఇటూ మార్చినట్లు అన్పిస్తుంది. అంతకన్నా గొప్పగాలేదు. మొత్తంగా అందరినీ ఎంటర్‌టైన్‌ చేయడమే కారణంగా ఈ చిత్రాన్ని తీశారు. రొటీన్‌ ఫార్మెట్‌ అయినా ఏవరేజ్‌ సినిమా.
 
రేటింగ్‌: 2/5