శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ivr
Last Modified: శుక్రవారం, 14 నవంబరు 2014 (16:33 IST)

'పిల్లా నువ్వు లేని జీవితం' సాయిధరమ్ కు స్టెప్పింగ్ స్టోనే... రివ్యూ రిపోర్ట్

పిల్లా నువ్వు లేని జీవితం నటీనటులు: సాయిధరమ్‌ తేజ, రెజీనా, జగపతి బాబు, షిండే, ప్రకాష్‌రాజ్‌, షఫీ, రఘుబాబు, వైజాగ్‌ ప్రసాద్‌, ప్రభాస్‌ శీను, మేల్కొటి, ఆహుతి ప్రసాద్‌, సురేఖ్‌, సత్యకృష్ణ తదితరులు; కెమెరా: దాసరధి శివేంద్ర, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: డైమండ్‌ రత్నం, ఎ.ఎస్‌. రవికుమార్‌ చౌదరి, నిర్మాతలు: బన్నీ వాసు, శ్రీహర్షిత్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ఎ.ఎస్‌. రవికుమార్‌ చౌదరి.
 
విడుదల: శుక్రవారం.. 14.11.2014
 
పాయింట్‌:  కాబోయే సిఎం.ను శ్రీనుగాడు ఎలా అడ్డుకున్నాడు.
 
కథగా చెప్పాలంటే... సి.ఎం. పోస్ట్‌కు షిండే, ప్రకాష్‌రాజ్‌ పోటీపడుతుంటారు. తనకు అడ్డు వచ్చినవారినందరినీ మైసమ్మ(జగపతిబాబు) అనే రౌడీ చేత వేసేస్తుంటారు. తన పోస్ట్‌కు అడ్డంకిగా మారిన జర్నలిష్టు షఫీను వేసేస్తాడు. అలాంటి మైసమ్మ దగ్గరకు వచ్చి శీను(సాయిధరమ్‌ తేజ్‌) తనను చంపాలంటూ అందుకు కొంత డబ్బును ఇవ్వచూపుతాడు. అసలు నీ కథేంటి? అని అడగడంతో తన లవ్‌ ట్రాక్‌ చెబుతాడు. సిరి(రెజీనా)ని తొలిచూపులోనే ప్రేమించేస్తాడు. తన కాలేజీలో చదివే అమ్మాయి. 
 
ఆమె తిరస్కరిస్తుంది. కానీ ఆమె ఫాలో చేస్తుంటే.. కొన్ని విషయాలు తెలుస్తాయి. సిరిని చంపడానికి ఓ రౌడీ ట్రై చేస్తున్నాడు. వాడిని చంపాలి. అదీ కథ. ఆ రౌడీ ఎవరు? అంటే మీరే అంటూ ట్విస్ట్‌ ఇస్తాడు. ఆమెను వదిలేది లేదని మైసమ్మ, ఆమెను చంపితే నిన్ను వేసేస్తాని శీను సవాల్‌ విసురుతాడు. ఇలా ఇద్దరు 10 రోజులు టైమ్‌ పెట్టుకుంటారు. ఆ పది రోజుల్లో ఏం జరిగింది? అన్నది మిగిలిన సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌ 
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సాయిధరమ్‌ తేజ్‌.. చిరంజీవి షేడ్స్‌ కన్పిస్తాయి. ఆ పెదాలు డైలాగ్‌ డెలివరీ చిరంజీవి మొదట్లో చేసినట్లుగా వుంది. కొన్ని మేనరిజాలు పవన్‌ కళ్యాణ్‌ను గుర్తుచేస్తాయి. ఎలా చేసినా... బాడీలో వున్న ఈజ్‌తో ఏక్టింగ్‌ను ఈజీగా చేసేశాడు. డాన్స్‌లు, ఫైట్లు పర్వాలేదు. కాస్త కేశాలంకరణ చూడతగ్గట్లుగా లేదు. మాస్‌ హీరోగా పనికివస్తాడు. హీరోయిన్‌ రెజీనా ఇంతకుముందు చేసిన పాత్రల కంటే మంచి పాత్రే పోషించింది. 
 
రౌడీగా జగపతిబాబు పాత్ర సరిపోయింది. ఇంతకుముందు ఆ పాత్రను శ్రీహరి చేయడం, ఆయన కాలం చేయడంతో మొత్తాన్ని రీష్యూట్‌ చేసి జగపతిబాబుపై తీశారు. అందుకే ఆయనకు నివాళిగా స్లైడ్‌లో వేయడం మంచి పరిణామం. ప్రకాష్‌ రాజ్‌, షిండేలు రాజకీయవేత్తలు. సిఎం.కోసం పోటీపడే పాత్రలను తమదైన శైలిలో చేసేశారు. మైసమ్మ అనుచరులుగా రఘుబాబు, ప్రభాస్‌ శీను తదితరులు నటించి నవ్వించే ప్రయత్నం చేశారు. ఇన్వెస్టిగేట్‌ జర్నలిస్టుగా షఫీ నటించాడు.
 
టెక్నికల్‌గా... 
సంభాషణల పరంగా సింపుల్‌గానూ ఎంటర్‌టైనింగ్ గానూ వుండేవిధంగా దర్శకుడితో పాటు రచయిత ప్రయత్నించాడు. ఈనాటి జనరేషన్‌కు తగిన డైలాగ్స్‌. అనూప్‌ రూబెన్స్‌ బాణీలు బాగున్నాయి. టైటిల్‌ సాంగ్‌ ముద్ర వేశాడు. శివేంద్ర ఫొటోగ్రఫీ ఫర్వాలేదు. నిర్మాణపరంగా బన్నీ వాసు, శ్రీహర్షిత్‌ (శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌) బాగానే వున్నాయి. 
 
విశ్లేషణ... 
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోకు ఏవిధంగా ప్రమోట్‌ చేయాలో అంత ఇదిగా నిర్మాణ వాల్యూతో సినిమాను తీశారు. దీని కోసం దిల్‌ రాజు కూడా తోడయి ఈ చిత్రాన్ని బయటకు తెచ్చారు. ఇంతకు ముందు 'రేయ్‌' చిత్రాన్ని చేసినా దాని తర్వాత చేసిన ఈ సినిమా విడుదలైంది. వారసుల కోవలో మరో హీరోను ప్రేక్షకులుపై వదిలారు. ఇంకా రెండుమూడు చిత్రాలు చేస్తేగానీ ఫేస్‌ ఇంకా చూడబుద్దికాదు.
 
దర్శకుడు రివర్స్‌ స్క్రీన్‌ప్లేతో కథను నడిపాడు. రెజీనా, శ్రీనుల లవ్‌ట్రాక్‌ ఇంకా ఎఫెక్ట్‌వివ్‌గా లేదు. మొదటి భాగం సరదాగా సాగుతుంది. రెండో భాగంలో రాజకీయ నేపథ్యంలో లెంగ్తీగా అనిపిస్తుంది. ఊహకందని ట్విస్ట్‌లు. సాహసాలతో రెండవ భాగం చకచకా నడిచిపోతుంది. సిఎం. అయ్యే వ్యక్తిని ధైర్యంగా ఎదుర్కోనే సంఘటనలు వాస్తవానికి విరుద్ధంగా వుంటాయి. దర్శకుడిగా 'యజ్ఞం' చిత్రాన్ని చేశాక.. రవికుమార్‌ చౌదరికి మళ్ళీ హిట్‌ లేదు. ఈ చిత్రం ఆ లోటు తీరుస్తుందనే చెప్పవచ్చు. ఈనాటి ఆడియన్సు కోరుకునే అంశాలు ఇందులో వుండటంతో చూడగలిగే చిత్రంగా వుంది. 
 
రేటింగ్‌ : 3/5