శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By IVR
Last Modified: శుక్రవారం, 4 జులై 2014 (13:45 IST)

రెజీనా 'రారా కృష్ణయ్య' అంది... మరి ప్రేక్షకులేమంటారు... రివ్యూ రిపోర్ట్

'రారా కృష్ణయ్య' నటీనటులు: సందీప్‌ కిషన్‌, రెజీనా, జగపతిబాబు, కల్యాణి, తాగుబోతు రమేష్‌,  సత్యం రాజేష్‌, తనికెళ్ళభరణి, ఇంటూరి వాసు తదితరులు; పాటలు: భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి, నిర్మాత: వంశీకృష్ణ శ్రీనివాస్‌, దర్శకత్వం: మహేష్‌ బాబు పి.
 
విడుదల: 4.7.2014.. శుక్రవారం
 
సినిమాకు ప్రేక్షకుల్ని థియేటర్‌ దగ్గరకు తీసుకురావాలంటే కొంతైనా భిన్నంగా ఆలోచించాలి. కథలు కూడా ఊహించని విధంగా ఉండాలి. ఆ జాగ్రత్తలు తీసుకుంటేనే సినిమాకు రా రమ్మంటే వస్తారు. లేదంటే కట్ కొట్టేస్తారు. అందుకే సందీప్‌కిషన్‌ తను చేసే చిత్రాలన్నీ కొత్తగా ఉండేలా ప్లాన్‌ చేస్తుంటానని చెబుతుంటాడు. అలా హీరో కొత్త దర్శకుడు మహేష్‌తో సినిమా చేశాడంటే ఏదో కొత్తగా ఉంటుందని అనుకున్నాడే కానీ.. ఆ కొత్తదనం ఫొటోగ్రఫీ, నిర్మాణంలో రిచ్‌నెస్‌ ఉంటేనే సరిపోదు. కథను సరిగా ప్రెజెంట్‌ చేయడం అవసరం. దానికి కథ కూడా కరెక్ట్‌గా ఎంచుకోవాలి. అప్పుడే థియేటర్‌కు 'రారా.. అంటే వస్తారు. లేదండే.. పోరా.. అంటూ ప్రేక్షకులు తీర్పుఇస్తారు. మరి ఈ రారా కృష్ణయ్య ఎలా తీశారో చూద్దాం.
 
కథ : 
కిట్టు (సందీప్‌ కిషన్‌) చెన్నైలో టాక్సీ ట్రావెల్స్‌లో డ్రైవర్‌. తను కష్టపడి సంపాదించి ఓనర్‌ తనికెళ్ళ భరణి అంతటివాడు కావాలని ఎయిమ్‌. అందుకు సంపాదించిన దాంట్లో కొద్దికొద్దిగా యజమాని దగ్గర దాస్తుంటాడు. కానీ స్వంత కారు కొనే సమయానికి యజమాని హ్యాండ్‌ ఇచ్చి గెంటివేయిస్తాడు. అదే సమయంలో అతని కుమార్తె నందిని(రెజీనా) తన తండ్రికి ఎదురుతిరిగి నచ్చని సంబంధాన్ని వాయిదా వేయాలనుకుంటుంది. 
 
అనుకోకుండా కిట్టు అక్కడికి వచ్చి మళ్ళీ యజమాన్ని నిలదీయడం చూసి... అదే అదనుగా కిట్టుతో నందిని ఎస్కేప్‌ అవుతుంది. తర్వాత తన తండ్రి చేత 15 లక్షలు డిమాండ్‌ చేయమని చెబుతుంది. సరిగ్గా డబ్బు చేతికి వచ్చేసరికి... బ్రహ్మాజీ ప్రత్యక్షమై నందినిని కిడ్నాప్‌ చేస్తాడు. ఆమె కోసం వెతుక్కుంటూ దుండగులు ఉండే నివాసానికి కిట్టు వెళతాడు. సరిగ్గా అక్కడే ట్విస్ట్‌.. అది తన పుట్టిన ఇల్లే. తన అన్న జగ్గుభాయ్‌ (జగపతిబాబు) చేసే కిడ్నాప్‌ వ్యాపారంలో ఇదో తంతు. ఆ తర్వాత ఏమయింది? అనేది కథ.
 
నటీనటులు: 
సందీప్‌ కిషన్‌ నటన ఫర్వాలేదు. రొటీన్‌గా గత చిత్రాల్లో మాదిరిగానే ఆయన ఆహార్యం ఉంది. కొత్తగా ఏమీ కన్పించలేదు. చేయడానికి కూడా ఏమీలేదు. రెజీనా కూడా అంతే. కాకపోతే ఇవాల్టి యువతలో ఉండే ఫాస్ట్‌నెస్‌ ఆమెలో ఎక్కువగా ఉన్నాయి. తమిళవాసిగా తనికెళ్ళ భరణి సరిపోయాడు. ఫ్యాక్షనిజం తరహాలో కిడ్నాప్‌ చేసే వృత్తిగా ఎంచుకున్న భాయ్‌గా జగపతిబాబు నటించాడు. కాకపోతే ఇందులో లెజెండ్‌లో ఉన్నంత ఫోర్స్‌ లేదు. పెద్దగా అరుపులు, కేకలు ఉండవు. గెటప్‌ ఫర్వాలేదు. ఆయన భార్యగా కళ్యాణి నటించింది. పోటీ గ్యాంగ్‌లో రవిబాబు గ్యాంగ్‌ ఉంటుంది. కథనంలో సాగే సన్నివేశాల్లో ఆయన చేసే అల్లరి కాస్త నవ్వు తెప్పిస్తాయి. ఇక హీరోహీరోయిన్ల కిడ్నాప్‌ జర్నీలో తాగుబోతు రమేష్‌ వచ్చే సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి. ఇక మిగిలినవారంతా షరా మామూలే.
 
టెక్నికల్‌గా.... 
ముందుగా ఈ చిత్రంలో చెప్పాల్సింది సినిమాటోగ్రఫీ.. చాలా అందంగా రిచ్‌గా చూపించాడు. చెన్నై నుంచి కథ ఆరంభమయి, ప్రకృతి అందాలతో పాటు కేరళ వరకు సాగుతుంది. అక్కడ ఓనమ్‌ పండుగలు, ఆహ్లాదకరమైన కొండ ప్రాంతాలు ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణ. సంగీతపరంగా చెప్పుకోవాల్సింది పెద్దగా లేదు. సాహిత్యం కూడా గొప్పగాలేదు. ఏ పాట అట్టే ఎట్రాక్ట్‌ చేయకపోవడం మైనస్‌. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌కు ఎక్కువ పని చెప్పారు. చాలాచోట్ల సెట్లు వేసి అందంగా చూపించగలిగాడు. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఫర్వాలేదు. అయితే... రెజీనాకు డబ్బింగ్‌ చెప్పిన విధానం వాయిస్‌ చాలా డల్‌గా అనిపిస్తుంది. హీరో మాడ్యులేషన్‌ కూడా దాదాపు అలాగే ఉంది.
 
విశ్లేషణ: 
సినిమా అంటే ఎంటర్‌టైన్‌మెంట్‌. దానికోసం ఏదో కథ రాసుకుని.. దానికి కామెడీ జోడించేసే సినిమాలు వస్తున్నాయి. సీరియస్‌గా ఉన్న సీన్స్‌లోనూ కామెడీ చొప్పిస్తే అది ఒకసారి వెగటు పుట్టిస్తుంది. సరిగ్గా ఈ సినిమా కూడా అలాగే ఉంది. కిడ్నాప్‌ చేసే జగ్గూభాయ్‌ పాత్ర కామెడీగా చూపించాడు. సీరియస్‌నెస్ లేకపోవడంతో పాత్ర తేలిపోయింది. హీరో కిట్టు ఉరఫ్‌ కృష్ణయ్య పాత్రలో ప్రేమలో కాసేపు దాగుడుమూతలు కథను ఆసక్తికరంగా నడింపించలేకపోయాయి. 
 
ఈనాటి అమ్మాయిగా ఫాస్ట్‌గా ఉండే పాత్రలో రెజీనా బాగా ఏక్ట్‌ చేసింది. నవ్వించే ప్రయత్నంలో డైరెక్ట్‌గా శృంగారపరమైన డైలాగ్‌లు పెట్టడం విచిత్రం. ఏదో ప్రాస కోసం ప్రాకులాడే క్రమంలో 'ఎండలో ఛిల్డ్‌ బీర్‌లా' ఉందంటూ హీరోయిన్‌ను చూస్తే అనిపించే డైలాగ్‌లు పక్కా మాస్‌ను దృష్టిలో పెట్టుకుని రాసినట్లుంది. ఇలా కొన్ని డైలాగ్‌లు కొరుకుడు పడవు. డా| కామేష్ చెప్పిన డైలాగ్‌లు కూడా అలాగే ఉంటాయి. 
 
అన్న తప్పుడు పనులు చేసేవాడు. తమ్ముడు స్వయంకృషితో పైకి రావలనుకునేవాడు. ఇద్దరికీ మధ్య విభేదాలు. మధ్యలో హీరోయిన్‌తో లవ్‌.. చివరికి ఆ హీరోయిన్‌తో కథ ముగింపు అనే కథలు కోకొల్లుగా తెలుగులో వచ్చాయి. దాన్ని కొత్తగా తీసుకురావడంలో దర్శకుడికి నేర్పు అవసరం. అందులో మహేష్‌ బాబు ఇంకా కృషిచేయాలి. ఏ సన్నివేశంలోనూ ప్రేక్షకుడు ఫీల్‌ కాకపోవడం చిత్రంలో ప్రధాన మైనస్‌. హీరో కొన్నిచోట్ల మహేష్‌ బాబు, పవన్‌ను అనుకరించడం వింతగా అనిపిస్తుంది. 
 
ఇతర హీరోలను బేస్‌ చేసుకుని సినిమాను నెగ్గుగు రావడం అనేది దర్శకులు మానుకోవాలి. మొదటిభాగం సరదాగా సాగినా.. రెండో భాగంలో వచ్చిన ట్విస్ట్‌లో సరైన ఫీల్‌ లేకపోవడంతో ఏదో కోల్పోయిన ఫీలింగ్‌ కలుగుతుంది. రెండున్నర గంటలపాటు సాగే ఈ సినిమా దాదాపు మూడుగంటల పైగా చూసిన ఫీలింగ్‌ మాత్రం కలుగుతుంది. మరి ఏమేరకు ప్రేక్షకులు ఆదరిస్తారో చూడాలి.