శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: శుక్రవారం, 27 మే 2016 (16:00 IST)

మరో 'పందెం కోడి'ని చూపించిన విశాల్ రాయుడు... రివ్యూ రిపోర్ట్

'రాయుడు' నటీనటులు: విశాల్‌, సూరి, రాధారవి, శ్రీదివ్య, ఆర్‌.కె. సురేష్‌, లీల తదితరులు; సాంకేతిక సిబ్బంది: కెమెరా: వేల్‌రాజా, సంగీతం: డి. ఇమాన్‌, బేనర్‌ అన్నగోపురం ఫిలిమ్స్‌, నిర్మాతలు: సురేష్‌, విశాల్‌, తెలుగులో హరి, కథ, కథనం, దర్శకత్వం: ముత్తయ్య. వి

'రాయుడు' నటీనటులు: విశాల్‌, సూరి, రాధారవి, శ్రీదివ్య, ఆర్‌.కె. సురేష్‌, లీల తదితరులు; సాంకేతిక సిబ్బంది: కెమెరా: వేల్‌రాజా, సంగీతం: డి. ఇమాన్‌, బేనర్‌ అన్నగోపురం ఫిలిమ్స్‌, నిర్మాతలు: సురేష్‌, విశాల్‌, తెలుగులో హరి, కథ, కథనం, దర్శకత్వం: ముత్తయ్య.
 
విడుదల: 27.5.2016
విశాల్‌ 'పందెం కోడి'తో తెలుగులో పరిచయమయ్యాడు. ఆ చిత్రంతో మాస్‌ హీరోగా పేరు పొందాడు. తర్వాత పలు చిత్రాలు చేసినా.. పదేళ్ళలో చాలామంది పందెంకోడి లాంటి సినిమానే తన నుంచి ఆశిస్తున్నట్లు విశాల్‌ చెబుతుండేవాడు. అందుకే ఈసారి ఆ ప్రయత్నంలో భాగంగానే.. పక్కా గ్రామంలోని మాస్‌ చిత్రానికి శ్రీకారం చుట్టాడు. మరుదు పేరుతో తమిళంలో ఈ నెల 20నే విడుదలైన ఈ సినిమాను తెలుగులో డిస్ట్రిబ్యూటర్‌ హరి 'రాయుడు'గా విడుదల చేశాడు. నైజాంలో దిల్‌రాజు ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ముత్తయ్య దర్శకత్వం తమిళంలో చేసిన ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం.
 
కథ: 
మధురైలోని రాజపాలెం అనే గ్రామం. తల్లిదండ్రులు లేని రాయుడు(విశాల్‌)ని అమ్మమ్మ మరియమ్మ (కొల్లాపులి లీలా) అన్నీ తానై పెంచుతుంది. అందుకే అమ్మమ్మ అంటే వల్లమాలిన అభిమానం. మార్కెట్‌లో లోడ్‌లను దించే కూలీగా రాయుడు పనిచేస్తాడు. భయమంటే తెలీనోడు. ఆడవారిని ఏడ్పిస్తే సహించడు. అలాంటి వ్యక్తి ఇంచుమించు అంతే ధైర్యవంతురాలైన భాగ్యలక్ష్మి (శ్రీదివ్య) ప్రేమలో పడతాడు. తను ఊరి లాయర్‌ కూతురు. భాగ్యలక్ష్మి లోకల్‌ గూండా, రాజకీయవేత్త అయిన రోలెక్స్‌(ఆర్‌కె సురేష్‌)పై కేసు వేస్తుంది.
 

రోలెక్స్‌ ఆ ఊరిని శాసించే రాజకీయవేత్త బల్వాన్‌(రాధారవి) అనుచరుడు. తన అక్రమాలన్నీ రోలెక్స్‌ చేత చేయిస్తాడు. దాంతో మార్కెట్‌ పదవులతో పాటు మరికొన్ని పదవులు రోలెక్స్‌కు కట్టబెడతాడు. ఆ అహంతో.. తనపై కేసు పెట్టిన భాగ్యలక్ష్మిని, అతని తండ్రిని చంపేందుకు వెంటాడతాడు. ఆ దృశ్యాన్ని చూసిన రాయుడు.. రౌడీలను తన్నితగలేస్తాడు. తను ప్రేమించిన భాగ్యలక్ష్మిని వారెందుకు చంపాలనుకుంటున్నారో తెలుసుకుని... వారిని కాపాడే బాధ్యత తనదిగా భావిస్తాడు. ఇద్దరూ పెండ్లి కూడా చేసుకుంటారు. అయితే.. కేసు వేయడానికి కారణం ఏమిటి? కేసుకు రాయుడుకు సంబంధం ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌:
విశాల్‌ మాస్‌ యువకుడిగా ఒదిగిపోయాడు. మళ్ళీ పందెంకోడి చిత్రంలోని ఆవేశం, ఆ ఎనర్జీ ఒక్కసారిగా కన్పించింది. యాక్షన్‌లో ఎమోషన్స్‌ బాగా చేశాడు. అతని అమ్మమ్మగా చేసిన కేరళ నటి లీల సింపుల్‌గా చేసింది. ఇక శ్రీదివ్య.. తన లుక్స్‌తోనూ నటించేసింది. మేకప్‌ లేకుండా డీగ్లామర్‌గా ఆమె చేసిన పాత్ర అలరిస్తుంది. మహిళకు వుండాల్సిన తెగింపు, తెగువ ఆమె పాత్రలో బాగా చూపించాడు. రాధారవి మేకవన్నె పులిగా బాగానే చేశాడు. ప్రధాన విలన్‌గా రోలెక్స్‌ పాత్రలో విలనిజం కన్పించింది. నిర్మాణంలో భాగస్వామితోపాటు నటుడిగా చేశాడు. ఇక మిగిలిన పాత్రలు కథ మేరకు బాగానే వున్నాయి.
 
టెక్నికల్‌గా..
ముందుగా వేల్‌రాజ్‌ కెమెరా గురించి చెప్పాలి. మారుమూల పల్లె ప్రాంతాల అందాల్ని ఉన్నది ఉన్నట్లు చూపించాడు. మేకప్‌ లేకుండా చూపించే విధానం బాగుంది. యాక్షన్‌ సన్నివేశాల్లో కెమెరా యాంగిల్స్‌ ఆకట్టుకున్నాయి. సంగీతం ఇమాన్‌.. జస్ట్‌ ఓకే. సాహిత్యం.. తమిళం టు తెలుగు ట్రాన్స్‌లేషన్‌ అయినా.. పదాలు బాగున్నాయి. 'ఒంటి జడా.. చిన్నదానా..' అనే టీజ్‌ సాంగ్‌తోపాటు అన్నీ పాటలు వినడానికి బాగున్నాయి. సంభాషణ పరంగా శశాంక్‌ తన శైలిలో రాసేశాడు. తమిళ సామెతలు కూడా కొన్ని జొప్పించాడు. ఉన్న గ్రామంలోని ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ తన పనితనాన్ని బాగా చూపించింది. అరసు యాక్షన్‌ సన్నివేశాలు మాస్‌ ప్రేక్షకుడ్ని ఆకట్టుకుంటాయి.
 
విశ్లేషణ:
కథగా చెప్పాలంటే.. ఇది పాత కథే. చెప్పేవిధానం కొత్తగా వుంటుందని.. మొదటి నుంచి విశాల్‌ చెబుతున్నది కరెక్టే అని చెప్పాలి. మాస్‌ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని సినిమాకు ఏమి కావాలో అవన్నీ ఇందులో వుండేలా జాగ్రత్త తీసుకున్నాడు. హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్‌ను బాగా డీల్‌ చేశాడు దర్శకుడు. ముఖ్యంగా అమ్మమ్మ, మనవుడు సెంటిమెంట్‌ను కట్టిపడేశాడు. విలన్‌కు హీరోకు మధ్య సన్నివేశాలు ఎమోషనల్‌గా దర్శకుడు బాగా డీల్‌ చేశాడు. అయితే క్రూరత్వం పేరుతో.. ఎంత క్రూరంగా చంపొచ్చో అదంతా చూపించాడు. శవాన్ని ముక్కలు ముక్కలుగా నరకడం.. వంటి సీన్లు.. సమాజంలో పలుచోట్ల జరుగుతూనే వున్నాయి. కథ అక్కడ నుంచి మొదలవుతుంది. ఆ చంపిది హీరోయిన్‌ తల్లినే.. కరాటే కనకమ్మగా ఆమె ఫేమస్‌.. ఊరిలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి.. దోపీడీదారుల చేతుల్లో చనిపోతుంది. 
బుక్ మై షో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 
గ్రామమే కాదు. సమాజంలో ఎక్కడ వున్నా.... పోలీసు స్టేషన్‌, యంత్రాంగం... రాజకీయనాయకుల తొత్తులుగా ఎలా పనిచేస్తుందో కళ్ళకు కట్టినట్లు మరోసారి చూపించాడు. రేషన్‌ దుకాణంలో అక్రమాలు.. కాలనీకి తాగునీరు వస్తే.. డబ్బులు వసూలు చేయడం వంటివన్నీ.. సమాజంలో జరుగుతున్న సంఘటనలే. ఇలాంటి కొన్ని సమాహారంగా తీసుకుని.. రాక్షసులైన రౌడీలకు... ఓ సామాన్యుడు ఎలాంటి బుద్ధి చెప్పాడనేది ఈ రాయుడు కథ. ఊర మాస్‌ చిత్రమిది... ఇలాంటి చిత్రాలు నచ్చేవారికి ఆకట్టుకుంటుంది. ఇక.. సూరి కామెడీ బాగుంది. విశాల్‌ తను ఐదవ సినిమా. పక్కా మాస్‌ కమర్షియల్‌ చిత్రంగా నిలుస్తుంది.
 
రేటింగ్‌: 2.5/5
బుక్ మై షో కోసం ఇక్కడ క్లిక్ చేయండి