శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By
Last Modified: శుక్రవారం, 27 మార్చి 2015 (17:01 IST)

'రేయ్‌' ఏంట్రా! ఈ గోల...?!! రివ్యూ రిపోర్ట్

రేయ్ విడుదల తేదీ : 27 మార్చి 2015.
రేయ్ నటీనటులు : సాయి ధరమ్‌ తేజ్‌, శ్రద్ధ దాస్‌, సయామీ ఖేర్‌.
సంగీతం :చక్రి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం : వైవిఎస్‌ చౌదరి.
 
రెండేళ్లుగా అదిగోఇదిగో అంటూ... పాకుతూ వచ్చిన 'రేయ్‌' సినిమా ఎట్టకేలకు శుక్రవారం విడుదలైంది. చిరంజీవి మేనల్లుడు మొదటి సినిమా కావడంతో ఫ్యాన్స్‌లో మరింత క్రేజ్‌ ఏర్పడింది. అందుకే ఎక్కడ లేని ఆర్భాటం థియేటర్లలో ఈరోజు కన్పించింది. వైవిఎస్‌ చౌదరి అన్నీ తానై ఈ సినిమాను తీశాడు. ఎక్కడో విదేశాల్లో కథ కోసం తీసుకెళ్ళాడు. హరోయిన్‌ను గ్లామర్‌గా వాడుకున్నాడు. విలన్‌‌గా శ్రద్ధదాస్‌ కనిపించింది. సయామీ ఖేర్‌ హీరోయిన్‌గా నటించింది. మరి రేయ్‌ ఎలా వుందో చూద్దాం.

 
కథ : అమెరికాలో పాప్‌ సింగర్‌ జెన్న(శ్రద్ధ దాస్‌). ప్రతిసారీ టైటిల్‌ తనకే రావాలనే కసి. ఇగోయిస్టు. హ్యాట్రిక్‌ కొట్టాలనుకునే మూడో పోటీలో ఇండియా నుంచి వచ్చిన సాండీ(షానవాజ్‌) గట్టి పోటీని ఇస్తాడు. ఇంకోవైపు అమెరికన్‌ డాన్‌ డాంగే(అర్పిట్‌ రాంఖా) సాండీని చంపేస్తాడు. సాండీ చెల్లెలైన అమృత(సయామీ ఖేర్‌) తన అన్నయ్య కోరికను నెరవేర్చి బెస్ట్‌ అఫ్‌ వరల్డ్‌ టైటిల్‌ గెలుచుకోవాలని అమెరికా వస్తుంది. ఆ కాంపిటీషన్‌‌లో ప్లేస్‌ సంపాదించడం కోసం జమైకా లోని ఓ మ్యూజికల్‌ కాలేజ్‌‌లో చేరుతుంది. 
 
అక్కడే రాక్‌ (సాయిధరమ్‌)   తన ఫ్రెండ్స్‌‌ని అమృత గ్రూప్‌‌లో వేస్తాడు. కానీ రాక్‌ బ్యాచ్‌ సీరియస్‌‌గా తీసుకోరు. కానీ ఓ రోజు మాఫియా డాన్‌ డాంగే చేసిన పనివల్ల రాక్‌ ఇగో హార్ట్‌ అవ్వడంతో జెన్నకి పోటీగా బెస్ట్‌ ఆఫ్‌ వరల్డ్‌ కాంపిటీషన్‌‌కి వెళ్ళాలని సిద్దమవుతాడు. కానీ ఆ కాంపిటీషన్‌‌లో పాల్గొనడానికి అన్ని దారులు మూసుకుపోతాయి. అప్పుడు మన హీరో రాక్‌ ఏం చేసాడు.? ఎలా బెస్ట్‌ ఆఫ్‌ వరల్డ్‌ కాంపిటీషన్‌‌లో చోటు సంపాదించాడు.? ఆ తర్వాత ఏమయింది? అనేది సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌.. సాయి ధరమ్‌ తేజ్‌ లుక్స్‌లో చిరంజీవి లోని కొన్ని కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా డాన్సులు చేయడంలో, రిస్క్‌ చేసి స్టంట్స్‌ చేయడంలో చిరులోని ఈజ్‌ కనిపిస్తుంది. మొదటి సినిమాలోనే నటన పరంగా కూడా చాలా వరకూ మెప్పించాడు. ఇక శ్రద్దాదాస్‌ పాప్‌ సింగర్‌గా బాగానే చేసింది. ఆ పాత్రకు ఆమె సరిపోయింది. తను పాత్ర కోసం 10 కేజీలు తగ్గడం... కష్టపడటం ఆమెకు మంచి మార్కులే వస్తాయి. వైవిఎస్‌ చౌదరి హీరోయిన్లను అందంగా చూపించడంలో దిట్ట. శ్రద్ధ దాస్‌ ఇంత గ్లామరస్‌‌గా ఇప్పటివరకూ కనిపించలేదు. దేవదాసులో ఇలియానాను చూపించినట్లుగా ఇందులో సయామీ ఖేర్‌ అందాలను దర్శకుడు చూపించాడు. డాన్‌‌గా అర్పిత్‌ రాంఖా పెర్ఫార్మన్స్‌ కూడా బాగుంది. ఇక సీనియర్‌ నరేష్‌, హేమల ట్రాక్‌ ఆడియన్స్‌‌ని నవ్విస్తుంది. తనికెళ్ళ భరణి హీరోయిజం ఎలివేట్‌ చేసే సీన్‌‌లో చాలా బాగా చేసాడు. 
 
సాంకేతిక విభాగం : 
గుణశేఖరన్‌ సినిమాటోగ్రఫీ హైలైట్‌. కరేబియన్‌ నేటివిటీని చూపించాలి. అక్కడి బ్యూటిఫుల్‌ లోకేషన్స్‌‌ని ఆకర్షణీయంగా తెరపై చూపించాడు. అలాగే హీరోయిన్స్‌‌ని డైరెక్టర్‌ అనుకున్నట్టుగా మోడ్రన్‌‌గా, గ్లామరస్‌‌గా చూపించడంలోనూ సక్సెస్‌ అయ్యాడు. ఇదొక మ్యూజిక్‌ అండ్‌ డాన్స్‌ బేస్‌ సినిమా..  సీట్లలో కూర్చున్న ఆడియన్స్‌ చేత డాన్సులు చేయించాలి. ఆడియన్స్‌ చేత డాన్సులు చేయించే రేంజ్‌ లోనే రాజు సుందరం, ప్రేమ్‌ రక్షిత్‌, జానీ, శేఖర్‌, భానోదయ మాస్టర్స్‌ స్టెప్స్‌ కంపోజ్‌ చేసారు.
 
అయితే, ఇటీవలే మరణించిన చక్రి అందించిన పాటలు విన్నప్పుడు యావరేజ్‌‌గా అనిపించినా ఆన్‌ స్క్రీన్‌ చూసేటప్పుడు చాలా బాగా అనిపిస్తాయి. కానీ పాటలకి సందర్భం కూడా కలిసి ఉంటే బాగుండేది. ఇక బ్యాక్‌‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ విషయానికి వస్తే పాత్రల లానే అక్కడక్కడా మరింత లౌడ్‌‌నెస్‌ ఉంది. మిగతా అంతా డీసెంట్‌‌గా అనిపిస్తుంది. కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్‌ పరంగా చాలా కేర్‌ తీసుకోవాల్సింది. సినిమాని మరీ లెంగ్తీగా కట్‌ చేసారు. అలాగే కొన్ని సాంగ్స్‌‌ని కూడా సరిగా ఎడిట్‌ చెయ్యలేదు. ఈయన ఫస్ట్‌ హాఫ్‌‌లో వచ్చే కొన్ని సాగదీసిన సీన్స్‌ మాత్రం కట్‌ చేసి ఉంటే చాలా రిలీఫ్‌‌గా ఉండేది. రఘు కులకర్ణి ఆర్ట్‌ వర్క్‌ కూడా ఈ సినిమాకి గ్రాండ్‌‌నెస్‌ తెచ్చింది.
 
విశ్లేషణ: 
సినిమాకు కథ చాలా ముఖ్యం. అది ఈ చిత్రంలో లోపించింది. కేవలం హీరోయిన్ల అందాలు, విదేశాల్లో డాన్స్‌లు పెట్టి యూత్‌ను ఎట్రాక్ట్‌ చేయాలనుకోవడం భ్రమే అవుతుంది. హీరో ఇంట్రడక్షన్‌ వచ్చే టైంకి సినిమాలో కథ -స్క్రీన్‌ ప్లే ఆడియన్స్‌‌కి అర్థమైపోతుంది. మొదటి 20 నిమిషాల నుంచి ఇంటర్వల్‌ బ్లాక్‌ వరకూ ఆడియన్స్‌‌కి చాలా బోర్‌ కొడుతుంది. కొన్నిచోట్ల  మళ్ళీ స్లో.. ఇలా సాగుతుంది. దాని వలన ఆడియన్స్‌ కంటెంట్‌‌కి కనెక్ట్‌ అవ్వరు.
 
ఇక దర్శకుడు తెలుగువారికి కరేబియన్‌ కల్చర్‌ చూపించాలని తపించాడు. కరేబియన్స్‌ లౌడ్‌ ఎక్స్‌‌ప్రెషర్స్‌ కావచ్చు కానీ మరీ ఆ రేంజ్‌లో చూపిస్తే తెలుగు ప్రేక్షకులకు మోతాదు మరీ ఎక్కువైంది అనిపిస్తుంది. అందుకే కాస్త తగ్గించి ఉండాల్సింది. అయితే హీరోహీరోయిన్ల రొమాంటిక్‌ ట్రాక్‌ చాలా బోరింగ్‌‌గా ఉంటుంది. అలీ, వేణు మాధవ్‌, రఘుబాబులను పెట్టినా వాళ్ళు నవ్వించకపోగా విసుగు తెప్పిస్తారు. పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌ బాబు, ఎన్‌.టి.ఆర్‌‌లపై చేసిన 3 ఇంటెలిజెంట్స్‌ అనే సినిమా స్పూఫ్‌ కూడా పెద్దగా మెప్పించలేదు. ఇటువంటి చిత్రం యూత్‌కు కనెక్ట్‌ కావడం కష్టమే... ఓ సందర్భంలో రేయ్‌, ఒరేయ్‌ అంటూ.. హీరోయిన్‌ మాస్‌లా బిహేవ్‌ చేస్తుంది. ప్రేక్షకుడు కూడా రేయ్‌.. ఏంటీ ఈ గోల అనే స్థితికి వస్తాడు. సో.. బిలో బిలో ఏవరేజ్‌ సినిమా ఇది. కేవలం బి,సి సెంటర్ల కోసమే తీశానని చెప్పిన చౌదరికి మరి వాళ్ళు కూడా ఎటువంటి తీర్పు ఇస్తారో చూడాల్సిందే. 
 
రేటింగ్‌: 2/5