శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Updated : శనివారం, 2 జులై 2016 (16:59 IST)

ఏఎన్నార్ 'రోజులు మారాయి' టైటిల్ పెట్టి బాదేశారు... రివ్యూ రిపోర్ట్

ఈరోజుల్లో.. బస్టాండ్‌ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన మారుతీ... తన దగ్గర పనిచేసిన మురళీకి అవకాశాన్ని ఇస్తూ ఓ కథను రాసుకున్నాడు. అమ్మాయిలు ఓ అబ్బాయిని హత్య చేశారనే.. వార్త దినపత్రికల్లో రావడంతో.. దాన్

రోజులు మారాయి నటీనటులు : చేతన్‌, పార్వతీశం, కతిక, తేజస్వి; సంగీతం : జె.బి. నిర్మాత : జి. శ్రీనివాసరావు, దర్శకత్వం: మురళి
 
ఈరోజుల్లో.. బస్టాండ్‌ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన మారుతీ... తన దగ్గర పనిచేసిన మురళీకి అవకాశాన్ని ఇస్తూ ఓ కథను రాసుకున్నాడు. అమ్మాయిలు ఓ అబ్బాయిని హత్య చేశారనే.. వార్త దినపత్రికల్లో రావడంతో.. దాన్ని చూసి ఇన్‌స్పైర్‌ అయి కథ, స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు. ఇందులో పాత్రల ఎంపికలో భాగంగా దిల్‌ రాజు ఆఫీసుకు వెళితే.. కథ విన్న వెంటనే.. దిల్‌రాజు తాను చిత్రాన్ని సమర్పిస్తానని చెప్పాడు. ఈ ఇద్దరు కలవడంతో.. సినిమాపై ఓ క్రేజ్‌ ఏర్పడింది. శ్రేయాస్‌ శ్రీనివాస్‌లతో కలిసి నిర్మించిన సినిమా 'రోజులు మారాయి'. మరి ఇప్పటి యువత ఎలా వుందని చెప్పాడో చూద్దాం.
 
కథ :
ఒకే హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగాలు వారు చేసుకునే ఆద్య(కతిక), రంభ (తేజస్వి)లకు ప్రేమ విషయంలో క్లారిటీ వుంటుంది. అయితే.. తమ అవసరాల కోసం ఇద్దరు బకరాలను వెతుకుతారు. అశ్వద్‌ (చేతన్‌), పీటర్‌ (పార్వతీశం)లు దొరకడంతో.. వారితో చిన్నపాటి ఖర్చులూ పెట్టిస్తారు. కాగా, తమకు కాబోయే భర్తలు.. పెండ్లయ్యాక చనిపోతారని శ్రీశైలంలో ఓ బాబా చెప్పడంతో వీరు ఆలోచనలో పడతారు. అప్పుడు వారికి తట్టిన ఆలోచనే.. బకరాలుగా దొరికిన వారిని పెండ్లాడేస్తారు. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలతో భర్తలను చంపేస్తారు. అలా ఎందుకు చేశారు? తర్వాత ఏం జరిగింది? అనేది సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌:
నటీనటుల్లో పార్వతీశం తన కామెడీ టైమింగ్‌తో, డైలాగ్‌ డెలివరీతో తీసుకొచ్చాడు. చేతన్‌ ఇంతకుముందు ఓ సినిమాలో చేసినట్లే సాఫ్ట్‌ పాత్రలో కన్పించాడు. కతిక పాత్ర చాలా కాంప్లికేటెడ్‌. ఒకేసారి రెండు కోణాల్లోనూ ఆలోచించే ఈ పాత్రలో ఆమె మంచి ప్రతిభ చూపింది. ఇక తేజస్వి సీనియర్‌ నటి. టైమింగ్‌, చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌ను పలికించడంలో కూడా చూపిన ప్రతిభ చాలా బాగుంది. మిగిలిన కొద్దిపాటి పాత్రలు పోసాని, రాజీ రవీంద్ర, వాసు, అలీ పర్వాలేదు అనిపించాడు.
 
సాంకేతిక పనితీరు:
కెమెరా సాదాసీదాగా వుంది. మారుతి కథ, స్క్రీన్‌ప్లే బాగుంది. ఇలాంటి కథను సినిమాగా మార్చే ప్రక్రియలో మారుతి ఫస్టాఫ్‌లో బాగా డీల్‌ చేశాడు. కానీ సెకండాఫ్‌కి వచ్చేసరికి పరమ రొటీన్‌గా మార్చేసి, చివర్లో అనవసర డ్రామా పెట్టి సాదాసీదాగా మార్చేశాడు. కొత్త దర్శకుడు మురళి సినిమాను బాగానే తెరకెక్కించాడు. దర్శకుడిగా ఇంటర్వెల్‌ బ్లాక్‌లో మురళి మంచి ప్రతిభ చూపాడు. సెకండాఫ్‌ విషయంలో మేకింగ్‌ పరంగా చెప్పుకోదగ్గ సన్నివేశాలేవీ లేవు. జె.బీ సంగీతం మూసధోరణిలో వుంది.  బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. రవి నంబూరి మాటలు బాగున్నాయి. ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌ కూడా ఎక్కడా చిన్న సినిమా అన్న ఫీల్‌ తెప్పించకుండా బాగున్నాయి.
 
విశ్లేషణ:
సినిమా కథ మొదలైన 15 నిముషాలకే.. తర్వాత ఏం జరిగిపోతుందో తెలిసిపోతుంది. దాంతో ట్విస్ట్‌లు ఏమీ వుండవని ప్రేక్షకుడు డిసైడ్‌ అయిఓతాడు. అమ్మాయిలు క్రిమినల్‌ మెంటాలిటీ చూపించాడు. బహుశా పేపర్లలో వచ్చిన వార్తను తన మైండ్‌సెట్‌లో రాసేసుకున్నాడు. సాధారణంగా అమ్మాయిల కోణం నుంచి ఈ తరహా కథలను చెప్పడానికి ఎవ్వరూ పెద్దగా సాహసించరు. మారుతి అలాంటి సాహసాన్నే, అందరికీ కనెక్ట్‌ అయ్యే కామెడీతో, ఈతరం ప్రేమల్లోని ఓ కోణాన్ని ప్రస్తావిస్తూ చెప్పడం పర్వాలేదు ఇక ఫస్టాఫ్‌లో కామెడీని ఈ సినిమాకు మేజర్‌ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. టైటిల్స్‌ దగ్గర్నుంచే కథలోకి తీసుకెళ్ళడం, ఆ తర్వాత వరుసగా ఇద్దరు వ్యక్తుల కథల నుంచి పుట్టే కామెడీని సరిగ్గా వాడుకోవడం ఇవన్నీ కట్టిపడేసేలా ఉన్నాయి.
 
ఇక ఫస్టాఫ్‌ తర్వాత రోజులు మారాయి సినిమా అంతా మళ్ళీ రొటీన్‌గా మారిపోయింది. ఈ సెకండాఫ్‌ మొత్తంలో పెద్దగా ఎగ్జైటింగ్‌ అంశాలేవీ లేవు. 'దశ్యం' ఎపిసోడ్‌, అలీ కామెడీ.. ఇవన్నీ కథను ముందుకు ఎలా నడపాలో తెలియక పెట్టినట్లు కనిపించింది. ఫస్టాఫ్‌లోనే అసలు కథంతా చెప్పడం, సెకండాఫ్‌ కోసం దాచిపెట్టిన ఒక్క ట్విస్ట్‌ కూడా ముందే తెలిసిపోయేంత సాదాసీదాగా ఉండడం లాంటి అంశాల వల్ల సెకండాఫ్‌లో సినిమా గాడి తప్పింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చేసరికి ప్రేక్షకుడికి ఇదేదో నసలా అనిపిస్తుంది. ప్రత్యేకత ఏం వుండదు. కథంతా మొదటిభాగంలో వుండటంతో దర్శకుడు మురళి.. తను చెప్పే విధానం సరిగ్గా లేదు. ఏదో ప్రత్యేకత వుందని వెళ్ళేవారికి నిరాశే మిగులుతుంది. పాత రోజుల్లో ఎఎన్‌ఆర్‌.. చేసిన 'రోజులు మారాయి' వంటి టైటిల్‌ పెట్టి.. ఇప్పటి తరానికి కనీసం సందేశమన్నా చెప్పకుండా.. కేవలం అమ్మాయిలు అబ్బాయిల్ని చంపడం అనే కాన్సెప్ట్‌తో బోర్‌ కొట్టించేశాడు.