శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ivr
Last Modified: శుక్రవారం, 28 నవంబరు 2014 (20:32 IST)

ఆది.. నిజంగా 'రఫ్‌' ఆడించాడా...? రివ్యూ రిపోర్ట్

రఫ్ మూవీ నటీనటులు: ఆది, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, స్వర్గీయ శ్రీహరి, కాశీవిశ్వనాథ్‌, సుహాసిని, అజయ్‌, సుప్రీత్‌, భరణి, రఘుబాబు మొదలైనవారు; కెమెరా: సెంథిల్‌ కుమార్‌, సంగీతం: మణిశర్మ, మాటలు: మరుధూరి రాజా, నిర్మాత: అభిలాష్‌ మాధవర్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుబ్బారెడ్డి.
 
'ప్రేమకావాలి' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన సాయికుమార్‌ నటవారసుడు ఆది. ఆ తర్వాత ఐదారు చిత్రాలు చేసినా పెద్దగా ఫలితం లేకపోయింది. కథల ఎంపికలో కొత్తదనం లోపించినట్లు కన్పిస్తుంది. కానీ ఈసారి ఆ లోపం లేకుండా జాగ్రత్తపడ్డానని చెబుతూ తీసిన చిత్రమే 'రఫ్‌'. రెండేళ్ళనాడు సినిమాను ఆరంభించి, కొన్ని ఆటుపోట్లమధ్య రిలీజ్‌ అయిన ఈ సినిమా ఆది చెప్పినట్లే వుందా? లేదా? చూద్దాం.
 
కథ: 
చందు (ఆది) ఈనాటి జనరేషన్‌. అంటే దేన్నీ సీరియస్‌గా తీసుకోకుండా తనకు నచ్చినట్లే బతికేయాలనుకునేవాడు. తొలిచూపులోనే నందిని(రకుల్‌ప్రీత్‌సింగ్‌)ని ప్రేమించేస్తాడు. పెద్దల్ని ఒప్పించి పెండ్లి చేసుకోవాలనే లాజిక్కుతో ఆమె అన్న సిద్దార్థ(శ్రీహరి)కే డైరెక్ట్‌గా ప్రేమ విషయం చెప్పేస్తాడు. ససేమిరా అనడంతో.. ఛాలెంజ్‌గా స్వీకరించి సిద్ధార్త్‌పై సవాల్‌ విసిరి నీ చెల్లెల చేత ఐలవ్‌వ్యూ అని చెప్పిస్తానని అంటాడు. ఆ తర్వాత సిద్ధార్త్‌ ఏం చేశాడు? చందు ఎలాంటి ప్లాన్‌లు వేశాడు? అన్నది కథ.
 
పెర్‌ఫార్మెన్స్‌ 
సాఫ్ట్‌గా లవ్‌ చిత్రాలు చేసే ఆది ఈసారి టైటిల్‌కు తగినట్లే మాస్‌ ప్రేక్షకుల్ని మెప్పించాలని రఫ్‌గా కన్పించాడు. అందుకు బాడీ కూడా పెంచేశాడు. సిక్స్‌ ప్యాక్‌ చూపించాడు. దానికి తగినట్లు ఫైట్లు బాగా చేశాడు. అయితే ఇతర హీరోల చిత్రాల శైలిలో డైలాగ్‌లు పలికాడు. 'నా ఫ్యామిలీ జోలికివస్తే.. సముద్రంలో పారేవి శంఖాలు కాదు, మీ శవాలు..' అనే భారీ డైలాగ్‌లు తనకు సూట్‌ కాలేదు. శ్రీహరి తనదైన శైలిలో చేసేశాడు. సినిమా అంతా కన్పిస్తాడు. అయితే సినిమాకు పెద్ద లాభం లేకుండా పోయింది. హీరోయిన్‌గా ఆమె పాత్ర పరిమితమే. 
 
టెక్నికల్‌గా.... 
కెమెరా నైపుణ్యం చూపే సెంథిల్‌కు ఇది యాక్షన్‌ సినిమా కావడంతో పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్‌ సంగీతం సోసోగానే వుంది. ఇలాంటి కథలకు ఆయన ట్యూన్స్‌ సరికావు. ఇందులో ఎడిటర్‌ పెద్ద పని. చాలాచోట్ల ఏమి కట్‌ చేయాలో తెలీకుండా పోయింది. అంటే దర్శకుడు అంత ఎక్కువగా తీసేశాడు. మరుధూరి రాజా పంచ్‌ డైలాగ్‌ కోసం ప్రాకులాడాడు. కొన్ని చోట్ల పర్వాలేదు అనిపిస్తాయి. దర్శకుడిగా సుబ్బారెడ్డి మరింతగా పరిణతి చెందాల్సి వుంది.
 
విశ్లేషణ 
కొత్తగా అవకాశం కోసం ఎదురుచూసే దర్శకుడికి హీరో అవకాశం ఇస్తే దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అది దర్శకుడి లోపం. ఈ కథలో అన్నిచోట్లా కన్పిస్తుంది. కథ పాతదనం. ట్విస్ట్‌ల పేరిట నూతనత్వం లేకపోవడం. హీరో ఇంట్రడక్షన్‌ను రొటీన్‌ మూస చిత్రాల తరహాలోనే చూపించేశాడు. ఈనాటి జనరేషన్‌కు.. హీరో వస్తే.. ఫైట్లు, డాన్స్‌లు కావాలా? కథలో ఎక్కడా కొత్తదనం కన్పించదు. దీనికితోడు డైలాగ్‌లో చిరంజీవి పేరును వాడుకున్నాడు. నేనసలే మెగాస్టార్‌ ఫ్యాన్‌ను రఫ్పాండిచేస్తా..అంటాడు. రఫ్‌ అనే మాట చిరంజీవి చిత్రంలోని డైలాగ్‌. దాన్నే టైటిల్‌గా పెట్టేశాడు. 
 
ఇది కాకుండా హీరోహీరోయిన్ల ప్రేమ ఓ గేమ్‌లా వుంటుంది. అమ్మాయి అన్నయ్య దగ్గరకు వెళ్లి ఛాలెంజ్‌ చేసి మరీ ప్రేమించడం చిత్రంగా అన్పిస్తుంది. దాని కోసం హీరో పడే పాట్లు ఎట్రాక్ట్‌గా ఉండవు. దర్శకుడు తనకిష్టం వచ్చినట్లు రాసుకున్న కథకు హీరో అంతే రేంజ్‌లో నటించాడు. దేశ రాజధానిలో చక్రం తిప్పే లెవల్లో వుండే హీరోయిన్‌ అన్నయ్య గల్లీ హీరో వేసే ఎత్తులతో తల పట్టుకుంటాడు. సిక్స్‌ప్యాక్‌ పెంచాడు కదా అని ఫైట్‌ పెట్టించాడు.  హీరోగా తను మాస్‌ ప్రేక్షకుల్ని అలరించాలని చేసిన ప్రయత్నమే మినహా మరేమీకాదు. ఇందుకు దర్శకుడు చాలా మెచ్యూర్డ్‌ కావాలి. భారీ చిత్రం పేరుతో ఫైట్లు, డాన్స్‌లు వుంటే సరిపోదు. ప్రేక్షకుడు కూర్చుని చూసేట్లుగా వుండాలి. లేదంటే.. ప్రేక్షకులు నిజంగానే రఫ్‌ ఆడించేస్తారు.