శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ivr
Last Modified: శుక్రవారం, 21 నవంబరు 2014 (16:02 IST)

'రౌడీ ఫెలో' ప్రేక్షకుల ఇగోకు పరీక్షా...? రివ్యూ రిపోర్ట్...

రౌడీ ఫెలో నటీనటులు: నారా రోహిత్‌, రావు రమేష్‌, విశాఖ సింగ్‌, ఆహుతి ప్రసాద్‌, అజయ్‌, పోసాని, సుప్రీత్‌, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు; కెమెరా: ఓం, సంగీతం: సన్నీ, నిర్మాత: టి. ప్రకాష్‌ రెడ్డి, కథ, మాటలు, దర్శకత్వం: కృష్ణ చైతన్య.
 
నారోహిత్‌ సినిమా అంటే 'బాణం' గుర్తుకువస్తుంది. ఎమోషనల్‌గా చాలా సైలెంట్‌గా స్క్రీన్‌ప్లేతో మంచి సినిమాగా గుర్తింపు పొందింది. నటుడిగా కొత్త కుర్రాడు వచ్చాడనుకున్నారు. తర్వాత ఐదు చిత్రాలు చేసినా అవేమీ అంత పేరు తేలేకపోయాయి. ఏడవ చిత్రంగా 'రౌడీ ఫెలో'ను చేశాడు. దర్శకుడిగా మారిన రచయిత కృష్ణచైతన్య చేసిన తొలిప్రయోగం ఎలా వుందో చూద్దాం.
 
కథగా చెప్పాలంటే... 
రాణా ప్రతాప్‌(నారారోహిత్‌) అమెరికాలో బాగా డబ్బు సంపాదించి ఇండియా వస్తాడు. తన ఇగోను ఎవరైనా హర్ట్‌ చేస్తే మూడేళ్ళయినా గుర్తుంచుకుని వారి పనిపడతాడు. అలాంటి రాణాను ఓ రౌడీ కోసం ఎసిపి ఆహుతి ప్రసాద్‌ హర్ట్‌ చేస్తాడు. ఇంకేముంది... ఏకంగా ఎస్‌పి అవ్వడం కుదరదు కనుక దొడ్డిదారిలో ఎస్‌ఐగా ఈస్ట్‌గోదావరికి వస్తాడు. అయితే పక్క ఊరిలోనే వున్న ఎసిపి పరిధిలోకి మార్చుకుంటాడు. ఆ ఊరిని 30 ఏళ్ళుగా శాసిస్తూ వారి కష్టాన్ని దోచుకుతింటూ ఎం.పి. అయిన దుర్గాప్రసాద్‌ (రావు రమేష్‌)కు తలనొప్పిగా మారతాడు. తను చేసే చట్టవ్యతిరేక పనుల్ని బయటపెట్టి మంత్రి పదవి రాకుండా చేస్తాడు. ఎందుకు అలా చేస్తున్నాడు? దీని వెనుక ఏదైనా కథ వుందా? అనేది సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌ 
నటుడిగా నారా రోహిత్‌ ఏడు సినిమాలు చేసినా బాణం నుంచి ఎలా వుందో అలాగే ఆయన డైలాగ్‌ మాడ్యులేషన్‌ వుంది. తన బాడీ లాంగ్వేజ్‌కు పోలీసు పాత్ర సూటయినా... నటుడిగా షేడ్స్‌ చూపించడంలో ఇంకా చాలా పలికించాల్సి వుంది. రఫ్‌ పాత్రలకు ఆయన సూటవుతాడు. ఇక ఊరిలో బూతు చిత్రాలను నడిపే టూరింగ్‌ టాకీస్‌ ఓనర్‌గా సిల్కు బాబు పాత్రలో పోసాని నవ్విస్తాడు. మంత్రి కావాలనుకునే తపించే ఈనాటి రాజకీయ నాయకుడిగా రావు రమేష్‌ సరిపోయాడు. ఆయన బావమరిదిగా అజయ్‌. కరెప్టెడ్ పోలీసుగా సుప్రీత్‌ సరిపోయాడు. తాత పాత్రలో గొల్లపూడి మారుతీరావు మెప్పిస్తాడు. విశాఖ సింగ్‌ పాత్ర నామమాత్రమే.
 
టెక్నికల్‌ 
దర్శకుడిగా కొత్త అయినా కృష్ణ చైతన్య స్క్రీన్‌ప్లేను చాలా గ్రిప్‌గా మార్చాడు. ఎక్కువగా హాలీవుడ్‌ చిత్రాల నెరేషన్‌ కన్పిస్తుంది. సంభాషణ పరంగా కొన్ని ప్రాసల కోసం పాకులాడారు. ఓం కెమెరా, సన్నీ సంగీతం పర్వాలేదు. 
 
విశ్లేషణ 
సినిమా కథే ఇగో పైనే మొదలవుతుంది. అలాంటి ఇగోకు ముగింపు సరిగ్గా వుండదు. పోలీసు కావాలనే ఇగో వల్లే లక్షలు ఖర్చు పెట్టి సంపాదిస్తాడు. తను డీల్‌ చేసిన కేసు గెలిస్తే... వాళ్ళ నాన్న కోట్ల విలువ చేసే కారు ఇస్తాడు. ఇలా తనో పెద్ద మిలియనీర్‌గా ట్రీట్‌ చేసినా.. అసలు అతనెవరు? అనేది ఎక్కడా చెప్పడు. ముగింపు కూడా షడెన్‌గా ముగిస్తాడు.
 
కేవలం ఇగో హర్ట్‌ అయింది. మా గ్రామానికి వచ్చి నన్ను టార్గెట్‌ పెట్టుకున్నావని రావు రమేష్ అంటాడు. అయితే అక్కడ సంభాషణలు చాలా ఆలోచింపజేసేవిగా వుంటాయి. చదువులేని ప్రజల్ని శాసించడమే నా ఇగో. దాన్ని హర్ట్‌ చేస్తే వదలను అంటాడు విలన్‌. ఇలా చివరికి అతన్ని చంపి ఊరిని బాగు చేస్తాడు. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమా కాకుండా కొత్తగా చూపించాలనే ప్రయత్నం చేశాడు. అయితే చిత్రంలో హీరో పాత్ర ఇంకా మెరుగు పడాల్సివుంది. స్లోగా కన్పించే నారా రోహిత్‌కు తగిన చిత్రం ఇది. నడక కూడా అలాగే ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడ్ని అభినందించాలి. ముగింపు, హీరో నటన తప్పితే ఈ చిత్రం మాస్‌ ప్రేక్షకులు బి,సి. సెంటర్లకు నచ్చవచ్చు. లేదంటే ప్రేక్షకుల ఇగో హర్ట్‌ చేస్తే ఆడకపోవచ్చు కూడా.
 
రేటింగ్‌:2.5/5