శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: శుక్రవారం, 29 జనవరి 2016 (19:07 IST)

'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు'తో క్రికెట్‌కు లింకేంటి...? రివ్యూ రిపోర్ట్

సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు నటీనటులు : రాజ్‌ తరుణ్‌, అర్తన బిను. సంగీతం : గోపీ సుందర్‌, దర్శకత్వం : శ్రీనివాస్‌ గవిరెడ్డి
 
నిర్మాత : ఎస్‌.శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్‌ రెడ్డి, హరీష్‌ దుగ్గిశెట్టి.
 
నువ్వే కావాలి చిత్రం పాయింట్‌ తీసుకుని 'ఉయ్యాల జంపాల'గా నటించిన రాజ్‌ తరుణ్‌ ఆ చిత్రంలో సక్సెస్‌ హీరోగా నిలిచాడు. ఆ తర్వాత 'సినిమా చూపిస్త మావా', 'కుమారి 21ఎఫ్‌'. ఇలా హ్యాట్రిక్‌ ఫీట్‌ను కెరీర్‌ ప్రారంభంలోనే సొంతం చేసుకున్న హీరో రాజ్‌ తరుణ్‌, 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' అంటూ సక్సెస్‌ ట్రాక్‌ను కొనసాగించే ఆలోచనతో మరో లవ్‌స్టోరీతో సిద్ధమైపోయారు. రాజ్‌ తరుణ్‌ తన స్నేహితుడు శ్రీనివాస్‌ గవిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు విడుదలైంది. అదెలా వుందో చూద్దాం..
 
కథ :
రామచంద్రాపురం అనే ఊర్లో హైస్కూల్‌ నుంచి స్నేహితులతో అల్లరిగా తిరిగే శ్రీ రామ్‌(రాజ్‌ తరుణ్‌), చిన్నప్పట్నుంచీ అదే ఊర్లో ఉండే సీతా మహాలక్ష్మి(అర్తన)ని అమితంగా ప్రేమిస్తూంటాడు. అయితే క్రికెట్‌ అంటే పిచ్చి. మహాలక్ష్మికి తనవల్ల దెబ్బ తగిలిందని తెలిసి క్రికెట్‌కు గుడ్‌బై చెబుతాడు. అయినా చదువు పెద్దగా అబ్బదు. ఇంకా ఇంటర్‌మీడియ్‌లోనే కుస్తీ పడుతుంటే మహాలక్ష్మి సిటీలో ఎం.బి.బి.ఎస్‌ చేసి సెలవులకు ఊరికి వస్తుంది. 
 
ఇక అప్పటినుంచి ఆమె ప్రేమకోసం తాపత్రయపడతాడు. బెడిసికొడుతుంది. తిడుతుంది. కానీ ప్రేమ విషయంలో తన మంకు వీడడు. మహాలక్ష్మి తండ్రి ఊరి సర్పంచ్‌. ప్రెస్టీజ్‌ ఫీలింగ్‌. తన కోరిక మేరకు ఓ క్రికెటర్‌కు కూతుర్ని ఇవ్వాలన్నది ఎయిమ్‌. ఢిల్లీ క్రికెటర్‌ను ఫిక్స్‌ చేస్తాడు. విషయం తెలిసిన శ్రీరామ్‌ అక్కడికి వెళ్ళి.. మహాలక్ష్మిని వదులుకోమంటాడు. ఇద్దరిమద్య వాగ్వాదం జరిగి తనతో క్రికెట్‌ ఆడి గెలిస్తేనే మహాలక్ష్మి దక్కుంతుందని పందెం వేస్తాడు. ఆ పందెం కోసం శ్రీరామ్‌ ఏం చేశాడు? అన్నదే సినిమా.
 
సాంకేతిక విభాగం :
మాటలు అనీల్‌ మల్లెలతో కలిసి శ్రీనివాస్‌ రాసిన డైలాగ్స్‌ ఇప్పటి యూత్‌ను అలరిస్తాయి. సంగీత దర్శకుడు గోపీ సుందర్‌. మళయాలంలో సెన్సేషనల్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అయిన గోపీ సుందర్‌, తెలుగులో ఇప్పటివరకూ చేసిన సినిమాల్లానే ఈ సినిమాలోనూ పాటలన్నీ బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ పరంగానూ గోపీ సుందర్‌ బాగా ఆకట్టుకుంటాడు. విశ్వ సినిమాటోగ్రఫీ బాగుంది. కథకు తగ్గ మూడ్‌ను క్యారీ చేస్తూనే గ్రామీణ వాతావరణాన్ని ప్రేమకథ నేపథ్యానికి చక్కగా సెట్‌ చేశాడు. ఇక ఎడిటర్‌ కార్తీక శ్రీనివాస్‌ పనితనం ఆకట్టుకునేలా లేదు.
 
పెర్‌ఫార్మెన్స్‌:
కథంతా రాజ్‌ తరుణ్‌పైనే నడుస్తుంది. ప్రతీ ఫ్రేమ్‌లోనూ అతడే కన్పిస్తాడు. తన బాణీలోనే అభినయాన్ని ప్రదర్శించాడు. ఇక హీరోయిన్‌గా నటించిన అర్తన.. కళ్యాణిలా కన్పిస్తుంది. నటన ఫర్వాలేదు. మలయాళ నటి తొలిగా తెలుగులో పరిచయమైంది. హీరో గ్యాంగ్‌ షకలక శంకర్‌, నవీన్‌ తదితరులు బాగా నవ్వించారు. హీరోయిన్‌ తండ్రిగా నటించిన రాజా రవీంద్ర ఫర్వాలేదు.

 
విశ్లేషణ:
మొదటి భాగం రొటీన్‌గా సాగుతూ కథేమి కొత్తగా లేదనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో అసలు కథను మొదలుపెట్టి దానికి చివర్లో క్రికెట్‌ పందెం అనే అంశాన్ని జోడించి హీరో పాత్రకు ఒక టార్గెట్‌ను రూపొందించి కొన్నిచోట్ల కామెడీ పండించారు. క్రికెట్‌ ఆట చుట్టూనే సాగే క్లైమాక్స్‌ పార్ట్‌లో ఫన్‌ ఫర్వాలేదు. ఇక సినిమాలోని పాటలన్నీ వినడానికి, చూడడానికి బాగున్నాయి. ఈ పాటలు మంచి రిలీఫ్‌నిస్తాయి. సెకండాఫ్‌లోనే వచ్చే రెండు, మూడు ఎమోషనల్‌ సీన్స్‌ బాగున్నాయి.
 
కథే రొటీన్‌.. అందుకే హీరో గ్యాంగ్‌తో.. ఎన్ని సినిమాల్లో ఇలా చూడలేదని పలుమార్లు చెప్పిస్తాడు. సినిమా కూడా కొత్తగా లేదుకానీ.. ఏదో చెప్పాలన్న తపన దర్శకునిలో కనిపించింది. హీరో, హీరోయిన్‌లు ప్రేమించుకోవడం, వారి ప్రేమకు కొన్ని పరిస్థితులు, వ్యక్తులు అడ్డురావడం, వీటన్నింటినీ ఎదిరించి హీరో తన ప్రేమను సొంతం చేసుకోవడం అన్న బేసిక్‌ లైన్‌ రొటీన్‌ అయినా కూడా ప్రేమకథల్లో ప్రధానంగా ఉండేది ఇదే కావడంతో ఈ లైన్‌లో ఏ సమస్యా లేదు. అసలు సమస్య ఈ బేసిక్‌ లైన్‌కు క్రికెట్‌ను కలిపి, క్రికెట్‌ పందెంలో గెలిచిన వారికి అమ్మాయి సొంతం అవుతుందన్న ఆలోచన ఏమాత్రం బాగాలేదు. సెకండాఫ్‌లో రామ్‌కు నిర్దేశించిన లక్ష్యమే అనాలోచితమైనప్పుడు, అతడేం చేసినా, ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు బాగున్నా అది కనెక్ట్‌ కాలేదు. దీంతో అసలు కథే సెకండాఫ్‌ను మైనస్‌గా నిలబెట్టింది.
 
ఇక రామ్‌, సీతల ప్రేమకథలో పెద్దగా ఎమోషన్‌ లేదు. హీరోయిన్‌, హీరో ప్రేమలో పడిపోవడం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. రామ్‌ పాత్రను పక్కనబెడితే మిగతా అన్ని పాత్రలకూ సరైన పాత్ర చిత్రణ లేదు. పూర్తిగా కామెడీనే నమ్ముకోవడం అనే అంశం వల్ల కొన్నిచోట్ల సన్నివేశాల్లో 'అతి' ఎక్కువ అయింది. అలాగే, తనతో పాటే ఉంటూ, ఎప్పుడూ సహాయం చేస్తూ ఉండే స్నేహితులను ఊరికే చెంప మీద కొడుతూ పోయే తరహా హీరో పాత్రతో నవ్వించాలన్న ఆలోచనే చీప్‌గా ఉంది. సినిమా పరంగా చూసుకుంటే సెకండాఫ్‌ను మేజర్‌ మైనస్‌ పాయింట్‌గా చెప్పుకోవచ్చు.
 
రాజ్‌ తరుణ్‌ యాక్టింగ్‌, కొన్నిచోట్ల నవ్వించే సన్నివేశాలు, గోపీ సుందర్‌ అందించిన మ్యూజిక్‌, వాటిని తెరకెక్కించిన విధానం.. ఇలా కొన్ని అంశాలను వదిలేస్తే ఈ సినిమాలో ప్రేమకథకు ఉండాల్సిన అసలైన ఎమోషనే లేదు. ఇక పైన చెప్పిన అంశాల కోసం మాత్రమే చూడాలనుకుంటే ఈ సినిమా ఫర్వాలేదనిపిస్తుంది. అంతకుమించి ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు.
 
 
రేటింగ్‌: 2/5