శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By dv
Last Updated : శుక్రవారం, 2 అక్టోబరు 2015 (14:48 IST)

ప్రేమ కోసం ఎవరడ్డొచ్చినా దూల తీరిపోద్ది.. ఇదే 'శివమ్‌' కథ

విడుదల: 2.10.2015.. శుక్రవారం..
పాయింట్‌:  ప్రేమకోసం ఎవరడ్డొచ్చినా దూల తీరిపోద్ది..
 
తెలుగు సినిమా కథలు చాలావరకు పైన చెప్పిన పాయింట్‌పైనే సాగుతుంటాయి. లవ్‌ స్టోరీ ఎంటర్‌టైన్‌మెంట్‌ అనగానే.. ఏదోరకంగా కథను అల్లేసి.. దానిచుట్టూ కొన్ని సన్నివేశాలు, కామెడీ పంచ్‌లతో లాగించేస్తున్నారు. 'కందిరీగ'లో రామ్ మాస్‌ ఎంటర్‌టైనర్‌ను టచ్‌ చేశాడు. ఇప్పుడు కాస్త అటూఇటుగా అలాంటి ఫార్ములాతోనే ట్రై చేశాడు. దర్శకుడిగా కొత్తగా పరిచయమవుతున్న శ్రీనివాస్ రెడ్డి కథను అందించారు. సొంత నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్‌లో రవికిశోర్‌ నిర్మించారు. ఇక సినిమా కథ ఎలా ఉందో చూద్దాం.
 
కథ:
శివ (రామ్‌) ఎక్కడ ప్రేమికులు కష్టాల్లో ఉన్నా వచ్చి కాపాడుతుంటాడు. అలా ఓ జంటను కాపాడే ప్రయత్నంలో ట్రైన్‌లో పారిపోతూ.. జడ్చెర్లలో కొద్ది ఆగిన ట్రైన్‌లో సిగరెట్‌ కోసం దిగుతాడు. లైటర్‌ వెలిగించుకునే టైంలో ఎవరో దాన్ని లాగేసుకుని వాడి బాస్‌ సిగరెట్‌ను అంటిస్తాడు. దాంతో ఉగ్రుడై శివ.. వాడిని, అతని అనుచరులను భరతం పడతాడు. తన్నులు తిన్నవాడు... ఆ ఊరిలో ప్రజల్ని పీడించే రాక్షసుడు. ఊరికి పెద్ద. ఊరివాళ్ళకు ఈ సంఘటన తెలియడంతో చులకన అయిపోతాడు. కొడుకును కొట్టినవాడి కోసం వేట ప్రారంభిస్తాడు. 
 
ఆ తర్వాత మరోచోట తను ప్రేమించే అమ్మాయి (రాశీఖన్నా) తారసపడగానే శివ ఆమె వెంటపడి.. ప్రేమను సఫలం చేసుకోవాలని చూస్తాడు. అప్పటికే అర్జున్‌సింగ్‌ అనే మరో వ్యక్తి సెంటిమెంట్‌ ప్రకారం తను (రాశీఖన్నా)ను ప్రేమించేస్తాడు. ఇద్దరూ తనకోసం చేసిన ప్రయత్నంలో ఎవరిది పైచేయిగా నిలిచింది. మరి జడ్చెర్ల ఊరి పెద్ద తన పరువు కోసం శివను ఏం చేశాడు? తర్వాత కథేమిటి? అనేది మిగిలిన సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌
నటనపరంగా రామ్‌ తొలి సినిమా 'దేవదాసు' నుంచి ఉన్న ఈజ్‌, స్పీడ్‌ ఏమాత్రం చెక్కుచెదరలేదు. బాడీలో ఈజ్‌వల్ల సన్నివేశాలను సరదాగా చేసేశాడు. రాశీఖన్నా తన పాత్రను బాగానే పోషించింది. ముఖ్యంగా చిన్నచిన్న ఫీలింగ్స్‌ బాగా పలికించింది. తాగుబోతు రమేష్‌, షకలక శంకర్‌ వంటి 'జబర్ధస్త్‌' బ్యాచ్‌ ఇందులో బాగానే ఎంటర్‌టైన్‌ చేశారు. జడ్చెర్ల ఊరిపెద్దగా... విక్రమార్కుడులో రవితేజకు ప్రత్యర్థిగా చేసిన బాలీవుడ్‌ నటుడు చేశాడు. మరో విలన్‌గా అర్జున్‌సింగ్‌ చేశాడు. అయితే ఇద్దరినీ కొన్ని సందర్భాల్లో ఎంటర్‌టైన్‌గా ఉంటాయి. పోసాని శివ ఫాధర్‌గా నటించాడు. తొలిసారిగా సింగర్‌ మనో... హీరోయిన్‌ ఫాదర్‌గా చేయడం విశేషం. ఇక మిగిలిన పాత్రలు మామూలే.
 
టెక్నికల్‌గా....
దేవీశ్రీ ప్రసాద్‌ బాణీలు ఆకట్టుకునేలా ఉన్నాయి. కెమెరామెన్ రసూల్ ఫొటోగ్రఫీ చిత్రానికి హైలైట్‌. సాహిత్యపరంగా భాస్కర భట్ల మాస్‌ పల్స్‌ తెలిసినట్లుగా గీత రచన చేశారు. సినిమా దాదాపు 2 గంటల 45 నిముషాల సినిమాను లెంగ్త్‌ అయినా ఇంకాస్త తగ్గిస్తే బాగుండేది. పాటల్లో ఎక్కడా ఆర్ట్ డిపార్టుమెంట్‌ పనిలేకుండా ఔట్‌డోర్‌లో విదేశాల్లో తీసేశారు. రీరికార్డింగ్‌ బాగుంది. సంభాషణలపరంగా తిరుమల ప్రాసకోసం బాగానే పలికించాడు. 
 
విశ్లేషణ:
యూత్‌ హీరోలకు సక్సెస్‌ ఫార్ములా ఎంటర్‌టైన్‌మెంట్‌. అమ్మాయి ప్రేమకోసం ఏదైనా చేసే కుర్రాడు.. ఆఖరికి పెద్దలకు నీతులు చెప్పి ఒప్పించే పాత్ర.. ఇదిచాలామంది హీరోలు చేసేసినవే. రెడీ, కందిరీగ వంటి చిత్రాల్లోఅలాంటి తరహా పాత్రలు పోషించిన రామ్‌.. మళ్ళీ కాస్త అటూఇటూగా క్యారెక్టర్‌ చేయడం విశేషమే. సినిమాలో తను నమ్మించి పూర్తి ఎంటర్‌టైన్మెంట్‌. మొదటిభాగంలో అందుకు కావాల్సిన అంశాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. మైండ్‌గేమ్‌తో ఎదుటివారిని బుట్టలో వేసుకునే విధానం చూసేవారికి నవ్వు తెప్పిస్తుంది. మొదటిభాగం మొత్తం సరదాగా సాగుతుంది. రెండో భాగంలో కథను చెప్పాలి.
 
అందుకే ప్లాష్‌బ్యాక్‌లో శివ.. అసలు పేరు రామ్‌... అంటూ. ఓ కథ చెబుతాడు. లాజిక్కుగా బాగానేవున్నా... లెంగ్త్‌ ఎక్కువనిపిస్తుంది. మధ్యలో కొన్ని యాక్షన్‌ సన్నివేశాలు తీసేస్తే.. మాస్‌ను బాగా అలరిస్తుంది. మాస్‌కు కావాల్సింది. యాక్షన్‌ కాబట్టే కొన్ని ఫైట్స్‌... ఊహకు అందనవిగా వుంటాయి. సెంటిమెంట్‌ను నమ్మకపోయినా.. కృష్ణభగవాన్‌ పాత్రద్వారా నమ్మేట్లు రామ్‌ పాత్ర ఒకసారివుంటుంది. అయితే సెంటిమెంట్‌ కానీ.. అదృష్టంకానీ... హీరోయిన్‌ విషయంలో అస్సలు అంగీకరించదు. లక్కీతో వచ్చిన తన అదృష్టాన్ని కాళ్ళతన్నుకుపోతున్నాడంటే అర్జున్‌సింగ్‌ను పిచ్చిపువ్వా అని తిడతాడు. ఇదంతా కాస్త ఎంటర్‌టైన్‌ కోసమే చేసినట్లుగా అనిపిస్తుంది. మొత్తంగా రకరకాల సన్నివేశాల అల్లికతో అల్లిన సినిమా ఇది. 
 
చాలా గొప్ప కథ అని చెప్పడానికి ఏమీలేదు. స్క్రీన్‌ప్లే పరంగా పాత కథే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. క్రూరుడుగా ఉన్న విలన్‌.. హీరో చేసే హితబోధతో షడెన్‌గా మారిపోవడం, తెలుగు సినిమా ముగింపులో కన్పించేది. ఇందులోనూ అలా ఉంటుంది. అయితే యాక్షన్‌ సన్నివేశాలుకానీ, కథ నడిపేవిధానంలో కానీ ఒక్కోసారి ఈ చిత్రం వేరే మాస్‌ హీరోకు సరిగ్గా కనెక్ట్‌ అవుతుందనిపిస్తుంది. ఇప్పటికే మాస్‌ పాత్ర చేసి జగడంతో ఫెయిల్‌ అయినా రామ్‌. ఈసారి 'కందిరీగ' లాంటి మరో కథతో ఎంటర్‌టైన్‌ చేయడానికి ట్రైచేశాడు. దర్శకుడు కొత్తైనా రామ్‌ను దృష్టిలో పెట్టుకుని రాసుకుని సేఫ్‌ ప్రాజెక్ట్‌గా చేశాడు. ఇది పూర్తి మాస్‌ చిత్రంగా వుంది. ప్రేక్షకులు ఆదరిస్తే సినిమా ఆడుతుంది.
 
రేటింగ్‌: 2.75/5.