శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ivr
Last Modified: శుక్రవారం, 15 ఆగస్టు 2014 (15:47 IST)

సింగానికి పూర్తి రివర్స్ 'సికిందర్‌'... టూత్ పిక్ కొరుకుతూ సూర్య....

సికిందర్ నటీనటులు: సూర్య, సమంత, మనోజ్‌బాజ్‌పాయ్‌, మురళీరావ్‌ తదితరులు, నిర్మాతలు: లగడపాటి శ్రీధర్‌, లింగుస్వామి,యుటీవీ, సాహిత్యం: చంద్రబోస్‌, దర్శకత్వం: లింగుస్వామి.
 
పంచ్‌లైన్‌: శత్రువు దగ్గరైనా ద్రోహి వుండకూడదు.
 
సినిమాల్లో మాఫియా ఫార్మెట్‌లు చాలా వున్నాయి. కమల్‌హాసన్‌ 'నాయకుడు', రజనీకాంత్‌ 'భాషా'లతోపాటు మమ్ముట్టి, రజనీకాంత్‌ స్నేహితులుగా 'దళపతి' సినిమా వచ్చింది. ఆ తర్వాత అలాంటి ఫార్మెట్‌లో మరికొన్ని చిత్రాలూ వచ్చాయి. బాలీవుడ్‌లో కూడా మాఫియా నేపథ్యంలో తెరకెక్కించారు. మళ్ళీ అలాంటి ఫార్మెట్‌తోనే వచ్చింది 'సికిందర్‌'. తమిళచిత్రమైన దీన్ని లింగుస్వామి, యుటీవీ సంస్థ నిర్మిస్తే తెలుగులో లగడపాటి శ్రీధర్‌ అనువదించారు. మరి సికందర్‌ ఏమిటో తెలుసుకుందాం.
 
కథగా చెప్పాలంటే....
చందు, రాజు భాయ్‌ (సూర్య) స్నేహితులు. ముంబైలో చీకటి వ్యాపారాలు చేసే ఓ బ్యాచ్‌. చందు ఆలోచనల్ని ముందుగానే పసిగట్టేసి కార్యాలు ముందుగా క్లియర్‌ చేస్తాడు. అలాంటి వీర్దిరినీ కె.కె. మరో డాన్‌ వీరికి వార్నింగ్‌ ఇస్తాడు. ఎంతలో వుండాలో అంతలో వుండండి. ఒక్క అడుగు ఎదిగినా పందిని కాల్చేసినట్లు కాల్చేస్తానంటాడు. దాంతో అహంతో రాజు కెకెను కిడ్నాప్‌ చేసి తిరిగి అదే వార్నింగ్‌ అప్పచెప్పి వదిలేస్తాడు. ఇక అప్పటినుంచి రగులుతున్న కాష్టంలా కె.కె. అహం కట్టలు తెంచుకుని చందును దారుణంగా చంపేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న రాజు... ఇంతమంది వున్నా ఎలా జరిగిందనే ఆవేశంతో కెకెని చంపాలనుకుంటాడు. అలా వెళ్ళిన రాజును సహచరుడే కాల్చేస్తాడు. మరి ఆ తర్వాత రాజు ప్రతీకారం తీరిందా?లేదా? సమంత పాత్ర ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
 
నటీనటులు: 
రాజుభాయ్‌గా అండర్‌ వరల్డ్‌ కార్యక్రమాలు చేసేవాడి పాత్రలో ఒదిగిపోయాడు. తనకంటూ ఒక మేనరిజాన్ని మెడలో చైన్‌తోనూ నోటిలో టూత్‌పిక్‌తోనూ కొత్తగా కన్పిస్తాడు. డాన్‌గా తనకంటూ ప్రత్యేక ముద్రను పొందేలా ప్రయత్నించాడు. అదేవిధంగా రాజుభాయ్‌ తమ్ముడిగా కృష్ణ పాత్రగా మరో కోణాన్ని ఆవిష్కరించాడు. చందుగా, కె.కె.గా గ్యాంగ్‌లోని సభ్యులంతా ముంబై, చెన్నైకు చెందిన ప్రముఖ నటీనటులు పోషించారు. సమంత కమీషనర్‌ కుమార్తెగా నటించింది. రొటీన్‌గా తన చిత్రాల్లో వుండే శైలిలో చేసేసింది. దూకుడులో చేసినట్లుగా ఆమె పాత్ర వుంటుంది. ఏమాత్రం కొత్తగా అనిపించదు. అయినా ఓకే. ఒక మిగిలిన పాత్రల్లో అందరూ సీరియస్‌గానే చేశారు.
 
టెక్నికల్‌గా...
సినిమాటోగ్రఫీ చిత్రానికి హైలైట్‌. సంభాషణపరంగా ప్రాస వుండేలా శశాంక్‌ వెన్నెలకంటి ప్రయత్నించాడు. తమిళ సినిమా అయినా అర్థం మారిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. శత్రువు దగ్గరగా ద్రోహులు కూడా బతక్కూడదు. మీ అన్న దగ్గర తిన్నాడు. నీ దగ్గర కక్కాడు.. వంటి సన్నివేశపరంగా వచ్చే పలు సంభాషణలు ఆకట్టుకుంటాయి. సంగీతపరంగా యువన్‌ శంకర్‌రాజా కొత్తగా అనిపించకపోయినా... పాటలతోపాటు సాగుతాయి.  నవ్వుల్లో సిల్కుస్మిత.. అంటూ ఆమెను తలుచుకునే పబ్‌ సాంగ్‌ పర్వాలేదు. ఆర్ట్‌, ఎడిటింగ్‌ పనితీరు ఓకే.
 
విశ్లేషణ 
అండర్‌వలర్డ్‌ సినిమాలంటేనే కథలు ఒకేలా వుంటాయి. ఒక బ్యాచ్‌లో వున్న డాన్‌ను చంపాలంటే అందులోవున్న వారిని ఆశ చూపించి అంతం చేయడం. ఫలితంగా వారికి ఆ పదవులు దక్కించడం. తన కన్నుసన్నల్లోనే వారు పనిచేసేలా అంతర్జాతీయ మార్కెట్‌ను కంట్రోల్‌ చేసుకోవడం. మాఫియా అంటేనే డబ్బు, పరపతి కోసం చేసేది. దానికోసం ఇన్ని గొడవలు జరుగుతాయంటూ... దర్శకుడు ఓ సందర్బంలో చెబుతాడు. దీని చుట్టూనే కథ తిరుగుతుంది. 
 
అయితే ఇందులో ముగింపు కూడా ఒకేలా వుంటుంది. పోకిరిలో గోల్కొండ వద్ద చేసిన యాక్షన్‌ సీన్‌ను సేమ్‌ టు సేమ్‌గా సికిందర్‌లో ముగింపును కూడా తీయడం చిత్రంగా అనిపిస్తుంది. ఒక సినిమాతో ఒక సినిమా పోలికలు కూడా అక్కడక్కడా కన్పిస్తాయి. మొత్తానికి సూర్య తన ఫెరోషియస్‌ నటనతో ఆకట్టుకున్నాడు. అనుచరులు కూడా అలానే చేశారు. విలన్లు ఎక్కువగా స్మూత్‌గా వుంటూ గొంతు కోసే రకం మాఫియాలది. ఈ చిత్రంలో వారి నటన మాస్‌ను ఆకట్టుకుంటుంది. రొటీన్‌గా లవ్‌ట్రాక్‌ వుండాలి కాబట్టి.. కమీషనర్‌ కుమార్తె సమంతను వుపయోగించుకుని లవ్‌ట్రాక్‌ నడిపారు. సికందర్‌ అంటే.. దేనికీ బెదరకుండా డేర్‌గా పనులుచేసేవాడు. సినిమా టైటిల్‌కు తగినట్లే ఈ చిత్రంలో సూర్య పాత్ర వుంటుంది. మాస్‌ ప్రేక్షకులకు కావాల్సిన హంగులన్నీ వున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 600 థియేటర్లలో ఆగస్టు 15న విడులైంది. మాస్‌ ప్రేక్షకుల ఆదరణ బట్టి ఈ చిత్రం ఆధారపడి వుంటుంది.
 
ఇక బ్రహ్మానందం సంగీతరాజుగా పాత్ర పోషించాడు. మన సంగీతాన్ని కాస్త అపహాస్యంగా చేసినట్లుగా ఆయన సీన్‌ వుంటుంది. ఇదికూడా కేవలం కామెడీ కోసమయితే పర్వాలేదు. సీరియస్‌గా తీసుకుంటే కళాకారులు విమర్శించవచ్చు.