గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Updated : శుక్రవారం, 3 జూన్ 2016 (17:17 IST)

శ్రీ శ్రీ సినిమా రివ్యూ రిపోర్ట్ : సర్పయాగం తరహాలో శ్రీశ్రీ.. కృష్ణ, విజయనిర్మల నటన భేష్.. బ్యాడ్ సినిమా కాదు!

నటీనటులు: కృష్ణ, విజయనిర్మల, సాయికుమార్‌, నరేష్‌, మురళీశర్మ, పోసాని,  శ్వేత, సుదీప్‌ తదితరులు
నిర్మాత: శ్రీ సాయిదీప్‌ చాట్ల, వై. బాలురెడ్డి, షేక్‌ సిరాజ్‌, 
సంగీతం: ఇ.ఎస్‌. మూర్తి, 
దర్శకత్వం: ముప్పలనేని శివ.
 
నటుడిగా సూపర్‌స్టార్‌ కృష్ణగా కెరీర్‌ను 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా అభిమానులు ఆయనతో తీసిన సినిమా ఇది. 75 ఏళ్ళ వయస్సులో.. ఎలాంటి క్యారెక్టర్‌కు సూటవుతాడో అంతగా ఆయనకు పాత్ర ఇచ్చి చేయించడం విశేషం. అయితే.. కృష్ణ, విజయనిర్మల నటులుగా నటించి చాలా కాలమైంది. అలాగే దర్శకుడు ముప్పలనేని శివకూ గ్యాప్‌ వుంది. అందుకే వీరి కలయిలో కృష్ణ ఫ్యాన్స్‌కు నచ్చేవిధంగా సినిమా తీశానని చెప్పుకున్నాడు. అందులోనూ శ్రీశ్రీ అనే టైటిల్‌ పెట్టడగానే.. విప్లవ కవి గుర్తుకురావడంతో.. ఎలా వుంటుందో అనే ఆసక్తి నెలకొంది. మరి ఎలా వుందో చూద్దాం.
 
కథ:
శ్రీపాద శ్రీనివాసరావు (కృష్ణ) లా కాలేజీలో ఫ్రొఫెసర్‌. భార్య విజయనిర్మల, కుమార్తె శ్వేతతో హాయిగా జీవిస్తుంటాడు. శ్వేత స్వతహాగా తండ్రి స్ఫూర్తితో అన్యాయాన్ని సహించదు. ప్రాజెక్ట్‌లో భాగంగా ఓ గ్రామానికి వచ్చిన ఆమెకు అక్కడి ప్రజల జీవన విధానం, దానికి కారణమైన పెట్టుబడిదారుల దుర్మార్గాలు తట్టుకోలేక తన స్నేహితుడు విజయ్‌తో కలిసి షూట్‌ చేస్తుంది. వాటిని టీవీ ఛానల్‌కు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ముగ్గురు యువకులు వచ్చి ఆమెను చంపి.. రహాస్యాలున్న చిప్‌ను లాక్కుంటారు. ఇదంతా శ్వేతతండ్రి ముందు జరుగుతున్నా.. ఏమీ చేయలేని నిర్భాగ్యుడవుతాడు. ఆ తర్వాత కేసు వేసినా.. వీగిపోతుంది. ఆ తర్వాత భార్య ప్రోత్సాహంతో... చైతన్యం పొంది.. ఆ ముగ్గురు వ్యక్తులపై ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు? అన్నది కథ.
 
పెర్‌ఫార్మెన్స్‌:
75 ఏళ్ళ వయస్సులో కృష్ణ నటించడం విశేషం. అమితాబ్‌ నటించినా.. కృష్ణ నటన ఫ్యాన్స్‌కు కొత్తగా వుంటుంది. వయస్సు ఛాయలు కన్పిస్తున్నా... వయస్సుకు తగ్గ పాత్ర పోషించాడు. విజయనిర్మల కూడా అంతే. నకిలీడాక్టరుగా వుంటూ ప్రజల్ని పీడించే వ్యక్తిగా పోసాని.. ల్యాబ్‌ను నడుపుతూ.. ప్రజల జీవితాలతో ఆడుకునే వ్యాపారవేత్తగా మురళీశర్మ నటించారు. వారి కొడుకులుగా కొత్తవారు నటించారు. సాయికుమార్‌ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసేవ్యక్తిగా నటించాడు. 
 
టెక్నికల్‌గా...
నిర్మాణ వాల్యూస్‌ పర్వాలేదు. ఓ విలేజ్‌లో జరిగే కథ కాబట్టి.. అక్కడి పరిస్థితిని కళ్ళకు కట్టినట్లు చూపించాడు. అందుకు కెమెరా పనితనం బాగుంది. సంగీతపరంగా చెప్పుకోవాల్సింది ఏమీలేదు. పాటలు సాధారణంగా వున్నాయి. దర్శకుడు ముప్పలనేని శివ.. స్క్రీన్‌ప్లే కొత్తగా ఏమీలేదు. జస్ట్‌ ఓకేగా వుంది. 
 
విశ్లేషణ:
చాలా గ్యాప్‌ తర్వాత కృష్ణను వెండితెరపై చూసే అవకాశం అభిమానులకు కల్గింది. కథ ప్రకారం చూస్తే.. కొత్తదేమీకాదు. అయితే దర్శకుడు తీసే విధానం.. అంతా.. గత చిత్రాలను గుర్తుచేస్తుంది. శోభన్‌బాబు నటించిన సర్పయాగం, ఆ తర్వాత శ్రీహరి నటించిన మహాలక్ష్మి చిత్రాల పాయింట్‌ గుర్తుకు వస్తుంది. అయితే.. అందులో హీరో కుమార్తెను యువకులు దారుణంగా రేప్‌ చేసి చంపేస్తారు. 
 
చట్టంకూడా శిక్షించకుండా తప్పించుకుంటారు. వారిని చంపడం హీరో వేసే శిక్ష. అయితే.. శ్రీశ్రీలో... రేప్‌ కాకుండా... ప్రజలకోసం పోరాడే ప్రొఫెసర్‌ కుమార్తెను తమ రహస్యాల కోసం చంపేస్తారు. అదే తేడా. మిగిలినదంతా సేమ్‌ టు సేమ్‌. ఇటువంటి కథను కృష్ణ అంగీకరించడంలో తప్పులేదు. ఇది సమాజానికి ఉపయోగపడే అంశమే. 
 
ట్రైబల్‌ ఏరియాలో.. కొందరు పెట్టుబడిదారులు, రాజకీయ పలుకుబడిగలవారు దోచుకుంటూ.. వారి జీవితాల్లో ఆడుకోవడం అనేది చక్కగా చూపించాడు. అయితే దర్శకుడు చూపించే విధానం కొత్తగా ఏమీలేదు. రొటీన్‌గా గత చిత్రాల్లో చూపించిన స్క్రీన్‌ప్లేనే వాడాడు. ఇప్పటి జనరేషన్‌కు ఊహించని మలుపు ఏమీలేవు. కథాపరంగా బ్యాడ్‌ సినిమా కాదు కానీ.. సాదాసీదాగా సాగిన సాధారణ సినిమాగా అనిపిస్తుంది.
 
రేటింగ్‌: 2/5