గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: గురువారం, 24 సెప్టెంబరు 2015 (15:49 IST)

ఒకే టిక్కెట్టుపై ఇద్దరు హీరోలు... సుబ్రమణ్యం ఫుల్ సేల్సేనా... రివ్యూ రిపోర్ట్

సుబ్రమణ్యం ఫర్ సేల్ నటీనటులు : సాయిధరమ్‌ తేజ్‌, రెజీన, బ్రహ్మానందం, ఆదాశర్మ, రావు రమేష్‌, అజయ్‌ తదితరులు; సాంకేతిక వర్గం: సంగీతం : మిక్కీ జే మేయర్‌, నిర్మాత : 'దిల్‌' రాజు, దర్శకత్వం : హరీష్‌ శంకర్‌.
 
మెగా హీరో కుటుంబం నుంచి వచ్చిన హీరో సాయిధరమ్‌ తేజ.. రేయ్‌, 'పిల్లా నువ్వులేని జీవితం' సినిమాతో ఒక్కసారిగా క్రేజ్‌ వచ్చేసిన ఆ హీరోతో దిల్‌రాజు వరుసపెట్టి సినిమాలు తీసేస్తున్నాడు. ఆయనతో రెండో సినిమా 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌'. గబ్బర్‌ సింగ్‌ తర్వాత హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కుటుంబ విలువలతో పాటు, కమర్షియల్‌ అంశాలను పర్ఫెక్ట్‌గా మిక్స్‌ చేసి తీశాడు. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ పెర్‌ఫెక్షన్‌ ఏమిటో చూద్దాం.
 
కథ :
డాలర్లు సంపాదించి స్వదేశంలో కాలర్‌ ఎత్తుకు తిరగాలనుకునే సుబ్రమణ్యం(సాయిధరమ్‌ తేజ్‌) ప్రతి దాన్ని క్యాష్‌ చేసుకునేందుకు ట్రై చేస్తాడు. కొంతమందికి భిన్నంగా డాలర్‌ కోసం సుబ్రమణ్యం తనని తానే అమ్ముకోవడం మొదలు పెడతాడు. డాలర్‌ కోసం ఏ పని చేయడానికైనా సిద్ధమే. పార్ట్‌టైమ్‌ వుద్యోగంలా కాసేపు రేడియో జాకీ, మరోసారి ఆవకాయ్‌ హోటల్‌లో కుక్‌గా చేస్తుంటాడు. స్పెషల్‌ కుక్‌గా ఇండియా నుంచి వచ్చిన బ్రహ్మానందం వచ్చిన సమయంలోనే సుబ్రమణ్యం లైఫ్‌ లోకి సీత(రెజీన) ఎంటర్‌ అవుతుంది.

తన కుటుంబాన్ని వదులుకొని వచ్చి ప్రేమించిన అబ్బాయి చేతిలో మోసపోయిన సీతకి సుబ్రమణ్యం తను పనిచేసే రెస్టారెంట్‌‌లో జాబ్‌ ఇప్పిస్తాడు. అలా మొదలైన వారి పరిచయం ప్రేమగా మారుతున్న సమయంలో సీత తన చెల్లెలు గీత(తేజస్వి) పెళ్లి కోసం తన సొంత ఊరు కర్నూల్‌ వెళ్ళాల్సి వస్తుంది. తనకి ధైర్యం కోసం సుబ్రమణ్యంని తీసుకెళుతుంది. అక్కడ సినిమాకి మెయిన్‌ విలన్స్‌ అయిన బియ్యం బుజ్జి(రావు రమేష్‌) మరియు గోవింద్‌ గౌడ్‌(అజయ్‌)ఎంటర్‌ అవుతారు. ఇక అక్కడి నుంచి ఏం జరిగింది.? అనేది మిగిలిన సినిమా.
 
 
పెర్‌ఫార్మెన్స్‌:
సాయిధరమ్‌ తేజ కొత్తహీరో అయినా సినిమా మొత్తాన్ని మోసేశాడు. తన స్క్రీన్‌ ప్రెజెంటేషన్‌ బాగుంది. అయితే ఎక్కువశాతం మేనమామ పోలికలు రావడంతో పవన్‌ కళ్యాణ్‌ కొత్తలో ఎలా చేశాడో అలా అనిపిస్తుంది. రెజీనా పాత్ర కథను నడిపేది. ఆమె నటన బాగానే వుంది. రావు రమేష్‌ పాత్ర తక్కువైనా.. పాజిటివ్‌ విలన్‌గా కొత్తగా కన్పిస్తాడు. ఫ్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్‌లో అజయ్‌ బ్యాచ్‌ చేసిన వినోదం బాగుంది. ఎన్‌ఆర్‌ఐగా నాగబాబు నటించాడు. ఇక మిగిలిన పాత్రలన్నీ ఓకే. 
 
సాంకేతిక విభాగం :
సి. రాంప్రసాద్‌ సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. యుఎస్‌‌లోని లొకేషన్స్‌ని చూపిన విధానం సీనియర్‌ పనితనం కన్పించింది. పాటల కోసం అక్కడ ఎంచుకున్న లొకేషన్స్‌ ఆకర్షణీయంగా వున్నాయి. ఇకపోతే ఆ విజువల్స్‌‌‍కి మిక్కీ జే మేయర్‌ అందించిన నేపధ్య సంగీతం సూపర్బ్. మిక్కీ ఇలాంటి మాస్‌ మ్యూజిక్‌ కూడా ఇవ్వగలడా అనే ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే, తన మార్క్‌ మ్యూజిక్‌‌ని కూడా ఎమోషనల్‌ సీన్స్‌‌కి ఇచ్చి నేపధ్య సంగీతానికి పూర్తి న్యాయం చేసాడు. పాటలు ఇప్పటికే ఆదరణ పొందాయి. చంద్రబోస్, వనమాలి తదితరులు రాసిన పాటల్లో తెలుగువాడిపై వచ్చిన పాట సందర్భానుసారంగా వుంది. గౌతమ్‌ రాజు ఎడిటింగ్‌ బాగానే ఉంది. వెంకట్‌, రామ్‌, లక్ష్మణ్‌ మాస్టర్స్‌ కంపోజ్‌ చేసిన యాక్షన్‌ ఎపిసోడ్స్‌ సీనియర్‌ ఆర్టిస్టులకు చేసినట్లు చేశారు. 
 
విశ్లేషణ:
'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' అనే టైటిల్‌ వినడానికి ఎంత డిఫరెంట్‌‌గా ఉందో అంతే డిఫరెంట్‌‌గా హీరో పాత్రని డిజైన్‌ చెయ్యడం సినిమాకి పెద్ద ప్లస్‌ పాయింట్‌. తనని తాను అమ్ముకోవాలి అనే కాన్సెప్ట్‌ చూసే ఆడియన్స్‌‌కి కొత్త ఫీల్‌‌ని ఇవ్వడమే కాకుండా దాని చుట్టూ రాసుకున్న అమెరికా బ్యాక్‌ డ్రాప్‌ సీన్స్‌ చాలా ఎంటర్టైన్‌ చేస్తాయి. కమెడియన్స్‌‌తో ఎక్కువ పని లేకుండా హీరో పాత్రతోనే ఎక్కువ భాగం కామెడీని పండిస్తూ రావడం కూడా సినిమాకి పెద్ద హెల్ప్‌ అయ్యింది. అంతేకాకుండా ఫస్ట్‌ హాఫ్‌ మొత్తం ఆద్యంతం నవ్విస్తూ, శరవేగంగా సాగిపోతుంది.
 
సీతని కలపడంలాంటి విషయాలు చాలాచాలా ఆసక్తికరంగా ఉంటూనే పెదవులపై నవ్వుల పువ్వులు పూయిస్తూనే ఉంటాయి. మధ్యమధ్యలో మాస్‌ ఆడియన్స్‌ కోరుకునే కమర్షియల్‌ ఎలిమెంట్స్‌‌తో ఫస్ట్‌ హాఫ్‌ అంతా ఆడియన్స్‌‌ని రంజింపజేశాడు. ఇక సెకండాఫ్‌‌లో ఓ అందమైన ఉమ్మడి కుటుంబంలో ఉండే విలువలని, అందులో ఉండే సరదాలను చూపిన విధానం మనసుకు హత్తుకుంటుంది. ముఖ్యంగా లీడ్‌ పెయిర్‌ రొమాంటిక్‌ ట్రాక్‌ హైలైట్‌ అయితే ఫ్యామిలీ ఎమోషనల్‌ సీన్స్‌ క్లైమాక్స్‌‌లో ఆడియన్స్‌‌కి ఓ మంచి ఫీల్‌‌ని ఇచ్చి బయటకి పంపిస్తాయి.
 
అయినా కొన్ని లోపాలున్నాయి. ముగింపు పెద్దగా ఎట్రాక్షన్‌గా లేదు. అలాంటి ముగింపు కథ కూడా మూస ధోరణి లేనిదే. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌ బాగున్నా, కొన్నికొన్ని బోర్‌ కొట్టడం, సాగ దీస్తున్నారనే ఫీలింగ్‌ వలన ఆడియన్స్‌ మదిలోకి ఊహించదగిన రెగ్యులర్‌ ముగింపే కదా అనే భావన కలుగుతూ ఉంటుంది.  
 
కామన్‌ మ్యాన్‌కు ఏం కావాలనే ఫార్ములాతోనే ఈ సినిమా రూపొందింది. హీరో చేసిన విన్యాసాలు ఎక్కువగా చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ను జీన్స్‌ పరంగా వచ్చినవే అయినా వారిని ఇమిటేడ్‌ చేయడంతో... దొంగమొగుడు.. సినిమా తాలూకు ఛాయలు కన్పిస్తాయి. మొత్తంగా ఇద్దరు హీరోల్ని కలిపి సాయిధరమ్‌లో చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది. కథలో కొత్తదనం లేకపోయినా కామెడీ, పంచ్‌లతో అలరించే ప్రయత్నం చేశాడు. మరి సుబ్రహ్మణ్యం ఎంతవరకూ సేల్ అవుతాడో చూడాల్సిందే.
 
 
రేటింగ్‌: 3/5