గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Updated : శుక్రవారం, 20 మే 2016 (15:04 IST)

ఇది మహేష్ బాబు 'బ్రహ్మోత్సవం'... తెర నిండా నిండుగా... రివ్యూ రిపోర్ట్

బ్రహ్మోత్సవం నటీనటులు: మహేష్‌ బాబు, కాజల్‌ అగర్వాల్‌, సమంత, ప్రణీత, సీనియర్‌ నరేష్‌, సత్యరాజ్‌, రేవతి, జయసుద, రావు రమేష్‌, శరణ్య, ఈశ్వరీరావు, తనికెళ్ళ భరణి, నాజర్‌, తులసి, కృష్ణ భగవాన్‌, జయప్రకాష్‌రెడ

బ్రహ్మోత్సవం నటీనటులు: మహేష్‌ బాబు, కాజల్‌ అగర్వాల్‌, సమంత, ప్రణీత, సీనియర్‌ నరేష్‌, సత్యరాజ్‌, రేవతి, జయసుద, రావు రమేష్‌, శరణ్య, ఈశ్వరీరావు, తనికెళ్ళ భరణి, నాజర్‌, తులసి, కృష్ణ భగవాన్‌, జయప్రకాష్‌రెడ్డి, పావని, చాందిని తదితరులు.
 
సాంకేతిక సిబ్బంది:
సినిమాటోగ్రఫీ: ఆర్‌. రత్నవేలు, ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: మిక్కీ జె. మేయర్‌, మణిశర్మ (బ్యాక్‌గ్రౌండ్‌), ఆర్ట్‌: తోట తరణి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల, మాటలు, సహకారం: పదిమంది రచయితలు, నిర్మాత: పీవీపీ బేనర్‌.
 
తెలుగు సినిమాల్లో ఈమధ్య కుటుంబ సంబంధాలు, బాంధవ్యాలు వాటిల్లో ఆప్యాయతలు ఉండేలా కొన్ని కథలు వస్తున్నాయి. ఆ కోవలోనిదే 'బ్రహ్మోత్సవం'. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' దర్శకత్వం వహించిన శ్రీకాంత్‌ అడ్డాల ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అందులో ఒక కుటుంబం అన్నదమ్ములు కలిసి ఉండాలి. చుట్టూ ఉన్న నలుగురితో సరదాగా ఉండాలనేది చెప్పాడు. ఈసారి సమాజమంటేనే మనిషి.. ఆ మనుషులు నలుగురితో కలిసిమెలిసి ఒక కుటుంబంలా ఉంటే ప్రతి రోజూ 'బ్రహ్మోత్సవ'మే అని చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. మరి తను ఎలా చెప్పాడో చూద్దాం. అయితే ఇందులో ఏ పాత్రకూ సరైన పేరు పెట్టి పిలవడం జరగదు. కనుక.. ఒరిజినల్‌ పేర్లతోనే మాట్లాడుకుందాం.
 
కథ:
సత్యరాజ్‌, రేవతి భార్యభర్తలు. నలుగురితో కలిసిమెలిసి ఉండాలనేది సత్యరాజ్‌ తత్త్వం. అందుకే భార్య తరపున నలుగురు బావమర్దులతో కలిసి ఉంటాడు. పెయింట్‌ వ్యాపారంతో బాగా సంపాదిస్తాడు. అతనికి చేదుడువాదోడుగా ఉండేవాడు పెద్ద బామర్ది రావు రమేష్‌. అయితే రావు రమేష్‌.. ఏదో పోగొట్టుకున్నవాడిలా ఉంటాడు. కారణం... తన బావ చేసే పనులు నచ్చక, ఊరిలో అందరూ బావ పంచనే ఉంటున్నారనే సూటిపోటి మాటలతో బాధపడుతుంటాడు. అలాంటి రావు రమేష్‌.. ఓసారి.. సత్యరాజ్‌ను నిలదీసేస్తాడు. నీ వల్ల మా ఎదుగుదల పోతుంది. వ్యక్తిత్వం అంటూ లేదని.. నానా మాటలు అని వెళ్ళిపోతాడు. దాంతో షాక్‌కు గురై సత్యరాజ్‌ చనిపోతాడు. 
 
ఆ తర్వాత నాన్న ఆశయం కోసం కొడుకుగా మహేష్ బాబు మళ్ళీ అందరినీ కలిపే ప్రయత్నం చేస్తాడు. అందులో భాగంగా చుట్టమైన సమంతతో ఏడు తరాలు తమ కుటుంబాల్లోని వారు ఎక్కడెక్కడున్నారనేది వెతికే ప్రయత్నం చేస్తాడు. ఇందులో భాగంగా కాశీ, బద్రినాథ్‌, లక్నో, లండన్‌ వంటి ఊర్లు తిరుగుతుతారు. అందర్నీ కలిసి తిరిగి ఇంటికి వస్తారు. ఈ జర్నీలో సమంత ప్రేమలో పడతాడు మహేష్‌. అయితే.. పెద్ద మామయ్య రావు రమేష్ కుమార్తె ప్రణీత పెండ్లి జరుగుతుంది. పిలుపులేని మహేష్‌.. అక్కడికి వెళ్ళి.. పెద్ద మామయ్య మనస్సు మారేలా చేస్తాడు. అదెలా అనేది సినిమా.
 
 
పెర్‌ఫార్మెన్స్:
మహేష్‌ బాబు పెర్‌ఫార్మెన్స్‌ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీలేదు. అంటే.. తను చేయలేదనికాదు.. అందంగా ఉన్నాడు. చిన్నచిన్న డైలాగ్‌లు.. లుక్‌లు.. అన్నీ గత సినిమాల్లోలానే ఉంటాయి. అయితే క్లైమాక్స్‌లో తను భారీ డైలాగ్‌లు చెప్పాల్సి వచ్చింది. యాక్షన్‌ పార్ట్‌ కూడా పెద్దగా కష్టపడింది లేదు. ఒకరకంగా స్టైలిష్‌ పాత్ర. సమంత.. అల్లరిచిల్లరిగా వుంటూ.. అందరినీ కలుపుకునే తత్త్వం. సరిగ్గా సత్యరాజ్‌ ఆలోచనలకు దగ్గరగా ఉండే అమ్మాయి. ఇక జయసుధ .. మహేష్‌ అత్తగా, రావు రమేష్‌ భార్యగా నటించింది. తను కాజువల్‌గానే నటించింది. రావు రమేష్‌ పాత్రే ఈ చిత్రానికి కీలకం. కథంతా ఆయనపైనే నడుస్తుంది. షిండే, సీనియర్‌ నరేష్‌లు ఆయన సోదరులుగా నటించారు. వారి భార్యలుగా నటించినవారు. మిగిలిన వారూ.. పాత్రలకు సరిపోయారు.
 
సాంకేతికంగా..
టెక్నికల్‌గా ముఖ్యంగా చెప్పాల్సింది.. తోటతరిణి గురించి. శ్రీవారి దేవాలయం బయట సెట్‌వేసి బాగా చిత్రీకరించేలా చేశాడు. అలాగే.. విజయవాడలో ఇంటి సెట్‌ కూడా హైదరాబాద్‌లోనే వేసి తీసేశాడు. కృష్ణానదీ, గోదావరి, గంగ పుణ్యక్షేత్రాలను బాగా చూపించేలా కెమెరామెన్‌ పనితనం బాగుంది. మిక్కీ జే. మేయర్‌ సంగీతం కొత్తగా లేకపోయినా.. వినడానికి బాగున్నాయి. తను ఆనంద్‌ నుంచి ఒకే తరహాలో ట్యూన్‌ ఉన్నట్లు అనిపిస్తాయి. ఎడిటింగ్‌కు బాగా పని కలిగింది. ఎక్కువ షాట్స్‌ కట్‌ అయినట్లు అనిపిస్తాయి. ప్రధానంగా గ్రాఫిక్స్‌ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. రావు రమేష్‌. తన తండ్రి రావు గోపాలరావుతో మాట్లాడే సీన్లు, తిరుమల సీన్లు ఆకర్షణగా వున్నాయి. సంభాషణ పరంగా ప్రాసల కోసం పాకులాడటం కాకుండా.. తెలుగుదనం ఉట్టిపడేలా పదాల పొందిక బాగుంది. అయితే దీనికోసం పదిమంది రచయితలు పనిచేయడం విశేషం.
 
విశ్లేషణ :
ప్రతి ఊరిలో పదిమంది దేవుడి ఉవ్సతాలను జరుపుకోవడం ఆనవాయితీ. అలాంటి ఉత్సవాలు ప్రతిరోజూ ప్రతి ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందనేది బ్రహ్మోత్సవం కాన్సెప్ట్‌. దీనికోసం ఓ ఇంటి పెద్ద పడే తపనే ఈ కథ. ఆ పాత్రను సత్యరాజ్‌ పోషించాడు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాల్లో.. ఉమ్మడి కుటుంబం.. వంటి సినిమాలు వచ్చేశాయి. అప్పటికాలంలో ఉమ్మడిగా ఉన్న కుటుంబం ముక్కలై, మళ్ళీ అతికించే ప్రయత్నం హీరో చేసేవాడు. ఇప్పటికాలంలోనూ.. అదే జరిగింది. కాకపోతే.. బ్యాక్‌డ్రాప్‌లు, సన్నివేశాలు పాత్రలు మారాయి. ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సింది.. ఏడు తరాలు.. ఓ ఇంటికి పిల్లనివ్వాలంటే అటు.. ఇటూ ఏడుతరాలు చూడాలంటారు. అందుకే హీరోహీరోయిన్లు సమంత, మహేష్‌.. ఆ ఏడు తరాలు ఎలా ఉన్నారో.. వారితో మాట్లాడి వారిని కలుపుకుంటే బ్రహ్మోత్సవంలా ఉంటుందని భావించి అందరినీ కలుపుకుంటారు. ఇది వినడానికి బాగున్నా... ఆచరణలో చాలా కష్టం. ఈ సినిమాలో ఈ కాన్సెప్ట్‌ చెప్పకముందే.. చాలామంది కొన్ని కుటుంబాలు, తమ మూలాల గురించి వెతుక్కునే సంఘటనలు కూడా కొన్ని జరిగాయి. ఏదిఏమైనా.. దర్శకుడు ఆ కథను తన శైలిలో మార్చేశాడు.
 
మైనస్‌లు..
ఇందులో కొన్ని కన్‌ఫ్యూజ్‌లు కూడా ఉన్నాయి. ప్రతి సీన్‌కు తెరనిండా జనాలు కన్పిస్తారు. బాగనేవున్నా.. కథేమిటో వారంతా ఎందుకున్నారో అర్థంకాదు. వారికే పనీలేకుండా.. హీరోని చూడ్డానికే సరిపోతుంది. ఏడుతరాల కోసం వెతికే క్రమంలో ఆ ఇంటికి పెద్ద సత్యరాజ్‌ అత్త, రేవతి అమ్మను మర్చిపోవడం విడ్డూరంగా ఉంది. ఆమె పాత్ర ఏమయిందో చెప్పడు. కాజల్‌ అగర్వాల్‌.. ఆస్ట్రేలియాలో చదువు కోసం వెళ్ళిపోతుంది. ఏదో టైంపాస్‌గా ఇక్కడ కొద్దిరోజుల ఉండి.. ఈ ఆప్యాయతలు అవన్నీ పూర్తికాలం భరించడం నావల్లకాదు. ఇంకా నేర్చుకోవాలనుందని వెళ్ళిపోతుంది. ఇక ముగింపులో. ప్రణీత పెండ్లికి ఏడు తరాల వారిని మహేష్‌ పెండ్లికి ఆహ్వానిస్తాడు. వారంతా.. ఈ పెండ్లి ఎవరిదో తెలీదు. నువ్వు రమ్మంటే వచ్చామని చెబుతారు.. అక్కడ ఆ డైలాగ్‌ ఎందుకో అర్థంకాదు. ఆ తర్వాత.. వీరంతా నా ఎదుగుదల చూసి వచ్చారంటూ... రావు రమేష్‌ చెప్పడం.. దానికి కౌంటర్‌గా.. సత్యరాజ్‌ డైరీలో.. తదనంతరం ఆస్తినంతా రావు రమేష్‌కు రాయడం తెలిసి తను మారిపోవడంతో కథ ముగుస్తుంది. ఆ ముగింపులో కొద్దిగా కళ్ళను చెమర్చేలా చేసినా.. హృదయాన్ని టచ్‌ చేసే విధంగా మరింత లోతుగా చూపిస్తే బాగుండేది. 

 
దేవుడి కల్యాణం పేరుతో రాముడు కళ్యాణాన్ని.. నాలుగుసార్లు జరిపినట్లు చూపిస్తారు. అక్కడ రాముడు, సీత తరపున అటు ఇటు తరఫున వారు మాట్లాడుకునే డైలాగ్‌లు.. ఇప్పటి జనరేషన్‌కు పెద్దగా నచ్చదు. దాన్ని ట్రిమ్‌ చేస్తే బాగుండేది. అయితే.. ఎక్కడా అసభ్యతకు తావులేకుండా.. అచ్చమైన తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా... నా అనేవారు.. పదిమంది మన చుట్టూ వుంటే చాలు ప్రతి రోజూ పండుగలా ఉంటుందనేది దర్శకుడు చెప్పదలిచాడు. సంపాదన కోసం ఆత్మీయుల్ని వదులుకుని వెళ్ళిన వేరే ఊరికివెళ్ళి బతుకున్నవారికి బాగా కనెక్ట్ అవుతుంది. కామన్‌మేన్‌కు... కనెక్ట్‌ కావడానికి టైం పడుతుంది. చూడగా చూడగా.. బాగా కనెక్ట్‌ అవ్వడానికి రెండోసారి చూడ్డం కష్టమే.. అయితే. తెలుగులో సినిమాల్లో.. ఉమ్మడి కుటుంబం అనేది ఉందని ఇప్పటి జనరేషన్‌కు మరోసారి చూపించే ప్రయత్నంచేశారు. అందరూ చూడాల్సిన సినిమా ఇది.
 
రేటింగ్‌:  3.5/5