శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: గురువారం, 5 మార్చి 2015 (17:17 IST)

'సూర్యుడు'పై మంచి ప్రయత్నం... సూర్య వర్సెస్ సూర్య... రివ్యూ రిపోర్ట్

సూర్య వర్సెస్‌ సూర్య నటీనటులు: నిఖిల్‌, త్రిదా చౌదరి, తనికెళ్ళ భరణి, షాయాజీ షిండే, సత్య, మస్త్‌ అలీ, వైవా హర్ష, తాగుబోతు రమేష్‌ తదితరులు; టెక్నికల్‌ టీమ్‌ : కెమెరా- కార్తీక్‌ ఘట్టమనేని, సంగీతం: సత్య మహావీర్‌, మాటలు: చందు మొండేటి, ఎడిటింగ్‌: గౌతమ్‌ నెరుసు, సమర్పణ: బేబి త్రిష, నిర్మాత: మల్కాపురం శివకుమార్‌, రచన, దర్శకత్వం: కార్తీక్‌ ఘట్టమనేని.
 
విడుదల తేదీ: 05.03.2015
తెలుగులో ఒక సినిమా హిట్టయితే అదే ఫార్మెట్‌లో రకరకాల సినిమాలు వస్తుంటాయి. అందుకే జాగ్రత్తగా అడుగులు వేస్తున్న 'హ్యాపీడేస్‌' నటుడు నిఖిల్‌... 'సూర్య వర్సెస్‌ సూర్య' చిత్రంలో భిన్నమైన పాత్ర పోషించాడు. స్వామి రారా, కార్తికేయ చిత్రాల తర్వాత బోల్డన్ని కథలు అవే తరహాలో రావడంతో విసుగుపుట్టి ఏవీ అంగీకరించలేదనీ, సూర్యుడిపై వచ్చిన కథ నచ్చి చేశానని చెప్పాడు. ఇలాంటి కథకు కార్తికేయ చిత్రంలో రచనా సహకారం ఇచ్చిన కార్తీక్‌ దర్శకత్వం వహించడం విశేషం. మరి ఈ చిత్రంలో ఆయన ఏం చెప్పదలిచాడో చూద్దాం.

 
కథ: సూర్య(నిఖిల్‌). తల్లి సంరక్షణలో పెరుగుతాడు. చీకటి పడ్డ తర్వాతే అతను బయటి ప్రపంచంలోకి రాగలడు. ఎందుకంటే సూర్యుడిని చూస్తే చచ్చిపోయే జబ్బు పుట్టుకతో వస్తుంది. అందుకే డిగ్రీ చదివేందుకు నైట్‌ కాలేజ్‌లో జాయిన్‌ అయి ప్రతిరోజూ ఆటోలో కాలేజ్‌కి వెళ్తుంటాడు. ఓరోజు తను పాతబస్తీ రౌడీ జుబేర్‌ చేత కిడ్నాప్‌ చేసి ఓ దీవికి తీసుకువస్తాడు. అక్కడ రౌడీ అనుచరుల్ని సూర్య చితకబాదేస్తాడు. దాంతో రౌడీ సూర్యను వదిలేసి బోట్‌లో పారిపోతారు. ఇద్దరే మిగిలిపోతారు. తెల్లారే లోగా సూర్య బయటపడాలి. లేదంటే తను చచ్చిపోతానని జుబేర్‌కు చెబుతాడు. కారణమేమిటని అడిగితే.. సూర్య ప్లాఫ్‌బ్యాక్‌ చెబుతాడు. అందులో ఒక టి.వి. ఛానల్‌లో పనిచేసే సంజన(త్రిదా చౌదరి)తో ప్రేమలో పడతాడు. రాత్రికి మాత్రమే పరిమితమైన సూర్య ప్రేమలో ఎలా పడ్డాడు? అది తెలిసి ఆమె ఎలా రియాక్ట్‌ అయింది? అసలు కిడ్నాప్‌ ఎందుకయ్యాడు? అనేది మిగిలిన సినిమా.
 
విశ్లేషణ : 
ఈ కథలో ప్రధానంగా చెప్పాల్సింది కాన్సెప్ట్‌. దీన్ని ఎట్రాక్ట్‌ చేసేలా దర్శకుడు చేసే ప్రయత్నం మెచ్చతగింది. డైరెక్టర్‌ కార్తీక్‌ ఘట్టమనేని కొంతవరకు సక్సెస్‌ అయ్యాడు. మొదటిభాగంలో చాలా సరదాగా చూపించేశాడు. సెకండాఫ్‌లో కొంత కన్‌ఫ్యూజ్‌ అయినా అద్భుతమైన ఫోటోగ్రఫీతో ఆద్యంతం అందంగా చూపించాడు. ముగింపు సరిగ్గా ఇవ్వలేకపోయాడు. కథరీత్యా నైట్‌ ఎఫెక్ట్‌లో ప్రతి షాట్‌ని కళ్ళకి ఇంపుగా చూపించడం కష్టమైనా మెప్పించాడు. సత్య మహావీర్‌ తొలి చిత్రంతోనే విషయం వున్న మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిపించుకున్నాడు. కథకు ఇబ్బంది కలగకుండా మంచి మెలోడియస్‌ పాటల్ని చేశాడు. దాన్ని మించి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ని ఎక్స్‌లెంట్‌గా చేసి హండ్రెడ్‌ పర్సెంట్‌ మార్కులు కొట్టేసాడు. ఆర్టిస్టుల విషయానికి వస్తే సూర్య క్యారెక్టర్‌లో నిఖిల్‌ ఒదిగిపోయాడని చెప్పాలి. ప్రతి ఎమోషన్‌ని పర్‌ఫెక్ట్‌గా చూపించగలిగాడు. హీరోయిన్‌ త్రిదా చౌదరి సంజన క్యారెక్టర్‌ను బాగా చేసింది.
 
నిఖిల్‌కి తల్లిగా నటించిన మధుబాల కూడా పెర్‌ఫార్మెన్స్‌ పరంగా ఓకే అనిపించింది. నిఖిల్‌కి ఫ్రెండ్స్‌గా నటించిన తనికెళ్ళ భరణి, సత్య తమకున్న పరిధిలో మంచి కామెడీ చేశారు. చందు మొండేటి ఈ చిత్రానికి రాసిన డైలాగ్స్‌ బాగా పేలాయి. ముఖ్యంగా కామెడీ డైలాగ్స్‌ని ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. కాగా, కొన్ని సందర్భాల్లో కథ స్లోగా నడుస్తోంది. ఫస్ట్‌ హాఫ్‌ వరకు ఓకే అనుకొని సెకండాఫ్‌ కోసం థియేటర్‌లోకి వెళ్ళిన ఆడియన్స్‌కి బోర్‌ స్టార్ట్‌ అవుతుంది. ఫస్ట్‌ హాఫ్‌లో ఎక్కడ ఆపిన కథ అక్కడే వుంటుంది తప్ప ముందుకి కదలదు. 
 
సినిమాని రన్‌ చేయడానికి కొన్ని అనవసరమైన సీన్స్‌, అర్థంలేని కామెడీతో సాగతీత మొదలవుతుంది. ఐలెండ్‌లో చిక్కుకున్న సూర్య, జుబేర్‌ సిటీకి వచ్చేందుకు ఆటోకి వాటర్‌ బాటిల్స్‌ కట్టి బోట్‌లా చేసే ప్రయత్నం, సంజన తండ్రి(షాయాజీ షిండే)కి తనకి వున్న డిసీజ్‌ గురించి చెప్పమని తనికెళ్ళ భరణి, సత్యని సూర్య పంపించే సీన్‌, తర్వాత తనే వాళ్ళ ఇంటికి వెళ్ళి తండ్రీకూతుళ్ళతో మాట్లాడే సీన్‌, నైట్‌ కాలేజీలో కల్చరల్‌ ప్రోగ్రామ్‌.. ఇలా చాలా సీన్స్‌ అసలు కథని పక్కన పెట్టేస్తాయి. ఇక పేలవమైన క్లైమాక్స్‌తో సినిమా ముగుస్తుంది. 
 
సినిమాలో కొన్ని మైనస్‌ పాయింట్స్‌ వున్నప్పటికీ ఓవరాల్‌గా ఒక మంచి ఎటెమ్ట్‌ చేశారని మాత్రం సినిమా చూసిన ఆడియన్స్‌ ఒప్పుకుంటారు. బి, సి సెంటర్‌ ఆడియన్స్‌కి ఈ కాన్సెప్ట్‌ అంతగా రుచించకపోయినా వాళ్ళు కూడా ఓవరాల్‌గా సినిమా ఓకే అని మాత్రం చెప్తారు. స్వామిరారా, కార్తికేయ వంటి డిఫరెంట్‌ మూవీస్‌తో కమర్షియల్‌ హిట్స్‌ అందుకున్న నిఖిల్‌కి ఈ చిత్రం గొప్ప చిత్రమనే చెప్పాలి. తెలంగాణ నిర్మాతగా చెప్పుకునే మల్కాపురం శివకుమార్‌ ప్రొడక్షన్‌ వేల్యూస్‌ బాగున్నాయి. స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ సినిమాని రిచ్‌గా చూపించడంలో నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వలేదని విజువల్స్‌ చూస్తే అర్థమవుతుంది. అయితే కమర్షియల్‌ వాల్యూస్‌ లేని ఈ చిత్రం మల్టీప్లెక్స్‌ చిత్రాలు చూసేవారికి బాగా నచ్చుతుంది.
 
రేటింగ్‌: 3/5