గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: శనివారం, 3 అక్టోబరు 2015 (14:18 IST)

ఈ 'పులి' ఎంతకాలం గాండ్రిస్తుందో...? విజయ్ 'పులి' రివ్యూ రిపోర్ట్

పులి నటీనటులు : విజయ్‌, శ్రీదేవి, శృతి హాసన్‌, హన్సిక, సుదీప్‌ తదితర నటీనటులు. సంగీతం : దేవీశ్రీ ప్రసాద్‌, నిర్మాత : శోభ, శిభు థమీన్స్‌, సెల్వ కుమార్‌, దర్శకత్వం : చింబుదేవన్‌ డి.
 
భారీతారాగణంతో రూపొందిన సినిమా 'పులి'. ఇలయదళపతి విజయ్‌ హీరోగా నటించిన సోషియో ఫాంటసీ అడ్వెంచర్‌ చిత్రమిది. శ్రీదేవి చాలాకాలం తర్వాత నటించిన చిత్రమిది. శృతి హాసన్‌, హన్సికలు హీరోయిన్లుగా నటించారు. కన్నడ స్టార్‌ సుధీప్‌ కూడా ఓ ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమాకి చింబుదేవన్‌ దర్శకుడు. భారీ బడ్జెట్‌‌తో, ఉన్నత గ్రాఫిక్స్‌ విలువలతో వచ్చిన ఈ చిత్రం 'బాహుబలి' తరహాలో వుంటుందనేట్లుగా ట్రైలర్స్‌ రావడంతో.. ఒక్కసారిగా క్రేజ్‌ పెరిగింది. అయితే బాహుబలితో పోల్చవద్దని.. దర్శకుడు రిలీజ్‌కు ముందే స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఏది ఇచ్చినా వెళ్ళాల్సిన మెసేజ్‌ వెళ్ళిపోయింది. విడుదల ఒక్కరోజుల ఆలస్యంగా జరిగింది. మరి ఎలా వుందో చూద్దాం.
 
కథ :
జానపద కథలా వుంటుంది. అనగనగా ఓ దీవి. దాని పేరు అఘోరా ద్వీపం. భేతాళ జాతికి చెందిన కొంతమంది వచ్చి దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించుకొని దానికి భేతాళదేశంగా పేరు పెట్టివారు 56 ఊర్లని పరిపాలిస్తూ ఉంటారు. ఆ భేతాళ దేశాన్ని పరిపాలించే రాణి యవ్వనరాణి(శ్రీదేవి). ఆమెకి దళపతి అయిన జలంధరుడు(సుధీప్‌) ప్రజలని హింసలు పెడుతూ, వారిని బానిసలుగావించి వారి పంట, ధనాన్ని లాక్కుంటూ ఉంటారు. కానీ ఆ భేతాళ దేశం కింద ఉండే గ్రామాల్లో భైరవకోన ఒకటి. ఆ భైరవకోనకి నాయకుడు నరసింగ నాయకుడు(ప్రభు). అతనికి నదిలో కొట్టుకు వచ్చిన ఓ బిడ్డ దొరుకుతాడు. ఆ బిడ్డకు మనోహరుడు(విజయ్‌) అని పేరు పెడతాడు. అతన్ని భేతాళజాతిని అడ్డుకోగల వీరుడిలా తయారు చేస్తాడు. ఆ సమయంలో భేతాళ జాతి వారు వచ్చి భైరవ కొనలోని వారిని కొట్టి, మందార మల్లి(శ్రుతి)ని ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఇక ఆమెకోసం మనరోహరుడు ఏం చేశాడు? ఎన్ని అడ్డంకులు అధిగమించాడు? కొన్ని రహస్యాల గురించి ఏం తెలుసుకున్నాడనేది కథ.
 
పెర్‌ఫార్మెన్స్‌:
నటుడిగా హీరో విజయ్‌ రెండు పాత్రల్లో పర్లేదు అనిపిస్తాడు. ముఖ్యంగా పోరాట సన్నివేశాలతో పాటు తన మార్క్‌ కామెడీతో ఆడియన్స్‌ని నవ్వించడానికి ట్రై చేసాడు. నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో శ్రీదేవి చాలా బాగా చేసింది. అందంతో హీరోయిన్స్‌కి పోటీని ఇచ్చింది. శృతి హాసన్‌- హన్సికలు తమ అందచందాల్ని ఆరబోశారు. సుధీప్‌ నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో మరోసారి మెప్పించాడు. నందిత శ్వేత, ప్రభు, విజయ్‌ కుమార్‌‌లు తమతమ పాత్రల్లో ఫరవాలేదనిపించారు. తంబిరామయ్య కామెడీ అక్కడక్కడా బాగానే పేలింది.
 

టెక్నికల్‌గా చూస్తే...
నటరాజన్‌ సుబ్రమణ్యం సినిమాటోగ్రఫీ ఆకర్షణగా వుంది. పెట్టుకున్న ఫ్రేమ్స్‌, విజువల్స్‌‌ని చూపిన విధానం అద్భుతం బ్లూ మాట్‌ షాట్స్‌కి చేసిన సిజి వర్క్‌ 80 శాతం బాగున్నాయి. ముత్తురాజ్‌ ఆర్ట్‌ వర్క్‌ చాలా బాగుంది. అసలు లేని కోట్లని ఇలా ఉంటాయేమో అని ఊహించి గీసిన కట్టడాలు బాగున్నాయి. శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌ అస్సలు బాగాలేదు. చాలాచాలా స్లోగా ఉంది. సినిమాకి అదో పెద్ద మైనస్‌. తెలుగులో డైలాగ్స్‌ బాగాలేవు. దేవీశ్రీప్రసాద్‌ అందించిన్‌ సాంగ్స్‌ తెలుగులో ఒకటి కూడా వినేలా లేవు. ఇకపోతే బ్యాక్‌‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. దర్శకుడిగా చింబుదేవన్‌ రొటీన్‌ ఓల్డ్‌ ఫార్మాట్‌ రివెంజ్‌ స్టొరీ తీసుకున్నాడు. కథనం నింపాదిగా సాగడం సహనానికి పరీక్షలా వుంటుంది. పొట్టివారి ఎపిసోడ్‌ పిల్లలకు నచ్చుతుంది.
 
విశ్లేషణ:
చందమామ కథల్లో రాసే ఎత్తుగడే చాలా ఆసక్తిగా వుంటుంది. అలా తీయాలని ఏదో తీసినట్లుగా వుంది. కథతో పాటు కథనం కూడా పెద్దగా ఆసక్తిగా లేదు. కథ అర్థమయ్యాక అంతా ఊహాజనితంగా సాగుతుంది. దానికితోడు సినిమా నేరేషన్‌ చాలా అంటే చాలా స్లోగా సాగుతుంది. అనవసరం అనిపించుకునే సీన్స్‌ చాలా ఎక్కువ ఉన్నాయి. దానికితోడు కనిపిస్తే పాటలు వచ్చేస్తాయి. అన్ని పాటలు అవసరం లేదు. అనవసరపు సీన్స్‌, సాంగ్స్‌‌ని కలుపుకొని 30 నిమిషాల సినిమాని ఈజీగా కట్‌ చేసి సినిమా రన్‌ టైంని తగ్గిస్తే చూసే ఆడియన్స్‌‌కి బెటర్‌ ఫీలింగ్‌ వస్తుంది. ఇక డైరెక్టర్‌‌గా విజువల్స్‌‌ని అయితే చూపించగలిగాడు కానీ పేపర్‌ మీద రాసుకున్న సీన్స్‌‌ని స్క్రీన్‌ పైకి తీసుకురాలేకపోయాడు. ఏ సీన్‌‌లోనూ పర్ఫెక్ట్‌ ఎమోషన్‌ కనిపించదు. ఒకవైపు విలన్స్‌‌ని సీరియస్‌‌గా చూపిస్తున్నా, హీరో సైడ్‌ నుంచి మాత్రం కథని కామెడీగా చూపిస్తూ ఉంటాడు. ఆ పాయింట్‌ ఆడియన్స్‌‌కి అస్సలు కనెక్ట్‌ అవ్వదు. అలాగే సినిమాకి మెయిన్‌ అనిపించుకునే ఫ్లాష్‌‌బ్యాక్‌ ఎపిసోడ్‌ చాలా సిల్లీగా అనిపించడంతో క్లైమాక్స్‌‌పై ఆసక్తి పోతుంది.
 
చాలాకాలం తర్వాత వస్తున్న సోషియో ఫాంటసీ మూవీగా బాహుబలి రావడంతో ఆ తర్వాత ఎటువంటి చిత్రాలు వచ్చినా దాని ప్రభావం కచ్చితంగా పడుతుంది. అందుకే విడుదలైన 'పులి' సినిమా ప్రేక్షకులను నిరాశాపరిచేలా ఉంది. రాసుకున్న కథని తెరపై చూపించలేకపోవడం. ఓవరాల్‌‌గా చూసుకున్నప్పుడు ఆడియన్స్‌‌కి ఓ బోరింగ్‌ సినిమా చూసాం అనిపిస్తే, విజువల్స్‌ పరంగా, గ్రాండియర్‌ పరంగా చూసుకుంటే మాత్రం భలే ఉన్నాయే సెట్స్‌ అనిపిస్తుంది. భారీభారీ సెట్స్‌, గుడ్‌ సిజి వర్క్‌, హీరోయిన్స్‌ గ్లామర్‌ సినిమాకి ప్లస్‌ అయితే ఆకట్టుకోలేకపోయిన కథ, కథనం, నేరేషన్‌, డైరెక్షన్‌, రన్‌ టైం, అనవసరపు సాంగ్స్‌ మేజర్‌ తీసేస్తే... విజువల్‌గా బాగుంది. కథనం ప్రకారం డీలా పడిపోయింది. మరి ఈ పులి ఎంతకాలం గాండ్రిస్తుందో చూడాల్సిందే...?!!

రేటింగ్: 2/5