గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ivr
Last Updated : శుక్రవారం, 28 నవంబరు 2014 (16:17 IST)

అప్పటి 'యమలీల'కు ఇప్పటి 'యమలీల-2'కి అదే తేడా... రివ్యూ రిపోర్ట్

యమలీల 2 నటీనటులు: డా|| సతీష్‌, మోహన్‌ బాబు, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, గిరిజ, దియా, రావురమేష్‌ తదితరులు; కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం: ఎస్‌వి కృష్ణారెడ్డి, బేనర్‌ క్రిష్వి ఫిలింస్‌, సమర్పణ: అచ్చిరెడ్డి, నిర్మాత: సతీష్‌.
 
ఎస్‌వికృష్ణారెడ్డి చిత్రాలంటే కుటుంబ చిత్రాలనేది తెలిసిందే. చైల్డ్‌ సెంటిమెంట్‌తో రాజేంద్రుడు గజేంద్రుడు, యమలీల వంటి చిత్రాలు తీసిన ఆయన ఈసారి యమలీల-2ను తెరకెక్కించాడు. అయితే ఇటీవల ప్రేక్షకుల ఆలోచనలు కూడా మారాయి. వాటికి కాస్త దూరంగా వున్నా... నిర్మాతే వచ్చి తనతో తీయాలంటే ఒక్కసారి మళ్ళీ మెదడుకు పదునుపెట్టాడు. మరి ఈసారి యమలీల చిత్రాన్ని ఎలా తీశాడో చూద్దాం.
 
కథ : 
యమలోకంలో యముడు (మోహన్‌బాబు) గాంధర్వ కన్య పాటలు పాడుతుంటే పరవశిస్తాడు. అది భూలోకంలోని మానస సరోవరం నుంచి వస్తుందని చిత్రగుప్తుడు(బ్రహ్మానందం) చెప్పడంతో కిందకి వస్తారు. వస్తూ భవిష్యవాణి గ్రంథాన్ని తెస్తారు. ఇక వీరిని చూసి గంధర్వ కన్యలు పారిపోతారు. యముడు సరోవరంలో సేదతీరుతానని చెప్పి 10 రోజుల వరకు రాడు. దీంతో బయట వున్న చిత్రగుప్తుడు వుండలేక... నీటిలోకి భవిష్యవాణిని తీసుకెళ్ళలేక అక్కడే వున్న ఒకేఒక్క మానవుడుని పిలిచి గ్రంథాన్ని ఇస్తాడు. దాన్ని తెరవకూడదంటాడు. కానీ ఆ తర్వాత వుండబట్టలేక అతను తెరిచి చూసి భయంభ్రాంతులవుతాడు. కాసేపటికి పైకి వచ్చిన వారికి మానవుడు కన్పించడు. అతనికోసం గాలిస్తూ.. అతన్ని తెలుసుకుని గ్రంథాన్ని ఇవ్వమంటే.. ఓ షరతు పెడతాడు. అది ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
 
 
పెర్‌ఫార్మెన్స్‌ 
గతంలో అలీ చేసిన పాత్రను ఈ సినిమాలో డా|| సతీష్‌ అనే కొత్త నటుడు చేశాడు. హావభావాలు పెద్దగా పలికించకపోయినా దర్శకుడు చెప్పింది చేశాడు. యముడిగా మోహన్‌బాబు పాత్ర ప్రత్యేకం. డైలాగ్‌ డెలివరీతో పాటు బాడీ లాంగ్వేజ్‌ కూడా సరిపోయింది. సినిమాటిక్‌ కోసం కొంత మేనరిజం వంటివి మార్చారు. చిత్రగుప్తుడుగా అప్పుడూ ఇప్పుడూ బ్రహ్మానందం పోషించాడు. సతీష్‌కు జోడిగా దియా అనే కొత్త నటి నటించింది. ఆమెకు పెద్ద నటన తెలీదు. రావు రమేష్‌ డాక్టర్‌గా షిండే, ఆశిష్‌ విద్యార్థిలు ఫార్మా కంపెనీలు పెట్టి కోట్లు సంపాదించే వ్యక్తులుగా నటించారు. గబ్బర్‌ సింగ్‌ బ్యాచ్‌ రౌడీలుగా నటించారు.
 
టెక్నికల్‌గా... 
ఇటువంటి కథలకు సాంకేతిక చాలా కీలకం. గ్రాఫిక్స్‌, విజువల్స్‌, డిటిఎస్‌ సిస్టమ్స్‌ అన్నీ బాగుండాలి. సంజీవిని మొక్క ఆర్టిఫియల్‌గా కన్పిస్తుంది. యముడు ప్రయాణించే రథం సెట్‌ బాగుంది. యమలోకం సీన్‌ పర్వాలేదు. భూలోకంలో మానస సరోవరం కూడా బాగానే చూపించారు. సంగీతం, సాహిత్యం ఈ చిత్రానికి వినసొంపుగా వున్నాయి. శబ్దాల హోరు లేదు. స్క్రీన్‌ప్లే రొటీన్‌గానే వుంది. మాటలు పొందికగానే ఉన్నాయి.
 
విశ్లేషణ 
యముడు పుస్తకం మర్చిపోతాడు. దానికోసం భూలోకం వస్తాడు. అనేది కాన్సెప్ట్‌. ఇక్కడకు వచ్చాక ఆయన ఏమేమి చేశాడు అనేది ఆసక్తికరంగా చూపించడమే దర్శకుడి పని. ఆ విధానంలో యమలీలో వున్న స్టఫ్‌ ఇందులో కన్పించదు. దానికి ప్రధాన కారణం కథానాయకుడు. తన కోసమే ఈ సినిమా తీయడం వల్ల అతను ఎంత చేస్తే అంతే అన్నట్లుగా వుంది. చైల్డ్‌ సెంటిమెంట్‌గా శ్రుతి అనే పాపకు క్యాన్సర్‌ కోసం మామయ్యగా హీరో మందు కనిపెట్టి ఆమెకు ఇప్పించడం అనేది మిగిలిన కథ. అందులో పాప ఎపిసోడ్‌ కూడా ఇంకా ఎట్రాక్ట్‌‌గా తీస్తే బాగుండేది. మిగిలిన పాత్రలు షరా మామూలే. 
 
సంగీత దర్శకుడు కూడా కృష్ణారెడ్డి కావడంతో దానిపై కూడా శ్రద్ధ పెట్టాడు. ఎటువంటి అశ్లీలత లేని సాహిత్యం.. కృష్ణం భజే... వంటి పాటలు ఇందులో వున్నాయి. కేరళలో ఎపిసోడ్‌లో తాగుబోతు రమేష్‌ కాస్త నవ్విస్తాడు. బ్రహ్మానందం పాత్ర నవ్వు తెప్పించే క్రమంలో చేసినా పెద్దగా ఉపయోగంలేదు. ఇక సిక్కుల గెటప్‌లో వున్న చలపతిరావు గ్యాంగ్‌ ఏమంత ఎట్రాక్ట్‌గా అనిపించలేదు. వారివీ కృతకంగా అనిపిస్తాయి. దాని బదులు అసలు సిక్కులనే తీసుకుని డాన్స్‌ చేయిస్తే సరిపోయేది. 
 
ఇక ఇప్పటి ట్రెండ్‌ ప్రేమలు ఎలా వున్నాయనేది పార్ట్‌ టైమ్‌ ప్రేమ సీన్‌ యముడి చేత చేయించాడు దర్శకుడు. ఏది ఏమైనా... కుటుంబకథా చిత్రాలు చూసేవారికి ఇటువంటి కథలు నచ్చుతాయి. అలా అని వారు కూడా చాలా మారిపోయారు. దర్శకుడు గతంలో మాదిరిగా దర్శకత్వం చేసినా... ఇప్పటి ట్రెండ్‌కు తగినట్లు ఇంకా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. ఈ సినిమా మహిళలు చూస్తే కొన్ని రోజులు ఆడుతుంది.