శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. సమీక్ష
Written By Selvi
Last Modified: శుక్రవారం, 9 నవంబరు 2007 (18:34 IST)

ఫ్యాక్షన్ గొడవలతో.. "వియ్యాల వారి కయ్యాలు"

ఆఖరికి హోమ్లీ టైటిల్ పెట్టినా ఫ్యాక్షన్ గొడవలతో కథను పక్కదోవ పట్టించారు.. చిత్ర దర్శక నిర్మాతలు. టైటిల్ వింటేనే చక్కని ఎంటర్‌టైన్‌మెంట్‌తో వినోదాత్మకంగా సాగుతుందనే ప్రేక్షకుడికి... చేయి నరకడాలు, బాంబు బ్లాస్ట్‌తో సుమోలు తాడిచెట్టంత ఎగిరిపడటాలతో ఖంగుతిన్నారు.

ఉదయ్‌కిరణ్ చాలా కాలం తర్వాత చేస్తున్న చిత్రంతో పాటు టైటిల్ కూడా ఆయన నిజజీవిత సంఘటనలకు లింక్ అవుతుందనేట్లు పెట్టి ఆకట్టుకునేలా చేశాడు నిర్మాత. పెద్దల్ని ఎదిరించి పెళ్ళి చేసుకోవడం తప్పు వారిని మెప్పించి పెండ్లి చేసుకోవడమే నిజమైన ప్రేమకు నిర్వచనమంటూ తెలిపే కథే " వియ్యాలవారి కయ్యాలు".

ఇక కథలోకెళితే... పూర్వం నాటకం ప్రదర్శించేముందు నాటకం ఎలా ఉంటుంది. తీరు తెన్నులేంటి... అనేది ఒక "హక్"లా తగిలించేట్లు చెప్పే పాత్ర ఉంటుంది. ఆ తర్వాత పాత్రధారులు ప్రవేశించడం.. అలాంటి పాత్రను నటశేఖర కృష్ణ చెప్పడంతో సినిమా మొదలవుతుంది. ప్రేమ, పెళ్ళి అంటే ఏమిటి? వియ్యంలో కయ్యాలు ఎందుకు వస్తాయి? వంటి చిన్నపాటి ఉపదేశం ఇస్తాడు. ఆయన ఉపన్యసించినంతసేపూ కామెడీ తరహాలో సాగుతుందేమో అనిపిస్తుంది.

కట్ చేస్తే... రాయలసీమలో ట్రైన్ ఆగడం. అందులోంచి వేణుమాధవ్ దిగడం.. ఆ తర్వాత ఉదయ్‌కిరణ్ కూడా దిగడం... ఎంత బాగుందో రాయలసీమ అనడం... కాసేపటికి ఎవర్నో చంపడానికి ఓ గుంపు కత్తులతో రావడం, బాంబులు పేలడం వంటివి వెంట వెంటనే జరిగిపోతాయి. దీంతోనే సినిమా ఎటువైపు వెళుతుందో అర్థమైపోతోంది. పంతాలు, పట్టింపులు, కక్షలు ఉన్న అటువంటి ప్రాంతంలోని యువతిని పెళ్లిచేసుకుంటానని వారి పెద్దల్ని మెప్పించి పెండ్లిచేసుకోవడమనేదే హీరోకున్న ముఖ్య కర్తవ్యం.

అలా ట్రైన్ దిగి ఊరికి జీపులో వెళతారు ఉదయ్‌కిరణ్, వేణుమాధవ్. ప్రేమకోసం ఇంతదూరం రావడమేమిటి? అసలు నీ ప్రేమ ఎలా మొదలయింది? అంటూ వేణుమాధవ్ వేసిన ప్రశ్నలకు ఉదయ్‌కిరణ్ చెప్పే ఫ్లాష్‌బ్లాక్ కథ.

కాలేజీ విద్యార్థిని నందిని (నేహా జుల్కా)ను కొందరు రౌడీల బారి నుంచి వంశీ (ఉదయ్‌కిరణ్) కాపాడతాడు. కాపాడే యత్నంలో ఆమె చెవికున్న ఒక రింగ్ వంశీ షర్టుకు చిక్కుకుంటుంది. అది ఆమె అమ్మ జ్ఞాపకార్థం. దాన్ని జాగ్రత్తగా తీసుకువచ్చిన వంశీని ప్రేమిస్తుంది... నందిని.

అతను వద్దన్నా వెంటబడి వేధించి ప్రేమలోకి దించుతుంది. ఈమె బాధ భరించలేక గుడికి రమ్మని తాళికడతానంటాడు వంశీ. దీంతో హతాశురాలై తనకొక అన్న ఉన్నాడనే సంగతి చెబుతుంది. పెళ్లి అంటే పవిత్రమైందంటూ కాని సినిమా డైలాగ్‌లు చెప్పాక, వీళ్ళిద్దరికున్న సమస్యల్లా ఇరువైపులూ పెద్దల్ని ఒప్పించడం, అందులో భాగమే రాయలసీమకు వంశీ పయనం.

నందిని అన్నయ్య భూపతిరాయుడు (శ్రీహరి) రాయలసీమ ఫ్యాక్షనిస్ట్. కానీ ఆ ఊరిజనం ఆయన్నో దేవిడిగా భావిస్తారు. నందిని స్నేహితులుగా వచ్చి భూపతిరాయుడు ఇంట్లో వారం రోజులు మకాం వేస్తాడు వంశీ. ఈ వారం రోజుల్లో చిన్నపాటి సంఘటనలతో భూపతి రాయుడ్ని మెప్పిస్తాడు. నందినిని కాపాడినట్లే భూపతిరాయుడ్ని ఓ ప్రమాదం నుంచి కాపాడి అతని మనసు గెలుస్తాడు.

ఇక వాళ్ళంతా కలిసి వంశీ తండ్రి రిజైర్డ్ జడ్జి (షియాజీ షిండే)ను ఒప్పించేందుకు హైదరాబాద్ వస్తారు. ప్రతీదీ లా ప్రకారం జరగాలనుకునే జడ్జికి నేర చరిత ఉన్న ఫ్యాక్షన్ కుటుంబంతో వియ్యమొందడానికి ససేమిరా అంటాడు. ఇదిలా ఉండగా, తాను జడ్జిగా ఉండగా ఓ నేరస్తుడికి (జీవీ) ఐదేళ్ళు కఠిన శిక్షవిధిస్తాడు. అతను శిక్షకాలం పూర్తయి వచ్చి జడ్జి కుమార్తె శీలాన్ని పాడుచేయమని తన తమ్ముడ్ని పురమాయిస్తాడు.

ఇది తెలుసుకున్న భూపతిరాయుడు వాడి కాళ్ళు చేతులు ఇరగదీసి బుద్ధి చెపుతాడు. ఈ విషయం తెలుసుకుని కాస్త శాంతించిన జడ్జి, వంశీ, నందిని పెళ్ళి జరగాలంటే రక్తపాతం లేకుండా శాంతిమార్గంలో మీ ఊళ్ళో జరిగే ఎలక్షన్లలో గెలవాలనే షరతు విధిస్తాడు. ఆపై వారి పెళ్ళి ఎలా జరిగింది అనేది క్లైమాక్స్.

ఇక... ఉదయ్‌కిరణ్, నేహాజుల్కా పాత్రలు పర్వాలేదు.. ద్వితీయార్థంలో ఉదయ్‌కిరణ్‌ను, శ్రీహరి పూర్తిగా డామినేట్ చేస్తాడు. షియాజీ షిండే పాజిటివ్‌గా ఉండే పాత్ర. కాస్త వినోదంకూడా జోడించాడు. ఇక జయప్రకాష్‌రెడ్డి పాత్ర రొటీనే. ఆ ఊర్లో అంతమంది అనుచరులతో ఉన్న ఒక్క జయప్రకాష్ రెడ్డి మాత్రమే రాయలసీమ యాసలో మాట్లాడాడు.

మిగతావారంతా మామూలు భాషే మాట్లాడడం దర్శకుడి తప్పిదమే. ఊరి క్షురకులుగా కృష్ణభగవాన్, లక్ష్మీపతి పాత్రలో హాస్యం పండలేదు. సాయినాథ్ రాసిన సంభాషణలు పెద్దగా ఆకట్టుకోలేదు. ఓ సీన్‌లో విలేకరిగా ఆయన కన్పిస్తాడు కూడా. రమణగోగుల సంగీతం ఆకట్టుకోలేదు.