శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : ఆదివారం, 21 అక్టోబరు 2018 (09:42 IST)

అమృతసర్ రైలు ప్రమాదంలో డ్రైవర్ తప్పేమీలేదు.. నష్టపరిహారం ఇవ్వలేం : రైల్వేశాఖ

పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో డ్రైవర్ తప్పేమీ లేదని రైల్వే శాఖ తేల్చేసింది. అందువల్ల మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించలేమని స్పష్టం చేసింది.
 
దసరా ముగింపు ఉత్సవాల్లో భాగంగా, రావణ దహనం కార్యక్రమం నిర్వహించారు. దీన్ని తిలకిస్తున్న ప్రజలపై రైలు ఒకటి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 59 మంది చనిపోయారు. దీనిపై రైల్వేశాఖ వివరణ ఇచ్చింది. అమృతసర్ ప్రమాదంలో ప్రజలపై నుంచి దూసుకెళ్లిన జలంధర్ రైలు డ్రైవర్‌పై ఎటువంటి చర్య తీసుకోబోమని రైల్వేశాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా స్పష్టం చేశారు. 
 
ప్రమాదం విషయంలో రైల్వేల వైపు నుంచి ఎటువంటి నిర్లక్ష్యంగానీ, పొరపాటుగానీ లేదని స్పష్టంచేశారు. రైల్వేట్రాక్‌ల సమీపంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని ప్రజలకు సలహా ఇచ్చారు. 
 
దసరా కార్యక్రమం నిర్వహణ గురించి తమకు ఎటువంటి సమాచారం లేదని.. కాబట్టి ప్రమాదం రైల్వేశాఖ తప్పుకాదని తేల్చిచెప్పారు. మా వైపు నుంచి ఎటువంటి పొరపాటు జరుగలేదు. ప్రజలను ఢీకొట్టిన రైలు డ్రైవర్‌పై ఎటువంటి చర్య తీసుకోవడం లేదని తేల్చి చెప్పారు. 
 
అలాగే, భవిష్యత్తులో ఇటువంటి ఉత్సవాలను రైలు పట్టాలకు సమీపంలో నిర్వహించవద్దు. ఇటువంటి వేడుకలు నిర్వహించేటప్పుడు అనుమతులు మంజూరు చేసే బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంటుంది. కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ విభాగం ఈ ఘటనపై అంతర్గత విచారణ చేపడుతుంది అని తెలిపారు.