శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By TJ
Last Modified: గురువారం, 4 అక్టోబరు 2018 (12:53 IST)

సిబిఐ మాజీ జెడి కొత్త పార్టీ... జనసేన రమ్మంటోందా?

సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ సొంత రాజకీయ పార్టీ పెట్టబోతున్నారా. అందుకోసమే రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారా. చిత్తూరు జిల్లాలో జరుగుతున్న పర్యటన ముగియగానే పార్టీ జెండా.. అజెండా ప్రకటిస్తారా..

సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ సొంత రాజకీయ పార్టీ పెట్టబోతున్నారా. అందుకోసమే రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారా. చిత్తూరు జిల్లాలో జరుగుతున్న పర్యటన ముగియగానే పార్టీ జెండా.. అజెండా ప్రకటిస్తారా.. ప్రస్తుత రాజకీయాల్లో ఈ అంశమే హాట్ టాపిక్‌గా మారుతోంది. ఖాకీ చొక్కాను వదిలి ఖద్దర్ వైపు చూస్తున్న జెడీ లక్ష్మీనారాయణ పొలిటికల్ ఎంట్రీపై ప్రత్యేక కథనం.
 
ఎపి రాజకీయ రణరంగంలోకి మరోకొత్త పార్టీ ప్రవేశించడానికి రంగం సిద్థమవుతోంది. నిజాయితీ గల అధికారిగా పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో పనిచేసిన సిబిఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ గురించి ప్రత్యేక ఇంట్రడక్షన్ అవసరం లేదు. విధి నిర్వహణలో ఉన్న సమయంలో ఎన్నో సంచలనాత్మక కేసులను సమర్థవంతంగా చేధించిన ఆయన అకస్మాత్తుగా ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో వివిధ సమస్యలపైన అవగాహన పెంచుకునే క్రమంలో బిజీగా ఉంటున్నారు. 
 
ప్రధానంగా రైతు సమస్యలపైన ప్రధాన దృష్టి పెట్టిన జె.డి.లక్ష్మీనారాయణ ఎపిలోని 13జిల్లాల్లో ఏకధాటిగా పర్యటిస్తున్నారు. పర్యటనకు వెళ్ళిన ప్రతిచోటా రైతులతో సమావేశమై వారి సాధకబాధకాలను తెలుసుకుంటున్నారు. అలాగే వివిధ ప్రాంతాల సమస్యలను నోట్ చేసుకుని మరీ వాటిని సమీక్షిస్తున్నారు. జిల్లాల పర్యటనల్లో భాగంగా చివరి మజిలీ అయిన చిత్తూరుజిల్లాలో జెడి. లక్ష్మీనారాయణ పర్యటన పూర్తి కావచ్చింది. అయితే చిత్తూరు జిల్లాలో తన పర్యటన సమయంలో జెడీ చేసిన వ్యాఖ్యలు ఆశక్తిని రేపుతున్నాయి. 
 
ఏ పార్టీలో చేరుతున్నారని మీడియా ప్రశ్నించగా ఆయన తన ఆలోచనను త్వరలోనే ప్రకటిస్తానని చెప్పడం చర్చనీయాంశంగా మారుతోంది. చిత్తూరు జిల్లా పర్యటన అనంతరం శ్రీవారిని దర్సించుకుని తన 13జిల్లాల పర్యటన వివరాలు అందులో తాను తెలుసుకున్న ప్రజా సమస్యలను అలాగే తనకు తోచిన పరిష్కారాలను ముఖ్యమంత్రి ముందు ఉంచుతానని ప్రకటించారు లక్ష్మీనారాయణ. అనంతరం తన భవిష్యత్తు కార్యాచారణ ఉంటుందన్నారు. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆశక్తిని రేపుతోంది. అంటే లక్ష్మీనారాయణ కొత్త పార్టీని పెట్టబోతున్నారా..? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. 
 
నిజంగా ఏదో ఒక పార్టీలో చేరే ఆలోచనే ఉంటే ఇప్పటికే ఆయనకు అనేక దారులు ఉన్నాయి. జగన్ కేసు సంధర్భంగా వైసిపి నేతలు గతంలో ఆయనపై ఆరోపణలు చేసిన సంధర్భంలో లక్ష్మీనారాయణ టిడిపి లేదా జనసేనలో చేరుతారని అందరూ భావించారు. అదే ప్రశ్నలను గతంలో పలుసార్లు జర్నలిస్టులు అడిగినా ఆయన నవ్వుతూ సమాధానాన్ని దాటవేశారు. అయితే రోజులు గడుస్తున్నా లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరుతారన్నది ఆయన సన్నిహితులకే అర్థం కావడం లేదు. లక్ష్మీనారాయణ సన్నిహితులు మాత్రం ప్రస్తుతం ఆయన ఏ పార్టీలోను చేరే అవకాశం లేదంటున్నారు. ఇప్పుడున్న పార్టీలపై జనంలో సదాభిప్రాయం లేదన్న అంచనాతో లక్ష్మీనారాయణ ఉన్నట్లుగా తెలుస్తోంది. 
 
దీంతో ఆయనే కొత్త పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజల సమస్యలే ప్రధాన అజెండాగా, రైతుల కష్టాలకు పరిష్కారం దిశగా లక్ష్మీనారాయణ పెట్టబోయే పార్టీ ఉండబోతుదంటున్నారు సన్నిహితులు. అందుకోసమే లక్ష్మీనారాయణ రాజీనామా చేసిన తరువాత విస్తృతంగా గ్రామీణ ప్రాంతాలలో పర్యటించినట్లుగా చెబుతున్నారు. మరి నిజంగా లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పేరు ప్రకటించబోతున్నారా.. ప్రస్తుతం ఉన్న పార్టీలకు లక్ష్మీనారాయణ పెట్టబోయే పార్టీ పోటీ ఇవ్వగలుగుతుందా అన్న ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. దీనికి కారణాలు ఉన్నాయి. 
 
గత అనుభవాల దృష్ట్యా చూసినట్లయితే సామాజిక సంస్ధగా ఉద్భవించిన లోక్ సత్తా ఆ తరువాతి కాలంలో రాజకీయ పార్టీగా రూపుదిద్దుకుంది. కలెక్టర్ పదవిని వదిలి రాజకీయాల్లో ప్రవేశించిన పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేశారు. ఆ పార్టీ అధినేత జయప్రకాష్‌ నారాయణ మినహా మిగిలినవారెవరూ విజయం సాధించలేకపోయారు. అనంతర కాలంలో లోక్ సత్తా కూడా కనుమరుగు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే తరహాలో జెడి.లక్ష్మీనారాయణ పెట్టే పార్టీ కూడా మారుతుందన్న వాదనలు కూడా ఉన్నాయి. 
 
ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణ ఎలా ముందుకు వెళ్ళబోతున్నారనేది ఆశక్తికరంగా మారుతోంది. పార్టీని నడపాలంటే కేవలం మంచి ఆశయాలు ఉండడంతోనే సరిపోదు.. పార్టీని సమర్థంగా నిర్వహించడానికి ఆర్థిక తోడు అవసరమన్నది గత అనుభవాలు నిరూపిస్తున్న సత్యం. మరి తాను ధరించే దుస్తులకే ఎక్కువగా ఖర్చు పెట్టని లక్ష్మీనారాయణ పార్టీ నిర్వహణకు భారీ ఖర్చు పెట్టే అవకాశమే లేదని దాదాపుగా చెప్పొచ్చు. దీంతో జెడి లక్ష్మీనారాయణ జిల్లా పర్యటనల అనంతరం ఏ ప్రకటన చేయబోతున్నారన్న అంశంపై ఉత్కంఠ భరితంగా మారుతోంది. 
 
ఇదిలా ఉంటే లక్ష్మీనారాయణ తన సామాజిక వర్గానికే చెందిన పవన్ కళ్యాణ్‌ పెట్టిన జనసేనలో చేరుతారన్న ఊహాగానాలు వస్తున్నాయి. కొంతమంది జెడి సన్నిహితులు కూడా ఇదే సలహా ఆయనకు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే లక్ష్మీనారాయణ మాత్రం జనసేనలో చేరేందుకు సుముఖంగా లేనట్లుగా సమాచారం. ఇప్పటికిప్పుడు లక్ష్మీనారాయణ ఎన్నికల్లో పోటీ చేసి పదవులు పొందాలన్న ఆలోచనతో లేరని, కేవలం రాజకీయ పార్టీ వేదికగా ప్రజా సమస్యలను లేవనెత్తేందుకు ఆయన సిద్థపడుతున్నట్లుగా తెలుస్తోంది. మరి మాజీ జెడి మనస్సులో ఏముంది అనేది మరో ఒక్కరోజులో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.