శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 22 మే 2018 (08:58 IST)

కర్ణాటక ఎలక్షన్స్ : బీజేపీ ఖర్చు రూ.6500 కోట్లు .. ఆనంద్ శర్మ ధ్వజం

తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ స్పందిస్తూ, కర్ణాటక ఎన్నికల్లో భాజపా రూ.6,500 కోట్లు ఖర్చు పెట్టిందని ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థికి కనీసం రూ.20 కోట్లు పంచిపెట్టిందని, ఫలితాల తర్వాత ఎమ

కర్ణాటక ఎన్నికలను భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం ఏకంగా ఆ పార్టీ అధినేత అమిత్ షా కర్ణాటక వ్యాప్తంగా సుడిగాలి పర్యటన జరిపారు. ఆయనతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ సైతం పలు దఫాలుగా పర్యటనలు జరిపారు. అంతేనా, ఈ ఎన్నికల్లో గెలుపు కోసం బెంగుళూరు వాసులను ఆకట్టుకునేందుకు వీలుగా మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.17 వేల కోట్ల నిధులను కేటాయించారు. అంతేకాకుండా, ఎన్నికల్లో డబ్బులను మంచినీళ్ల ప్రాయంగా ఖర్చుచేసినట్టు విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
 
తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ స్పందిస్తూ, కర్ణాటక ఎన్నికల్లో భాజపా రూ.6,500 కోట్లు ఖర్చు పెట్టిందని ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థికి కనీసం రూ.20 కోట్లు పంచిపెట్టిందని, ఫలితాల తర్వాత ఎమ్మెల్యేల కొనుగోలు కోసం మరో రూ.4 వేల కోట్లు కేటాయించిందని ధ్వజమెత్తారు. ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
ఈ అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన పార్టీ భాజపా అని, ఆ పార్టీకున్నంత పెద్ద కార్యాలయం ఏ పార్టీకి లేదన్నారు. దేశంలో అన్నిపార్టీల ఆదాయంకంటే రెట్టింపు భాజపాకు ఉందని, అది ఎలా వచ్చిందో ప్రజలకు చెప్పాలన్నారు. నల్లధనంతో ఎన్నికల్లో పోరాడిన భాజపా నల్లధన వ్యతిరేక పోరాటం చేస్తున్నట్లు చెప్పుకోవడం సబబు కాదన్నారు. 
 
కర్ణాటకలో బీజేపీ చేసిన తప్పులకు దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెబుతారని భావించామని, కానీ, తాము అపవిత్ర కలయికతో అధికారం ఏర్పాటు చేస్తున్నామంటూ ఎదురుదాడికి దిగారన్నారు. కర్ణాటకలో తమది అపవిత్ర కలయిక అయితే, బీహార్‌ ప్రజలు ఆర్‌జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌ కూటమికి ఓటేస్తే ఎన్నికల అనంతరం జేడీయూతో కలిసి భాజపా అధికారం చేజిక్కించుకోవడం పవిత్రమైన కలయికా? అని ప్రశ్నించారు. 
 
అతిపెద్దపార్టీకి ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం ఇవ్వాలని మాట్లాడుతున్న అమిత్‌షా గోవా, మణిపూర్‌, మేఘాలయలో అదే సూత్రం ఎందుకు వర్తింపజేయలేదని ఆనంద్‌శర్మ సూటిగా ప్రశ్నించారు. వాళ్లు దొడ్డిదారిన అధికారంలోకి వస్తే మంచిది.. తాము చేస్తే తప్పు అనడం ఆయనకు తగదన్నారు. నిజం చెప్పాలంటే అమిత్ షా కిందిస్థాయి కార్యకర్తలా దిగజారి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.