శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 5 జూన్ 2018 (09:05 IST)

దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు.. ఇందిరకు పట్టిన గతే మోడీకి : శరద్ పవార్

దేశంలో 1977నాటి ఎమర్జెన్సీ పరిస్థితులే నెలకొనివున్నాయనీ, అందువల్ల నాడు ఇందిరా గాంధీకి పట్టిన గతే ఇపుడు ప్రధాని నరేంద్ర మోడీకి కూడా పడుతుందని ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ జోస్యం చెప్పా

దేశంలో 1977నాటి ఎమర్జెన్సీ పరిస్థితులే నెలకొనివున్నాయనీ, అందువల్ల నాడు ఇందిరా గాంధీకి పట్టిన గతే ఇపుడు ప్రధాని నరేంద్ర మోడీకి కూడా పడుతుందని ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ జోస్యం చెప్పారు. నాడు ప్రజాస్వామ్యాన్ని ఇందిర భూస్థాపితం చేస్తే.. నేడు మోడీ కూడా అదే పని చేస్తున్నారని మండిపడ్డారు.
 
ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో భండారా-గోండియా లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎన్సీపీ అభ్యర్థి మధుకర్‌ కుకడేతో సమావేశం తర్వాత శరద్ పవార్ మాట్లాడుతూ... నాడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడడంతో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయని, ఇపుడు కూడా అదే పరిస్థితి నెలకొందన్నారు. ఆ ఫలితమే ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి అని వ్యాఖ్యానించారు. భావసారూప్యత ఉన్న పార్టీలను ఏకం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు.
 
పార్టీలతో విభేదాలున్నప్పటికీ బీజేపీని ఓడించేందుకు మాత్రం అంతా కలిసి కట్టుగా ముందుకు రావాలని పవార్ పిలుపునిచ్చారు. ఏపీలో టీడీపీ, తెలంగాణలో టీఆర్ఎస్, కర్ణాటకలో జేడీఎస్, మహారాష్ట్రలో ఎన్సీపీ, కేరళలో లెఫ్ట్, పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్రలో కాంగ్రెస్ బలంగా ఉందని పవార్‌ వివరించారు. ఇవన్నీ ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.