గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శుక్రవారం, 13 జులై 2018 (15:01 IST)

అప్పుడు సైకిళ్లకు పంక్చర్లు.. ఇప్పుడు రూ.150 కోట్ల ఆస్తులు.. ఎలా?

'ఇచ్చట సైకిళ్లకు పంక్చర్లు వేయబడును - సైకిళ్లు అద్దెకు ఇవ్వబడును' అనే బోర్డు పెట్టుకుని, ఒక గంట అద్దెకు రూ.5, ఒక పంక్చర్‌కు రూ.10 చొప్పున డబ్బులు తీసుకున్న వ్యక్తి నేడు ఏకంగా రూ.150 కోట్ల ఆస్తులకు అధి

'ఇచ్చట సైకిళ్లకు పంక్చర్లు వేయబడును - సైకిళ్లు అద్దెకు ఇవ్వబడును' అనే బోర్డు పెట్టుకుని, ఒక గంట అద్దెకు రూ.5, ఒక పంక్చర్‌కు రూ.10 చొప్పున డబ్బులు తీసుకున్న వ్యక్తి నేడు ఏకంగా రూ.150 కోట్ల ఆస్తులకు అధిపతి. అదీకూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమిస్తే 200 రూపాయల కూలీ రావడమే గగనంగా ఉన్న ఈ కాలంలో.. ఓ పంక్చర్ షాపుతో ఏకంగా రూ.150 కోట్ల ఆస్తులు ఎలా సంపాదించాడన్నదే ఇపుడు ప్రతి ఒక్కర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ పంక్చర్ షాపు యజమాని చరిత్రను తెలుసుకుందాం.
 
తిరుపతికి చెందిన కందిశెట్టి రమేష్. ఈయన పదేళ్ల క్రితం సైకిళ్లకు పంక్చర్ల షాపు నిర్వహిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో పరిచయాలు ఏర్పడ్డాయి. నమ్మకస్తుడిగా పేరు రావటంతో చిట్స్ వ్యాపారం మొదలుపెట్టాడు. టైం టూ టైం చెల్లింపులు ఉండేవి. నమ్మకం మరింత పెరిగింది. చిట్స్ వేసే వారి సంఖ్యా పెరిగింది. ఇదేసమయంలో తనకు వచ్చిన డబ్బుని వడ్డీలకు ఇచ్చేవారు. 
 
అలా, సైకిల్ షాపు పోయింది.. శారదా ఎంటర్‌ప్రైజెస్ పేరుతో చిట్స్ ఆఫీస్ వెలసింది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు చిట్స్ వేయటం మొదలుపెట్టాడు. వడ్డీకి ఇచ్చే అప్పు కూడా వేలు, లక్షలు దాటి కోట్ల వరకు వెళ్లింది. తన లావాదేవీల నిర్వహణ కోసం ఏకంగా ముగ్గురు ఆడిటర్లను నియమించుకున్నాడు. ఆ తర్వాత బంగారం వ్యాపారంలోకి దిగాడు. గత 2014 ఎన్నికల్లో కొందరు రాజకీయ నేతలు సైతం ఈయన వద్ద వడ్డీకి అప్పు తీసుకున్నారంటే ఆయన రేంజ్ ఏ మేరకు ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 
 
ఇలా అంచెలంచెలుగా ఎదిగిన రమేష్ ఆస్తి ఇప్పుడు రూ.150 కోట్లకి చేరింది. ఇటీవలే అధునాతమైన భవనం కూడా కట్టుకున్నాడు. ఆరా తీసిన ఆదాయపు పన్ను అధికారులు దాడులు చేశారు. మూడు రోజులు సోదాలు. ఇప్పటివరకు 8 కేజీల బంగారం సీజ్ చేశారు. 150 కోట్ల రూపాయలకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆదాయ పన్ను చెల్లించాలని నోటీసు జారీ చేశారు. కానీ రమేష్ మాత్రం పరారీలో ఉన్నాడు. ఇంతకీ ఈయనగారి గుట్టు ఆదాయ పన్ను చెల్లించకపోవడం వల్లే బహిర్గతమైంది.