శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : బుధవారం, 6 జూన్ 2018 (13:52 IST)

ఆమోదముద్ర వేయాలంటే రీ-కన్ఫర్మేషన్ లేఖ ఇవ్వండి.. షాక్‌తిన్న వైకాపా ఎంపీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రంపై నిరసన తెలుపుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలూ తమ రాజీనామాలను ఆమోదించాలని బుధవారం ఉదయం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కోర

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రంపై నిరసన తెలుపుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలూ తమ రాజీనామాలను ఆమోదించాలని బుధవారం ఉదయం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కోరారు. ఆ సమయంలో ఆమె వారితో రాజీనామాలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత రీ కన్ఫర్మేషన్ లేఖలను ఇవ్వాలని కోరారు. దీంతో వైకాపా ఎంపీలు షాక్ తిన్నారు.
 
'భావోద్వేగాలతోనే మీరు రాజీనామాలు చేసి ఉంటారని భావిస్తున్నా' అన్న సుమిత్ర వ్యాఖ్యలపై స్పందించిన ఎంపీలు, తామేమీ తొందరపడి రాజీనామాల నిర్ణయం తీసుకోలేదని, అన్నీ ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చామని స్పష్టంచేశారు. దీంతో లిఖితపూర్వకంగా అదే విషయాన్ని తనకు తెలియజేయాలని ఆమె చెప్పడంతో, మరికాసేపట్లో రీకన్ఫర్మేషన్ లేఖలను ఇవ్వనున్నామని ఆ పార్టీ ఎంపీ వరప్రసాద్ మీడియాకు తెలిపారు. 
 
మరోవైపు, తమ రాజీనామాలు ఆమోదం పొందినట్టేనని ఆ పార్టీకి చెందిన నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. పార్టీ మారిన ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌ను కోరామని చెప్పారు. అలాగే, మరో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఇద్దరు ఎంపీలపై ఫిర్యాదులు అందినట్టు స్పీకర్ చెప్పారని తెలిపారు. ప్రత్యేక హోదాను సాధించే వరకు తమ పోరాటం ఆగదని అన్నారు. టీడీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.
 
ప్రజలను తాము నమ్ముకున్నామని, విలువలను అమ్ముకోలేదని వైయస్ అవినాష్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికలు తమకు కొత్త కాదని చెప్పారు. రాజీనామాలపై టీడీపీ నేతల సర్టిఫికెట్ తమకు అవసరం లేదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని మరో ఎంపీ వరప్రసాద్ విమర్శించారు. మిథున్ రెడ్డి మాట్లాడుతూ, హోదా కోసం చిత్తశుద్ధితో తాము రాజీనామాలు చేశామని చెప్పారు. ప్రజాక్షేత్రంలో టీడీపీ నాటకాలను ఎండగడతామని హెచ్చరించారు.