Widgets Magazine

#EconomicSurvey2018 : వృద్ధిరేటు 7 - 7.5 శాతమే... అరుణ్ జైట్లీ

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రసంగించారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో ఆర్థిక సర్వే 2017-18ను ప్రవ

arun jaitley
pnr| Last Updated: సోమవారం, 29 జనవరి 2018 (14:23 IST)
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రసంగించారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో ఆర్థిక సర్వే 2017-18ను ప్రవేశపెట్టారు. 2017-18లో వృద్ధి రేటు 6.75 శాతంగా నమోదైందనీ, ఇది 2018-19 ఆర్థిక సంవత్సరంలో 7.0 నుంచి 7.5 శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు.

ఇకపోతే, భారత ఆర్థిక వ్యవస్థకు జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) కొత్త ఊపునిచ్చిందన్నారు. జీఎస్టీ అమలు తర్వాత పారిశ్రామిక వృద్ధిరేటులో కొంత మందగమనం ఉందన్నారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో గణనీయంగా రాబడి పెరిగిందని తెలిపారు. వ్యవసాయేతర రంగాల్లో అనుకున్న దాని కన్నా ఉపాధి పెరిగిందని స్పష్టంచేశారు.

పన్ను చెల్లింపుదారులు 50 శాతం పెరిగారు. జీఎస్టీ వల్ల చిన్న వ్యాపారుల నమోదు శాతం పెరిగిందన్నారు. ఇతర దేశాల కన్నా మన ఎగుమతులు బాగున్నాయని గుర్తుచేశారు. రాష్ట్రాల నుంచి విదేశీ ఎగుమతుల పెరుగుదల అధికంగా నమోదైందని తెలిపారు. ఎగుమతుల్లో 70 శాతం మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ నుంచే జరుగుతున్నట్టు చెప్పారు.

నోట్ల రద్దు వల్ల మదుపుదారుల సంఖ్య పెరిగిందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. వస్త్ర పరిశ్రమ ప్రోత్సాహకాలతో రెడిమేడ్ దుస్తుల ఎగుమతులు పెరిగాయన్నారు. వ్యవసాయ దిగుబడులపై వాతావరణం ప్రతికూల ప్రభావం చూపించిందన్నారు. ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన అనంతరం లోక్‌సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.


దీనిపై మరింత చదవండి :