మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వినాయక చవితి
Written By PNR
Last Updated : గురువారం, 28 ఆగస్టు 2014 (18:03 IST)

గణపతి ఆకృతిలో దాగివున్న సందేశాలేమిటో తెలుసా?

నమోస్తు గణనాథాయ సిద్ధిబుద్ధియుతాయ చ |
సర్వ ప్రదాయ దేవాయ పుత్రవృద్ధి ప్రదాయ చ ||
అంటూ బొజ్జ గణపయ్యను పూజించుకుని ఆయన ఆకృతిలో మానవాళికి గల సందేశాలేమిటో వినాయక చవితి సందర్భంగా ఒకసారి పరిశీలిద్దాం..!. 
 
వినాయకుడి ఆకృతి విచిత్రమైనదే. కానీ ఇందులో అనేక సందేశాలున్నాయని పండితులు అంటున్నారు. ఇందులో గణేశుని తల ఏనుగుది. అటు బలమైన కార్యాలను, ఇటు బుద్ధికి సంబంధించిన కార్యాల్నీ రెండింటిని నిర్వహించగల సామర్థ్యం గల ఏకైక జీవి ఏనుగు. అటువంటి ఏనుగు తలను ధరించిన గణపతి బుద్ధి భావాలకు చక్కని ప్రతీక. 
 
గణేశుడి చెవులు పెద్దవి, కళ్ళు చిన్నవి. ఎంతటి చిన్న విషయాల్ని అయినా పెద్ద చెవులతో వినాలని ఆయన చెవులు చెప్తుంటే, కామానికి మూలమైన కళ్లు చిన్నవిగా ఉండాలని, జన్మ పరంపరల్ని ఆపాలంటే కళ్లను ఎక్కువ సమయం తెరిచి ఉండకుండా ధ్యానముద్రలో మూసి ఉంచాలని కళ్ళు చెప్తుంటాయి. 
 
ఇక విఘ్నేశ్వరుని ఉదరం బహు పెద్దది. మనిషి దీర్ఘాయువుగా ఉండాలంటే పొట్ట పెద్దదిగా ఉండాలని పతంజలి యోగ శాస్త్రం నిర్దేశిస్తుంది. పెద్ద పొట్టను-సృష్టి రహస్యాల్ని, యోగ రహస్యాల్ని దాచే పరికరంగా చెప్పారు. 
 
ఇదేవిధంగా నిత్యకర్మాచరణాన్ని అనుసరించే ఎవరైనా మన చరణాలకు నమస్కరించడం జరుగుతుందని చెప్పడానికే వినాయకుని పాదాలు చిన్నవిగా ఉంటాయి. ఇవి చిన్నవే అయినా ముమ్మార్లు భూప్రదక్షిణం చేశాయని పురోహితులు చెబుతున్నారు. 
 
అలాగే విఘ్నేశ్వరుని తల విఘ్ననాశిని, చిన్ని కళ్ళు-సూక్ష్మ దృష్టిని, తుండం-ఆత్మాభిమానాన్ని, పెద్ద చెవులు- సహనంగా అన్నింటిని వినడాన్ని, దంతాలు- పరులకు హాని చేయకపోవడాన్ని, చిన్న నాలుక-ఆత్మపరిశీలనకు, పెద్ద పొట్ట-జ్ఞాన భాండాగారానికి సూచకాలు. 
 
ఇంకా నాలుగు చేతులు-చతుర్విధ పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు, చిన్నినోరు- తక్కువ మాట్లాడటానికి, ఎలుక వాహనం- కోరికలను అదుపులో ఉంచుకోవాలని చెప్పాయని పురోహితులు అంటున్నారు. 
 
లంబోదరుడు, వక్రతుండుడు అని పిలువబడే వినాయకుడు ఉద్భవించిన రోజున ఇళ్లల్లో, వ్యాపార సంస్థల్లో సిద్ధి బుద్ధి అని రెండు వైపులా రాసి స్వస్తిక పద్మం లిఖించడం ద్వారా శుభాన్ని ఆకాంక్షించవచ్చును. ఈ గుర్తు గీసి "అస్మిన్ స్వస్తిక పద్మే శ్రీ మహాగణపతిం ఆవాహయామి" అని ఆవాహన చేసి మహాగణపతికి పూజలందిస్తారు.
 
దీనిని బట్టి మహాగణపతికి, స్వస్తిక పద్మానికి అవినాభావ సంబంధం ఉంది. హోమమే కాక ప్రతిష్ట లేక అనుష్టానాదులతో కూడా నవగ్రహాలతో పాటు గణపతి స్థానంలో స్వస్తిక పద్మం వేసి గణపతిని ఆరాధించడం చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు చెబుతున్నారు.