గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 4 ఏప్రియల్ 2015 (14:46 IST)

ఆఫీసుల్లో లైంగిక వేధింపులు: బయటకు చెబితే.. అంతేసంగతులు.. ఉద్యోగినుల వ్యధ!

కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపులు చెప్పినా.. చెప్పకపోయినా ఉద్యోగినులకు పెద్ద బాధే. లైంగిక వేధింపుల్ని తట్టుకునే మనసు లేకపోవడం.. ఆపై  వేధింపులను తాళలేక ఫిర్యాదు చేసినా ఉద్యోగినులకు బాధలు తప్పేలా లేవు. ఏ మహిళా ఉద్యోగి అయినా ఒక ఫిర్యాదు చేసిన తరువాత భవిష్యత్తులో అటువంటి వేధింపులు ఉండవని యాజమాన్యాలు హామీ ఇవ్వగలుగుతున్నాయా? అంటే సమాధానం దొరకట్లేదు. 
 
అమలులో ఉన్న చట్టాల ప్రకారం బాధిత మహిళ వివరాలు బయట పెట్టకూడదు. కానీ చాలా సందర్భాల్లో అలా జరగట్లేదు. సదరు మహిళ మరో ఉద్యోగం వెతుక్కోవడంలో కూడా కష్టాలు ఎదురవుతున్నాయి. ఇదిలా ఉంటే, బాధితురాలికి స్నేహితుల నుంచి వచ్చినంత ఓదార్పు కూడా కుటుంబ సభ్యుల నుంచి లభించడం లేదు. ఫిర్యాదు చేసిన వారిలో 99 శాతం మంది ఉద్యోగాలు వీడాల్సిన పరిస్థితి నెలకొంది.
 
చాలా సందర్భాల్లో నిందితుడు బాధితురాలికన్నా పెద్ద పొజిషన్‌లో ఉండటంతో, సహోద్యోగుల సలహా సైతం రాజీనామా చేయమనే వస్తోంది. చాలా కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని రక్షించేందుకు అంతర్గతంగా యత్నాలు జరుగుతున్నాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. దీనికి ఉదాహరణ తెహల్కా కేసు. మీడియాలో వివరాలు వచ్చిన తరువాతనే తెహల్కా చీఫ్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. మహిళలపై లైంగిక వేధింపులు ఆగాలంటే మరింత కఠిన చట్టాలు అమలు కావాలని సామాజిక ఉద్యమ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
 
అలాగే నిహారికా త్యాగి కేసును పరిశీలిస్తే అసలు సంగతేంటో మీకే అర్థమవుతుంది.. వివరాల్లోకి వెళితే.. నిహారికా త్యాగి... ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగిని. తనకు ఎదురైన లైంగిక వేధింపులను 9 నెలల పాటు మౌనంగా భరించి, ఆపై తాళలేక ఫిర్యాదు చేసింది. సమస్య పరిష్కారం కాకపోగా, ఆమె పనిచేస్తున్న డిపార్ట్ మెంట్ హెడ్ నుంచి నోటీసులు అందుకుంది. 
 
ఆఫీసులోకి ప్రవేశించగానే "నీ ఫిర్యాదు వెనక్కి తీసుకో. అతని గురించి ఆలోచించు. ఆయనకు పెళ్లాం, పిల్లలు ఉన్నారు" అంటూ సదరు ఉన్నతాధికారి కేకలు వేశారు. త్యాగి మాత్రం వెనక్కు తగ్గలేదు. చివరికి ఆ ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. అయితే సమస్య అక్కడితో ఆగిపోలేదు. "నేను ఫిర్యాదు చేసిన మరుక్షణం నుంచి నా బాధ పెరిగింది. నాపై సహోద్యోగులు జోకులు వేసుకునేవారు. 'ఈ ఆధునిక మహిళను చూడండి.
 
ఎవరైనా భుజంపై చెయ్యి వేసినా లైంగిక వేధింపులు అంటూ ఏడుపు మొదలుపెడుతుంది' అంటూ మాట్లాడుకునేవారు. అందరి జోకులకు నేను కేంద్రాన్ని అయ్యాను" అని త్యాగి తెలిపారు. ఇక డిపార్ట్ మెంట్ హెడ్ ఆమెకు పని ఇవ్వడం తగ్గించి, ఆపై ఇచ్చిన పని సరిగా చేయడం లేదని కేకలు వేయడం మొదలు పెట్టాడట. ఆఫీసులో ఒంటరైన ఆమె చివరికి రాజీనామా పరిష్కారం అయ్యింది. ఇలా ఎందరో మహిళలు లైంగిక వేధింపులతో ఒకవైపు.. ఫిర్యాదు చేయడంతో మరోవైపు నానా తంటాలు పడుతున్నారు.